ఐపీఎల్-2019: ముంబయి ఇండియన్స్ గెలుపుతో ప్లే-ఆఫ్‌కు సన్‌రైజర్స్ హైదరాబాద్

  • 6 మే 2019
ముంబై ఇండియన్స్ Image copyright Mumbai Indians/facebook

ఐపీఎల్-12లో ఆదివారం జరిగిన మ్యాచుల్లో అందరి దృష్టి వాంఖడే స్టేడియంలో జరిగిన మ్యాచ్‌పైనే నిలిచింది.

ఎందుకంటే, కోల్‌కతా నైట్ రైడర్స్ ఆతిథ్య ముంబయి ఇండియన్స్‌ను ఎలాగోలా ఓడిస్తే అది ప్లేఆఫ్‌కు చేరుతుంది.

కానీ అలా జరగలేదు. కోల్‌కతా నైట్ రైడర్స్ అది 9 వికెట్ల తేడాతో ఓడిపోయింది. ఆ జట్టు ఓటమితో సన్‌రైజర్స్ హైదరాబాద్ ప్లేఆఫ్‌కు చేరుకుంది.

కోల్‌కతా ఓటమి హైదరాబాద్ పాలిట వరంగా మారింది.

నిజానికి హైదరాబాద్‌కు 14 మ్యాచుల్లో 6 విజయాలతో 12 పాయింట్లే ఉన్నాయి.

రాత్రి పరాజయం పాలైన కోల్‌కతాకు కూడా 14 మ్యాచుల్లో 6 విజయాలతో 12 పాయింట్లే ఉన్నాయి. కానీ దాని రన్ రేట్ హైదరాబాద్‌ కంటే తక్కువ ఉంది.

ఇప్పుడు ప్లేఆఫ్‌ మొదటి క్వాలిఫయర్‌లో మంగళవారం చెన్నై సూపర్ కింగ్స్ తన సొంత మైదానంలో ముంబయి ఇండియన్స్‌తో తలపడుతుంది.

ప్లేఆఫ్ రెండో ఎలిమినేటర్‌ మ్యాచ్‌లో బుధవారం దిల్లీ క్యాపిటల్స్ సన్‌రైజర్స్ హైదరాబాద్‌ను ఢీకొంటుంది.

Image copyright Kings XI Punjab/facebook

చెన్నై సూపర్ కింగ్స్‌పై కింగ్స్ ఎలెవన్ పంజాబ్ విజయం

అంతకు ముందు జరిగిన మొదటి మ్యాచ్‌లో కింగ్స్ ఎలెవన్ పంజాబ్ తన సొంత మైదానం మొహాలీలో చెన్నై కింగ్స్‌ను ఆడుతూపాడుతూ ఆరు వికెట్ల తేడాతో ఓడించింది.

కానీ ఆ జట్టు విజయంతో చెన్నై సూపర్ కింగ్స్‌కు ఏ నష్టం జరగకపోగా, పంజాబ్‌కు కూడా ఏ లాభం లేకుండా పోయింది.

పంజాబ్ మొదటే ప్లేఆఫ్ రేసు నుంచి తప్పుకోగా, చెన్నై ఇప్పటికే చివరి నాలుగు జట్లలో అగ్ర స్థానంలో సురక్షితంగా ఉంది.

ఇటు రెండో మ్యాచ్‌లో ముంబయి ఇండియన్స్ ముందు నైట్ రైడర్స్ కేవలం 134 పరుగుల విజయ లక్ష్యం నిలిపింది.

జట్టు ఓపెనర్, కెప్టెన్ రోహిత్ శర్మ హాఫ్ సెంచరీతో చేసి నాటౌట్‌గా నిలవడంతో ముంబయి 16.1 ఓవర్లలోనే ఒక్క వికెట్ కోల్పోయి విజయం సాధించింది.

రోహిత్ శర్మ 48 బంతుల్లో 8 ఫోర్లతో 55 పరుగులు నాటౌట్‌గా నిలిచాడు.

రోహిత్ శర్మ, పార్ట్‌నర్ క్వింటన్ డి కాక్ కూడా 23 బంతుల్లో 1 ఫోర్, 3 సిక్సర్ల సాయంతో 30 రన్స్ చేశాడు.

మిగతా పని సూర్యకుమార్ యాదవ్ పూర్తి చేశాడు. అతడు కేవలం 27 బంతుల్లో 5 ఫోర్లు, 2 సిక్సర్ల సాయంతో 46 పరుగులు చేసి నాటౌట్‌గా నిలిచాడు.

Image copyright Kolkata Knight Riders/facebook

రాబిన్ ఉతప్ప స్లో బ్యాటింగ్

చావో రేవో తేల్చుకోవాల్సిన ఈ మ్యాచ్‌లో టాస్ ఓడి బ్యాటింగ్‌కు దిగిన కోల్‌కతా నైట్ రైడర్స్ ముంబయి ముందు భారీ లక్ష్యాన్ని ఉంచడంలో విఫలమైంది.

మ్యాచ్ అంతా కోల్‌కతా బ్యాట్స్‌మెన్ ముంబయి బౌలర్ల ఒత్తిడికి తలవంచారు. నిర్ధారిత 20 ఓవర్లలో 7 వికెట్లు కోల్పోయి 133 పరుగులే చేయగలిగారు.

ఓపెనర్ క్రిస్ లిన్ 29 బంతుల్లో 2 ఫోర్లు, 4 సిక్సర్ల సాయంతో 41 రన్స్ చేశాడు.

మరోవైపు రాబిన్ ఉతప్ప 40 పరుగులు చేయడానికి 47 బంతులు ఖర్చు చేశాడు.

అతడి స్లో ఇన్నింగ్స్‌ కోల్‌కతా ప్లేఆఫ్ చేరకుండా ఆగిపోవడానికి ఒక అడ్డుగోడగా నిలిచింది.

అయినా, క్రికెట్‌ మ్యాచ్‌ ఫలితం ఎలా ఉంటుందనేది చెప్పడం కష్టమే. కానీ ఇంత ముఖ్యమైన మ్యాచ్‌లో ఉతప్ప ఇలాంటి ఇన్నింగ్స్ ఆడడం, ముంబయి ఇండియన్స్ విజయాన్ని మరింత సులభం చేసింది.

క్రిస్ లిన్, రాబిన్ ఉతప్ప మినహా నితీశ్ రాణా కేవలం 13 బంతుల్లో 26 రన్స్ చేశాడు.

మిగతా కోల్‌కతా బ్యాట్స్‌మెన్లలో ఎవరూ ముంబై బౌలర్లను ధాటిగా ఎదుర్కుని రెండంకెల స్కోరు కూడా చేయలేకపోయారు.

గత రెండు మ్యాచుల్లో సత్తా చూపిన శుభమన్ గిల్ 9, దినేశ్ కార్తీక్ 3 పరుగులే చేశారు.

ఖాతా తెరవకుండానే పెవిలియన్ చేరిన కోల్‌‌కతా డాషింగ్ బ్యాట్స్‌మెన్ ఆండ్రూ రసెల్ అభిమానుల ఆశలపై నీళ్లు చల్లాడు.

Image copyright Mumbai Indians/facebook

మ్యాన్ ఆఫ్ ది మ్యాచ్ పాండ్యా

ముంబయి బౌలర్లు లసిత్ మలింగ 35 రన్స్‌కు 3, జస్‌ప్రీత్ బుమ్రా 31 రన్స్‌కు 2, హార్దిక్ పాండ్యా 20 రన్స్‌కు ఇచ్చి 2 వికెట్లు పడగొట్టారు.

అద్భుతంగా బౌలింగ్ చేసిన హార్దిక్ పాండ్యాకు మ్యాన్ ఆఫ్ ది మ్యాచ్ లభించింది.

ఐపీఎల్-12లో అంతకు ముందు ఆడిన మ్యాచ్‌లో కింగ్స్ ఎలెవన్ పంజాబ్ మొహాలీలో చెన్నై సూపర్ కింగ్స్‌ను 4 వికెట్ల తేడాతో సులభంగా ఓడించింది.

పంజాబ్‌ 171 పరుగుల విజయ లక్ష్యాన్ని 18 ఓవర్లలో 4 వికెట్లు కోల్పోయి అందుకుంది.

పంజాబ్ ఓపెనర్ కేఎల్ రాహుల్ 36 బంతుల్లో 7 ఫోర్లు, 5 సిక్సర్ల సాయంతో 71 రన్స్ చేశాడు.

అతడితోపాటు నికొలస్ పూరన్ 36, గేల్ 28 రన్స్ చేశారు.

అనుభవజ్ఞుడైన చెన్నై బౌలర్ హర్భజన్ సింగ్ 57 రన్స్ ఇచ్చి 3 వికెట్లు పడగొట్టాడు.

అంతకు ముందు టాస్ గెలిచిన పంజాబ్ చెన్నైను బ్యాటింగ్‌కు ఆహ్వానించింది. చెన్నై ఓపెనర్ ఫాఫ్ డు ప్లెసీ 96, సురేశ్ రైనా 53 రన్స్ సాయంతో నిర్ధారిత 20 ఓవర్లలో 5 వికెట్లు కోల్పోయి 170 పరుగులు చేసింది.

అయితే, ఈ మ్యాచ్‌లో విజయం సాధించినా పంజాబ్ ప్లేఆఫ్‌లో స్థానం సంపాదించలేకపోయింది.

Image copyright SunRisers Hyderabad/facebook

పాయింట్ల పట్టిక చూస్తే..

ఐపీఎల్‌లో 56 మ్యాచుల తర్వాత ముంబయి ఇండియన్స్ 14 మ్యాచుల్లో 9 విజయాలతో 18 పాయింట్లతో పట్టికలో మొదటి స్థానంలో నిలిచింది.

గత ఛాంపియన్ చెన్నై సూపర్ కింగ్స్ 14 మ్యాచుల్లో 9 విజయాలు సాధించినా ముంబయి కంటే రన్ రేట్ కాస్త తక్కువగా ఉండడంతో 18 పాయింట్లతో రెండో స్థానంలో నిలిచింది.

ఏడేళ్ల తర్వాత ప్లేఆఫ్ చేరిన దిల్లీ క్యాపిటల్స్‌క కూడా 14 మ్యాచుల్లో 9 విజయాలతో 18 పాయింట్లు ఉన్నాయి. కానీ దాని రన్ రేట్ ముంబై, చెన్నై కంటే తక్కువగా ఉంది. దాంతో అది మూడో స్థానంలో నిలిచింది.

ఇక 14 మ్యాచుల్లో 6 విజయాలతో 12 పాయింట్లు సాధించిన సన్‌రైజర్స్ హైదరాబాద్ కోల్‌కతా కంటే మెరుగైన రన్ రేట్ ఉన్న కారణంగా నాలుగో స్థానంలో నిలిచింది.

దిల్లీ క్యాపిటల్స్ - సన్‌రైజర్స్ హైదరాబాద్ మధ్య రెండో ప్లేఆఫ్ బుధవారం విశాఖపట్టణంలో జరుగుతుంది.

ఇవి కూడా చదవండి:

(బీబీసీ తెలుగును ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్‌, ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)