కేసీఆర్ ఫెడరల్ ఫ్రంట్ ప్రయత్నాలు... కేరళ, తమిళనాడు, కర్నాటక రాష్ట్రాల్లో పర్యటనలు :ప్రెస్‌ రివ్యూ

  • 6 మే 2019
కేసీఆర్ Image copyright KALVAKUNTLACHANDRASHEKARRAO/FB

సమాఖ్య కూటమి ఏర్పాటు సన్నాహాలపై ముఖ్యమంత్రి కేసీఆర్‌ మళ్లీ దృష్టి సారించినట్లు ఈనాడు కథనం ప్రచురించింది.

సోమవారం నుంచి కేసీఆర్ కేరళ, తమిళనాడు, కర్నాటకల్లో పర్యటించనున్నారని ఈ కథనంలో తెలిపారు.

భాజపా, కాంగ్రెస్‌లకు ప్రత్యామ్నాయంగా ప్రతిపాదిస్తున్న సమాఖ్య కూటమిలోకి వామపక్షాలనూ ఆహ్వానించాలని ఆయన నిర్ణయించినట్లు తెలిసింది.

సోమవారం సాయంత్రం సీఎం కేసీఆర్‌ బేగంపేట విమానాశ్రయం నుంచి ప్రత్యేక విమానంలో బయల్దేరి 6 గంటలకు తిరువనంతపురం చేరుకుంటారు. కేరళ ముఖ్యమంత్రి పినరయి విజయన్‌తో సమావేశమవుతారు. ప్రస్తుత జాతీయ రాజకీయ పరిస్థితులపై ఇద్దరు చర్చిస్తారని ఈనాడు పేర్కొంది.

ఈ సమావేశంలో సమాఖ్య కూటమి ఏర్పాటు పూర్వాపరాలు, భాజపా, కాంగ్రెస్‌లకు ప్రత్యామ్నాయంగా ఇతర పార్టీలు నిర్వహించాల్సిన పాత్ర వంటి వాటిపై నేతలు మాట్లాడుకుంటారు.

అనంతరం కేసీఆర్ తమిళనాడులోని రామేశ్వరం, శ్రీరంగం దేవాలయాలను సందర్శిస్తారు. ఆ రాష్ట్రంలో వివిధ పార్టీల నేతలతో సమావేశమవుతారు. ఆ తర్వాత కర్ణాటక వెళ్తారని కథనంలో తెలిపారు.

భాజపా, కాంగ్రెస్‌ పార్టీలకు ప్రత్యామ్నాయంగా సమాఖ్య కూటమి ఏర్పాటు ప్రతిపాదనను శాసనసభ ఎన్నికలకు ముందు సీఎం కేసీఆర్‌ తెరమీదికి తెచ్చారు. పలు పార్టీల అధ్యక్షులు, ముఖ్యనేతలను కలిశారు. ముఖ్యమంత్రులు మమతా బెనర్జీ, నవీన్‌ పట్నాయక్‌ తదితరులతో భేటీ అయ్యారు.

అసెంబ్లీ ఎన్నికలు ముగిసిన తర్వాత కూటమి సన్నాహాలను ఆయన పునఃప్రారంభించారు. అయితే, లోక్‌సభ ఎన్నికలు రావడంతో ఈ ప్రయత్నాలు కొంత మేర ఆగాయి. రాష్ట్రంలో సార్వత్రిక ఎన్నికలు ముగిసిన తర్వాత మళ్లీ సీఎం కేసీఆర్‌ అటువైపు దృష్టి సారించినట్లు ఈనాడు చెప్పింది.

స్థానిక సంస్థలు ఎన్నికల పర్యవేక్షణ బాధ్యతలను సీఎం పార్టీ కార్యనిర్వాహక అధ్యక్షుడు కేటీఆర్‌కు అప్పగించినట్లు తెలిపింది.

లోక్‌సభ ఎన్నికల ఫలితాలు ఈ నెల 23న రానుండండతో అప్పటి వరకు సమాఖ్య కూటమిని క్రియాశీలం చేయాలని సీఎం భావిస్తున్నారు.

ఎన్నికల ఫలితాలు వెలువడే నాటికి ప్రత్యామ్నాయాన్ని అన్ని విధాలా సిద్ధం చేయాలనుకుంటున్నారు. ఈ నేపథ్యంలో ప్రస్తుతం వివిధ దశల లోక్‌సభ ఎన్నికలు ముగిసిన రాష్ట్రాల్లో పర్యటించాలని ఆయన నిర్ణయించారు. ఇందుకు తొలుత కేరళను ఎంచుకున్నారు అని ఈనాడు కథనంలో చెప్పింది.

Image copyright Getty Images

మోదీ సర్కారును గద్దె దించాలి: మన్మోహన్ సింగ్

ప్రధానమంత్రి నరేంద్రమోదీని అధికారం నుంచి సాగనంపాల్సిన తరుణం ఆసన్నమైందని మాజీ ప్రధాని మన్మోహన్‌సింగ్ అన్నట్లు నమస్తే తెలంగాణ సహా అన్ని ప్రధాన పత్రికలూ కథనం ప్రచురించాయి.

మోదీ ఐదేండ్ల పరిపాలనలో దేశంలోని యువతకు, రైతులకు, వ్యాపారులకు, ప్రతి ప్రజాస్వామ్య సంస్థకు తీవ్రమైన నష్టం వాటిల్లిందని పీటీఐ వార్తా సంస్థకు ఇచ్చిన ప్రత్యేక ఇంటర్వ్యూలో నిప్పులు చెరిగినట్లు కథనం తెలిపింది.

దేశంలో మోదీ అనుకూల పవనాలు వీస్తున్నాయన్న అభిప్రాయాన్ని ఆయన తోసిపుచ్చారు. సమ్మిళిత అభివృద్ధిని విశ్వసించకుండా కేవలం రాజకీయ అస్థిత్వం కోసం పాకులాడుతున్న మోదీ సర్కారును గద్దెదించాలని ప్రజలు ఎదురు చూస్తున్నారని చెప్పారు.

మోదీ హయాంలో అవినీతి అనూహ్యమైన స్థాయికి పెరిగిందని, రాజకీయ పదవుల్లో ఉన్న వ్యక్తులు బ్యాంకులను ముంచి విదేశాలకు పారిపోయిన మోసగాళ్లతో కుమ్మక్కయ్యారని విమర్శించారు.

పెద్ద నోట్ల రద్దు స్వతంత్ర భారత దేశ చరిత్రలోనే అతిపెద్ద కుంభకోణమని పేర్కొన్నారు.

పాకిస్థాన్ పట్ల మోదీ పిల్లి మొగ్గలు వేస్తున్నారని, తన వైఖరిని పదేపదే మార్చుకుంటూ నిర్లక్ష్య విధానం అనుసరిస్తున్నారని మన్మో హన్ విమర్శించినట్లు నమస్తే తెలంగాణ చెప్పింది.

ఆహ్వానం లేకుండా పాకిస్థాన్‌కు వెళ్లిన మోదీ.. నయ వంచనకు మారుపేరైన ఐఎస్‌ఐని ఉగ్రవాద దాడిపై దర్యాప్తు కోసం పఠాన్‌కోట్ వైమానిక స్ధావరానికి ఆహ్వానించారని దుయ్యబట్టారు.

దేశ ఆర్థిక వ్యవస్థను మోదీ సర్కారు కష్టాల కొలిమిలోకి నెట్టిందని, దీంతో ఆర్థిక మాంద్యం వైపు అడుగులు వేస్తున్నదని అన్నట్లు కథనంలో తెలిపారు.

జాతీయవాదాన్ని, ఉగ్రవాదాన్ని ప్రస్తావిస్తూ ఎన్నికల్లో ఓట్లు దండుకోవాలని చూస్తున్న బీజేపీకి మన్మోహన్ కౌంటర్ ఇస్తూ.. దేశం పట్ల మోదీకి గల నిబద్ధత ఏమిటని ప్రశ్నించారు.

పుల్వామా ఉగ్రదాడిలో 40 మంది సీఆర్పీఎఫ్ జవాన్లు అమరులైన వెంటనే భద్రతా వ్యవహారాల క్యాబినెట్ కమిటీ (సీసీఎస్) సమావేశాన్ని నిర్వహించి పరిస్థితిని సమీక్షించడానికి బదులుగా జిమ్ కార్బెట్ నేషనల్ పార్కులో మోదీ తన ప్రచార చిత్రం షూటింగ్‌లో పాల్గొనడం విచారకరమని మన్మోహన్ ధ్వజమెత్తినట్లు నమస్తే తెలంగాణ తెలిపింది.

Image copyright Vanama Venkateswara Rao/facebook

ఫిరాయింపులపై రచ్చ రచ్చ

అసెంబ్లీ న్నికల్లో కాంగ్రెస తరఫున గెలిచి సిరా గుర్తు కూడా ఆరక ముందే అధికార టీఆర్ఎస్‌లో చేరిన ఎమ్మెల్యేలకు చేదు అనుభవాలు ఎదురవుతున్నాయంటూ ఆంధ్రజ్యోతి దినపత్రిక ప్రత్యేక కథనాన్ని ప్రచురించింది.

నమ్మకంతో గెలిపిస్తే ఎందుకు పార్టీ మారారంటూ ప్రజలు నిలదీస్తున్నారు. స్థానిక ఎన్నికల్లో టీఆర్ఎస్ అభ్యర్థులకు ఓట్లు వేయాలంటూ ఎమ్మెల్యేలు వస్తుడడంతో అసెంబ్లీ ఎన్నికల్లో సదరు నేతల విజయానికి కృషి చేసిన కాంగ్రెస్ నేతలు, కార్యకర్తలు, ప్రజలు రగిలిపోతున్నారు. ఇల్లెందు ఎమ్మెల్యే హరిప్రియ నాయక్ మీద దాడి జరిగిన మరుసటి రోజు ఆదివారమే పినపాక ఎమ్మెల్యే రేగా కాంతారావుకు నిరసన సెగ తగిలింది. బూర్గుంపాడు మండలం రెడ్డి పాలంలో ప్రచారానికి వెళఅళఇన రేగాను కాంగ్రెస్ కార్యకర్తలు, గ్రామస్థులు అడ్డుకున్నారు. దుర్భాషలాడడమే కాకుండా ఆయన కారును దహనం చేస్తామని హెచ్చరించినట్లు ఈ కథనలో రాశారు. గ్రామాన్ని అభివృద్ధి చేస్తామని చెప్పి, ఎన్నికల్లో గెలిచిన తరువాత పార్టీ మారి గ్రామం వైపు కన్నెత్తి చూడలేదని ఆగ్రహం వ్యక్తం చేశారు. పరిస్థితి ఉద్రిక్తంగా మారడంతో రేగా అక్కడి నుంచి వెళ్ళిపోయారని ఈ వార్తలో రాశారు.

అలాగే, అధికార టీఆర్ఎస్ పార్టీలోకి ఫిరాయించి మోసం చేశారని కొత్తగూడెం ఎమ్మెల్యే వనమా వెంకటేశ్వరరావుపై సుజాత నగర్ పోలీస్ స్టేషన్, ఇల్లెందు ఎమ్మెల్యే హరిప్రియపై ఇల్లెందు స్టేషన్లో కాంగ్రెస్ కార్యకర్తలు ఫిర్యాదు చేశారు. నిరసన సెగల మధ్య ఫిరాయింపు ఎమ్మెల్యేలు పోలీసు బందోబస్తుతో ప్రచారం సాగించాల్సిన పరిస్థితి ఏర్పడిందని ఈ కథనంలో పేర్కొన్నారు.

Image copyright Getty Images

ఏపీపీఎస్సీ కోడ్ ఉల్లంఘన

గ్రూప్-2 పరీక్షా పేపర్‌లో ఏపీపీఎస్సీ ఎన్నికల కోడ్ ఉల్లంఘించిందని, చంద్రబాబు పథకాల గురించి ప్రశ్నలు అడిగిందని సాక్షి ఒక కథనం ప్రచురించింది.

ఆంధ్రప్రదేశ్‌ పబ్లిక్‌ సర్వీస్‌ కమిషన్‌ (ఏపీపీఎస్సీ) ఆదివారం నిర్వహించిన గ్రూప్‌-2 ప్రిలిమనరీ పరీక్షలో పలు ప్రశ్నలు అభ్యర్థులను విస్తుపోయేలా చేశాయి.

ఎన్నికలకు కొద్దికాలం ముందు ఓట్ల కోసం తన పేరుతో తెలుగుదేశం అధినేత, ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు పెట్టిన కొన్ని పథకాల గురించిన ప్రశ్నలను ఏపీపీఎస్సీ అడగడం వివాదాస్పదంగా మారింది.

సాధారణ ఎన్నికల కోడ్‌ మే 27వ తేదీ వరకు అమల్లో ఉన్న విషయం తెలిసిందే. పైగా రాష్ట్రంలోని ఎన్నికల పోలింగ్‌ ప్రక్రియ కూడా ఇంకా ముగియలేదు. మూడు జిల్లాల్లోని ఐదు పోలింగ్‌ కేంద్రాల్లో సోమవారం రీపోలింగ్‌కు కూడా ఎన్నికల కమిషన్‌ ఆదేశించింది. ఈ తరుణంలో జరిగిన గ్రూప్‌-2 పరీక్షలో ఏపీపీఎస్సీ అడిగిన పలు ప్రశ్నలపై తీవ్ర అభ్యంతరాలు వ్యక్తమవుతున్నాయని కథనంలో చెప్పారు.

పోలింగ్‌ సమయంలో అధికార తెలుగుదేశం పార్టీకి లబ్ధి కలిగేలా ఏపీపీఎస్సీ ప్రశ్నలున్నాయన్న విమర్శలు వస్తున్నాయి. ఇలాంటి ప్రశ్నలను అడగడం ద్వారా చంద్రబాబుపై తన స్వామిభక్తిని ఏపీపీఎస్సీ చాటుకున్నట్లుగా ఉందన్న ఆరోపణలూ వినిపిస్తున్నాయని సాక్షి తమ కథనంలో చెప్పింది.

ఎన్నికల కోడ్‌ అమల్లో ఉందని, మరోవైపు.. ఫొని తుపాను కారణంగా ఉత్తరాంధ్ర జిల్లాల్లో పరిస్థితులు అస్తవ్యస్తంగా ఉన్నాయని, ఈ తరుణంలో గ్రూప్‌-2 పరీక్షలు సరికాదని, రెండు నెలలు వాయిదా వేయాలని అభ్యర్థులు, వైఎస్సార్‌ కాంగ్రెస్‌ ఎంపీ విజయసాయిరెడ్డి ఇతర ప్రజాప్రతినిధులు ఏపీపీఎస్సీకి విన్నవించారు.

తమకు ప్రిపరేషన్‌కు సరైన సమయం కూడా ఇవ్వకుండా పరీక్షలు పెట్టడంవల్ల నష్టపోతామని అభ్యర్థులు చాలా కాలంగా ఏపీపీఎస్సీ చైర్మన్‌కు, ప్రభుత్వానికి మొరపెట్టుకున్నా ఫలితం లేకపోయింది.

ఎన్నికల కోడ్‌ అమల్లో ఉంటూ రీపోలింగ్‌ జరుగుతున్న సమయంలో పరీక్షలు నిర్వహించడమే కాకుండా అధికార పార్టీకి అనుకూలంగా ప్రచారం జరిగేలా ప్రశ్నలు అడగడంపై మండిపడుతున్నారని సాక్షి కథనం తెలిపింది.

ఇది కూడా చదవండి:

(బీబీసీ తెలుగును ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్‌, ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)