ఏపీలో కౌంటింగ్‌కు కౌంట్‌డౌన్.. మీ నియోజకవర్గంలో లెక్కింపులో పాల్గొనేది ఎవరో తెలుసుకోవచ్చా

  • 6 మే 2019
ఈవీఎంలు Image copyright Getty Images

ఆంధ్రప్రదేశ్‌లోని ఐదు పోలింగ్ కేంద్రాల్లో రీపోలింగ్ ప్రశాంతంగా ముగిసింది.

గుంటూరు, ప్రకాశం, నెల్లూరు జిల్లాల పరిధిలో ఈ ఐదు కేంద్రాలు ఉన్నాయి.

వీటిలో నాలుగు చోట్ల 6 గంటలకు పోలింగ్ ముగియగా.. ఒక్క కేంద్రంలో మాత్రం అప్పటికి ఇంకా 47 మంది క్యూలో ఉండడంతో అక్కడ పోలింగ్ గంటల వరకు కొనసాగినట్లు ఆంధ్రప్రదేశ్ ప్రధాన ఎన్నికల అధికారి గోపాల కృష్ణ ద్వివేది తెలిపారు.

ఈ రీపోలింగ్‌తో ఏపీలో పోలింగ్ ప్రక్రియ ముగిసిందని.. ఇక కౌంటింగ్‌కు సంబంధించిన ప్రక్రియ ప్రారంభిస్తామని ఆయన తెలిపారు. సిబ్బంది ఎంపిక, శిక్షణ ప్రారంభమవుతుందన్నారు.

Image copyright Prasad

గుంటూరు జిల్లా నరసరావుపేట (అసెంబ్లీ, పార్లమెంటు నియోజకవర్గ) పరిధిలోని కేశనుపల్లి పోలింగ్ కేంద్రంలో అత్యధికంగా 89.23% ఓటింగ్ జరిగింది. మొత్తం 956 మంది ఓటర్లుండగా 853 మంది ఓటు హక్కును వినియోగించుకున్నారు.

గుంటూరు పశ్చిమ (అసెంబ్లీ), గుంటూరు (పార్లమెంటు) నియోజకవర్గాల పరిధిలోని నల్లచెరువు పోలింగ్ కేంద్రంలో అత్యల్పంగా 75.43% ఓటింగ్ నమోదైంది.

ప్రకాశం జిల్లా పరిధిలోని ఎర్రగొండపాలెం (అసెంబ్లీ), ఒంగోలు (పార్లమెంటు) నియోజకవర్గాల పరిధిలోని కలనూతల పోలింగ్ కేంద్రంలో 87.01% ఓటింగ్ జరిగింది.

Image copyright Prasad

నెల్లూరు జిల్లాలోని కోవూరు (అసెంబ్లీ), నెల్లూరు (పార్లమెంటు) నియోజకవర్గాల పరిధిలోని ఇసుకపాలెం కేంద్రంలో 75.55% పోలింగ్..

సూళ్ళూరు పేట (అసెంబ్లీ) తిరుపతి (ఎస్సీ రిజర్వ్‌డ్ పార్లమెంటు) అటకానితిప్ప కేంద్రంలో 84.23% ఓటింగ్ జరిగింది.

Image copyright Prasad

మంగళవారం నుంచి కౌంటింగ్ ఏర్పాట్లు

ఏపీలో రీపోలింగ్ ప్రశాంతంగా ముగిసిందని.. మంగళవారం నుంచి కౌంటింగ్ కు సంబంధించిన ప్రక్రియ ప్రారంభమవుతుందని రాష్ట్ర ప్రధాన ఎన్నికల అధికారి గోపాల కృష్ణ ద్వివేది చెప్పారు.

ప్రతి జిల్లా నుంచి పది మందిని ఎంపిక చేసి ఇక్కడ శిక్షణ ఇస్తారన్నారు. ఓట్ల లెక్కింపు సందర్భంగా తీసుకోవలసిన జాగ్రత్తలు, విధివిధానాలు అన్ని వారికి వివరిస్తారని చెప్పారు.

వారు మే 17న ఆయా జిల్లాలలో ఇతర ఓట్ల లెక్కింపు సిబ్బందికి శిక్షణ ఇస్తారన్నారు. ఈవీఎం ఓట్ల కంటే ముందే పోస్టల్ బ్యాలెట్ ఓట్లను లెక్కిస్తారని చెప్పారు. గెలిచిన అభ్యర్థికి వచ్చిన మెజార్టీ ఓట్ల కంటే ఎక్కువ పోస్టల్ ఓట్లు ఉంటే వాటిని మరోసారి లెక్కిస్తారన్నారు. ఓట్ల లెక్కింపు కేంద్రం విస్తీర్ణం ఆధారంగా ఎన్ని టేబుల్స్ అనేది నిర్ణయిస్తారన్నారు. ఓట్ల లెక్కింపు సిబ్బందిగా ఏ నియోజకవర్గానికి ఎవరిని ఎంపిక చేశారో ఒక రోజు ముందు మాత్రమే తెలుస్తుందన్నారు.

ఎవరికి ఏ టేబుల్ వస్తుందో ఒక గంట ముందు మాత్రమే తెలుస్తుందన్నారు. అవన్ని పరిశీలకులు నిర్ణయిస్తారని చెప్పారు. ఓట్ల లెక్కింపు ప్రక్రియ అంతా నిష్పక్షపాతంగా జరుగుతుందన్నారు. నియోజకవర్గానికి 150 మంది వరకు ఓట్ల లెక్కింపు సిబ్బంది కావలసి ఉంటుందని, 20 శాతం మందిని అదనంగా తీసుకుంటారని చెప్పారు. ఈ నెల 23న పరిశీలకుల సమక్షంలో ఓట్ల లెక్కింపు ప్రారంభమవుతుందన్నారు.

మొదట ఈవీఎంల ఓట్లను లెక్కిస్తారని, తరువాత నియోజకర్గానికి ఓ అయిదు వీవీప్యాట్ లను ర్యాండమ్ గా ఎంపిక చేసి లెక్కిస్తారని చెప్పారు.

ఈవీఎంల ఓట్లకు, వీవీప్యాట్ ల ఓట్లకు మధ్య వ్యత్యాసం లేకపోతే ఫలితాలను ప్రకటిస్తారన్నారు. వ్యత్యాసం ఉంటే వీవీ ప్యాట్ ఓట్లను మరొకసారి లెక్కిస్తారని, అప్పటికీ మార్పులేకపోతే వీవీప్యాట్ ఓట్లను మొత్తం లెక్కిస్తారని, ఆ లెక్క ఆధారంగానే ఫలితాలను ప్రకటిస్తారని వివరించారు.

మధ్యాహ్నం భోజన సమయానికి ఫలితాలు తెలుస్తాయని, అధికారికంగా ప్రకటించడానికి కొంత సమయం పడుతుందన్నారు.

ఓట్ల లెక్కింపు సందర్భంగా మూడు అంచల గట్టి భద్రతా ఏర్పాట్లు చేస్తున్నట్లు ద్వివేది చెప్పారు.

ఇవి కూడా చదవండి:

(బీబీసీ తెలుగును ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్‌, ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)

ఈ కథనం గురించి మరింత సమాచారం