సీజేఐ రంజన్ గొగోయ్‌‌పై ఆరోపణలు నిరాధారమని తేల్చిన విచారణ కమిటీ.. అన్యాయం చేశారన్న ఫిర్యాదుదారు

  • 6 మే 2019
జస్టిస్ గొగోయ్ Image copyright Getty Images

సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి(సీజేఐ) రంజన్ గొగోయ్‌పై వచ్చిన లైంగిక వేధింపుల ఆరోపణలపై విచారణ జరిపిన అంతర్గత త్రిసభ్య కమిటీ ఆయనకు వ్యతిరేకంగా ఆధారాలు లేవని తేల్చింది.

ఫిర్యాదులోని ఆరోపణలను బలపరిచే ఆధారాలేవీ లభించలేదని స్పష్టం చేసింది.

జస్టిస్ ఎస్‌ఏ బోబ్డే అధ్యక్షతన ఏర్పాటైన ఈ ఇన్-హౌజ్ కమిటీ విచారణ నివేదికను తాజాగా సమర్పించింది.

జస్టిస్ ఇందిరా బెనర్జీ, జస్టిస్ ఇందూ మల్హోత్రా ఈ కమిటీలో సభ్యులుగా ఉన్నారు.

కమిటీ నివేదిక ఏం తేల్చిందన్నది సీజేఐ సెక్రటరీ జనరల్ ప్రకటన రూపంలో వెల్లడించారు.

గతంలో సుప్రీంకోర్టులో జూనియర్ అసిస్టెంట్‌గా ఉన్న ఓ మహిళ.. తనపై ఆయన లైంగిక వేధింపులకు పాల్పడ్డట్లు ఆరోపణలు చేసిన సంగతి తెలిసిందే.

ఈ విషయం గురించి మొత్తం 22 మంది సుప్రీం కోర్టు జడ్జిలకు ఏప్రిల్ 19న ఆమె లేఖ రాశారు.

ఈ ఆరోపణలపై విచారణ జరిపేందుకే ఈ ఇన్-హౌజ్ కమిటీ ఏర్పాటైంది.

అయితే, ఫిర్యాదు చేసిన మహిళ తొలుత విచారణకు హాజరైనా కమిటీ తీరుపై అభ్యంతరాలు వ్యక్తం చేస్తూ తరువాత విచారణ నుంచి తప్పుకొన్నారు.

ఏ ప్రాతిపదికన సీజేఐ కేసు నుంచి బయటపడ్డారో సుప్రీంకోర్టు చెప్పాలి: మనోజ్ మిట్టా

జస్టిస్ రంజన్ గొగోయ్‌పై వచ్చిన ఆరోపణలు నిరాధారమని కమిటీ తేల్చినప్పటికీ ఆ నివేదికను బహిర్గతం చేయాలని సీనియర్ పాత్రికేయుడు మనోజ్ మిట్టా అన్నారు.

''సీజేఐపై వచ్చిన లైంగిక ఆరోపణలపై ఏర్పాటు చేసిన అంతర్గత కమిటీ విచారణ తీరుపై ఫిర్యాదుదారైన మహిళ, జస్టిస్ చంద్రచూడ్‌ల నుంచి ఆందోళనలు వ్యక్తమైనా జస్టిస్ రంజన్ గొగోయ్‌కు క్లీన్ చిట్ లభించింది.

సీజేఐపై వచ్చిన లైంగిక వేధింపుల ఆరోపణలకు సంబంధించి ఆధారాలు లేవంటూ కమిటీ తేల్చడం రూల్ ఆఫ్ లా, సర్వోన్నత న్యాయస్థానానికున్న విశ్వసనీయతకు విఘాతం.

సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తిపైనే వచ్చిన ఈ సంచలన ఆరోపణలకు సంబంధించి కమిటీ ఏం తేల్చిందనేది వెల్లడించినంతమాత్రాన సరిపోదు.

అంతర్గత కమిటీ సమర్పించిన నివేదిక మొత్తం బహిర్గతం చేయకపోయినా కనీసం, సీజేఐ రంజన్ గొగోయ్‌‌ ఏ ప్రాతిపదికన ఈ కేసు నుంచి బయటపడగలిగారన్న సారాంశమైనా వెల్లడించాలి'' అని ఆయన అభిప్రాయపడ్డారు.

బాధపడలేదు.. కానీ, న్యాయంపై నమ్మకం పోతోంది: ఫిర్యాదుదారు

''నేను చీఫ్ జస్టిస్ ఆఫ్ ఇండియాపై ఫిర్యాదు చేసిన మహిళను. సుప్రీంకోర్టు మాజీ ఉద్యోగినిని. నా ఫిర్యాదు నిరాధారం అని అంతర్గత కమిటీ తేల్చడంతో నేనేమీ తీవ్ర అంసతృప్తికి లోనవలేదు, బాధ పడలేదు. కానీ, ఈ దేశ పౌరురాలిగా నాకు తీరని అన్యాయం జరిగిందని మాత్రం భావిస్తున్నాను.

ఇప్పుడు నేను ఎంతో భయపడుతున్నాను. నా ఫిర్యాదుపై విచారణ జరిపిన కమిటీ ముందు నేను అన్ని ఆధారాలు సమర్పించినప్పటికీ వారు న్యాయం కానీ, రక్షణ కానీ అందివ్వకపోవడమే దీనికి కారణం.

నేను, నా కుటుంబసభ్యులు ఎదుర్కొన్న సస్పెన్షన్లు, అవమానాల గురించి కూడా కమిటీ ఏమీ చెప్పలేదు.

ఇప్పటికే నాపైన, నా కుటుంబంపైనా ప్రతీకార చర్యలు, దాడులు జరుగుతున్నాయి.. మేం ముందుముందు కూడా వాటికి గురికావాల్సిన పరిస్థితుల్లోనే ఇంకా ఉన్నాం.

సీజేఐపై నా ఫిర్యాదును ఈ ఏడాది ఏప్రిల్ 19న అఫిడవిట్ రూపంలో సుప్రీంకోర్టు న్యాయమూర్తులందరికీ పంపించాను. పని చేసే చోట నేను ఎదుర్కొన్న లైంగిక వేధింపులు.. ఆ తరువాత నిర్దాక్షిణ్యంగా నాపైన, నా కుటుంబంపైనా ప్రతీకారం తీర్చుకున్నారనడానికి ఆధారంగానూ సాక్ష్యాలు కమిటీకి ఇచ్చాను.

ఏప్రిల్ 26న నేను విచారణ కమిటీ ముందు హాజరయ్యాను. ఆ రోజున ప్రారంభం నుంచే నేను విచారణ తీరుపై నాకున్న ఆందోళనలు, అభ్యంతరాలు వ్యక్తంచేస్తూ వచ్చాను. సీజేఐ, నాకు మధ్య అధికార స్థాయిల్లో ఉన్న భేదం ఈ విచారణపై ప్రభావం చూపిస్తుందని ఆందోళన చెందాను.

ఈ రోజు నా భయాలన్నీ నిజమయ్యాయి. సర్వోన్నత న్యాయస్థానం నుంచి నాకు న్యాయం దక్కుతుందన్న ఆశలు చెదిరిపోయాయి.

నివేదిక పూర్తి కాపీని నాకు ఇవ్వబోమని కమిటీ చెప్పేసింది. కాబట్టి... లైంగికంగా వేధింపులకు గురయ్యానని, ప్రతీకార చర్యలకు బాధితురాలినని నేను చేసిన ఫిర్యాదును కొట్టివేయడానికి కారణాలేంటో నేను అర్థం చేసుకోవడం తప్ప ఇంకే మార్గం నా ముందు లేదు.

కమిటీ ఎదుట నేను హాజరైనప్పుడు వారికి ఏం చెప్పాననేది ఏప్రిల్ 30న ఒక ప్రెస్ నోట్లో నేను అందరిముందూ ఉంచాను.

ఏప్రిల్ 26, 29, 30 తేదీల్లో నేను కమిటీ ముందు చెప్పిన అంశాల హార్డ్ కాపీని మే 4 రాత్రి 8 గంటలకు నాకు పంపించారు. అందులో ఉన్న తప్పులను సరిచేసి నేను తిరిగి పంపించాను.

ఈ రోజు కమిటీ నిర్ణయం తరువాత ఏం చేయాలనేది నా లాయర్‌తో మాట్లాడి నిర్ణయిస్తాను.

ప్రస్తుతం నేను న్యాయ భావనపై విశ్వాసం కోల్పోవడానికి చిట్టచివరి అంచున ఉన్నాను.''

నివేదిక బహిర్గతం చేయాలి: ఇందిరా జైసింగ్

ఇదంతో ఓ కుంభకోణం అని సుప్రీంకోర్టు సీనియర్ న్యాయవాది ఇందిరా జైసింగ్ ఆరోపించారు. కమిటీ సమర్పించిన నివేదికను బయటపెట్టాలని ఆమె డిమాండ్ చేశారు.

ఇవి కూడా చదవండి:

(బీబీసీ తెలుగును ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్‌, ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)

ఈ కథనం గురించి మరింత సమాచారం