రేష్మా పఠాన్: షోలే 'బసంతి'కి డూప్.. బాలీవుడ్ తొలి స్టంట్ ఉమన్

  • 7 మే 2019
రేష్మా పఠాన్
చిత్రం శీర్షిక రేష్మా పఠాన్, బాలీవుడ్‌లో తొలి మహిళా స్టంట్ ఆర్టిస్టు

షోలే సినిమాలో 'బసంతి' అందరికీ గుర్తుండే ఉంటుంది. కానీ, ఈ సినిమాలో హేమ మాలినికి డూప్‌గా నటించిన రేష్మా పఠాన్ గురించి మాత్రం ఎవరికీ పెద్దగా తెలియదు.

హిందీ సినిమాల్లో తొలి 'స్టంట్ ఉమన్‌'గా రేష్మాకు పేరుంది.

అనేక చిత్రాల్లో ఆమె అత్యంత కఠినమైన స్టంట్లు చేశారు. చాలామంది నటీమణులకు డూప్‌గా నటించారు.

"ఒక షాట్‌లో రెండు చక్రాలు ఒకదాని తర్వాత ఒకటి విరిగిపోవడంతో గుర్రం బండి ఆగిపోవాలి. కానీ, అలా జరగలేదు. యాక్షన్ అనగానే, బండిని ఉరికించి ఒక రాయిని ఢీకొట్టాను. అయితే, దానికున్నది నిజమైన చక్రాలు కావడంతో విరగలేదు. దాంతో బండి తిరగబడింది. దానికింద నేను ఇరుక్కుపోయా. నేను చనిపోయానని అందరూ భయపడ్డారు. బండిని లేపిన తర్వాత నేను బతికే ఉన్నానని తెలుసుకుని, ఆస్పత్రికి తీసుకెళ్లారు" అని ఆనాటి జ్ఞాపకాలను గుర్తు చేసుకున్నారు రేష్మా.

మీ పరికరంలో మీడియా ప్లేబ్యాక్ సదుపాయం లేదు.
Media captionరేష్మా పఠాన్: సినిమాల్లో నటించొద్దంటూ తండ్రి కొట్టినా ఆమె ఊరుకోలేదు

రేష్మా అత్యంత సాధారణ కుటుంబం నుంచి వచ్చారు.

చిన్నప్పుడు చిలిపి పనులు చేస్తుండేవారు. ఆమె 14 ఏళ్ల వయసులో 'ఏక్ ఖిలాడీ 52 పట్టే' అనే సినిమాలో తొలి స్టంట్ చేశారు.

సినిమాల్లో నటించొద్దంటూ రేష్మాను ఆమె తండ్రి కొట్టారు. కానీ, ఆఖరికి రేష్మా ప్రతిభను చూసి ఆయనే మనసు మార్చుకున్నారు.

Image copyright Reshma pathan
చిత్రం శీర్షిక బాలీవుడ్‌లో అనేక మంది నటీమణులకు డూప్‌గా రేష్మా నటించారు.

ఇటీవల ఆమె బయోపిక్ 'ది షోలే గర్ల్ రేష్మా పఠాన్' విడుదలైంది.

"నా బయోపిక్ తీస్తామంటూ నిర్మాత కాల్ చేశారు. నేను నమ్మలేకపోయాను. ఎవరో నాకు తెలిసినవారు ఆటపట్టిస్తున్నారు, నేను ఎవరికి తెలుసని నా బయోపిక్ తీస్తారు? అని అనుకున్నాను. కానీ, తర్వాత పదేపదే కాల్స్ రావడంతో నా బయోపిక్ తీసేందుకు ఎవరో ఆసక్తి చూపిస్తున్నారని అనిపించింది. నా బయోపిక్ వచ్చినందుకు ఆనందంగా ఉంది. నేను స్టంట్ ఉమన్ అని ఇప్పుడు ప్రజలకు తెలిసింది. నా గురించి ఇన్నాళ్లూ ఎవరికీ తెలియదు. ఇప్పుడు నాకు కొంత గుర్తింపు వచ్చింది" అని ఆమె అంటున్నారు.

Image copyright Reshma pathan

భారతీయ సినిమాకు అత్యుత్తమ సేవలందించినందుకు గాను 'ఫిలిం క్రిటిక్స్ గిల్డ్' రేష్మాకు ఫస్ట్ క్రిటిక్స్ ఛాయిస్ ఫిలిం అవార్డుతో సత్కరించింది.

గతంలో స్టంట్ ఆర్టిస్టులకు సరైన సదుపాయాలు ఉండేవి కాదని ఆమె అంటున్నారు.

రేష్మాకు ఇప్పుడు 65 ఏళ్లు. ఈ వయసులోనూ ఆమెలో స్టంట్లు చేయాలన్న ఆసక్తి తగ్గలేదు.

ఇవి కూడా చదవండి

(బీబీసీ తెలుగును ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్‌, ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)