బీజేపీకి 271 సీట్లు వస్తే సంతోషమే: రాంమాధవ్ - ప్రెస్ రివ్యూ

  • 7 మే 2019
Image copyright Facebook

సొంతంగా బీజేపీ 271 పార్లమెంటు స్థానాలు గెలవగలిగితే సంతోషమేనని ఆ పార్టీ జాతీయ ప్రధాన కార్యదర్శి రామ్‌ మాధవ్‌ వ్యాఖ్యానించినట్లు ఆంధ్రజ్యోతి పత్రిక ఓ కథనం ప్రచురించింది. దాని ప్రకారం..

ప్రభుత్వ వ్యతిరేకత కారణంగా గత ఎన్నికల్లో సాధించినన్ని సీట్లు మళ్లీ దక్కించుకోలేకపోవచ్చని రామ్‌మాధవ్ అన్నారు. అయితే, ఎన్డీయే పక్షాలతో కలుపుకుంటే తమకు మెజార్టీ వస్తుందని వ్యాఖ్యానించారు.

2014లో భారీగా సీట్లు సాధించిన రాష్ట్రాల్లో ఈసారి కలిగే నష్టాన్ని.. ఈశాన్య రాష్ట్రాలు, పశ్చిమ బెంగాల్‌, ఒడిశా రాష్ట్రాల్లో సాధించే సీట్లతో పూడ్చుకుంటామని రామ్‌మాధవ్ పేర్కొన్నారు.

తూర్పు భారతంలో బీజేపీ బాగా విస్తరించగలిగిందని, దక్షిణ భారతంలోనూ అదే స్థాయి కృషి చేసి ఉంటే తమ పార్టీకి సౌకర్యవంతంగా ఉండేదని అన్నారు.

బీజేపీకి చెందిన ఓ సీనియర్‌ నేత, ప్రభుత్వ ఏర్పాటుకు అవసరమైన మెజారిటీ సొంతంగా రాకపోవచ్చని ఈ ఎన్నికల్లో వ్యాఖ్యానించడం ఇదే మొదటిసారని ఈ కథనంలో ఆంధ్రజ్యోతి పేర్కొంది.

చంద్రబాబు నాయుడు Image copyright Getty Images

'పోలవరం నీళ్లు వచ్చే జూన్‌కే'

పోలవరం ప్రాజెక్టు నీటి విడుదలపై ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు మాట మార్చారంటూ సాక్షి దినపత్రిక ఓ కథనం ప్రచురించింది.

ఈ ఏడాది జూన్‌ నాటికే ప్రాజెక్టు నిర్మాణాన్ని పూర్తి చేసి, గ్రావిటీపై కాలువలకు నీటిని విడుదల చేస్తామని ఇటీవల ఎన్నికల ప్రచారంలో చంద్రబాబు ప్రచారం చేసుకున్నారని, ఇప్పుడు మాత్రం 2020 జూన్‌ నాటికే అది సాధ్యమవుతుందని అంటున్నారని తెలిపింది.

ఎన్నికల ప్రవర్తనా నియమావళిని ఉల్లంఘించి చంద్రబాబు సోమవారం పోలవరం ప్రాజెక్టు నిర్మాణ ప్రాంతంలో పర్యటించారని పేర్కొంది.

వచ్చే ఏడాది జూన్‌ నాటికి సైతం ఈ ప్రాజెక్టు నిర్మాణాన్ని పాక్షికంగా పూర్తి చేయడమైనా సాధ్యం కాదని సాగునీటి రంగ నిపుణులు చెబుతున్నారని తెలిపింది.

ఇదే విషయంపై చంద్రబాబు చేసిన ప్రకటనను తెలుపుతూ ఈనాడు దినపత్రిక ఓ కథనం రాసింది.

ఎన్నికల కారణంగా పోలవరం పనులు నెమ్మదించాయని, వేగం పుంజుకునేలా చేసేందుకు చర్యలు చేపడుతున్నామని చంద్రబాబు అన్నట్లు పేర్కొంది.

కేంద్ర నుంచి సరైన సహకారం లేదని, సమయానికి నిధులు ఇచ్చి ఉంటే వెసులుబాటు ఉండేదని ఆయన వ్యాఖ్యానించినట్లు పేర్కొంది.

Image copyright Getty Images

ప్రయాణికులు ఎక్కకుండానే బయల్దేరిన రైలు

విశాఖపట్నం రైల్వే స్టేషన్‌లో ఓ ప్రత్యేక రైలు ప్రయాణికులు ఎక్కకుండానే వెళ్లిపోయిందని, దీంతో 500 మంది ప్రయాణికులు ఇబ్బందుల పాలయ్యారని పేర్కొంటూ ఈనాడు దినపత్రిక ఓ వార్తా కథనం రాసింది. దాని ప్రకారం..

విశాఖ నుంచి కాచిగూడ వెళ్లే ప్రత్యేక రైలు సోమవారం రాత్రి 7.40 గంటలకు బయలుదేరాల్సి ఉంది.

అయితే, ఆ రైలు రాక గురించి మైక్‌ల్లో ఎంతకూ ప్రకటన రాలేదు. ఎలక్ట్రానిక్ బోర్డులపైనా సమాచారం ప్రదర్శించలేదు.

విచారణ కేంద్రం వద్దకు వెళ్లి ప్రయాణికులు ఆరా తీయడంతో, రైలు అప్పటికే వెళ్లిపోయిందని సిబ్బంది సమాధానం ఇచ్చారు. ప్రత్యేక రైలు కావడంతో మాన్యువల్‌గా ప్రకటన చేశామని వివరించారు.

దీంతో ప్రయాణికులు స్టేషన్‌ మాస్టర్‌ బలరామస్వామి ఛాంబర్‌ వద్దకు వెళ్లి నిరసన తెలియజేశారు. ఆయన ఉన్నతాధికారులకు విషయం చెప్పి, అవే టిక్కెట్లతో నచ్చిన రైలు ఎక్కి ప్రయాణం సాగించాలని ప్రయాణికులకు సూచించారు.

అయితే సీటు లేకుండా కాచిగూడ వరకూ ఎలా వెళ్లాలంటూ ప్రయాణికులు ప్రశ్నించారు. కొంతమంది ప్రయాణాల్ని విరమించుకోగా, మరికొందరు ఇబ్బందుల నడుమ వేర్వేరు రైళ్లలో ప్రయాణాలు చేశారు.

కొద్దిరోజులుగా మైక్‌ సరిగా పనిచేయడంలేదనే ఫిర్యాదులు వస్తున్నాయని, అందుకే మ్యానువల్‌గా చేసిన ప్రకటన ప్రయాణికులకు వినిపించి ఉండకపోవచ్చని విచారణ కేంద్రం సిబ్బంది తెలిపారని ఈనాడు ఈ కథనంలో పేర్కొంది.

ఇవి కూడా చదవండి.

(బీబీసీ తెలుగును ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్‌, ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)

ముఖ్యమైన కథనాలు

గోదావరిలో వ‌రుస పడవ ప్ర‌మాదాలు... ఎందుకిలా జ‌ర‌ుగుతోంది? ఎవరు బాధ్యులు?

పాకిస్తాన్‌లో హిందూ విద్యార్థిని అనుమానాస్పద మృతి

కశ్మీర్: పీఎస్ఏ చట్టం కింద ఫారూక్ అబ్దుల్లా నిర్బంధం... ఏమిటీ చట్టం? ఎంత కఠినం?

దక్షిణ కొరియా నాయకులు ఎందుకు గుండు కొట్టించుకుంటున్నారు?

ధోనీ మళ్లీ ఆడతాడా... భారత క్రికెట్‌కు అతడి అవసరం ఇంకా ఉందా?

ఏరియా 51: అమెరికాలో రెండు పట్టణాలను గడగడలాడిస్తున్న 'ఏలియన్స్ జోక్'..

గుజరాత్ 2002 అల్లర్ల ముఖ చిత్రాలైన వీళ్లను గుర్తుపట్టారా.. వీళ్లు ఇప్పుడేం చేస్తున్నారు

గోదావరి బోటు ప్రమాదం: 20కి చేరిన మృతులు.. మరో 27 మంది ఆచూకీ గల్లంతు.. కొనసాగుతున్న గాలింపు చర్యలు