సీజేఐ జస్టిస్ రంజన్ గొగోయ్‌పై లైంగిక వేధింపుల కేసు: ఫిర్యాదుదారు ముందున్న మార్గాలేంటి? - అభిప్రాయం

  • 7 మే 2019
సీజేఐ రంజన్ గొగోయ్‌ Image copyright Reuters
చిత్రం శీర్షిక సీజేఐ రంజన్ గొగోయ్‌

భారత ప్రధాన న్యాయమూర్తి (సీజేఐ) జస్టిస్ రంజన్ గొగోయ్‌పై వచ్చిన లైంగిక వేధింపుల ఆరోపణలు నిరాధారమని సుప్రీం కోర్టు అంతర్గత త్రిసభ్య కమిటీ ప్రకటించింది. కమిటీ సభ్యుల్లో ఒకరైన జస్టిస్ మిశ్రా మే 5న నివేదికను సమర్పించారు. దీని ప్రతిని గొగోయ్‌కు అందజేశారు. కానీ, ఫిర్యాదు చేసిన మహిళకు మాత్రం దీన్ని ఇవ్వలేదు.

దీంతో, తన ఆరోపణలను ఏ ప్రాతిపదికన నిరాధారమని తేల్చారో చెప్పలేకపోతున్నానని ఫిర్యాదుదారు వ్యాఖ్యానించారు.

కమిటీ ఇచ్చిన నివేదికపై ఎన్నో సందేహాలు తలెత్తుతున్నాయి. అది ఎక్స్‌పార్టీ (ఫిర్యాదుదారు విచారణ నుంచి తప్పుకొన్నారు. ఒక పక్షాన్ని మాత్రమే కమిటీ విచారించింది) నివేదిక. దానికి విలువ ఉండదు.

న్యాయవాదిని ఎంచుకునే అవకాశం ఫిర్యాదుదారుకు ఇవ్వలేదు. అందరికీ ఉండే మౌలిక హక్కు ఇది.

విచారణ కమిటీలో ఉన్న ఆ ముగ్గురు జడ్జిలను ఎవరు ఎంపిక చేశారన్నది తెలియదు. ఈ అంశంపై నోటిఫికేషన్ గానీ, తీర్మానం గానీ ఏదీ లేదు.

ఏప్రిల్ 20న స్వయంగా ధర్మాసనంలో సీజేఐ కూర్చొని ఈ అంశాన్ని విచారించారు. ఇది అన్నిటికన్నా పెద్ద విషయం. ఆ తర్వాత నుంచి జరిగిందంతా చట్ట విరుద్ధమే. అందుకే ఈ నివేదికకు విలువ ఉందని అనిపించడం లేదు.

విచారణ నివేదిక బహిర్గతం చేయలేమని సుప్రీంకోర్టు సెక్రటరీ జనరల్ ఓ ప్రకటన చేశారు. ఈ నివేదికను బహిర్గతం చేయాల్సిన అవసరం లేదని 'ఇందిరా జైసింగ్ వర్సెస్ సుప్రీం కోర్టు 2003 కేసు'ను ఉటంకిస్తూ పేర్కొన్నారు.

Image copyright Supreme Court of India

2003లోని ఆ కేసు ఏంటి?

కర్నాటక హైకోర్టుకు చెందిన ఓ జడ్జిపై వచ్చిన లైంగిక వేధింపుల ఆరోపణలకు సంబంధించిన కేసు అది.

అప్పుడు ఓ పబ్లిక్ నోటిఫికేషన్ జారీ చేశారు. విచారణను ఏర్పాటు చేశారు. సమాచారం అందజేసేందుకు దానికి నేను హాజరయ్యా. ఆ కేసులోనూ ఆరోపణలు ఎదుర్కొన్న జడ్జికి క్లీన్ చిట్ వచ్చిందని విన్నా. నివేదిక ప్రతి ఇవ్వమని కోరగా.. సుప్రీం కోర్టు నా అభ్యర్థనను తిరస్కరించింది.

కానీ, అప్పుడు సమాచార హక్కు చట్టం లేదన్న విషయం గమనార్హం. ఇప్పుడు చట్టం మారింది కాబట్టి, సుప్రీం కోర్టు నిర్ణయమూ మారాలి.

2003 కేసులో నిర్ణయం తాజా కేసుకు వర్తించదన్నది నా అభిప్రాయం.

Image copyright Getty Images

ఇప్పటివరకైతే ఫిర్యాదుదారుకు నివేదిక ప్రతి ఇవ్వలేదు. ఇస్తారన్న నమ్మకం కూడా లేదని ఆమె అన్నారు. ఇలాంటి సమయంలో, ఆమె ముందు ఇంకా ఏయే మార్గాలు ఉన్నాయన్నది తెలుసుకోవడం ముఖ్యం.

త్రిసభ్య కమిటీ ఇచ్చింది అధికారిక నివేదిక కాబట్టి, న్యాయస్థానంలో సవాలు చేయొచ్చు.

ఏ మార్గం ఎంచుకోవాలన్నది ఫిర్యాదుదారు చేతుల్లోనే ఉంది. డిస్పోజల్ ఆర్డర్‌ను కూడా ఆమె సవాలు చేయొచ్చు.

క్రిమినల్ ఫిర్యాదు కూడా చేయొచ్చు.

నివేదిక ప్రతి కోసం ఆమె కోర్టును ఆశ్రయించొచ్చు. దీనిపై నిర్ణయం ఎలా వచ్చినా, ఆమె ముందు మరిన్ని దారులు ఉన్నాయి.

సీజేఐపై చర్యలు తీసుకోవాలంటే అభిశంసనను తేవడం ఒక్కటే మార్గమని కొందరు అంటున్నారు.

మధ్య ప్రదేశ్‌లో ఓ న్యాయమూర్తిపై లైంగిక వేధింపుల ఆరోపణలు వచ్చినప్పుడు రాజ్యసభలో ఆయనపై అభిశంసనను ప్రవేశపెట్టారు.

(బీబీసీ ప్రతినిధి దివ్య ఆర్యకు ఇందిరా జైసింగ్‌ చెప్పిన విషయాల ఆధారంగా..)

ఇవి కూడా చదవండి:

(బీబీసీ తెలుగును ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్‌, ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)