మహారాష్ట్ర: ప్రేమ వివాహం చేసుకున్నారని కొత్త జంటపై పెట్రోల్ పోసి సజీవ దహనం.. మరణించిన భార్య, మృత్యువుతో పోరాడుతున్న భర్త

  • 7 మే 2019
సజీవ దహనం, పరువు హత్య
చిత్రం శీర్షిక రుక్మిణి, మంగేష్ ఆరు నెలల క్రితం ప్రేమ వివాహం చేసుకున్నారు

పంతొమ్మిదేళ్ల రుక్మిణి ఆరు నెలల క్రితమే తను ప్రేమించిన అబ్బాయిని వివాహం చేసుకుంది. అయితే, వారి కులాలు వేరు కావడంతో ఆమె కుటుంబ సభ్యులు ఆ పెళ్లికి అంగీకరించలేదు.

తమ అనుమతి లేకుండా పెళ్లి చేసుకుందన్నారని ఆగ్రహించిన ఆమె తండ్రి, చిన్నాన్న, మేనమామ కలిసి రుక్మిణిపై, ఆమె భర్తపై పెట్రోల్ పోసి నిప్పటించారు.

కుటుంబ సభ్యుల కర్కశత్వానికి రుక్మిణి బలయ్యారు. మహారాష్ట్రలోని అహ్మద్‌నగర్ జిల్లాలోని నిఘోజ్ గ్రామంలో జరిగిన ఈ 'కుల దురహంకార హత్య' సంచలనం సృష్టించింది.

రుక్మిణీ కుటుంబం ఉత్తర్‌ప్రదేశ్ నుంచి వచ్చి మహారాష్ట్రలో స్థిరపడింది. స్థానికుడైన మంగేష్ రాంసింగ్‌, రుక్మిణి ప్రేమించుకుని, పెళ్లి చేసుకున్నారు. వారి వివాహాన్ని అబ్బాయి కుటుంబ సభ్యులు అంగీకరించారు. కానీ, రుక్మిణి తండ్రి, బంధువులు మాత్రం తీవ్రంగా వ్యతిరేకించారు.

"వారి పెళ్లై ఆరు నెలలు గడిచినా రుక్మిణి బంధువుల్లో ఆగ్రహం తగ్గలేదు. వీధుల్లో కనిపించిన ప్రతిసారీ ఆ దంపతులను రుక్మిణి బంధువులు బెదిరించేవారు. తమకు వారి నుంచి హాని ఉందంటూ ఈ ఏడాది ఫిబ్రవరిలో రుక్మిణి, మంగేష్ వెళ్లి పార్నెర్ పోలీస్టేషన్‌లో ఫిర్యాదు చేశారు" అని మహేష్ చెప్పారు.

చిత్రం శీర్షిక ఘటనా స్థలం

ఆగ్రహావేశాలు కొనసాగుతుండగానే ఏప్రిల్ 30న రుక్మిణిని కుటుంబ సభ్యులు తమ ఇంటికి పిలిపించారు. ఆమెను తీవ్రంగా కొట్టారు. అర్ధరాత్రి రుక్మిణి తన భర్తకు ఫోన్ చేసి తనను అమ్మానాన్నలు తీవ్రంగా కొట్టారని, వెంటనే వచ్చి తనను తీసుకెళ్లిపోవాలని చెప్పింది.

మరుసటి రోజు మే 1న ఉదయాన్నే మంగేష్ రుక్మిణి ఇంటికి వెళ్లారు. అప్పుడే ఉత్తర్‌ప్రదేశ్ నుంచి రుక్మిణి చిన్నాన్న, మేనమామ వచ్చారు. రుక్మిణి, మంగేష్ ప్రేమ వివాహంపై పెద్దఎత్తున గొడవ జరిగింది.

రుక్మిణి బాబాయి, మేనమామ ఇద్దరూ మంగేష్ మీద దాడి చేసి కొట్టారు. తర్వాత ఆ నవ దంపతులిద్దరినీ ఇంట్లో తాడుతో కట్టేసి, ఏమాత్రం కనికరం చూపకుండా వారి మీద పెట్రోల్ పోసి నిప్పంటించారు. ఇంటి తలుపులు మూసేసి బయట వేచిచూశారు.

ఆ మంటల్లో కాలిపోతున్న ఆ భార్యాభర్తలు రక్షించండంటూ హాహాకారాలు చేశారు. ఆ కేకలు విని ఇరుగుపొరుగువారు వచ్చారు. అంబులెన్సును పిలిపించి తీవ్రంగా గాయపడిన ఇద్దరిని పుణెలోని ససూన్ ఆస్పత్రిలో చేర్చారు.

తీవ్రంగా గాయపడి నాలుగు రోజులపాటు మృత్యువుతో పోరాడిన రుక్మిణి మే 5న తుదిశ్వాస విడిచారు.

"ఆస్పత్రిలో చేర్చినప్పుడే ఆమె పరిస్థితి చాలా విషమంగా ఉంది. ఆమె శరీరం 60 నుంచి 65 శాతం కాలిపోయింది. మంగేష్‌కు ఇంకా చికిత్స అందిస్తున్నాం. కానీ, అతని పరిస్థితి కూడా విషమంగానే ఉంది. అతని శరీరం 40 నుంచి 45 శాతం కాలిపోయింది" అని ససూన్ హాస్పిటల్ వైద్యుడు డాక్టర్. అజయ్ తవారే చెప్పారు.

ఈ ఘటనపై పార్నెర్ పోలీసు స్టేషన్‌లో కేసు నమోదైంది. రుక్మిణి మేనమామ ఘనశ్యామ్, చిన్నాన్న సురేంద్ర బాబులాల్ అలియాస్ బిల్లు పండిట్‌లను పోలీసులు అరెస్టు చేశారు.

పరారీలో ఉన్న రుక్మిణి తండ్రి రామా రాంపాల్ భార్తీయ కోసం పోలీసులు వెతుకుతున్నారు.

ఘటనా స్థలం నుంచి పెట్రోలు డబ్బాను, మరికొన్ని వస్తువులను పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. కేసు దర్యాప్తు జరుగుతోందని అహ్మద్‌నగర్ ఎస్పీ మనీష్ కల్వనీయ చెప్పారు.

అయితే, పోలీసులు నిర్లక్ష్యంగా వ్యవహరించడం వల్లే ఈ పరిస్థితులు తలెత్తాయని రుక్మిణి బావ ఆరోపిస్తున్నారు.

"రుక్మిణి కుటుంబ సభ్యులు బెదిరిస్తున్నారంటూ నిఘోజ్, పార్రెర్ పోలీసు స్టేషన్లలో ఫిబ్రవరిలోనే ఫిర్యాదు చేశాం. ఈ ఘటన జరగడానికి కొన్ని రోజుల ముందు మళ్లీ ఫిర్యాదు చేశాం. పోలీసులు సరైన చర్యలు తీసుకుంటే ఇంతటి పరిస్థితి వచ్చేది కాదు" అని మహేష్ ఆవేదన వ్యక్తం చేశారు.

దోషులను కఠినంగా శిక్షించాలని మహేష్ కోరుతున్నారు.

ఇవి కూడా చదవండి:

(బీబీసీ తెలుగును ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్‌, ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)

సంబంధిత అంశాలు

ఈ కథనం గురించి మరింత సమాచారం