"సీజేఐ వేధించారంటున్న ఆ మహిళ మరి సుప్రీంకోర్టునే ఎందుకు నమ్మారు": అభిప్రాయం

  • 8 మే 2019
ఆ మహిళలకు ఇప్పటికీ న్యాయవ్యవస్థపై నమ్మకం ఉంది.

దేశంలోని అత్యున్నత న్యాయస్థానంలో పనిచేసిన ఒక మహిళ అదే సంస్థ చీఫ్ తనపై లైంగిక వేధింపులకు పాల్పడ్డారని ఆరోపించారు. తర్వాత తనను ఉద్యోగం నుంచి తొలగించారని, తన కుటుంబాన్ని కూడా హింసించారని చెప్పారు.

ఆ తర్వాత ఒక విచారణ అనంతరం ఆ చీఫ్‌పై వచ్చిన ఆరోపణలన్నీ నిరాధారమని తేలింది.

అయితే, ఆ మహిళ ఈ విషయాలన్నీ బయటపెట్టాలని అనుకున్నప్పుడు, ఏ సంస్థ పెద్దపై తను ఫిర్యాదు చేయాలనుకున్నారో, అదే సంస్థపై ఎందుకు నమ్మకం పెట్టుకున్నారు?

న్యాయవ్యవస్థ స్వయంప్రతిపత్తిపై, లైంగిక వేధింపుల నివారణ చట్టం చేసిన వారిపై ఆమెకు నమ్మకం ఉంది.

అందుకే ఆమె అదే సంస్థలోని జడ్జిలందరికీ లేఖలు రాసి, ఒక నిష్పక్షపాత విచారణకు డిమాండ్ చేశారు.

ఆరోపణలు బహిర్గతం కావడంతో భారత ప్రధాన న్యాయమూర్తి రంజన్ గొగోయ్ స్వయంగా ఆమె ఆరోపణలను అవాస్తవాలుగా, అభ్యంతరకరమైనవిగా పేర్కొంటూ తోసిపుచ్చారు.

వాటికి సమాధానం ఇవ్వాల్సిన అవసరమే లేదన్నారు. అప్పుడేం జరిగింది?

అప్పుడు న్యాయస్థానంలోని చాలా మంది మహిళలు భుజం భుజం కలిపి ఫిర్యాదు చేసిన మహిళకు అండగా నిలిచారు. న్యాయవ్యవస్థపై ఒత్తిడి తీసుకొచ్చి, ఒక విచారణ కమిటీని నియమించేలా చేశారు.

కమిటీ ప్రశ్నలకు ప్రభావితం కాలేదు. దాని సభ్యులు, అధ్యక్షుడు, విచారణ వ్యవస్థ అన్నిటిపై ఎన్నో నియంత్రణలు వచ్చాయి.

ఆ మహిళ సందేహాలు వ్యక్తం చేశారు, కమిటీ ముందు కూడా హాజరయ్యారు.

తర్వాత భయం కమ్మేయడంతో నిష్పక్షపాత విచారణ కోసం ఆమె కమిటీ ముందు తన డిమాండ్లు ఉంచి, విచారణ నుంచి వైదొలిగారు.

ఆమె లేకుండానే విచారణ కొనసాగించాలని కమిటీ నిర్ణయించింది. చివరికి భారత ప్రధాన న్యాయమూర్తికి వ్యతిరేకంగా వచ్చిన ఆరోపణలు నిరాధారమని చెప్పింది.

దాంతో ఫిర్యాదు చేసిన మహిళ కదిలిపోయారు. మీడియా ప్రకనట ద్వారా "తనకు అన్యాయం జరిగింది" అని ఆరోపించారు.

"నా భయమే నిజమైంది, న్యాయం దక్కుతుందనే నమ్మకం పోయే స్థితికి చేరుకున్నానను" అని ఆమె తెలిపారు.

తర్వాత చాలా మంది మహిళా నిరసనకారులు ఆమెకు అండగా నిలిచారు. సుప్రీంకోర్టు ఎదుట ప్లకార్డులు పట్టుకుని 'నిష్పక్షపాత విచారణ' కోరుతూ మౌనంగా నిలబడ్డారు.

మళ్లీ నమ్మకం ఏర్పడడంతో ఫిర్యాదు చేసిన మహిళ సుప్రీంకోర్టు కమిటీకి లేఖ రాశారు. "తన ఆరోపణలకు సంబంధించి అన్ని ఆధారాలూ సమర్పించినా, ఎందుకు తన ఆరోపణలను నిరాధారం అన్నారు" అంటూ ఆ రిపోర్ట్ కాపీని కోరారు.

ఫిర్యాదుదారు మాటిమాటికీ న్యాయవ్యవస్థ గుమ్మం దగ్గరే నిలబడతారు. ఆరోపణలు నిజమో, అబద్ధమో 'నిర్ణీత ప్రక్రియ' ద్వారా నిరూపించాలని అడుగుతారు.

మళ్లీ ఆ డిమాండు రావడంతో మరికొంత మంది మహిళలు ఆమెతో కలుస్తారు. వారంతా ఆమె ఆరోపణలు నిజమా కాదా తెలుసుకోడానికి 'నిర్ణీత ప్రక్రియ' చేపట్టాలని డిమాండ్ చేస్తారు.

Image copyright Getty Images

వీరందరూ ఆ మహిళలే. 2002లో గుజరాత్‌లో సామూహిక అత్యాచారానికి గురైన బిల్కిస్ బానోకు అండగా నిలిచింది కూడా వీరే.

తన కేసులో ప్రత్యక్షసాక్షులను ప్రభావితం చేస్తారని భయపడ్డ బిల్కిస్ ఆ కేసు విచారణలను ముంబైకి బదిలీ చేయాలని అప్పుడు సుప్రీంకోర్టును కోరారు.

న్యాయవ్యవస్థపై ఆమె నమ్మకం నిలిచింది. ఆమె కేసు విచారణను బదిలీ చేశారు.

బిల్కిస్‌పై సామూహిక అత్యాచారం, ఆమె కుటుంబ సభ్యుల హత్య కేసులో 2008లో 11 మందిని దోషులుగా నిర్ధరించారు.

తర్వాత 2017లో ఆధారాలు ధ్వంసం చేసినందుకు ఐదుగురు పోలీసులు, ఇద్దరు డాక్టర్లను దోషులుగా నిర్ధరించారు. వాళ్లు తీర్పుపై అపీల్ చేసుకున్నప్పుడు సుప్రీంకోర్టు వాటిని తోసిపుచ్చింది.

ఇక మూడో సందర్భంలో.. ఈ ఏడాది చారిత్రక తీర్పు ఇచ్చిన సుప్రీంకోర్టు బిల్కిస్‌కు న్యాయవ్యవస్థపై ఉన్న నమ్మకాన్ని గౌరవించింది. ఆమెకు పరిహారంగా రూ.50 లక్షలు ఇవ్వాలని, ఉద్యోగం, ఇల్లు ఇవ్వాలని గుజరాత్ ప్రభుత్వాన్ని ఆదేశించింది.

బిల్కిస్ తన భర్త పక్కనే కూర్చుని "ఈ సుదీర్ఘ న్యాయ పోరాటంలో చాలా మంది మహిళలు తమకు అండగా నిలిచారు" అని చెప్పారు. ఆమె న్యాయవాది, మహిళా కార్యకర్తలు దిల్లీ, గుజరాత్‌లో ఉన్నారు.

17 ఏళ్ల సుదీర్ఘ పోరాటంలో అండగా నిలిచిన ఈ మహిళలే ఆమెలో న్యాయవ్యవస్థపై ఉన్న నమ్మకాన్ని తిరిగి నిలబెట్టారు.

Image copyright Reuters

మానవ హక్కులు సర్వోన్నతమైనవిగా న్యాయవ్యవస్థ భావిస్తుంది. చట్టాలు అమలు చేయడంలో, తన ప్రతి తీర్పులో ప్రజలకు రాజ్యాంగం ప్రకారం వచ్చిన హక్కులను మార్గదర్శకాలుగా భావిస్తుంది.

అలాంటప్పుడు, ఈరోజు 350 మంది మహిళలు, మహిళా సంఘాలు ఒకే లేఖ రాసి అదే సంస్థను ప్రశ్నిస్తున్నప్పుడు, సమాధానంలో ప్రమాణాలు మరోలా ఎలా మారిపోతాయి?

ఈ మహిళలు రిటైర్డ్ జడ్జిలకు రాసిన తమ లేఖలో "న్యాయంగా, నిష్పక్షపాతంగా చెప్పండి, ఎందుకంటే ఈసారి సుప్రీంకోర్టు విశ్వసనీయతే ప్రమాదంలో పడింది. ఇప్పుడు ఈ వ్యవస్థను రక్షించడం చాలా అవసరం" అని అపీల్ చేశారు.

ఈ మహిళలందరూ తమ విశ్వాసం నిలుపుకోడానికే న్యాయవ్యవస్థను సాయం కోరుతున్నారు.

Image copyright Reuters
చిత్రం శీర్షిక సీజేఐ రంజన్ గొగోయ్

అమెరికాలో ఏం జరిగింది?

కేవలం ఈ మహిళలే కాదు, వేల కిలోమీటర్ల అవతల అమెరికాలో గత ఏడాది సెప్టెంబరులో ఒక మహిళా ప్రొఫెసర్ క్రిస్టీన్ బ్లేసీ ఫోర్డ్ కూడా ఇదే విశ్వాసానికి ఉదాహణగా నిలిచారు.

ఆమె 1980వ దశకంలో తను 17 ఏళ్ల వయసులో ఉన్నప్పుడు అమెరికా జడ్జి బ్రెట్ కెవెనా తనపై అత్యాచార యత్నం చేశారని ఆరోపించారు.

చాలా ఏళ్ల క్రితం జరిగినట్టు చెబుతున్న ఈ ఘటనను ఫోర్డ్ ఇప్పుడు చెప్పాల్సిన అవసరం ఏముంది? చాలా మంది దీని వెనక ఆమెకు వేరే ఏదో ఉద్దేశం ఉందనే ప్రశ్నలు లేవనెత్తారు.

కానీ ఫోర్డ్ తన విశ్వాసం కోల్పోలేదు. 36 ఏళ్ల ముందు జరిగిన ఈ ఘటన తన జీవితాన్నే మార్చేసిందని ఆమె చెప్పారు.

ఇప్పుడు అమెరికా సెనేట్‌లో బ్రెట్ కెవెనా నియామకంపై ఓటింగ్ జరుగుతున్నప్పుడు ఆ విషయం బయటపెట్టాలని తనకు అనిపించిందని చెప్పారు.

బ్రెట్ కెవెనా ఆమె ఆరోపణలను ఖండించారు. కానీ, సెనేట్ న్యాయ కమిటీ ఇద్దరి వాదనలూ వినాలని నిర్ణయించింది.

9 గంటల పాటు జరిగిన విచారణలో ఫోర్డ్ అన్ని ప్రశ్నలకూ సమాధానం ఇచ్చారు. తనకు గుర్తున్న విషయాలన్నీ చెప్పారు.

చివరికి ఎఫ్‌బీఐ విచారణ కూడా జడ్జి బ్రెట్ కెవెనాపై ఆరోపణలను నిరూపించలేకపోయింది. దాంతో సెనేట్ ఆయన నియామకానికి అనుకూలంగా ఓటింగ్ జరిపింది.

ప్రొఫెసర్ ఫోర్డ్ 'డ్యూ ప్రాసెస్'పై విశ్వాసం ఉంచారు. తీర్పు వచ్చిన కొన్ని నెలల తర్వాత రాసిన ఒక బహిరంగ లేఖలో ఆమె "ఇది నా బాధ్యత, చాలా కష్టం, కానీ ఇది అవసరం, తమ అనుభవాలు పంచుకోవడానికి సాహసించిన ఆ మహిళలు, పురుషులందరి నుంచి నేను ప్రభావితం అయ్యాను" అని చెప్పారు.

భారత్‌లోని మహిళాజాతిలాగే ఫోర్డ్ కూడా తనకు అండగా నిలిచి, తన విశ్వాసంలో భాగమైనవారందరికీ ధన్యవాదాలు చెప్పారు.

ఇవి కూడా చదవండి

(బీబీసీ తెలుగును ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్‌, ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)

ఈ కథనం గురించి మరింత సమాచారం