నెల్లూరు: ‘ఆస్పత్రి బిల్లు కట్టలేకపోతే అవయవదానం చేయాలన్నారు.. కళ్లు, కిడ్నీలు తీసుకున్నారు’

  • 9 మే 2019
ఆస్పత్రి Image copyright Getty Images

అవయవదానం విషయంలో నెల్లూరు జిల్లా సింహపురి ఆస్పత్రిపై తీవ్ర ఆరోపణలు వచ్చాయి. అవయవ దానం విషయంలో ఈ ఆస్పత్రి నిబంధనలు పాటించలేదని విచారణలో తేల్చారు ఉన్నతాధికారులు. ఆసుపత్రి బిల్లు కట్టలేకపోతే అవయవదానం చేయాలన్నారన్న బాధితుల ఆరోపణలు సంచలనం సృష్టిస్తున్నాయి.

అసలేం జరిగింది?

రాష్ట్ర వైద్య విద్య సంచాలకులు ఇచ్చిన నివేదికలో పేర్కొన్న వివరాల ప్రకారం... నెల్లూరు జిల్లా కావలి సమీపంలోని ఉప్పిడిగుంట గ్రామానికి చెందిన ఏకొల్లు శ్రీనివాసులు అనే వ్యక్తి రోడ్డు ప్రమాదానికి గురయ్యారు. ఆయనను ఏప్రిల్ 18న రాత్రి 1.34కు నెల్లూరులోని సింహపురి ఆసుపత్రికి తీసుకువచ్చారు. మెదడుకు బలమైన గాయాల కారణంగా బ్రెయిన్ డెడ్ కావడంతో, ఆయన అవయవాలను దానం ఇచ్చారు.

నిబంధనల ప్రకారం అవయవదానం చేసేప్పుడు ఎలాంటి ఆర్థిక లావాదేవీలూ జరగకూడదు. అవయవాలు కొనకూడదు, అమ్మకూడదు. అయితే ఆసుపత్రి బిల్లు కట్టలేని పరిస్థితుల్లోనే తాను అవయవ దానానికి ఒప్పుకున్నాను అన్న మృతుని భార్య ఆరోపణలతో కేసు మొదలైంది.

శ్రీనివాసులు వైద్యానికి అయిన బిల్లు లక్షా 28 వేలు. కానీ తాను అంత మొత్తం చెల్లించలేనని చెప్పడంతో, అవయవదానం చేయాలని ఆసుపత్రి వర్గాలు కోరాయని, వారు ఎక్కడ సంతకం పెట్టమంటే అక్కడ సంతకం పెట్టానని శ్రీనివాసులు భార్య అరుణ బీబీసీతో చెప్పారు.

"నేను శుక్రవారం ఉదయం ఆసుపత్రికి వెళ్లాను. 'మీ ఆయన బతకడు, కోమాలోకి వెళ్లాడు' అని చెప్పారు. 'మీరు తీసుకువెళ్లినా బతకడు' అని చెప్పారు. లక్షా ఇరవై వేలు కట్టమన్నారు. 'మేం పేదవాళ్లం, కట్టలేం సార్' అన్నాను. 'సరే, మీరు డబ్బు కట్టక్కర్లేదు. మేం కళ్లు, కిడ్నీలు దానంగా తీసుకుంటాం. సంతకాలు పెట్టండి' అన్నారు. నాలుగైదు చోట్ల సంతకాలు పెట్టించుకున్నారు. తీసుకెళ్లే ముందు నాకు ఆయన్ని చూపించారు. నోరు తెరుస్తూ ఉన్నాడు. ఊపిరి పీలుస్తున్నాడు. పైపులు పెట్టారు. కట్లేవీ కనపడలేదు. 'నాతో మాట్లాడతాడా' అని వాళ్లను అడిగాను. 'ఇప్పుడు మాట్లాడరు' అంటూ తీసుకుపోయారు. మేం వెంబడి లేము. వెంబడి ఉంటే మాకు తెలుసేది. ఆలోచించుకునే సమయం కూడా ఇవ్వలేదు మాకు" అన్నారు మృతుని భార్య అరుణ.

"నేనూ ఆయనా ఇటుక బట్టీల్లో పనిచేస్తాం. మాకు ముగ్గురు పిల్లలు. వారి పోషణ బాధ్యత చూడాలి" అంటూ తన కుటుంబ పరిస్థితి వివరించారు అరుణ.

అరుణ ఫిర్యాదుతో స్పందించిన జిల్లా యంత్రాంగం, ఒక కమిటీ వేసింది. ఆసుపత్రి వర్గాలు అవయవ దానానికి సంబంధించిన నిబంధనలను పాటించలేదని ఆ కమిటీ నిర్ధరించింది.

Image copyright SimhapuriHospitals/facebook

ఆసుపత్రి ఏమంటోంది?

ఈ ఘటనపై ఆసుపత్రి యాజమాన్యాన్ని సంప్రదించేందుకు ప్రయత్నించగా, వారు అందుబాటులోకి రాలేదు. అయితే సింహపురి ఆసుపత్రి మెడికల్ డైరెక్టర్ పవన్ కుమార్ రెడ్డి, రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శికి ఒక లేఖ రాశారు.

శ్రీనివాసులు కేసు గురించిన వివరాలను ఈ లేఖలో పేర్కొంది ఆసుపత్రి యాజమాన్యం. మొదటిసారి సబ్ కలెక్టర్ ఆధ్వర్యంలో జరిగిన విచారణ బృందంలో నిపుణులు ఉన్నప్పటికీ, వారికి అవయవదానానికి సంబంధించిన అంశాల్లో నైపుణ్యం లేదు కాబట్టి, న్యూరాలజిస్టులు, న్యూరో సర్జన్లు, నెఫ్రాలజిస్టులు, జీవన్ దాన్ ట్రస్టు కోఆర్డినేటర్లతో కూడిన ఒక నిపుణుల బృందంతో మళ్లీ విచారణ చేయించాలని కోరింది. అంతేకాదు, మానవతా దృక్పథంతోనే శ్రీనివాసులు బిల్లులు మాఫీ చేసినట్టుగా ఆసుపత్రి యాజమాన్యం వివరించింది.

అలాగే.. సింహపురి హాస్పిటల్స్ ఈ వ్యవహారంపై బహిరంగంగా ఒక వివరణ ఇచ్చింది.. శ్రీనివాసులు కుటుంబం అతి పేదరికంలో ఉన్నదని, వారి వద్ద అంత్యక్రియలకు సైతం డబ్బు లేదని ప్రాంతీయ రాజకీయ నాయకులు అభ్యర్థించారని, దీంతో అడ్మిషన్ సమయంలో శ్రీనివాసులు కుటుంబం ఆసుపత్రికి చెల్లించిన రూ.20 వేలను కూడా వారికి తిరిగి ఇచ్చేశామని తెలిపింది.

నిష్పక్షపాతంగా, పారదర్శకంగానే అవయవదానం జరిగిందని, అయితే కొన్ని ప్రక్రియలు నిబంధనలకు పూర్తిగా అనుగుణంగా లేవని మాత్రమే విచారణ కమిటీ అభియోగం మోపిందని వివరించింది.

Image copyright SimhapuriHospitals/facebook

మరోసారి విచారణ

ఆసుపత్రి లేఖపై స్పందించిన సీఎస్ కార్యాలయం.. వైద్య విద్యాశాఖ డైరెక్టర్‌తో దీనిపై విచారణ జరిపించాలని, ఒకవేళ ఆసుపత్రి నిబంధనలు పాటించకపోతే ఆ నివేదికను కలెక్టర్, ఎస్పీలకు అందజేయాలని సీఎస్ కార్యాలయం ఆదేశించింది. మే 2వ తేదీన ఈ ఆదేశాలు జారీ అయ్యాయి.

సీఎస్ ఆదేశాలపై వెంటనే స్పందించిన డీఎంఈ మే 3వ తేదీన ఆసుపత్రిని సందర్శించారు.

డీఎంఈ నివేదికలో ఏముంది?

శ్రీనివాసులు ఆసుపత్రిలో చేరిన మర్నాడు ఉదయం పది గంటలకు బ్రెయిన్ డెడ్ అయిన విషయాన్ని కుటుంబ సభ్యులకు వైద్యులు వివరించారు. అదే రోజు మధ్యాహ్నం 2 గంటలకు మొదటిసారి, రాత్రి 8 గంటలకు మరోసారి బ్రెయిన్ డెత్‌ను ధృవీకరించారు.

కానీ మృతుడి భార్యకు వీడియో కౌన్సిలింగ్ మాత్రం అదే రోజు మధ్యాహ్నం 1.37కే అంటే బ్రెయిన్ డెత్ నివేదికకు ముందే చేసేశారు.

రాత్రి రాత్రి 8.30: జీవనదాన్‌లో డోనర్ పేరు నమోదు చేశారు.

రాత్రి 8.36: అనుమతి వచ్చింది.

రాత్రి 10.15: ఆ కిడ్నీని సింహపురి ఆసుపత్రికి ఇస్తూ ఆదేశాలు వచ్చాయి.

అదేరోజు సాయంత్రం 5.36కు నెల్లూరు జిల్లాకు చెందిన ఒక మహిళ కిడ్నీ మార్పిడి కోసం ఆసుపత్రిలో చేరారు.

20వ తేదీ ఉదయం 6 గంటలకు ఆమెకు ఆ కిడ్నీ అమర్చారు.

సింహపురి ఆసుపత్రి యాజమాన్యం బాధితుడి చికిత్సకు అయిన 1,28,354 రూపాయలు ఫీజు రద్దు చేయడమే కాకుండా, 20 వేల రూపాయలు (ఇది డిపాజిట్ అని ఆస్పత్రి చెబుతోంది) అదనంగా ఇచ్చారు.

Image copyright Getty Images

డీఎంఈ నివేదికలో ఆసుపత్రికి వ్యతిరేకంగా ఉన్న అంశాలు

  • కేసు షీట్లో 'కిడ్నీలు పనికివస్తాయి' అని బ్రెయిన్ డెత్ కన్నా ముందే రాశారు.
  • బ్రెయిన్ డెత్ మొదటి ధృవీకరణ కన్నా ముందే, ఆయన భార్యకు వీడియో కౌన్సిలింగ్ నిర్వహించారు.
  • జీవనదాన్ ట్రస్టు ఆ కిడ్నీని సింహపురి ఆసుపత్రికి ఇవ్వకముందే కిడ్నీ అవసరమైన మహిళ ఆసుపత్రిలో చేరారు. (దానంగా వచ్చిన కిడ్నీ ఎవరికి కేటాయించాలనేది జీవన్ దాన్ ట్రస్టు నిర్ణయిస్తుంది)
  • ఆసుపత్రి బిల్లు రద్దు చేయడమే కాకుండా 20 వేలు అదనంగా ఇవ్వడం. కానీ.. అవయవదాన నిబంధనల ప్రకారం కేవలం శరీర భాగాలను నిర్వహించడానికి అయ్యే చార్జీలు మాత్రమే రద్దు చేయాలి.
  • ఈ అవయవ మార్పిడిలో నగదు లావాదేవీలు జరగలేదన్న తనిఖీలు చేయకపోవడం.

మొత్తానికి ఈ వ్యవహారంలో అవయవదానానికి సంబంధించి పారదర్శక ప్రక్రియ చేయలేదు అని నివేదిక ఇచ్చారు డీఎంఈ. ఈ నివేదికపై స్పందించడానికి డీఎంఈ నిరాకరించారు. అది రహస్య నివేదిక అని, దాన్ని తాము జిల్లా కలెక్టరుకు అందించామని బీబీసీకి వివరించారాయన.

ఏం చర్యలుండొచ్చు?

కలెక్టరు ఆదేశాలతో పోలీసులు కేసు నమోదు చేశారు. నెల్లూరు రూరల్ పోలీస్ స్టేషన్లో ఏప్రిల్ 28వ తేదీన ఐపీసీ 420, 384 సెక్షన్లతో పాటు ట్రాన్స్‌ప్లాంటేషన్ ఆఫ్ హ్యూమన్ ఆర్గాన్స్ యాక్ట్ సెక్షన్లు 18, 19 కింద కేసు నమోదు చేసినట్టు బీబీసీకి చెప్పారు నెల్లూరు రూరల్ ఇన్‌స్పెక్టర్ శ్రీనివాస రెడ్డి. ప్రస్తుతం కేసు విచారణలో ఉందని ఆయన అన్నారు.

ప్రస్తుతానికి ఆసుపత్రి రిజిస్ట్రేషన్ ఎందుకు రద్దు చేయకూడదో చెప్పాలంటూ నోటీసు ఇచ్చారు నెల్లూరు జిల్లా వైద్యాధికారి డాక్టర్ వరసుందరం.

"దీనిపై సమాధానం ఇచ్చేందుకు ఆసుపత్రికి 15 రోజుల గడువు ఇచ్చారు. మే 17వ తేదీన నెల్లూరు డీఎంహెచ్ఓ కార్యాలయంలో ఆసుపత్రి వర్గాలు తమ వాదన వినిపిస్తాయి. ఒకవేళ ఆసుపత్రి వివరణతో సంతృప్తి చెందితే చర్యలు తీసుకోకుండా ఉండవచ్చు. లేదంటే ఆసుపత్రి గుర్తింపు రద్దు చేసే అధికారం జిల్లా వైద్యాధికారికి ఉంది" అన్నారు డాక్టర్ వరసుందరం.

Image copyright Getty Images
చిత్రం శీర్షిక ప్రతీకాత్మక చిత్రం

సమాధానం లేని ప్రశ్న

బాధితుడి తరపు వారి నుంచి ఎటువంటి సొమ్మూ తీసుకోకుండా ఒక ప్రైవేటు ఆసుపత్రి చికిత్స చేయడం వెనుక ఆ ఆసుపత్రికి ఏ ఉద్దేశం ఉందనేది సమాధానం లేని ప్రశ్నగా ఉంది.

మానవతా దృక్పథంతోనే రోడ్డు ప్రమాద బాధితులకు కేవలం 20 వేల రూపాయల డిపాజిట్ మీద లక్షా 20 వేల రూపాయల వైద్యం చేశారా? లేకపోతే శరీర భాగాలు పనికి వస్తాయనే ఉద్దేశాలు ముందు నుంచే ఉన్నాయా? అనేది తేలాల్సి ఉంది.

మొదటి విచారణలో ఆసుపత్రి నిబంధనలు పాటించలేదని తేలింది. రెండో విచారణలోనూ అదే తేలింది. ఇప్పుడా నివేదిక వైద్య ఆరోగ్య శాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి, జిల్లా కలెక్టర్ల వద్ద ఉంది. దీనిపై వారు ఎలాంటి నిర్ణయం తీసుకుంటారనేది తెలియాల్సి ఉంది.

హైకోర్టును ఆశ్రయించిన వైద్యులు

మరోవైపు రాష్ట్ర ప్రభుత్వం ఇచ్చిన షోకాజు నోటీసుపై హైకోర్టుకు వెళ్లారు సింహపురి వైద్యులు. దీనిపై స్పందించిన హైకోర్టు.. వైద్య ఆరోగ్య శాఖకు స్పందించడానికి 15 రోజులు గడవు ఇచ్చింది. ఇక వైద్యుల గుర్తింపుకు సంబంధించి ఆంధ్రా మెడికల్ కౌన్సిల్ ఆదేశాలపై కూడా కోర్టు స్టే విధించింది. దీంతో సింహపురి ఆసుపత్రి వర్గాలు మరోసారి ప్రభుత్వానికి, మెడికల్ కౌన్సిల్‌కి తమ వాదన వినిపించే అవకాశం దక్కింది.

ఇవి కూడా చదవండి.

(బీబీసీ తెలుగును ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్‌, ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)

ముఖ్యమైన కథనాలు