పార్లమెంటు ఎన్నికలు 2019: భారత ప్రజాస్వామ్య పండుగలో రంగూ, హంగూ ఎలా మాయమయ్యాయి?

  • 9 మే 2019
ఒంటె మీద అభ్యర్థి ప్రచారం Image copyright Getty Images
చిత్రం శీర్షిక దేశంలో ఎన్నికల ప్రచారం తీరుతెన్నులు ఎంతగానో మారిపోయాయి

భారతదేశ ఎన్నికలు ప్రజాస్వామ్యంలో అత్యంత వర్ణశోభిత పండుగగా చాలా కాలంగా అభివర్ణిస్తున్నారు. అయితే ఎన్నికల ప్రచార నిబంధనలు, వ్యయ పరిమితులు అంతకంతకూ కఠినమవతుండటంతో ఇది మారిపోతూ వచ్చింది. బీబీసీ ప్రతినిధి శివం విజ్ కథనం.

డప్పు మోతల జోరు, నినాదాల హోరు మధ్య వేలాది మంది జనం కాషాయ టోపీలు ధరించి.. ప్రధానమంత్రి నరేంద్రమోదీకి అభినందనలు చెప్తూ ఆయన నిర్వహించిన ఏడు కిలోమీటర్ల రోడ్ షో వెంట ప్రయాణించారు. ''మోదీ ఫరెవర్'' - అంటే 'మోదీ శాశ్వతం' అని రాసిన టీ-షర్టులు ధరించారు. మోదీ మీద గులాబీ పూల రేకులు విసిరుతూ వచ్చారు.

ఉత్తరప్రదేశ్‌లోని వారణాసి లోక్‌సభ స్థానానికి నామినేషన్ వేయటానికి మోదీ చేపట్టిన రోడ్‌షో అది. ఈ ప్రాచీన నగరం నుంచి రెండోసారి పార్లమెంటుకు ప్రాతినిధ్యం వహించాలని ఆయన భావిస్తున్నారు.

అయితే.. ఒక ప్రతిపక్ష నాయకుడు వెంటనే భారత ఎన్నికల సంఘానికి ఫిర్యాదు చేశారు. మోదీ నిర్వహించిన ఈ ఒక్క రోడ్ షో ఖర్చు.. ఒక లోక్‌సభ అభ్యర్థి తన మొత్తం ఎన్నికల ప్రచారానికి ఖర్చు చేయటానికి అనుమతించిన 70 లక్షల రూపాయల పరిమితిని దాటిపోయిందన్నది ఆయన ఆరోపణ.

Image copyright Getty Images
చిత్రం శీర్షిక వారణాసిలో నామినేషన్ వేయటానికి మోదీ నిర్వహించిన రోడ్ షో ఖర్చు.. ఆయన మొత్తం ఎన్నికల ప్రచార పరిమితి అయిన రూ. 70 లక్షలు దాటిపోయిందని ప్రతిపక్షం ఆరోపించింది

బిగిసిన ఉచ్చు

భారతదేశానికి స్వాతంత్ర్యం వచ్చిన తర్వాత 17వ సాధారణ ఎన్నికలు ఇవి. ''పెద్ద పండుగ'' అని, ''ప్రజాస్వామ్య పండుగ'' అని ఎన్నికల కమిషన్ ఈ ఎన్నికలను అభివర్ణిస్తోంది. కానీ ఇది చాలా పాత మాట. ఎందుకంటే.. ఎన్నికలు పండుగ ఓ పండుగగా జరగటం అంతకంతకూ తగ్గిపోతూ వస్తోంది.

ఎన్నికల ప్రచారంలో అభ్యర్థులు ఎంత మొత్తం ఖర్చు పెట్టాలనే విషయంలో ప్రతి ఎన్నికలకూ ఎన్నికల కమిషన్ మరింత కఠినంగా వ్యవహరిస్తోంది. ఈ నిబంధనలు ఎంత కఠినంగా ఉన్నాయంటే.. ఇప్పుడు ఎంతగా వెదికినా వీధి స్థాయి ప్రచారాలు కనిపించటం చాలా అరుదు. పోస్టర్లు, గోడల మీద పెయింటింగ్‌లు, జండాలు, లౌడ్ స్పీకర్లలో పాటలు, కోలాహలంగా ఉండే ప్రదర్శనలు.. అన్నీ అదృశ్యమయ్యాయి.

ఎన్నికల వ్యయాన్ని పర్యవేక్షించటానికి 2010లో అప్పటి ప్రధాన ఎన్నికల కమిషనర్ ఎస్.వై.ఖురేషి ఓ కొత్త విభాగాన్ని ఏర్పాటుచేశారు. కొత్త నిబంధనలు రూపొందించారు. అప్పటి నుంచీ అభ్యర్థులు తాము ప్రచారం కోసం డబ్బు ఎలా ఖర్చు పెడతాము అనే విషయాన్ని ముందుగానే ఎన్నికల కమిషన్‌కు తెలియజేయాలి. ప్రచారానికి ఎన్ని వాహనాలు ఉపయోగిస్తారు? ఎన్ని బహిరంగ సభలు నిర్వహిస్తారు? ఎన్ని పోస్టర్లు, బ్యానర్లు ఏర్పాటు చేస్తారు? వంటి వివరాలన్నీ సంపూర్ణంగా అందించాలి.

ఇప్పుడు.. ప్రతి నియోజకవర్గంలోనూ ఫ్లయింగ్ స్క్వాడ్లు, నిఘా బృందాలు, వీడియో నిఘా బృందాలు సంచరిస్తూ ఉంటాయి. ఆయా అభ్యర్థుల ప్రచార వ్యయాన్ని పరిశీలిస్తూ.. అధికారిక లెక్కలోకి రాని, అనుమతి లేని పోస్టర్లను తొలగించటం, అనుమతించని ఖర్చును 'షాడో రిజిస్టర్ల'లో నమోదు చేయటం ఈ బృందాల పని.

ప్రతి తరహా ఖర్చుకూ నిర్దిష్ట ధరలు ఉంటాయి. అవి మారవు. ఒక ప్లాస్టిక్ కుర్చీని అద్దెకు తీసుకోవటానికి ఆరు రూపాయలు, ఒక ప్లేటు భోజనానికి 100 రూపాయలు. ఏదైనా వార్తా పత్రికలో వచ్చిన ఏదైనా కథనం 'డబ్బులు చెల్లించిన కథనమా' - అంటే వార్త ముసుగులో వచ్చిన వాణిజ్య ప్రకటనా అనేది దర్యాప్తు చేయటానికి కూడా ఒక బృందం ఉంది. ఒకవేళ అది చెల్లింపు కథనమని తేలితే ఆ ఖర్చును కూడా సదరు అభ్యర్థి ఖాతాలో కలుపుతారు.

Image copyright Getty Images
చిత్రం శీర్షిక ఎన్నికల ప్రచారం నియమనిబంధనలు మార్చేసిన ఘనత ఎస్.వై.ఖురేషిదేనని చెప్తారు

ఖాళీ పద్దు పుస్తకాలు

ఎన్నికల్లో ధనిక అభ్యర్థులకు వారి డబ్బు ద్వారా ఎక్కువ అవకాశం లభించకుండా.. అందరికీ సమాన అవకాశం కల్పించేలా చేయాలన్న ఉన్నత ప్రయత్నం కూడా ఉంది. అయితే, దేశంలో పార్లమెంటు నియోజకవర్గ సగటు జనాభా 16.5 లక్షల మంది. ఇంతమంది ఓటర్ల ముందు ప్రచారం చేయటానికి 70 లక్షల రూపాయలు చాలా తక్కువ.

ఉదాహరణకు, ఒక నియోజకవర్గంలోని ప్రతి ఓటరుకూ పోస్టు ద్వారా ఒక లేఖ పంపించాలన్నా, ఒక్కో లేఖకు ఐదు రూపాయలు చొప్పున మొత్తం రూ. 80 లక్షలకు పైగా ఖర్చవుతుంది.

ఈ వ్యయ పరిమితిని 2014లో పెంచారు. అప్పటి నుంచీ ద్రవ్యోల్బణానికి అనుగుణంగా కూడా ఈ పరిమితిని సవరించలేదు. అయినాకానీ.. ఈ పరిమితిని పెంచాలని ఎవరూ బలంగా వాదించలేరు. ఎందుకంటే.. అభ్యర్థుల్లో చాలా మంది తమకున్న పరిమితి రూ. 70 లక్షల కన్నా చాలా తక్కువే ఖర్చు చేశామని లెక్కలు చెబుతుంటారు.

అంటే, ఎన్నికల కమిషన్ స్వతంత్రంగా గుర్తించిన ఖర్చులను తమ ఖాతాలో రాస్తుందన్న భయంతో చాలా మంది అభ్యర్థులు కృత్రిమంగా లెక్కలు తగ్గించి చూపుతారు. వాస్తవానికి.. ఈ అధికారిక పరిమితి కన్నా అనేక రెట్లు అధికంగా ఖర్చు చేయనిదే ఒక అభ్యర్థి పార్లమెంటు స్థానంలో గెలవటం చాలా అరుదు. ఫలితంగా అభ్యర్థులు తమ ఖర్చులను ఎన్నికల కమిషన్ పరిశీలన బృందాల కళ్లపడకుండా దాచేస్తున్నారు.

ఒక అభ్యర్థి తన వ్యయ పరిమితిని మించి ఖర్చు పెట్టారని ఎన్నికల కమిషన్ అంచనా వేసినట్లయితే.. సదరు అభ్యర్థి ఆ ఎన్నికల్లో గెలిచినా కూడా అనర్హులుగా ప్రకటించవచ్చు. అభ్యర్థి ఐదేళ్ల పదవీ కాలంలో ఎప్పుడైనా ఈ అనర్హత వేటు పడవచ్చు. ఇలా అనర్హులుగా ప్రకటించిన ఉదంతాలు అరుదే అయినా.. అభ్యర్థుల్లో ఈ భయం ఒక కత్తిలా వేలాడుతూ ఉంటుంది.

Image copyright Getty Images
చిత్రం శీర్షిక చిన్న సమావేశాలు, వీధి ప్రచారాలు ఇప్పుడు అదృశ్యమైపోయాయి

రహస్య ప్రచారం

ఫలితంగా ఒకప్పుడు చాలా విస్తారంగా కనిపించిన వీధి స్థాయి ప్రచారం.. ఇప్పుడు రహస్యంగా మారింది. అభ్యర్థులు ఓట్ల కోసం అర్థరాత్రిళ్లు డబ్బు, మద్యం విస్తారంగా పంచుతారని చాలా మందికి తెలుసు. ఇటువంటి లంచాల వల్ల నిజంగా ఓట్లు పడవని పరిశోధన చెప్తున్నప్పటికీ ఈ ఆచారం తగ్గుముఖం పట్టలేదు.

ఎన్నికల్లో అక్రమ డబ్బు, మద్యాలను అధికారులు స్వాధీనం చేసుకోవటం అంతకంతకూ పెరుగుతోంది. ఎన్నికల కమిషన్ సమాచారం ప్రకారం.. ఈ ఎన్నికల్లో గత మార్చి 26వ తేదీ వరకూ 47 కోట్ల డాలర్ల విలువైన నగదు, మద్యం, నగలు తదితరాలను స్వాధీనం చేసుకున్నారు.

ఒకవేళ అధికారులు పట్టించుకోకున్నా, ఏదైనా వారి దృష్టికి రాకపోయినా సదరు అభ్యర్థి ప్రత్యర్థులు అధికారిక ఫిర్యాదు నమోదు చేయవచ్చు. ఆపైన మీడియా కూడా ఉంది. కాబట్టి పోటీదారులు ఎటువంటి అవకాశం తీసుకోరు. వ్యయ పరిమితిని దాటకుండా ఉండటానికి దొడ్డిదారులు వెదుకుతుంటారు.

ఉదాహరణకు ఒక అభ్యర్థి ప్రచారం కోసం ఐదు కార్లు ఉపయోగించాలని అనుకుంటే.. అందుకు అనుమతిస్తూ ఐదు కార్లకు ఐదు స్టికర్లను అధికారులు అందిస్తారు. అలా అనుమతి లేని వాహనాన్ని ఉపయోగించినట్లయితే అధికారులు దానిని స్వాధీనం చేసుకోవచ్చు.

వాస్తవంలో.. అభ్యర్థులు అంతకన్నా చాలా ఎక్కువ వాహనాలు ఉపయోగిస్తారు. కాకపోతే ఆ కార్ల మీద పార్టీ జెండా ఉండదు. ఇలా చేయటం ద్వారా.. సదరు వాహనాలను ప్రచారం కోసం ఉపయోగించలేదని అభ్యర్థులు చెప్తారు.

Image copyright Getty Images
చిత్రం శీర్షిక రాజకీయ పార్టీలు ప్రతి పోస్టరుకూ, ప్రతి పాంప్లెట్‌కూ లెక్క చెప్పాల్సి ఉంటుంది

అంటే, ఆ వాహనం కోసం డబ్బు ఖర్చు పెడతారు. కానీ రోడ్డు మీద ప్రయాణించే సాధారణ వాహనం లాగానే అది కనిపిస్తుంది. దీని ఫలితంగా ఎన్నికలు రంగు, రూపు, ధ్వని కోల్పోతున్నాయి.

ఈ నిబంధనల్లో చాలా వరకూ ఖురేషీ హయాంలో చట్టంగా రూపొందాయి. ఆ రంగూ, హంగూ పండుగ కాదని.. అసలైన పండుగ ఓట్లు వేసే ఓటర్ల శాతమని ఆయన వాదిస్తారు. నిజానికి దేశంలో ఓటింగ్ శాతం పెరుగుతూ వస్తోంది. ''ఒకప్పుడు 35 శాతంగా ఉన్న ఓటింగ్ శాతం ఇప్పుడు 70 శాతానికి పెరిగింది. పండుగ ఎండిపోయిందని ఎవరంటారు? ఇది మరింత క్రమశిక్షణగా జరుగుతోంది. అభ్యర్థులు తమ ఇళ్ల గోడల మీద అడ్డంగా రాయటానికి వీలులేదని చాలా మంది ఓటర్లు ప్రశంసించారు కూడా'' అని ఆయన పేర్కొన్నారు.

సమూహాలకన్నా వ్యక్తులు మిన్న

కచ్చితంగా చెప్పాలంటే, భారతదేశంలో ఎన్నికల శోభ తగ్గిపోవటానికి ప్రచార వ్యయాలపై నియంత్రణ ఒక్కటి మాత్రమే కారణం కాదు. ప్రపంచంలోని ఇతర ప్రాంతాల్లో లాగానే ఇండియాలో కూడా సాంకేతిక పరిజ్ఞానం వల్ల కూడా ఎన్నికల కళ తగ్గిపోయింది.

కేబుల్ టీవీ, స్మార్ట్‌ఫోన్లు, చౌక డాటా వంటివి విపరీతంగా విస్తరిస్తుండటంతో ప్రచారం అనేది సమూహాలను పక్కకు పెట్టి వ్యక్తులను లక్ష్యంగా చేసుకుని సాగుతోంది. డిజిటల్ మార్కెటింగ్ సంస్థలు మూడు పువ్వులు, ఆరు కాయలుగా వెలిగిపోతున్నాయి. ఎన్నికల వస్తువులను తయారుచేయటమే ప్రత్యేకతగా ఉన్న కంపెనీలు కుదేలవుతున్నాయి.

Image copyright Getty Images
చిత్రం శీర్షిక ఎన్నికల్లో పాల్గొనే ఓటర్ల శాతం పెరగటమే నిజమైన ప్రజాస్వామ్య పండుగ అని ఖురేషి అంటారు

ఇలాంటి సూక్ష్మ లక్ష్యాలపై చేసే వ్యయాన్ని ఎన్నికల సంఘం నిఘా కళ్లకు కనిపించకుండా దాచేయటం కూడా సులభంగా ఉండటం అభ్యర్థులకు కలిసివస్తోంది. డిజిటల్ వ్యయాలను ఆరాతీయటం కష్టం. కాబట్టి ఇందుకోసం ముందస్తు అనుమతి కూడా అడగరు. పైగా ఓటర్లను వ్యక్తిగతంగా లక్ష్యంగా పెట్టుకుని ప్రచారం చేయటానికి అభ్యర్థులు పెట్టే పెట్టుబడికి మంచి ఫలితాలు వస్తున్నట్లు కనిపిస్తోంది.

ఓట్లు గెలవటం కోసం డబ్బు ఎలా ఖర్చు పెట్టారని భారత రాజకీయ నాయకులను ప్రశ్నిస్తూ న్యూయార్క్‌లోని కొలంబియా యూనివర్సిటీలో పొలిటకల్ ప్రొఫెసర్ సైమన్ చౌచార్డ్ అధ్యయనం చేశారు. ''ఒక్కో వ్యక్తి లక్ష్యంగా స్థానిక వాట్సాప్ వంటి ఆన్‌లైన్ నెట్‌వర్కులతో పాటు.. ఆఫ్‌లైన్‌లోనూ వ్యక్తిగతీకరించిన వ్యూహాల మీదే చాలా మంది అభ్యర్థులు ఎక్కువగా పెట్టుబడులు పెడుతున్నారు'' అని ఆయన తెలిపారు.

''ఇప్పుడు హెలికాప్టర్‌లో ఆకాశం నుంచి దిగేసి ప్రసంగం ఇచ్చేస్తే సరిపోదన్న అభిప్రాయం నెలకొంది. ఇంటింటి ప్రచారం చేయాల్సిన అవసరముంది. ఓటర్లను వ్యక్తిగతంగా కలవాల్సి ఉంది. వారు చెప్తున్నది వింటున్నట్లు కనీసం నటించాల్సిన అవసరముంది'' అని వివరించారు.

విషాదకరమైన విషయమేమిటంటే.. వ్యక్తిగత అభ్యర్థులు చాలా పరిమితంగా ఉంటే.. ప్రచారం కోసం రాజకీయ పార్టలు చేసే వ్యయం మీద ఎటువంటి పరిమితీ లేదు. దీనివల్ల అందరికీ సమాన అవకాశం ఉండేలా చూడటమనే లక్ష్యమే నీరుగారిపోతుంది. ఇటువంటి ఆంక్షల ఆలోచననే పార్టీలు తిరస్కరిస్తున్నాయి.

ఈ ఆర్థిక అసౌష్ఠవం వల్ల భారతదేశ ఎన్నికలు అధ్యక్ష ఎన్నికల తరహాలో మారిపోయాయి. నరేంద్రమోదీ, రాహుల్ గాంధీ వంటి అగ్రస్థాయి నాయకులు ఒకవైపు దేశవ్యాప్తంగా భారీ సభల్లో ప్రసంగిస్తుంటే.. దేశంలోని గల్లీలు, కూడళ్లలో ఎన్నికల ప్రచారం అదృశ్యమైపోయింది.

ఇవి కూడా చదవండి:

(బీబీసీ తెలుగును ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్‌, ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)