మహారాష్ట్ర 'కుల దురహంకార హత్య' కేసులో కొత్త కోణం... భర్త పైనే అనుమానాలు

  • 10 మే 2019
రుక్మిణి, మంగేష్ ఆరు నెలల క్రితం ప్రేమ వివాహం చేసుకున్నారు
చిత్రం శీర్షిక రుక్మిణి, మంగేష్ ఆరు నెలల క్రితం ప్రేమ వివాహం చేసుకున్నారు

మహారాష్ట్రలోని నిఘోజ్ గ్రామంలో జరిగిన 'కుల దురహంకార హత్య' కేసులో కొత్త కోణం వెలుగుచూసింది.

మొదట కులదురహంకార హత్య కేసుగా దర్యాప్తు ప్రారంభించిన పోలీసులు రుక్మిణిని ఆమె భర్త మంగేశ్ హత్య చేసి ఉండొచ్చని అనుమానిస్తున్నారు. ఆ కోణంలోనూ దర్యాప్తు చేస్తున్నారు.

మే 1న అహ్మద్‌నగర్ జిల్లాలోని నిఘోజ్ గ్రామంలో మంగేశ్, రుక్మిణి జంట సజీవంగా మంటల్లో తగలబడిపోవడంతో వారిని స్థానికులు పుణెలోని ససూన్ ఆసుపత్రికి తరలించారు.

చికిత్స పొందుతున్న రుక్మిణి మే 5 రాత్రి ఆసుపత్రిలో తుదిశ్వాస విడిచారు.

మంగేశ్ సోదరుడు మహేశ్ ఇచ్చిన ఫిర్యాదు మేరకు పోలీసులు సెక్షన్ 307, 34 కింద కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. తన తండ్రి, బంధువులే తమను కాల్చారని పోలీసులకు ఇచ్చిన మరణ వాంగ్మూలంలో రుక్మిణి తెలిపారు.

దీంతో రుక్మిణి మేనమామ, బాబాయిలను పోలీసులు అరెస్టు చేశారు.

Image copyright BBC/NITIN NAGARDHANE
చిత్రం శీర్షిక మంగేశే తన బిడ్డను చంపారని రుక్మిణి తల్లి నిర్మల భార్తీయ ఆరోపించారు.

రుక్మిణి సోదరుడి వాంగ్మూలంతో మలుపు తిరిగిన కేసు

రుక్మిణి మేనమామ రామ భార్తీయాను మే7న పోలీసులు అరెస్టు చేశారు. రుక్మిణిని సజీవ దహనం చేస్తున్నప్పుడు అక్కడ ఆమె ముగ్గురు సోదరులు కూడా ఉన్నారు. వారిలో ఒకరి వాంగ్మూలాన్ని పోలీసులు నమోదు చేసుకున్నారు.

మంగేశే రుక్మిణిని దహనం చేశాడని ఆమె సోదరుడు చెప్పారు. దీంతో ఈ కేసులో కొత్త కోణం వెలుగు చూసింది. పోలీసులు కూడా ఈ దిశగా విచారణ జరుపుతున్నారు.

''విచారణ సమయంలో ఇతర అంశాలను కూడా పరిగణనలోకి తీసుకుంటాం' అని ఈ కేసును విచారిస్తున్న ఎస్ఐ విజక్ కుమార్ బొట్రే అన్నారు.

Image copyright BBC/NITIN NAGARDHANE
చిత్రం శీర్షిక ఘటనా స్థలం

రుక్మిణి, మంగేశ్‌లు ఆరు నెలల కిందటే పెద్దలను ఎదురించి వివాహం చేసుకున్నారు. ఈ పెళ్లిని రుక్మిణి ఇంట్లోవాళ్లు, బంధువులు అంగీకరించలేదు. కానీ, మంగేశ్ కుటుంబ సభ్యులు ఒప్పుకున్నారు.

రుక్మిణి తల్లి నిర్మల భార్తీయ బీబీసీతో మాట్లాడుతూ, ''మంగేశ్ నా బిడ్డను తరచూ కొడుతుండేవాడు. దీంతో మా బిడ్డను తిరిగి పంపించం అని చెప్పాం. దీంతో గొడవ జరిగింది. తర్వాత మళ్లీ మంగేశ్ మా ఇంటికి వచ్చాడు. మేం అప్పుడు ఇంట్లో లేం. మేం ఇంటికి వచ్చేసరికి రుక్మిణి మంటల్లో కాలిపోతోంది'' అని చెప్పారు.

Image copyright BBC/NitinNagardhane
చిత్రం శీర్షిక మంగేశ్ సోదరుడు మహేశ్

మౌనంగా ఇరుగుపొరుగు

''రుక్మిణి వాళ్ల ఇంటికి కొద్దిదూరంలోనే మేం ఉంటాం. ఆ రోజు నేను ఇంట్లో ఉన్నా. మధ్యాహ్నం రుక్మిణి ఇంటి నుంచి కేకలు వినిపించాయి. మంటలొస్తున్న చోటుకు వెంటనే పరిగెత్తా. కానీ, తలుపులు మూసిఉన్నాయి. వాటిని పగలగొట్టి అంబులెన్స్‌కు ఫోన్ చేశాం'' అని సంజయ్ బలిద్ అనే స్థానికుడు చెప్పారు.

అయితే, పోలీసులు రుక్మిణి ఇరుగుపొరుగును విచారించగా చాలా మంది ఈ ఘటనపై మాట్లాడలేదు.

మంగేశ్ మీద వస్తున్న ఆరోపణలను ఆయన సోదరుడు మహేశ్ నిరాకరించారు. మంగేశ్, రుక్మిణి ప్రేమించుకొని పెళ్లిచేసుకున్నారని, వారి మధ్య ఎలాంటి గొడవలు లేవని స్పష్టం చేశారు. మంగేశ్ దంపతులకు న్యాయం చేయాలని డిమాండ్ చేశారు.

రుక్మిణి కుటుంబానికి ఆర్థికసాయం అందించేందుకు మంగేశ్ గతంలో అనేకసార్లు వారి ఇంటికి వెళ్లాడని తెలిపారు.

మంగేశ్‌కు 45 శాతానికి పైగా శరీర గాయాలున్నాయి. ప్రస్తుతం అతడి ఆరోగ్య పరిస్థితి నిలకడగానే ఉంది.

ఇవి కూడా చదవండి

(బీబీసీ తెలుగును ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్‌, ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)