'పదో తరగతిలో 60 శాతం మార్కులు... మా బాబు బంగారం'

  • 11 మే 2019
వందనా సూఫియా Image copyright facebook/Vandana Sufia Katoch

సీబీఎస్‌ఈ పదో తరగతి పరీక్షల ఫలితాలు ఇటీవల విడుదలయ్యాయి. 500 మార్కులకుగానూ 13 మంది విద్యార్థులకు 499 మార్కులు వచ్చాయి. అంటే వారు 99.8% మార్కులు సాధించారు.

ఫలితాల రోజు ఆ 13 మంది కుటుంబాల్లో ఎంత సంతోషం నెలకొని ఉంటుందో, వారి తల్లిదండ్రులు ఎంత గర్వపడి ఉంటారో అందరూ అంచనా వేయొచ్చు.

మరి, 60 శాతం మార్కులు సాధించిన విద్యార్థుల మాటేంటీ? వారి తల్లిదండ్రులు ఎలా ఉండి ఉంటారు?

తమ చిన్నారుల భవిష్యత్తు గురించి దిగులుపడుతూ, పైచదువుల్లో వాళ్లు ఎలా నెగ్గుకువస్తారా అని బాధపడుతూ ఉండి ఉంటారని కొందరు చెప్పొచ్చు.

కానీ, అందరు తల్లిదండ్రులందరూ అలా ఉండరు.

60 శాతం మార్కులు వచ్చినా, 'మా బాబు / పాప బంగారం'' అనుకునేవారూ ఉంటారు.

అలాంటి ఓ అమ్మే.. దిల్లీకి చెందిన వందనా సూఫియా.

చిన్నారుల ప్రతిభకు కొన్ని అంకెలు మాత్రమే కొలమానం కాదని భావించే వ్యక్తుల్లో ఆమె కూడా ఒకరు.

వైరల్‌గా మారిన ఫేస్‌బుక్ పోస్టు

వందన కుమారుడు ఆమెర్ సీబీఎస్‌ఈ పదో తరగతి పరీక్షల్లో 60 శాతం మార్కులతో ఉత్తీర్ణుడయ్యారు.

ఆమె ఈ విషయాన్ని గర్వంగా చెప్పుకుంటూ ఫేస్‌బుక్‌లో పోస్ట్ పెట్టారు. కుమారుడి పట్ల తాను ఎందుకు గర్వపడుతున్నానో అందులో వివరించారు.

ఈ పోస్ట్ వైరల్ అయ్యింది.

''నా కుమారుడు 60% మార్కులు సాధించడం పట్ల చాలా గర్వపడుతున్నా. అవి 90% కాకపోయినా, నా ఆనందంలో ఎలాంటి మార్పూ లేదు. కొన్ని సబ్జెక్ట్‌లు అతడికి బాగా కష్టంగా అనిపించేవి. దాదాపు ఆశలు వదులుకునే స్థితికి వచ్చాడు. అయినా, చివరి నెలన్నర రోజుల్లో బాగా కష్టపడి పాస్ అయ్యాడు. ఆమెర్, అతడిలాంటి మిగతా చిన్నారులకు నేను చెప్పేది ఒకటే. చేపలలాంటి మిమ్మల్ని చెట్లు ఎక్కమని అడుగుతున్నారు. కానీ, విశాలమైన సముద్రంలో మీదైన పెద్ద ప్రయాణాన్ని మీరు సాగించండి. ఆమెర్.. నీ మంచిమనసును, ఉత్సుకతను, తెలివిని, ముఖ్యంగా నీ హాస్య చతురతను అలాగే పదిలంగా ఉంచుకో'' అని వందన ఆ ఫేస్‌బుక్ పోస్ట్‌లో వ్యాఖ్యానించారు.

కొన్ని గంటల్లోనే ఈ పోస్ట్‌ను వేల మంది షేర్ చేశారు.

వందనకు చాలా మంది శుభాకాంక్షలు, అభినందనలు తెలియజేస్తూ స్పందించారు.

Image copyright facebook/Vandana Sufia Katoch

మార్కులతో సంతోషపెట్టాల్సిన బాధ్యత చిన్నారులది కాదు

కొందరు మాత్రం నెలన్నర కాకుండా, ఏడాదంతా కష్టపడితే ఆమెర్‌కు మంచి మార్కులు వచ్చి ఉండేవని వ్యాఖ్యానించారు.

ఈ విషయంపైనా వందన స్పందించారు.

''మంచి మార్కులు రాలేదంటే విద్యార్థి ఏడాదంతా జులాయిగా తిరిగాడని అర్థం కాదు. ఒక్కో చిన్నారి ఒక్కోలాగా ఉంటారు. మార్కులు రాకపోవడానికి అందరికీ ఒకే కారణం ఉండదు'' అని అన్నారు.

''ఆమెర్ రోజూ కష్టపడుతున్నా, ఫలితాలు ఆశించినట్లు వచ్చేవి కావు. అయితే, నేనెప్పుడూ మిగతా చిన్నారులకూ, అతడికి పోలిక పెట్టేదాన్ని కాదు. ఆమెర్ కుంగిపోతుంటే, నాకూ దిగులుగా అనిపించేది. కానీ, మేం ఆగిపోలేదు. సబ్జెక్ట్‌లను చిన్న చిన్న భాగాలుగా విభజించుకున్నాం'' అని వందన చెప్పారు.

తల్లిదండ్రులను మార్కులతో సంతోషపెట్టాల్సిన బాధ్యత చిన్నారులది కాదని, వారిపై ఒత్తిడి తేవడం సరికాదని ఆమె అన్నారు.

జీవితంలో విజయం సాధించడమంటే రూ.లక్షల్లో సంపాదించడం మాత్రమే కాదని, తన కుమారుడు అనుకున్నది సాధిస్తాడని వందన విశ్వాసం వ్యక్తంచేశారు.

ఇవి కూడా చదవండి

(బీబీసీ తెలుగును ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్‌, ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)