రవి ప్రకాశ్‌పై కేసేంటి? టీవీ9లో ఏం జరిగింది?

  • 10 మే 2019
టీవీ9 Image copyright TV9Telugu/facebook

టీవీ9 చానల్ యాజమాన్యం వ్యవహారంలో హైడ్రామాకి తెరపడింది. టీవీ9 తమదే అని అలంద మీడియా ప్రమోటర్లు నియమించిన కొత్త డైరెక్టర్లు ప్రకటించారు. రవిప్రకాశ్‌ను సీఈవో బాధ్యతల నుంచి తొలగించామని ప్రమోటర్లు ప్రకటించగా, వారిపై పలు ఆరోపణలు చేస్తూ రాజీనామా లేఖ విడుదల చేశారు రవిప్రకాశ్.

టీవీ9 చానళ్లు అసోసియేటెడ్ బ్రాడ్ క్యాస్టింగ్ లిమిటెడ్ అనే సంస్థ యాజమాన్యంలో నడుస్తున్నాయి. 2018 ఆగష్టులో ఆ సంస్థ ప్రమోటర్లు తమకు చెందిన 90.54 శాతం వాటాను అలంద మీడియా అండ్ ఎంటర్టైన్మెంట్ సంస్థకు అమ్మేశారు. ఏ కంపెనీలో అయినా మెజార్టీ షేర్ల అమ్మకాలు జరిగిన తరువాత కంపెనీలో డైరెక్టర్లుగా కొత్తగా వాటాలు కొనుక్కున్న వారు వస్తారు. కానీ మీడియా కంపెనీల్లో ఆ ప్రక్రియ ఆలస్యం అవుతుంది. కేంద్ర ప్రభుత్వం అనుమతిచ్చిన తరువాతే కొత్త డైరెక్టర్లు మీడియా సంస్థలకు రావాల్సి ఉంటుంది.

చిత్రం శీర్షిక విలేకరుల సమావేశంలో పాల్గొన్న టీవీ 9 కొత్త యాజమాన్యం

‘‘స్వార్థంతో, తప్పుడు ఆసక్తులతో కంపెనీని కంట్రోల్ చేయాలనుకుంటున్నారు’’

దీంతో టీవీ9 లో కొత్త డైరెక్టర్లు రావడం ఆలస్యం అయింది. అయితే, దాన్ని ఉద్దేశపూర్వకంగా మరింత ఆలస్యం చేసేందుకు రవిప్రకాశ్ ప్రయత్నించాడనేది అలంద మీడియా ఆరోపణ. కంపెనీల రిజిస్ట్రార్ కి సమాచారాన్ని కావాలనే ఆలస్యం చేస్తూ తమ రాకను రవిప్రకాశ్ అడ్డుకున్నారని వారు విమర్శించారు. "మార్చి 29న ఏబీసీలో కొత్త డైరెక్టర్ల నియామకానికి కేంద్రం అనుమతిచ్చింది. కానీ రవిప్రకాశ్, సంస్థ సిఎఫ్‌ఒ మూర్తిలు ఆర్ఒసి (రిజిస్ట్రార్ ఆఫ్‌ కంపెనీస్)కి కొత్త డైరెక్టర్ల పేర్లు ఇవ్వలేదు. చివరకు ఆధారాలతో కొత్త డైరెక్టర్ల పేర్లు ఆర్ఒసిలోకి చేరాయి. కానీ ఆ తరువాత కూడా కొత్త డైరెక్టర్లు బోర్డు మీటింగు పెట్టకుండా ఆలస్యం చేస్తూ వచ్చారు. కంపెనీల ట్రిబ్యునల్ దగ్గర ఉన్న కేసును దీనికి సాకుగా చూపారు. దాన్ని బట్టే వారికి కొత్త యాజమాన్యం రావడం ఇష్టం లేదని అర్థం అయింది. మేం కొత్త డైరెక్టర్లతో ఏప్రిల్ 23న, మే 5న బోర్డు మీటింగు పెడితే రవిప్రకాశ్, మూర్తీ కలసి వారిపై తప్పుడు కేసులు పెట్టారు. రవిప్రకాశ్, మూర్తిలు స్వార్థంతో, తప్పుడు ఆసక్తులతో కంపెనీని కంట్రోల్ చేయాలనుకుంటున్నారు. బయటి వారితో కుమ్మక్కై కంపెనీపైనే కేసులు పెట్టించారు" అంటూ ప్రకటన విడుదల చేశారు ఏబీసీఎల్ కొత్త డైరెక్టర్లు.

చిత్రం శీర్షిక అలంద మీడియా విడుదల చేసిన పత్రికా ప్రకటన
చిత్రం శీర్షిక అలంద మీడియా విడుదల చేసిన పత్రికా ప్రకటన

"మొన్న మే 8వ తేదీనే మేం బోర్డు మీటింగు పెట్టి రవిప్రకాశ్, మూర్తిలను పూర్తి స్థాయి డైరెక్టర్, సీఈవో, సీఎఫ్‌ఓ పదవుల నుంచీ తొలగించాం. ఈరోజు షేర్ హోల్డర్ల మీటింగు పెట్టి దాన్ని ధృవీకరిస్తూ తీర్మానం పాసైంది. ఇకపై రవిప్రకాశ్ కీ టీవీ9కీ ఎటువంటి సంబంధం లేదు. అతను ఒక సాధారణ వాటాదారు మాత్రమే. సంస్థకు మధ్యంతర సీఈవోగా మహేంద్ర మిశ్రాను నియమిస్తున్నాం" అని విలేకర్లకు చెప్పారు ఏబీసీఎల్ కొత్త డైరెక్టర్ సాంబశివరావు. "కంపెనీ ట్రిబ్యునల్ దగ్గర ఉన్న కేసు చాలా చిన్నది. ఆయన్ను తొలగించాక ఆయన సీఈవోను అంటూ తెరపై ఎందుకు కనిపించారో మరి. ఆయనపై ఉన్న కేసుల గురించి ఇప్పుడు మేం మాట్లాడదలచుకోలేదు" అన్నారు సాంబశివరావు.

Image copyright youutube/Tv9

‘‘రాజకీయ నేతల అండదండలతో జర్నలిజాన్ని నాశనం చేసే లక్ష్యంతో పని చేస్తున్నారు’’

అటు ఏబీసీఎల్ కొత్త డైరెక్టర్ల విలేకర్ల సమావేశం కంటే ముందే ఒక ప్రకటన విడుదల చేశారు రవిప్రకాశ్. తాను టీవీ9 అధ్యక్ష పదవి నుంచి రాజీనామా చేస్తున్నట్టు ఆ లేఖలో ప్రకటించారాయన. "మీరు రాజకీయ నేతల అండదండలతో జర్నలిజాన్ని నాశనం చేసే లక్ష్యంతో పని చేస్తున్నారు. స్వతంత్రంగా పనిచేసే tv9 పని పట్టాలని ఈ చర్యలకు దిగారు. అసత్యాలతో మోసగించి, వెనుక దారిలో tv9 సంస్థలోకి జొరబడ్డారు. పోలీసుల సహాయంతో tv9 ని కంట్రోల్ లోకి తీసుకున్నారు. తప్పుడు కేసులతో నన్ను వేధించే ప్రయత్నాన్ని పూర్తి స్థాయిలో చేశారు. బలవంతంగా కంపెనీ స్వాధీనం చేసుకున్నారు.

మీరెన్ని అక్రమాలు, అన్యాయాలు, చట్ట వ్యతిరేక కార్యకలాపాలకు పాల్పడినా నేను మీ సాటి షేర్ హోల్డర్ గా, సంస్థలో నా వాటాకు ప్రతినిధిగా మీ పక్కనే ఉంటాను. దేశంలో జర్నలిజాన్ని కాపాడడానికి, పాత్రికేయ విలువల్ని రక్షించడానికి మీడియా సంస్థల్లో రాజకీయ జోక్యాన్నినిలువరించటానికి నా ప్రయత్నం కొనసాగుతూనే ఉంటుంది" అని ఆ ప్రకటనలో రాశారు రవిప్రకాశ్.

మెజారిటీ వాటాదారులుగా తమకు ఉన్న హక్కులతో 8వ తేదీనే రవిప్రకాశ్ ను తొలగించినట్టు కొత్త యాజమాన్యం చెబితే, 9వ తేదీ సాయంత్రం టీవీ9 తెరపై కనిపించి అలాంటిదేమీ లేదని ప్రకటన ఇచ్చారు రవిప్రకాశ్. ఇక పదవ తేదీ వాటాదార్ల సమావేశానికి ఆయన హాజరు కాలేదు. కానీ కొత్త డైరెక్టర్లు ఆరున్నరకు విలేకర్ల సమావేశం అనడంతో, తన లేఖపై సమయం 6 గంటలు అని రాసారు రవిప్రకాశ్.

కొత్త డైరెక్టర్లు వాటాదార్ల సమావేశం తరువాత టీవీ9 సిబ్బందిని పిలిచి, యాజమాన్యం మార్పిడి వ్యవహారం గురించి ప్రకటన చేశారు.

చిత్రం శీర్షిక టీవీ9 కొత్త యాజమాన్యం విలేకరుల సమావేశం కవర్ చేసేందుకు వివిధ మీడియా ఛానెళ్లు ఏర్పాటు చేసిన లైవ్ (ఓబీ) వాహనాలు

కేసుల సంగతి?

రవిప్రకాశ్ పై పెట్టిన కేసుల గురించి కొత్త డైరెక్టర్లు మాట్లాడలేదు. అయితే సంతకాలు ఫోర్జరీ చేశారంటూ.. వెలిచేటి రవిప్రకాశ్, నటుడు శివాజీ ఇంకొందరిపై అలందా మీడియా సంస్థ డైరక్టర్ గా ఉన్న పి కౌశిక్ రావు సైబరాబాద్ సైబర్ క్రైమ్ పోలీస్ స్టేషన్లో పిర్యాదు చేశారు. దీనిపై క్రిమినల్ కేసులు నమోదయ్యాయి. ఐపిసిలోని 406, 420, 467, 471, 120బి సెక్షన్ల కిందా, ఐటి చట్టంలోని 66, 72 సెక్షన్ల కిందా పోలీసులు కేసు పెట్టారు. ఏప్రిల్ 24న ఈ ఫిర్యాదు చేయగా, దాని ఆధారంగా కోర్టు అనుమతితో మే 9వ తేదీన నాలుగుచోట్ల సోదాలు నిర్వహించారు. ఏబీసీఎల్ - అసోసియేటెడ్ బ్రాడ్ క్యాస్టింగ్ లిమిటెడ్ (టీవీ9 కార్యాలయం), రవిప్రకాశ్ ఇల్లు, శివాజీ ఇల్లు, ఎంవికెఎన్ మూర్తి ఇళ్లల్లో పోలీసులు సోదాలు నిర్వహించారు. అనేక పత్రాలు, ఎలక్ట్రానిక్ సాక్ష్యాలూ స్వాధీనం చేసుకున్నారు. వీటిని ఫోరెన్సిక్ ల్యాబుకు పంపి విశ్లేషించనున్నారు. అంతేకాదు, తప్పుడు పత్రాలు సృష్టించారంటూ అంతకు ముందే మరో ఫిర్యాదు చేశారు.

ఇవి కూడా చదవండి:

(బీబీసీ తెలుగును ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్‌, ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)