మన్ను తిన్న చిన్నారి మట్టిలో కలిసిపోయింది.. ఆ పాపం ఎవరిది

  • 12 మే 2019
కదిరి ఆకలి చావులు

ఆంధ్రప్రదేశ్‌లోని అనంతపురం జిల్లాలో రెండు వారాల క్రితం రెండేళ్ల చిన్నారి మరణం చర్చనీయమైంది.

ఆకలి తీరే మార్గం లేక మట్టి తినడం వల్లే చిన్నారి మరణించిందని హక్కుల సంఘాలు, ప్రతిపక్ష నేతలు ఆరోపిస్తుండగా... ఆ చిన్నారి తల్లిదండ్రులు, సంరక్షకుల నిర్లక్ష్యం వల్లే పోషకాహార లోపంతో ఆమె మరణించిందని అధికారులు తమ నివేదికల్లో రాశారు.

నిర్లక్ష్యం తల్లిదండ్రులు, సంరక్షులదేనా? ప్రభుత్వానికి, అధికారులకు బాధ్యత లేదా? అని హక్కుల సంఘాలు ప్రశ్నిస్తున్నాయి.

ఇంతగా చర్చకు కారణమైన ఈ చిన్నారి ఎవరు? ఆమె మరణానికి దారితీసిన పరిస్థితులేమిటి?

దేశంలో ఆహార భద్రత చట్టం, ఉపాధి హామీ, మాతాశిశు సంరక్షణకు అంగన్‌వాడీ కేంద్రాలు వంటివన్నీ ఉన్నా ఎందుకీ దుస్థితి అన్న ప్రశ్న ఉత్పన్నమవుతోంది.

ఈ నేపథ్యంలో చిన్నారి మరణం వెనుక వాస్తవాలు తెలుసుకునేందుకు అనంతపురం జిల్లా కుమ్మరవాండ్లపల్లిలోని హమాలీ క్వార్టర్లలో నివసిస్తున్న చిన్నారి కుటుంబీకులు, స్థానికులను, పోలీసులను 'బీబీసీ' కలిసింది.

పోలీసులేమంటున్నారు

పోలీసుల వివరాల ప్రకారం.. కర్ణాటక రాష్ట్రం గుదిబండ గ్రామానికి చెందిన మహేశ్.. అనంతపురం జిల్లా కదిరి మండలం కుమ్మరవాండ్లపల్లికి చెందిన నాగమణిని వివాహం చేసుకొని కుమ్మరవాండ్లపల్లిలోనే నివసిస్తున్నారు.

కూలినాలి చేసుకుని జీవించే వీరికి ఐదుగురు పిల్లలు. జీవనోపాధి కోసం కొంత కాలం హైదరాబాద్‌లో ఉండి తిరిగి కుమ్మరవాండ్లపల్లికి చేరుకున్నారు.

ఉండడానికి ఇల్లు లేక పాత బట్టలతో ఓ చిన్న గుడారం ఏర్పాటు చేసుకొని అందులో నివసిస్తున్నారు. నాగమణి తల్లి కూడా వీరికి సమీపంలోనే మరో చిన్న ఇంట్లో ఉంటున్నారు.

స్థానికులేం చెప్పారు

ఆరు నెలల కిందట మహేశ్, నాగమణిల రెండో కొడుకు మూడేళ్ల వయసున్న సంతోష్ కుమార్ తీవ్రమైన పోషకాహార లోపంతో చనిపోయాడు. ఆర్థిక స్థోమత లేకపోవటంతో తాముంటున్న గుడారం పక్కనే సంతోష్‌ను పూడ్చిపెట్టారు.

ఇటీవల చనిపోయిన వెన్నెల నిజానికి మహేశ్, నాగమణిల సంతానం కాదు. ఆ చిన్నారి నాగమణి చెల్లెలు లక్ష్మి కూతురు. లక్ష్మి భర్తను విడిచి మరో వ్యక్తితో వేరే ప్రాంతానికి వెళ్లిపోయింది. వెళ్తూవెళ్తూ వెన్నెలనూ తీసుకెళ్లింది.

కానీ, 2018 మేలో‌ వెన్నెలను కుమ్మరవాండ్లపల్లికి తీసుకువచ్చిన లక్ష్మి తన తల్లి సుంకులమ్మ దగ్గర వదిలి వెళ్లింది.

అప్పటికి వెన్నెల తీవ్ర అనారోగ్యంతో ఉంది.

తీవ్ర అనారోగ్యంపాలైన వెన్నెలను కాలనీవాసుల ఆర్థిక సహకారంతో తిరుపతిలోని రుయా ఆస్పత్రిలో చేర్పించి వైద్యం చేయించారు.

కోలుకున్న తరువాత కూడా వెన్నెల తల్లి తిరిగి రాకపోవటంతో ఆ పాప.. అమ్మమ్మ సుంకులమ్మ, పెద్దమ్మ నాగమణి వద్దనే ఉంటోంది.

ఇటీవల మళ్లీ అనారోగ్యం పాలైన వెన్నెల రెండు వారాల కిందట చనిపోయింది.

ఆకలికి తట్టుకోలేక తమ ఇద్దరు పిల్లలు మట్టితిని అనారోగ్యంపాలై చనిపోయారని మహేశ్, నాగమణి మీడియా ముందు చెప్పటంతో ఒక్కసారిగా కలకలం రేగింది.

అధికారులు కదిలొచ్చి మహేశ్, నాగమణిల సంతానమైన మరో చిన్నారి పది నెలల లావణ్యను కాపాడేందుకు అనంతపురం ప్రభుత్వాస్పత్రిలో చేర్చించి చికిత్స చేయిస్తున్నారు. వారి మరో ముగ్గురు పిల్లలను శిశు సంరక్షణ కేంద్రానికి తరలించారు.

అధికారులు రేషన్ కార్డు జారీ చేసుంటే పిల్లలు బతికేవారు: మహేశ్, నాగమణి

తమ పిల్లల మరణానికి తమ పేదరికం.. ప్రభుత్వ అధికారులు పట్టించుకోకపోవడమే కారణమని మహేశ్, నాగమణి ఆరోపిస్తున్నారు.

''మేం పేదోళ్లం సార్.. నేను రాళ్లు కొట్టే పనిచేస్తాను. పని కోసం ఆరేడు కిలోమీటర్లు నడిచిపోవాలి. ఉదయం ఐదు గంటలకే పోతా. ఒక్కోసారి పని ఉంటుంది‌, ఒక్కోసారి ఉండదు. కష్టపడి పని చేస్తేనే తిండి, లేకుంటే లేదు. నాకు యాక్సిడెంట్ అయింది.. ఒళ్లంతా కుట్లే. ఆ నొప్పులతో రోజూ పనిచేయలేను. మాకు ఉండటానికి ఇల్లు లేదు. కష్టపడి సంపాదించినదాంట్లో నోరు కట్టుకొని చిన్న ఇంటి కోసం పునాది వరకు వేసుకున్నాం. ఇంటి పట్టా, రేషన్ కార్డు కోసం అప్లికేషన్ ఇచ్చినా ప్రభుత్వం మాకేం సహాయం చేయలేదు. దీనికితోడు మావాళ్లు మద్యం తాగుతారు సార్. నేను కష్టపడి తెచ్చిన డబ్బుతో తాగి పడిపోతారు. పిల్లలకు తిండి కూడా ఉండదు. మా పరిస్థితి చాలా ఘోరం సార్'' అని మహేశ్ వివరించాడు.

మహేష్ భార్య నాగమణి మాట్లాడుతూ ''మాకు ఆధార్ కార్డు, ఓటర్ కార్డు ఉన్నాయి కానీ బియ్యం కార్డు మాత్రం లేదు. కార్డు కోసం మా ఆయన ఎమ్మార్వో ఆఫీసుకు వెళ్లి అప్లికేషన్ ఇచ్చాడు. అయినా కార్డు రాకపోవడంతో నేను జన్మభూమిలో మరోసారి అప్లికేషన్ ఇచ్చాను. అప్పుడూ ఏమీచేయలేదు. కనీసం ఆ బియ్యం కార్డన్నా ఇస్తే నా పిల్లలకు ఒక పూటైనా తిండి పెట్టగలిగేవాళ్లం. ప్రభుత్వం.. ప్రభుత్వం అంటారుగాని మాకేమీ చెయ్యలా. ఇప్పుడు నా ఇద్దరు పిల్లలు చచ్చిపోయినాక.. ఇప్పుడొచ్చి ఇది చేస్తాం, అది చేస్తామంటున్నారు. ఆ సహాయం ఏదో ముందే చేసుంటే నా పిల్లలు బతికేవాళ్లు'' అని ఆవేదన వ్యక్తం చేసింది.

‘మద్యానికి బానిసలు’

కుమ్మరవాండ్లపల్లిలోని హమాలీ క్వార్టర్లలో ఉండే స్థానికులు మాత్రం.. నాగమణి, సుంకులమ్మలు తాగుడుకు బానిసలై పిల్లలను పట్టించుకోకపోవటంవల్లే చనిపోయారని చెబుతున్నారు.

నూర్జహాన్ అనే మహిళ బీబీసీతో మాట్లాడుతూ ''పిల్లల తల్లి, అవ్వా ఎప్పుడూ తాగి పడిపోవడమే. పిల్లలకు బువ్వకూడా సరిగా పెట్టేవారు కాదు. ఎవరన్న పెడితే ఇంత తినేవారు, లేదంటే వాళ్ల నాయన తెచ్చి పెడితేనే వారికి తిండి ఉండేది. మట్టి తింటుండేవారు'' అని చెప్పారు.

కదిరి రూరల్ ఎస్‌ఐ వెంకటస్వామి మాట్లాడుతూ ''పిల్లలు మట్టితినటం వాస్తవమే అని స్థానికులు చెబుతున్నారు. అయితే ఆకలికి తట్టుకోలేక తింటున్నారా లేక అలవాటుగా తింటున్నారా అన్నది చెప్పలేం. ఈ కేసులో తల్లిదండ్రుల నిర్లక్ష్యం స్పష్టంగా కనిపిస్తోంది. పిల్లల తల్లి, అమ్మమ్మ తాగుడుకు బానిసలై ఇంట్లో వంట కూడా చేయకపోవటంతోనే పిల్లలు పోషకాహార లోపంతో చనిపోయారు'' అని అన్నారు.

రేషన్ కార్డుకు అప్లై చేయకుండానే ఆరోపిస్తున్నారేమో: ఆర్‌డీఓ

ఈ విషయంపై వివిధ ప్రభుత్వ విభాగాల అధికారులతో కలసి విచారణ చేసిన ఆర్‌డీఓ అజయ్‌కుమార్‌ను సంప్రదించగా దీనిపై కలెక్టరుకు నివేదిక సమర్పించినట్లు తెలిపారు.

''ఇంట్లో తల్లి అన్నం కూడా వండకుండా ఎప్పుడూ తాగి పడిపోతుంటే పిల్లలు మట్టి తినక ఏంచేస్తారు'' అని ఆర్డీవో ప్రశ్నించారు.

బెల్టు షాపులు, నాటుసారా తయారీని ప్రభుత్వం, అధికారులు అరికట్ట లేకపోవటం వల్లే ఈ ఘటన జరిగిందని అనుకోవచ్చా? అన్న బీబీసీ ప్రశ్నకు ఆయన సమాధానమివ్వలేదు.

రేషన్ కార్డు లేకపోవడంపై మాట్లాడుతూ ''అప్లై చేయకుండానే మాపై ఆరోపణలు చేయవచ్చు కదా'' అన్నారు ఆర్‌డీవో.

''ఆకలి చావుల విషయంలో నేనేమీ చెప్పలేను. కేవలం తల్లిదండ్రుల నిర్లక్ష్యం కారణంగానే ఈ ఘటన జరిగింది'' అంటూ కలెక్టరుకు కూడా అదే విషయం నివేదించానని చెప్పారు.

ఆహార భద్రత బాధ్యత ప్రభుత్వానిదే: హక్కుల సంఘాలు

మానవహక్కుల సంఘాలు, కొందరు మహిళలు మాత్రం ఈ విషయంలో ప్రభుత్వ విధానాలను తప్పుబడుతున్నారు. పిల్లల సంరక్షణ బాధ్యత ప్రధానంగా తల్లిదండ్రులదే అయినప్పటికీ ప్రజాస్వామ్య వ్యవస్థలో తల్లిదండ్రులకు కనీస సౌకర్యాలు, ఆర్థిక, ఆహార భద్రత కల్పించాల్సిన బాధ్యత ప్రభుత్వాలదేనని మానవహక్కుల ఫోరం అంటోంది.

ఆధార్ కార్డు, ఓటరు కార్డు కలిగిన ఒక నిరుపేద కుటుంబానికి ఆహార భద్రతకు సంబంధించిన రేషన్ కార్డు లేకపోవటమనేది‌ ప్రభుత్వాలు సిగ్గుతో తలదించుకోవలసిన‌ పరిస్థితని‌ విమర్శిస్తోంది. వ్యక్తులు మద్యంతాగి‌ నిర్లక్ష్యంగా వ్యవహరిస్తున్నారంటూ.. సమాజం, అధికారులు బాధితులనే దోషులుగా నిలబెట్టడం సరైంది కాదని ఫోరం ఉమ్మడి రాష్ట్రాల కో ఆర్డినేషన్ కమిటీ సభ్యులు చంద్రశేఖర్ అన్నారు.

‘‘మద్య నిషేధం హామీ ఏమైంది?’’

ఐదు సంవత్సరాల క్రితం అధికారంలోకి వచ్చిన తెలుగుదేశం పార్టీ విడతల వారీగా మద్యాన్ని నియంత్రిస్తామని తన మ్యానిఫెస్టోలో హామీ ఇచ్చింది. బెల్టు షాపులు తొలగిస్తామని స్పష్టమైన హామీ ఇచ్చినప్పటికీ, ఇప్పటివరకూ ఎలాంటి చర్యలూ తీసుకోలేదని తెలిపారు. ఫలితంగా‌ ఇవాళ ప్రతిచోట లూజ్ లిక్కరుతోపాటు నాటుసారా కూడా దొరుకుతోందన్నారు.

కదిరి చుట్టుపక్కల ప్రాంతాల్లో చిన్నపిల్లలకు కూడా మందు అమ్మే పరిస్థితి ఉంది అని ఆయన తెలిపారు. చట్టబద్దంకాని బెల్టు షాపులు, నాటుసారా తయారీని అరికట్టకుండా ప్రజలు మద్యానికి బానిసలౌతున్నారనటం హస్యాస్పదంగా ఉందన్నారు. వీటిని అరికట్టాల్సిన బాధ్యత ఎక్సైజ్, రెవెన్యూ శాఖలకు లేదా అని చంద్రశేఖర్ ప్రశ్నించారు.

చట్టబద్ధంకాని మద్యం అమ్మకాలను ఇప్పటికైనా అరికట్టాలని ఆయన డిమాండ్ చేశారు.

కలెక్టరుకు సమర్పించిన నివేదికలో ఏముంది

రెండేళ్ల చిన్నారి వెన్నెల మరణంపై నివేదిక సమర్పించిన ఆర్డీవో.. చిన్నారి కుటుంబ నేపథ్యం, పరిస్థితులను ఆ నివేదికలో వివరించారు. మహేశ్, నాగమణిల వద్ద ఉన్న పిల్లలందరి పేర్లూ స్థానిక అంగన్‌వాడీ కేంద్రంలో నమోదై ఉన్నాయని.. కొన్నాళ్ల కిందటివరకు అంగన్‌వాడీ కేంద్రం నుంచి పాలు, పోషకాహారం వారికి అందేదని.. అయితే, పిల్లల తల్లి నాగమణి మద్యం మత్తులో ఉంటూ వారి ఆలనాపాలనా చూడడం మానేసిందని ఆ నివేదికలో రాశారు.

అయిదుగురు పిల్లల్లో అంగన్‌వాడీకి వెళ్తున్న ముగ్గురి ఆరోగ్య పరిస్థితి బాగానే ఉందని చెప్పారు.

ఆ కుటుంబానికి అంత్యోదయ అన్న యోజన కార్డు మంజూరు చేస్తామని.. గ్రామీణ ఉపాధి హామీ కింద జాబ్ కార్డులు వచ్చేలా చర్యలు తీసుకుంటామని కలెక్టరుకు నివేదించారు.

ఇంటి పట్టా మంజూరుకు చర్యలు తీసుకుంటామని.. తాత్కాలిక ఆవాసం ఏర్పాటు చేసుకునేందుకు రూ.5 వేల ఆర్థిక సహాయం చేసినట్లు నివేదికలో వెల్లడించారు.

మద్యానికి బానిసైన నాగమణి, ఆమె తల్లి సుంకులమ్మలను డీఅడిక్షన్ సెంటర్లో చేర్పిస్తామని ఆర్డీవో కలెక్టరుకు నివేదించారు.

ఇవి కూడా చదవండి.

(బీబీసీ తెలుగును ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్‌, ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)

ఈ కథనం గురించి మరింత సమాచారం