పవన్ కల్యాణ్: నాకెంత మెజార్టీ వస్తుందో ఇప్పుడేమీ చెప్పలేను- ప్రెస్ రివ్యూ

  • 12 మే 2019
పవన్ కల్యాణ్ Image copyright fb/janasenaparty

వీవీ ప్యాట్‌ స్లిప్‌లను తప్పనిసరిగా లెక్కించాల్సిన అవసరం ఉందని జనసేన అధ్యక్షుడు పవన్ కల్యాణ్ అన్నారని ఆంధ్రజ్యోతి రాసింది.

"కాబోయే ముఖ్యమంత్రి ఎవరు అనేది 23న తెలిసిపోతుంది. ప్రజలు ఎవరిని ముఖ్యమంత్రిగా స్వీకరిస్తారా అని ఎదురు చూస్తున్నా'' అని పవన్‌ కల్యాణ్‌ అన్నారు.

శనివారం కర్నూలు జిల్లాలోని ఓర్వకల్లు విమానాశ్రయం వద్ద ఆయన మీడియాతో మాట్లాడారు.

''పోలింగ్‌ ఎవరికి అనుకూలంగా ఉందనేది ఫలితాల ద్వారానే వెల్లడవుతుంది. గాజువాక, భీమవరంలో ఎంత మెజారిటీతో గెలుస్తానన్నది కౌంటింగ్‌ తర్వాతే తెలుస్తుంది. ఇప్పుడేమీ చెప్పలేను. ఓటింగ్‌ సరళి ఫలితాల రోజే తెలుస్తుంది. అంతవరకు ఎవరు ఏమి చెప్పినా ఊహాగానాలే'' అని పవన్‌ అన్నారు.

నంద్యాల ఎంపీ ఎస్పీవై రెడ్డి కుటుంబాన్ని పవన్‌ పరామర్శించారు. ఇటీవలే ఎస్పీవై రెడ్డి అనారోగ్యంతో మృతి చెందారు.

Image copyright Getty Images

4 నిమిషాల్లో 40 వేల లీటర్ల నీరు

రైళ్లలో నీటి కష్టాలకు చెక్ పెట్టే 'క్విక్‌ వాటరింగ్‌ ప్రాజెక్టు' అందుబాటులోకి వచ్చిందంటూ సాక్షి ఒక కథనం ప్రచురించింది.

రైళ్లలో నీటి కష్టాలపై ప్రయాణికుల నుంచి కుప్పలుతెప్పలుగా ఫిర్యాదులు వస్తుండటంతో ఎట్టకేలకు రైల్వే శాఖ మేల్కొంది.

ప్రధాన స్టేషన్‌లలో 'క్విక్‌ వాటరింగ్‌ సిస్టం'ను ఏర్పాటు చేస్తోంది. ఇప్పటికే సికింద్రాబాద్, కాచిగూడ, విజయవాడల్లో ఏర్పాటు చేశారు. త్వరలో మిగతా ప్రధాన స్టేషన్‌లలో ఏర్పాటు చేస్తున్నారు. ఇందుకోసం బోగీల్లో నీళ్లు నింపే పాత పైప్‌లైన్‌లు మార్చి కొత్తవి ఏర్పాటు చేశారు.

ఒక్కోచోట నాలుగు చొప్పున 40 హెచ్‌పీ సామర్థ్యం ఉన్న మోటార్లు అమర్చారు. ఈ పైప్‌లైన్‌ నుంచి బోగీలకు చిన్న పైప్‌లను అమర్చి మోటారు ఆన్‌ చేయగానే కేవలం నాలుగు నిమిషాల్లో మొత్తం రైలులోని నీటి ట్యాంకులు నిండిపోతాయి. పైగా ఒకేసారి అన్ని బోగీల్లో నీళ్లు నిండుతాయి.

మరో లైన్‌లో నిలబడిన రైలుకు కూడా అదే సమయంలో నీళ్లు నింపేలా ఏర్పాటు చేశారు. వెరసి నాలుగు నిమిషాల్లో రెండు రైళ్లలో ట్యాంకులు నింపేయొచ్చన్నమాట. నీళ్లు అయిపోయిన రైలు వచ్చి ఆగి.. తిరిగి బయలుదేరేంత సమయంలోనే నీటిని నింపేస్తారు. కొద్దిరోజుల క్రితమే ఇది అందుబాటులోకి వచ్చింది.

ఈ వ్యవస్థను సెన్సార్లు, రిమోట్‌లతో అనుసంధానించారు. నీళ్లు నిండగానే సెన్సార్లు గుర్తించి ఆటోమేటిక్‌గా పంపింగ్‌ నిలిచిపోయేలా చేస్తాయి.

ఈ ప్రాజెక్టు కోసం రైల్వే బోర్డు గతేడాది రూ.300 కోట్లు విడుదల చేసింది. ప్రధాన స్టేషన్‌లకు రూ.2 కోట్లు చొప్పున కేటాయింపులు చేసింది. ఏప్రిల్‌లో పనులు పూర్తయి ఇటీవలే అందుబాటులోకి వచ్చింది.

Image copyright Getty Images

రికార్డు స్థాయిలో విద్యుత్ వినియోగం

ఎండలు, వడగాలులు.. ఉక్కపోత.. విపరీతంగా పెరగడంతో ఆంధ్రప్రదేశ్‌లో విద్యుత్ వినియోగం గరిష్ఠ స్థాయికి చేరిందంటూ ఈనాడు పేర్కొంది.

ఆ కథనం ప్రకారం, రాష్ట్రంలో ముందెన్నడూ లేనంతగా రికార్డు స్థాయిలో విద్యుత్తు వినియోగం రోజుకు 199.929 మిలియన్‌ యూనిట్లకు చేరింది.

ఉష్ణోగ్రతలు ఇదేస్థాయిలో కొనసాగితే రోజువారీ డిమాండ్‌ 200 మిలియన్‌ యూనిట్లు దాటవచ్చని అధికారులు అంచనా వేస్తున్నారు.

వేడి, ఈదురుగాలుల ప్రభావంతో ట్రాన్స్‌ఫార్మర్లు ఎక్కడికక్కడ దెబ్బతింటున్నాయి.

రాష్ట్రవ్యాప్తంగా మార్చి నుంచే ఉష్ణోగ్రతల పెరుగుదల మొదలైంది.అప్పటి నుంచే విద్యుత్తు డిమాండ్‌ పెరుగుతూ వచ్చింది. మార్చి 6న 191.198 మిలియన్‌ యూనిట్లకు చేరింది. 30న డిమాండ్‌ 197.70 మిలియన్‌ యూనిట్లుగా ఉంది. ఏప్రిల్‌ 5 దాకా సగటున ఇదే స్థాయిలో వాడకం నమోదైంది. మే 6 నుంచి ఉష్ణోగ్రతలు 47 డిగ్రీలకు చేరాయి. దీనికి అనుగుణంగానే విద్యుత్తు డిమాండ్‌ పెరుగుతూ వచ్చింది. అత్యధికంగా 199.929 మిలియన్‌ యూనిట్లకు చేరింది.

Image copyright Getty Images

ఒక్క తప్పుకు... వెయ్యి తిప్పలు

భూముల పాస్ పుస్తకాల్లో చిన్న తప్పు ఉన్నా దాన్ని సరిచేయించుకునేందుకు.. రైతులు రెవెన్యూ కార్యాలయాల చుట్టూ చెప్పులరిగేలా తిరగాల్సి వస్తోందంటూ నమస్తే తెలంగాణ పత్రిక ఒక కథనం ప్రచురించింది.

ఆ కథనం ప్రకారం, ఒకరి నిర్లక్ష్యం కొత్త పాస్‌పుస్తకాల్లో సర్వే నంబర్లనే మాయంచేసింది. 994 మంది రైతులకు శాపంగా మారింది. ఏడాదిన్నరగా చెప్పులరిగేలా రెవెన్యూ కార్యాలయం చుట్టూ తిప్పుతోంది.

భూప్రక్షాళన కార్యక్రమంలో నల్లగొండ జిల్లా నర్సింగ్‌భట్ల గ్రామ రెవెన్యూ అధికారి నిర్లక్ష్యం ఊరి రైతులకు కొత్త సమస్యను తెచ్చిపెట్టింది. ఉన్న భూమికంటే తక్కువ భూమిని పాస్‌పుస్తకాల్లో ఎక్కించి జారీచేయడంతో రైతులు తలలు పట్టుకుంటున్నారు. ఉన్నతాధికారులకు ఫిర్యాదుచేసినా నేటికీ ఆ సమస్య పరిష్కారానికి నోచుకోవటంలేదు.

భూప్రక్షాళన సమయంలో కొత్త పాస్ పుస్తకాలు ఇవ్వాల్సిన రెవెన్యూ అధికారులు తప్పులతో జారీచేశారు. 2,100 మంది రైతుల్లో 994 మంది పాస్‌పుస్తకాల్లో తప్పులు దొర్లాయి. ఒక్కో రైతుకు నాలుగైదు సర్వేనంబర్లలో భూములుండగా, వీఆర్వో నిర్లక్ష్యంగా వ్యవహరించి ఒకటి లేదా రెండు సర్వేనంబర్లలోని భూముల వివరాలను మాత్రమే ఆన్‌లైన్‌లో నమోదుచేసి కొత్త పాస్‌పుస్తకాల్లో ఎక్కించారు.

ఇవి కూడా చదవండి

(బీబీసీ తెలుగును ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్‌, ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)