డయాబెటిస్, క్యాన్సర్ మందుల రేట్లు కుట్రపూరితంగా పెంచుతున్నారంటూ ఫార్మా కంపెనీలపై అమెరికాలో కేసులు

  • 12 మే 2019
మందులు Image copyright Getty Images

అందరికీ అవసరమైన మందుల ధరలకు కంపెనీలు ఉద్దేశపూర్వకంగా పెంచుతున్నాయంటూ అమెరికాలోని 40కి పైగా రాష్ట్రాలు ఔషధ కంపెనీలపై కేసులు వేశాయి.

డయాబెటిస్, క్యాన్సర్ మందులు సహా సుమారు 100 రకాల ఔషధాల ధరలను నిర్ణయించడంలో 20 ఫార్మా కంపెనీలు కీలక పాత్ర పోషిస్తున్నాయని, కుట్రపూరితంగా ధరలను పెంచుతున్నాయని ఆ కేసుల్లో అభియోగాలు నమోదు చేశారు.

ఆరోపణలు ఎదుర్కొంటున్న సంస్థల్లో ప్రపంచంలోనే అతిపెద్ద జనరిక్ మందుల తయారీ కంపెనీ టెవా ఫార్మాస్యూటికల్స్ కూడా ఉంది. అయితే, టెవా మాత్రం ఈ ఆరోపణలను ఖండించింది.

కొన్ని మందుల ధరలు 1000 శాతానికి పైగా పెరిగాయంటూ కనెక్టికట్ అటార్నీ జనరల్ విలియమ్ టోంగ్ దాఖలు చేసిన కేసులో ఆరోపించారు. ''అమెరికన్ల జీవితాలతో ఆటలాడుతూ జనరిక్ మందుల తయారీ రంగంలోని కొందరు వందల కోట్ల డాలర్ల కుంభకోణానికి తెరతీశారనడానికి మా వద్ద బలమైన ఆధారాలున్నాయ''ని టోంగ్ అన్నారు.

ఎన్నో ఏళ్లుగా సాగుతున్న ఈ ధరల దందాకు సంబంధించిన ఈమెయిల్స్, టెక్స్ట్ మెసేజ్‌లు, వాయిస్ రికార్డులు, సంస్థల్లో ఒకప్పుడు పనిచేసినవారి సాక్ష్యాల రూపంలో తమ వద్ద ఆధారాలున్నాయని ఆయన చెప్పారు.

ఇజ్రాయెల్‌కు చెందిన టెవా సంస్థ అమెరికా ప్రతినిధి ఒకరు రాయిటర్స్ వార్తాఏజెన్సీతో దీనిపై మాట్లాడుతూ.. తమ సంస్థ చట్ట విరుద్ధమైన పనులేమీ చేయలేదన్నారు.

ఆరోపణలు ఎదుర్కొంటున్న మిగతా 19 కంపెనీలు ఇంకా దీనిపై స్పందించలేదు.

కాగా ఈ వ్యవహారంలో వివిధ సంస్థలకు సంబంధించిన 15 మందిపైనా అభియోగాలు నమోదయ్యాయి.

ఎన్నో మందుల ధరలు పెంచేశారు

2013 జులై, 2015 జనవరి మధ్య పదుల సంఖ్యలో మందుల ధరలను అమాంతంగా పెంచేందుకు కంపెనీలు కుట్రకు పాల్పడ్డాయని ఫిర్యాదులో పేర్కొన్నారు. హెల్త్ కేర్ రంగంలో అమెరికాలో ఇది భారీ కుంభకోణమని అందులో ఆరోపించారు.

అమెరికాలో వైద్య ఖర్చులు, మందుల ధరలు ఎందుకింత ఎక్కువగా ఉన్నాయన్నది ఈ పరిశోధన వల్ల బయటపడిందన్నారు.

ఇవి కూడా చదవండి:

(బీబీసీ తెలుగును ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్‌, ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)