జోగులాంబ గద్వాల జిల్లా: ‘ఆ పాడు బస్సొచ్చి పదారుమందిని పొట్టన బెట్టుకుంది..చచ్చిపోయినోళ్లంతా ఇంటి పెద్దలు’

  • 13 మే 2019
రోడ్డు ప్రమాద మృతుడి తల్లి

"మా ఊరి పిల్లగాని నిశ్చితార్థానికి పోయి తిరిగొస్తున్నాం. మా వాళ్లు వస్తున్న బండిని ఆ పాడు బస్సొచ్చి కొట్టింది నాయనా. పదారుమందిని పొట్టన బెట్టుకుంది. చచ్చిపోయినోళ్లంతా ఇంటి పెద్దలు.. తల్లిదండ్రులను చూసుకుంటున్న కొడుకులే నాయనా. నా కొడుకు మునిసామి.. కష్టపడి మమ్మల్ని సాకుతుండె. ఆడు పోయినాడు. మేము ముసలోళ్లం కష్టపడలేం. ఇప్పుడు మా పరిస్థితేందొ దిక్కుదోస్తలేదు నాయనా"

ఇది తెలంగాణ రాష్ట్రంలోని జోగులాంబ గద్వాల జిల్లా వడ్డేపల్లి మండలం రామపురం గ్రామానికి చెందిన క్రిష్ణమ్మ అనే మహిళ ఆవేదన.

ఈమెలాగానే ఆ గ్రామంలో అనేకమంది కన్నీటిపర్యంతమవుతున్నారు. గుండెలవిసేలా విలపిస్తున్నారు.

ఈనెల 10వ తేదీ శుక్రవారం సాయంత్రం కర్నూలు జిల్లా వెల్దుర్తి సమీపంలో జరిగిన ఘోర రోడ్డు ప్రమాదంలో ఈ గ్రామానికి చెందిన పదహారు మంది చనిపోయారు.

దీంతో ఆ గ్రామం శోకసంద్రంలో మునిగిపోయింది.

ముగ్గురు మినహా మృతులంతా నలభై ఏళ్ల లోపువారే.

కుటుంబాన్ని పోషిస్తున్న యజమానులు.. తల్లిదండ్రుల ఆలనాపాలనా చూస్తున్న కుమారులే.

రామపురం గ్రామంలో 32 దళిత కుటుంబాలున్నాయి. వారంతా రైతులు.. వ్యవసాయం చేసుకొని బతికేవారు.

వీరిలో ఎవరింట్లో ఏ కార్యక్రమం జరిగినా కనీసం ఇంటికొకరు చొప్పున హాజరు కావడం ఆనవాయితీ.

ఈ క్రమంలోనే నిన్న మాజీ సర్పంచ్ లక్ష్మన్న కుమారుడు శ్రీనాథ్ నిశ్చితార్థం కోసం మూడు ప్రైవేట్ వాహనాల్లో ఉదయం 9 గంటలకు అనంతపురం జిల్లా గుంతకల్లు వెళ్లారు.

నిశ్చితార్థం ముగించుకుని తూఫాన్‌ వాహనంలో తిరిగి వస్తుండగా ఈ ఘోర ప్రమాదం జరిగింది.

"అన్నం తిని గుంతకల్లు నుంచి తూఫాన్ వాహనంలో తిరుగు ప్రయాణమయ్యాం . ఊర్లో విషయాలతోపాటు పెళ్లి ఎలా చేయాలో కూడా మాట్లాడుకుంటూ వస్తున్నాం. వెల్దుర్తి దగ్గరకు రాగానే ఉన్నట్టుండి ఒక వోల్వో బస్సు వేగంగా వచ్చి ముందు బైక్‌ను..ఆ తరువాత మా తూఫాన్ బండిని ఢీకొట్టింది. చాలాదూరం లాక్కెళ్లింది" అని తీవ్రంగా గాయపడి ప్రాణాపాయ స్థితిలో ఉన్న విజయకుమార్ 'బీబీసీ'కి తెలిపారు.

చిత్రం శీర్షిక పరశురాం మృతదేహం వద్ద కుటుంబసభ్యుల రోదనలు

నడవలేని అమ్మానాన్న, భార్యాపిల్లలు.. అందరి ఆధారం పోయింది

ప్రమాదంలో మరణించిన 25 ఏళ్ళ పరశురాం గౌండా.. పనిచేస్తూ కుటుంబాన్ని పోషించుకునేవారు.

భార్య, ఇద్దరు పిల్లలతో పాటు పోలియో కారణంగా నడవలేని స్థితిలో ఉన్న తల్లిదండ్రులకు ఈయనే ఆధారం.

పరశురాం మరణంతో వీరందరి పరిస్థితి అగమ్యగోచరంగా ఉంది. వారి జీవనానికి ఆధారమైన ఒక్కగానొక్క దిక్కును కోల్పోయారు.

చిత్రం శీర్షిక పద్మావతి

బతుకు మరింత చీకటైంది

ట్రాక్టర్ డ్రైవర్‌గా పనిచేస్తూ కుటుంబాన్ని పోషించే వెంకటరాముడుకు భార్య, ఇద్దరు చిన్న పిల్లలున్నారు.

భార్య పద్మావతికి రేచీకటి.. సాయంత్రమైతే ఏమీ కనిపించదు. ఇప్పుడు తన భర్త లేకపోవడంతో... ఇద్దరు పిల్లలతో తానెల బతకాలంటూ ఆమె రోదిస్తున్న తీరు అందరినీ కంటతడి పెట్టిస్తోంది.

ప్రమాదంలో దుర్మరణం చెందిన 16 మంది మృతదేహాలకు కర్నూలు ప్రభుత్వ ఆసుపత్రిలో పోస్ట్‌మార్టం నిర్వహించి మృతుల స్వగ్రామం రామాపురానికి తరలించారు.

అక్కడ అధికారులు , పోలీసుల సమక్షంలో కుటుంబ సభ్యులు అంతిమ సంస్కారాలు నిర్వహించారు.

మృతులంతా ఒకే గ్రామానికి చెందిన వారు కావటం.. అంతా సమీప బంధువులే కావడంతో స్థానికంగా తీవ్ర విషాదం నెలకొంది.

అంతకుముందు మృతి చెందిన కుటుంబాలకు ఎక్స్‌గ్రేషియా చెల్లించాలని బాధిత కుటుంబ సభ్యులతోపాటు.. దళిత సంఘాల నేతలు ఆందోళనకు దిగారు.

కర్నూలులో మార్చురీ ఎదుట, రామాపురం సమీపంలోని శాంతినగరం రహదారిపై భైఠాయించారు. ఎక్స్‌గ్రేషియా ప్రకటించేవరకు మృతదేహాలను తరలించేది లేదని భీష్మించారు.

చిత్రం శీర్షిక మాకు దిక్కెవరంటూ రోదిస్తున్న మృతుల కుటుంబసభ్యులు

‘‘16 మందిని పొట్టనబెట్టుకున్న మలుపు వద్ద గతంలోనూ ప్రమాదాలు జరిగాయి. బెంగళూరు, హైదరాబాద్ మధ్య సాఫ్ట్‌వేర్ ఉద్యోగులు, వ్యాపారవర్గాల వారి రాకపోకలు ఎక్కువగా ఉండడంతో ఈ మార్గంలో ప్రైవేట్ ట్రావెల్ బస్సులు, కార్లు ఎక్కువగా తిరుగుతుంటాయి.

‘‘ట్రావెల్ బస్సులు, కార్లు అతివేగానికి అడ్డుకట్ట వేసే వ్యవస్థ లేదు. రోడ్డు భద్రతావారోత్సవాలు వంటివి పోలీసులు నిర్వహిస్తున్నా అలాంటి చర్యలు ఏమాత్రం ఫలితం ఇవ్వడం లేద’’ని పాత్రికేయుడు హెచ్.విజయభాస్కరరావు ‘బీబీసీ’తో అన్నారు.

ఇవి కూడా చదవండి:

(బీబీసీ తెలుగును ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్‌, ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)

ముఖ్యమైన కథనాలు

పశ్చిమాసియాలో అమెరికా అదనపు బలగాల మోహరింపు.. ఇవి ఇరాన్‌తో యుద్ధానికి సన్నాహాలేనా..

భారత్-పాక్ మ్యాచ్: ప్రధాని ఇమ్రాన్ వద్దన్నవన్నీ చేసిన కెప్టెన్ సర్ఫ్‌రాజ్

శాంసంగ్: స్మార్ట్ టీవీలపై వైరస్ దాడులను నివారించేందుకు ఇలా చేయడి

సానియా మీర్జా: ‘నేను పాకిస్తాన్ జట్టుకు తల్లిని కాదు’

కాళ్లు, చేతులు కట్టేసుకుని నదిలోకి దిగాడు.. మ్యాజిక్‌ చేసి బయటకు వస్తానన్నాడు. కానీ..

అగ్రకులాలపై దళిత మహిళల తిరుగుబాటు.. భూమిపై హక్కుల కోసం పంజాబ్‌లో పోరాటం

క్రికెట్ ప్రపంచకప్ 2019: బిజినెస్ ఎంతో ఊహించగలరా..

శోభనం రాత్రి బెడ్‌షీట్లు ఏం నిరూపిస్తాయి.. పురాతన వివాహ సంప్రదాయాలు నేటితరం మహిళల్ని ఎలా వెంటాడుతున్నాయి