మహేశ్ బాబు: ‘మహర్షి సినిమాతో నేను కూడా కాలర్‌ ఎత్తుకుంటున్నా’ - ప్రెస్‌రివ్యూ

  • 13 మే 2019
Image copyright Mahasrhi/fb

'అభిమానులంతా గర్వంగా కాలర్‌ ఎత్తుకునే సినిమా తీశామని ఇది వరకే చెప్పాను. ఆ మాట నిజమైంది. ఇప్పుడు నేను కూడా కాలర్‌ ఎత్తుకుంటున్నా' అని మహేష్‌బాబు అన్నారని ఈనాడు తెలిపింది.

ఆయన కథానాయకుడిగా నటించిన చిత్రం 'మహర్షి'. వంశీ పైడిపల్లి దర్శకత్వం వహించారు. అశ్వనీదత్‌, దిల్‌రాజు, పీవీపీ నిర్మాతలు. ఆదివారం హైదరాబాద్‌లో విజయోత్సవ కార్యక్రమం జరిగింది. ఈ సందర్భంగా మహేష్‌ మాట్లాడుతూ ''నా 25 సినిమాల ప్రయాణం చాలా ప్రత్యేకం. 'మహర్షి' మరింత ప్రత్యేకం. అమ్మ దగ్గరకు వెళ్లినప్పుడల్లా కాఫీ తాగుతుంటాను. అలా తాగితే దేవుడి గుళ్లో ప్రసాదం తిన్నట్టుగా ఉంటుంది. 'మహర్షి' విజయాన్ని అమ్మలందరికీ అంకితం ఇస్తున్నా. తొలి వారంలోనే నా గత చిత్రాల రికార్డుల్ని 'మహర్షి' దాటుకుని వెళ్లబోతోంది. అంతకంటే ఆనందం ఇంకేం లేద''న్నారు.

అల్లరి నరేష్‌ మాట్లాడుతూ ''ఈ పాత్రలో నన్ను ఎలా ఊహించారా? అనిపిస్తోంది. వరుసగా కామెడీ పాత్రలు చేసుకుంటూ వెళ్తున్న నాకు కొత్త అనుభూతిని ఇచ్చిన సినిమా ఇది'' అన్నారు. దర్శకుడు మాట్లాడుతూ ''ఓ మంచి సినిమా తీస్తే ప్రేక్షకులు ఎలా ఆదరిస్తారో చెప్పడానికి 'మహర్షి' ఓ ఉదాహరణ. మంచి మనసుతో ఈ సినిమా చూశారు. రైతులపై జాలి చూపించొద్దు, వాళ్లని గౌరవించమని చెప్పాం. రైతుల సమస్యలకు పరిష్కార మార్గాలు కూడా చూపించాం'' అన్నారు.

''రైతు నేపథ్యంలో కృష్ణగారు నటించిన చిత్రాలన్నీ బాగా ఆడాయి. మహేష్‌ తన 25వ సినిమాగా అలాంటి కథని ఎంచుకోవడం ఆనందంగా ఉంది. ఈ సినిమా చరిత్రని తిరగరాస్తోంద''న్నారు అశ్వనీదత్‌.

దిల్‌రాజు మాట్లాడుతూ ''ఈ కథని ముందు నుంచీ నేను, మహేష్‌, వంశీ నమ్ముతూనే ఉన్నాం. ఆ నమ్మకమే ఇప్పుడు నిజమైంది. రైతుల గురించి మహేష్‌ ఓ సినిమా చేయడం, దానికి ఈ స్థాయిలో ఆదరణ దక్కడం గర్వంగా అనిపిస్తోంద''న్నారు. దేవీశ్రీ ప్రసాద్, రాజీవ్‌ కనకాల, పృథ్వీ, పోసాని కృష్ణమురళి, శ్రీమణి, కమల్‌ కామరాజు, హరి తదితరులు పాల్గొన్నారని ఈనాడు పేర్కొంది.

Image copyright youtube/tv9

రెండోసారి విచారణకూ రవిప్రకాశ్‌ గైర్హాజరు

టీవీ9 వాటాల వ్యవహారంలో నకిలీ పత్రాల సృష్టి, సంతకం ఫోర్జరీ కేసులో ఆరోపణలు ఎదుర్కొంటున్న ఆ సంస్థ మాజీ సీఈవో రవిప్రకాశ్‌ రెండో నోటీసుకు కూడా స్పందించకపోవడంతో సైబరాబాద్‌ సైబర్‌ క్రైమ్‌ పోలీసులు తదుపరి చర్యలకు ఉపక్రమిస్తున్నారని సాక్షి తెలిపింది.

160 సీఆర్‌పీసీ కింద ఇప్పటికే రెండుసార్లు నోటీసులు జారీ చేసినా పోలీసు విచారణకు రవిప్రకాశ్‌ హాజరు కాకపోవడంతో తదుపరి చర్యల కోసం న్యాయసలహాను తీసుకుంటున్నారు. ఒకవేళ సోమవారం రవిప్రకాశ్‌ విచారణకు హాజరైతే ఓకే కానీ, లేనిపక్షంలో వారంట్‌ ద్వారా అరెస్టు చేసే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయని పోలీసు వర్గాల్లో చర్చ నడుస్తోంది.

ఈ నేపథ్యంలోనే సైబరాబాద్‌ సైబర్‌ క్రైం పోలీసులు చట్టబద్ధంగా అందుబాటులో ఉన్న ప్రతి అంశాన్ని పరిశీలిస్తున్నారు. సోమవారం తర్వాత పరిణామాలు ఏవిధంగా ఉంటాయనేది ఆసక్తికరంగా మారింది.

సీఆర్‌పీసీ 160 కింద శనివారం జారీ చేసిన నోటీసును బంజారాహిల్స్‌లోని రవిప్రకాశ్‌ ఇంటి గోడకు అంటించిన సంగతి తెలిసిందే. పోలీసుల విచారణకు ఒక్కరోజులో హాజరు కావాలంటూ ఆ నోటీసులో పేర్కొన్న ఆదివారం గచ్చిబౌలిలోని సైబరాబాద్‌ సైబర్‌ క్రైమ్‌ పోలీసు స్టేషన్‌కు రవిప్రకాశ్‌ రాలేదు.

అయితే, అలంద మీడియా సంస్థ డైరక్టర్‌ కౌశిక్‌రావు ఇచ్చిన ఫిర్యాదుపై సైబరాబాద్‌ సైబర్‌ క్రైం పోలీసులు ఏప్రిల్‌ 24, 30 తేదీల్లో రెండు ఎఫ్‌ఐఆర్‌లను నమోదు చేసిన సంగతి తెలిసిందే. ఈ రెండు ఎఫ్‌ఐఆర్‌లు నమోదైన విషయాలపై 160 సీఆర్‌పీసీ కింద రవిప్రకాశ్, సినీ నటుడు శివాజీ, మాజీ సీఎఫ్‌ఓ మూర్తికి పోలీసులు నోటీసులు జారీ చేశారు.

వీటికి మూర్తి ఒక్కరే స్పందించి గత మూడ్రోజుల నుంచి పోలీసుల ఎదుట హాజరై విచారణకు సహకరిస్తున్నారు. రవిప్రకాశ్, శివాజీలు మాత్రం ఇంత వరకు హాజరుకాలేదు.

ఫోర్జరీ కేసులో విచారణకు టీవీ9 మాజీ సీఎఫ్‌ఓ మూర్తి ఆదివారం మూడోరోజూ సైబరాబాద్‌ సైబర్‌ క్రైం పోలీసుల ఎదుట హాజరయ్యారు. అతనితో పాటు హెచ్‌ఆర్, అడ్మిన్, అకౌంట్స్‌ వ్యవహారాలు చూస్తున్న ముగ్గురు కూడా పోలీసుల ఎదుట హాజరైనట్టు తెలిసింది. వీరిచ్చిన వివరాలతో పోలీసులు ఆధారాలు సేకరిస్తున్నారు.

ఫోర్జరీ ఎవరు చేశారు.. ఎందుకు చేశారు.. ఎవరి కోసం చేశారు.. ఎలా చేశారు.. ఇలా ప్రతి ఒక్క విషయాన్ని సున్నితంగా తెలుసుకునే దిశగా విచారణ చేస్తున్నారు. సైబర్‌ క్రైం డీసీపీ రోహిణీ ప్రియదర్శిని సారథ్యంలోని సైబర్‌ క్రైమ్‌ బృందం ఈ కేసు విచారణను చేస్తోందని సాక్షి వెల్లడించింది.

Image copyright PAtnam/fb

టీఆర్‌ఎస్ ఎమ్మెల్సీ అభ్యర్థులు వీరే

స్థానిక సంస్థల కోటా శాసనమండలి స్థానాల్లో పోటీచేసే తెలంగాణ రాష్ట్ర సమితి అభ్యర్థులను పార్టీ అధ్యక్షుడు, ముఖ్యమంత్రి కే చంద్రశేఖర్‌రావు ఆదివారం ఖరారు చేశారని నమస్తే తెలంగాణ వెల్లడించింది.

వరంగల్ స్థానిక సంస్థల నియోజకవర్గం నుంచి పోచంపల్లి శ్రీనివాస్‌రెడ్డి, నల్లగొండ నుంచి తేరా చిన్నపురెడ్డి, రంగారెడ్డి నుంచి పట్నం మహేందర్‌రెడ్డిని అభ్యర్థులుగా ప్రకటించారు. ఈ మేరకు ముగ్గురు అభ్యర్థులకు పార్టీ అధ్యక్షుడు కేసీఆర్ బీఫారాలను అందజేశారు.

జిల్లాల నాయకులతో సమన్వయంతో పనిచేసి, ఎన్నికల్లో విజయం సాధించాలని వారికి సూచించారు. నాయకులను సమన్వయం చేసే బాధ్యతను మంత్రులకు అప్పగించారు. అనంతరం టీఆర్‌ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కే తారక రామా రావు ఎమ్మెల్సీ అభ్యర్థులు, మంత్రులు, ముఖ్యనాయకులతో సమావేశమయ్యారు. ఎన్నికల్లో అనుసరించాల్సిన వ్యూహంపై చర్చించారు. పార్టీ అభ్యర్థులు గెలువడానికి అవసరమైన మెజారిటీ స్పష్టంగా ఉన్నదని తెలిపారు.

స్థానిక సంస్థల ప్రజాప్రతినిధుల్లో అధికశాతం మంది టీఆర్‌ఎస్‌కు చెందినవారే ఉన్నందున ప్రతిపక్షాలు కూడా అభ్యర్థులను బరిలో దింపడానికి వెనకంజవేయవచ్చని అంచనా వేశారు. దీంతో దాదాపుగా టీఆర్‌ఎస్ అభ్యర్థులు ఏకగ్రీవంగా ఎన్నికయ్యే అవకాశం ఉన్నదని సమాచారం.

మూడు ఎమ్మెల్సీస్థానాల ఉప ఎన్నికకు సంబంధించి నామినేషన్ల గడువు మంగళవారంతో ముగియనున్నది. 17న నామినేషన్ల ఉపసంహరణకు గడువు. పోలింగ్ అనివార్యమైతే మే 31న నిర్వహించనున్నారు. జూన్ 3న ఓట్లను లెక్కిస్తారని నమస్తే తెలంగాణ పేర్కొంది.

వరి పంట Image copyright Getty Images

కనీస 'మోసపు' ధర!

రైతులు వరినాట్లు వేయలేదు...కౌలుదార్లు వ్యవసాయం చేయలేదు. కానీ, ధాన్య సేకరణ కేంద్రాలు వెలిశాయి. వారి నుంచి వేలాది క్వింటాళ్లు సేకరించాయి. ప్రభుత్వం కనీస మద్దతు ధర కింద కోట్లాది రూపాయలు ఇచ్చేసింది! ఏపీలో వెనుకబడిన శ్రీకాకుళం జిల్లాలో జరిగిన 'ఎమ్‌ఎస్‌పీ' బాగోతం ఇదీ అంటూ ఆంధ్రజ్యోతి ఒక కథనాన్ని ప్రచురింది.

రాష్ట్రవ్యాప్తంగా తనిఖీలు నిర్వహించిన విజిలెన్స్‌ అండ్‌ ఎన్‌ఫోర్స్‌మెంట్‌ అధికారులు., శ్రీకాకుళం సహా ఆరు జిల్లాల్లో గుర్తించిన లోపాలపై నివేదిక సిద్ధం చేశారు. అన్నపూర్ణగా పేరుగాంచిన ఆంధ్రప్రదేశ్‌లోని తొమ్మిది జిల్లాల్లో వరిసాగు అవుతోంది.

రైతన్నను ఆదుకోవడానికి ప్రభుత్వం కనీస మద్దతుధర (ఎంఎస్‌పీ) ఇస్తోంది. మన రాష్ట్రంలో క్వింటాళ్లు వరికి 1,770 (నాణ్యమైన రకం) రూపాయలు చెల్లించి కొనుగోలు చేస్తోంది. ఈ కొనుగోలు ప్రక్రియను పౌరసరఫరాలశాఖ ఆధ్వర్యంలో ప్రాథమిక సహకార సంఘాలు, వెలుగు బృందాలు పూర్తి చేస్తాయి.

పాతిక ఎకరాల్లోపు పొలం ఉన్న ప్రతి రైతు నుంచీ ఎలాంటి షరతులు లేకుండా అవి ధాన్యం సేకరించాలి. అయితే, ఈ సంస్థలు గడ్డిమేయడంతో.. మద్దతు అందాల్సిన రైతులు నిలువుదోపిడీకి గురవుతున్నారు. ధాన్య సేకరణ కేంద్రాలు, రైస్‌ మిల్లర్లు, పౌరసరఫరాల అధికారులు ఉమ్మడిగా సాగిస్తున్న ఈ దోపిడీపై విజిలెన్స్‌ అండ్‌ ఎన్‌ఫోర్స్‌మెంట్‌ అధికారులకు ఇటీవల ఫిర్యాదులు ఎక్కువ అయ్యాయి. దీనిపై రాష్ట్రవ్యాప్తంగా సోదాలకు దిగిన బృందాలకు విస్తుపోయే విషయాలు తెలిశాయి.

రైతులు తమ ధాన్యాన్ని సేకరణ కేంద్రాలకు తరలిస్తే కొనుగోలు కేంద్రాల్లో తేమశాతం లాంటివి తనిఖీ చేసి తీసుకుంటారు. ఆ తర్వాత 48గంటల్లోనే రైతు బ్యాంకు ఖాతాల్లోకి పౌరసరఫరాలశాఖ డబ్బులు జమ చేస్తుంది.

కానీ, మన రాష్ట్రంలో చాలాచోట్ల ధాన్య సేకరణ కేంద్రాలు లేవు. వెలుగు బృందాలకు ప్రభుత్వం ఇచ్చే కమీషన్‌ మాత్రం రైస్‌ మిల్లర్ల నుంచి చేరుతుంది. రికార్డులు నిర్వహించడానికి మాత్రం ఒక ఉద్యోగి ఉంటారు అంతే. ధాన్యం కొనుగోలు మాత్రం నేరుగా రైతు నుంచి రైస్‌ మిల్లర్‌ రూ.1,300 నుంచి రూ.1,500 మధ్యలో ధర నిర్ణయించి కొనుగోలు చేసుకెళ్తాడు. కానీ పౌరసరఫరాలశాఖ రికార్డుల్లో కనీస మద్దతు ధర రూ.1,770 చూపించి మిగతా మొత్తాన్ని అందరూ పంచేసుకుంటారు.

రైతు నుంచి ధాన్యం కొనుగోలు చేయాలంటే పట్టాదారు పాస్‌బుక్‌ వివరాలు, ఆధార్‌ నంబర్‌ను ధాన్య సేకరణ కేంద్రాల వద్ద ఉన్న ట్యాబ్‌లో నమోదు చేయాలి. ఇది పూర్తిగా ఆన్‌లైన్‌ అని పౌరసరఫరాలశాఖ చెబుతోంది. కానీ ఒకే రైతు వివరాలు వేర్వేరు కేంద్రాల్లో నమోదుచేస్తే ట్యాబ్‌ స్వీకరిస్తుండటం గమనార్హం.

ఆన్‌లైన్‌ విధానంలో ఒకసారి నమోదైన ఆధార్‌ నంబర్‌ మరోసారి ఎలా స్వీకరిస్తుందో మరి! దీనిపై ఆరా తీయగా సాఫ్ట్‌వేర్‌లో కిరికిరి బయట పడింది. ఈ సాఫ్ట్‌వేర్‌ను అనుకూలంగా మార్చుకుని అధికారులు, మిల్లర్లు కోట్ల సొమ్ము జేబులో వేసుకొన్నట్టు విచారణలో తేలిందని ఆంధ్రజ్యోతి తెలిపింది.

ఇవి కూడా చదవండి

(బీబీసీ తెలుగును ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్‌, ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)

ముఖ్యమైన కథనాలు

మిడిల్ ఈస్ట్‌లో అమెరికా అదనపు బలగాల మోహరింపు.. ఇవి ఇరాన్‌తో యుద్ధానికి సన్నాహాలేనా..

సానియా మీర్జా: ‘నేను పాకిస్తాన్ జట్టుకు తల్లిని కాదు’

కాళ్లు, చేతులు కట్టేసుకుని నదిలోకి దిగాడు.. మ్యాజిక్‌ చేసి బయటకు వస్తానన్నాడు. కానీ..

క్రికెట్ ప్రపంచకప్ 2019: బిజినెస్ ఎంతో ఊహించగలరా..

‘జగన్ నా ప్రాణం.. కేసీఆర్ కూడా ప్రాణ సమానుడే..’

ప్రపంచ కప్‌లో బంగ్లాదేశ్ సంచలనం... 321 పరుగుల లక్ష్యం 41 ఓవర్లలోనే ఉఫ్

శోభనం రాత్రి బెడ్‌షీట్లు ఏం నిరూపిస్తాయి.. పురాతన వివాహ సంప్రదాయాలు నేటితరం మహిళల్ని ఎలా వెంటాడుతున్నాయి

చైనా-హాంకాంగ్‌ వివాదం ఏంటి.. హాంకాంగ్‌‌లో భారీ స్థాయిలో నిరసనలు ఎందుకు