వీర్ సావర్కర్: కొందరికి హీరో, మరికొందరికి విలన్ ఎందుకయ్యారు?

  • 14 మే 2019
వీర సావర్కర్ Image copyright SAVARKARSMARAK.COM

అది 1906 అక్టోబర్‌. లండన్‌లో ఒక చల్లటి సాయంత్రం చిత్‌పావన్ బ్రాహ్మణుడైన వినాయక్ దామోదర్ సావర్కర్ ఇండియా హౌస్‌లో తన గదిలో రొయ్యలు వేయిస్తున్నారు.

సావర్కర్ ఆరోజు ఒక గుజరాతీ వైశ్యుడిని తన గదికి భోజనానికి పిలిచారు. ఆయన దక్షిణాఫ్రికాలో భారతీయులపై జరుగుతున్న అన్యాయాలను ప్రపంచం దృష్టికి తీసుకెళ్లాలని లండన్‌ వచ్చారు.

ఆయన పేరు మోహన్‌దాస్ కరమ్‌చంద్ గాంధీ. ఆరోజు గాంధీ సావర్కర్‌తో ఆంగ్లేయులకు వ్యతిరేకంగా తన రాజకీయం చాలా దూకుడుగా ఉంటుందని చెబుతున్నారు. సావర్కర్ ఆయనతో "సరే ముందు భోంచేయండి" అన్నారు.

ప్రఖ్యాత గ్రంథం 'ది ఆరెస్సెస్-ఐకాన్స్ ఆఫ్ ద ఇండియన్ రైట్' రచయిత నీలాంజన్ ముఖోపాధ్యాయ్ "అప్పట్లో గాంధీ మహాత్ముడు కారు. ఆయన మోహన్‌దాస్ కరమ్‌చంద్ గాంధీ మాత్రమే. అప్పటికి భారత్ ఆయన కర్మభూమి కాదు" అన్నారు.

సావర్కర్ గాంధీని ఇంటికి భోజనానికి పిలవగానే, ఆయన సావర్కర్‌తో "క్షమించండి, నేను మాంసం, చేపలు తినను" అన్నారు. అప్పుడు సావర్కర్ ఆయనతో సరదాగా "మాంసం తినని వాళ్లు అవే తినే ఆంగ్లేయుల బలాన్ని ఎలా ఎదుర్కోగలరు చెప్పు" అన్నారు. ఆ రాత్రి సత్యాగ్రహం ఆందోళనకు ఆయన మద్దతు తీసుకోకుండానే సావర్కర్ గది నుంచి గాంధీ ఖాళీ కడుపుతో బయటికి వచ్చారు".

1948లో మహాత్మా గాంధీ హత్య జరిగిన ఆరు రోజులకు గాంధీ హత్యకు కుట్ర పన్నారని వినాయక్ దామోదర్ సావర్కర్‌ను ముంబైలో అరెస్ట్ చేశారు. అయితే 1949 ఫిబ్రవరిలో ఆయన నిర్దోషిగా విడుదలయ్యారు.

Image copyright SAVARKARSMARAK.COM

ఆరెస్సెస్‌లో లేకున్నా సంఘ్ పరివార్‌ గౌరవం

ఇక్కడ చెప్పుకోవాల్సిన విషయం ఏంటంటే, ఎప్పుడూ రాష్ట్రీయ స్వయం సేవక్ సంఘ్, భారతీయ జనసంఘ్‌లో సభ్యుడు కాని వీర్ సావర్కర్ అంటే సంఘ్ పరివార్‌కు చాలా మర్యాద, గౌరవం ఉంది.

2000లో వాజ్‌పేయి ప్రభుత్వం సావర్కర్‌కు భారత అత్యున్నత పౌర పురస్కారం 'భారత రత్న' ఇవ్వాలని అప్పటి రాష్ట్రపతి కేఆర్ నారాయణన్‌కు ప్రతిపాదనలు పంపింది. కానీ, ఆయన దానిని స్వీకరించలేదు.

"2014 మే 26న నరేంద్ర మోదీ ప్రమాణ స్వీకారం చేశారు. తర్వాత రెండ్రోజులకు వీర్ సావర్కర్ 131వ జయంతి వచ్చింది. పార్లమెంటుకు వెళ్లిన ప్రధాని సావర్కర్ చిత్రపటం ముందు శ్రద్ధాంజలి అర్పించారు. సావర్కర్ చాలా వివాదాస్పద వ్యక్తి అనే విషయం మనం ఒప్పుకుని తీరాలి" అని నీలాంజన్ ముఖోపాధ్యాయ్ అంటారు.

"గాంధీ హత్యకు సంబంధించి ఆయనపై హత్య కేసు నడిచిందనేది మనం మర్చిపోకూడదు. ఆయన విడుదలయ్యారు సరే, ఆయన బతికున్నప్పుడే ఆ కేసు విచారణ కోసం కపూర్ కమిటీని వేశారు. ఆ రిపోర్టులో అనుమానాలన్నీ సావర్కర్‌పైనే ఉండేవి. అలాంటి నేతకు బహిరంగంగా అంత గౌరవం ఇవ్వడం మోదీ వైపు నుంచి ఒక పెద్ద ప్రతీకాత్మక అడుగు"

Image copyright NILANJAN MUKHOPADHYAY
చిత్రం శీర్షిక నీలాంజన్ ముఖోపాధ్యాయ్ పుస్తకం 'ద ఆరెస్సెస్-ఐకాన్స్ ఆఫ్ ద ఇండియన్ రైట్'

నాసిక్ కలెక్టర్ హత్య కేసులో అరెస్టు

ఎప్పుడూ రాజకీయ ఆలోచనలతో ఉండే సావర్కర్‌ను ఫర్గ్యూసన్ కాలేజ్ నుంచి బహిష్కరించారు. నాసిక్ కలెక్టర్‌ హత్యలో ప్రమేయం ఉందనే ఆరోపణలతో 1910లో లండన్‌లో ఆయన్ను అరెస్టు చేశారు.

సావర్కర్ గురించి ప్రత్యేక పరిశోధన చేసిన నిరంజన్ తక్లే "నాసిక్ జిల్లా కలెక్టర్ జాక్సన్‌ను హత్య చేశారనే ఆరోపణలతో మొదట 1910లో సావర్కర్ సోదరుడిని అరెస్టు చేశారు" అని చెప్పారు.

"లండన్ నుంచి తన సోదరుడికి ఒక పిస్టల్ పంపించారని, దానినే ఆ హత్యకు ఉపయోగించారని సావర్కర్‌పై ఆరోపణలు వచ్చాయి. 'ఎస్ఎస్ మౌర్య' అనే నౌకలో ఆయన్ను భారత్ తీసుకొస్తున్నారు. మధ్యలో ఆ నౌక ఫ్రాన్స్‌లోని మార్సెలీ రేవు దగ్గర ఆగినపుడు సావర్కర్ టాయిలెట్‌లోని పోర్ట్ హోల్ నుంచి సముద్రంలోకి దూకేశారు" అన్నారు నిరంజన్.

Image copyright SAVARKARSMARAK.COM

నౌకలోంచి సముద్రంలోకి దూకిన సావర్కర్

ఆ తర్వాత కథను ఆయన జీవితచరిత్ర 'బ్రేవ్‌హార్ట్ సావర్కర్' రాసిన అశుతోష్ దేశ్‌ముఖ్ చెప్పారు. "సావర్కర్ కావాలనే అప్పుడు నైట్ గౌన్ వేసుకుని ఉన్నారు. టాయిలెట్లోకి వెళ్లిన ఖైదీలను గమనించేందుకు వాటికి అద్దాలు ఉండేవి. కానీ సావర్కర్ తన నైట్ గౌన్ తీసి ఆ అద్దాలను మూసేశారు" అని తెలిపారు.

ఆయన మొదటే టాయిలెట్లో ఉన్న 'పోర్ట్ హోల్‌' కొలతలు తీసుకున్నారు. దాంతో దాన్లోంచి ఈజీగా బయటపడచ్చని ఆయనకు అర్థమైంది. తన సన్నటి శరీరాన్ని పోర్ట్ హోల్‌లోంచి దూర్చిన ఆయన సముద్రంలో దూకేశారు".

నాసిక్‌లో నేర్చుకున్న ఈత అప్పుడు ఆయనకు ఉపయోగపడింది. సావర్కర్ తీరం వైపు ఈదుకుంటూ వెళ్లారు. సెక్యూరిటీ సిబ్బంది ఆయనపై కాల్పులు జరిపినా తప్పించుకోగలిగారు".

Image copyright SAVARKARSMARAK.COM
చిత్రం శీర్షిక 1910, మార్చి 13న విక్టోరియా స్టేషన్‌లో అరెస్టు చేసిన తర్వాత తీసిన సావర్కర్ ఫొటో

అరెస్ట్ చేసిన సెక్యూరిటీ సిబ్బంది

"ఈదుతున్నప్పుడు సావర్కర్‌కు గాయమైంది. దాన్నుంచి రక్త కారుతోంది. సెక్యూరిటీ సిబ్బంది సముద్రంలోకి దూకారు. ఈదుతూ ఆయన్ను వెంబడించారు" అని దేశ్‌ముఖ్ తన పుస్తకంలో చెప్పారు.

సావర్కర్ సుమారు 15 నిమిషాలు ఈదుతూ రేవుకు చేరుకున్నారు. తర్వాత వేగంగా పరిగెత్తారు. నిమిషంలోనే ఆయన సుమారు 450 మీటర్ల దూరం పరిగెత్తారు.

ఆయనకు రెండు వైపులా ట్రామ్స్ వెళ్తున్నాయి. సావర్కర్ దాదాపు నగ్నంగా ఉన్నారు. అప్పుడే ఆయనకు ఒక పోలీస్ కనిపించాడు. అతడి దగ్గరకు వెళ్లిన సావర్కర్ "నన్ను రాజకీయ శరణార్థిగా మేజిస్ట్రేట్ దగ్గరకు తీసుకెళ్లు" అని అడిగారు. అప్పుడే ఆయన వెనక పరుగు తీస్తున్న సెక్యూరిటీ సిబ్బంది "దొంగ, దొంగ, పట్టుకోండి" అని అరిచారు. తప్పించుకోడానికి సావర్కర్ చాలా ప్రయత్నించారు. కానీ చాలా మంది కలిసి ఆయన్ను పట్టుకోగలిగారు.

Image copyright SAVARKARSMARAK.COM

అండమాన్ సెల్యులర్ జైలు, రూం నంబర్ 52

కొన్ని నిమిషాల్లోనే సావర్కర్ స్వేచ్ఛకు తెర పడింది. తర్వాత 25 ఏళ్ల వరకూ ఆయన ఏదో ఒక విధంగా ఆంగ్లేయుల ఖైదీగా ఉన్నారు.

సావర్కర్‌కు 25-25 ఏళ్ల చొప్పున రెండు వేరు వేరు తీర్పులు ఇచ్చారు. ఈ శిక్ష అనుభవిండానికి భారత్‌కు దూరంగా అండమాన్ అంటే 'కాలాపానీ'కి పంపించారు.

ఆయన్ను 698 గదులున్న సెల్యులర్ జైల్లో 13.5 అడుగుల పొడవు, 7.5 అడుగుల వెడల్పు ఉండే 52వ నంబర్ గదిలో ఉంచారు.

అక్కడ సావర్కర్ జైలు జీవితం గురించి ప్రస్తావించిన అశుతోష్ దేశ్‌ముఖ్ తన పుస్తకంలో "అండమాన్‌లో ప్రభుత్వ అధికారులు కూర్చూనే బగ్గీలను రాజకీయ ఖైదీలు లాగేవారు" అని చెప్పారు.

"అక్కడ రోడ్లు సరిగా ఉండేవి కావు. అదంతా పర్వత ప్రాంతం. ఖైదీలు బగ్గీలను లాగలేకపోయినప్పుడు వాళ్లను తిట్టేవారు, కొట్టేవారు. ఇబ్బంది పెట్టే ఖైదీలకు కొన్ని రోజుల వరకూ గంజి మాత్రమే ఇచ్చేవారు.

అంతేకాదు, వారికి బలవంతంగా క్వినైన్ తాగించేవాళ్లు. దాన్ని తాగడం వల్ల వాళ్లకు కళ్లు తిరిగేవి. కొంతమందికి వాంతులు కూడా అయ్యేవి, కొందరు ఆ బాధలన్నీ భరించేవాళ్లు.

Image copyright SAVARKARSMARAK.COM

గొలుసులు, సంకెళ్లు

ఖైదీలందరికీ టాయిలెట్ వెళ్లడానికి ఒక నియమిత సమయం ఉండేది. లోపల ఉండడానికి కూడా వాళ్లకు కొంత సమయమే ఇచ్చేవారు.

అప్పుడప్పుడు ఖైదీలు జైల్లో తమ గదుల్లోనే ఒక మూల మలమూత్రాలు విసర్జించేవాళ్లు

జైలు గది గోడలంతా మల, మూత్రాల దుర్గంధం వచ్చేది. అప్పుడప్పుడు ఖైదీల కాళ్లకు, చేతులకు సంకెళ్లు వేసి నిలబడే ఉండే శిక్ష అమలు చేసేవారు.

అప్పుడు వాళ్లు నిలబడే మలమూత్రాలకు వెళ్లాల్సివచ్చేది. వాంతి చేసుకునేటప్పుడు కూడా వారికి కూచోడానికి అనుమతి ఉండేది కాదు.

Image copyright SAVARKARSMARAK.COM

ఆంగ్లేయులకు క్షమాపణ లేఖ

జైలు నుంచి సావర్కర్ మరో జీవితం మొదలైంది. సెల్యులర్ జైల్లో ఆ గదిలో ఆయన గడిపిన 9 ఏళ్ల 10 నెలల శిక్షా కాలం ఆంగ్లేయులంటే సావర్కర్‌కు వ్యతిరేకత పెరగడానికి బదులు అంతం అయ్యేలా చేసింది.

"నేను సావర్కర్ జీవితంలోని చాలా భాగాలను చూస్తున్నా. ఆయన జీవితంలో మొదటి భాగం రొమాంటిక్ విప్లవకారుడుగా ఉన్నారు. అందులో ఆయన 1857 యుద్ధం గురించి ఒక పుస్తకం కూడా రాశారు. అందులో ఆయన లౌకికత్వం గురించి చాలా మంచి పదాలతో చెప్పారు" అని నిరంజన్ తక్లే అన్నారు.

అరెస్టయిన తర్వాత ఆయన వాస్తవాలను ఎదుర్కోవాల్సి వచ్చింది. 1911 జులై 11న సావర్కర్ అండమాన్ చేరుకున్నారు. ఆగస్టు 29న అక్కడకు చేరిన నెలన్నరలోపే ఆయన తన మొదటి క్షమాపణ లేఖ రాశారు. తర్వాత 9 ఏళ్లలో సావర్కర్ ఆరు సార్లు ఆంగ్లేయులకు క్షమాపణ లేఖ రాశారు.

జైలు రికార్డుల ప్రకారం అక్కడ ప్రతి నెలా ముగ్గురు, నలుగురు ఖైదీలకు ఉరిశిక్ష వేసేవారు. ఉరిశిక్ష వేసే ప్రాంతం ఆయను ఉన్న గదికి సరిగ్గా కింద ఉండేది. సావర్కర్‌పై దాని ప్రభావం పడుండచ్చు. కొన్ని సర్కిళ్ల ప్రకారం జైలర్ బ్యారీ సావర్కర్‌కు చాలా మినహాయింపులు ఇచ్చారు.

మరో ఖైదీ వీరేంద్ర ఘోష్ తర్వాత ఆయన గురించి రాశారు "సావర్కర్ మమ్మల్ని జైలర్‌కు వ్యతిరేకంగా ఆందోళనలు చేయాలని రహస్యంగా రెచ్చగొట్టేవారు. కానీ, మీరు కూడా మాతో రండి అని మేం ఆయన్ను అడగ్గానే, వెనకుండిపోయేవారు. సావర్కర్‌కు కష్టమైన పనులేవీ ఇచ్చేవారు కాదు" అని చెప్పారు.

Image copyright SAVARKARSMARAK.COM

హింసా మార్గం...

"15 రోజులకొకసారి అక్కడ ఖైదీల బరువు తూచేవారు. సావర్కర్ సెల్యులర్ జైలుకు వచ్చినపుడు ఆయన బరువు 51 కిలోలు. రెండున్నరేళ్ల తర్వాత ఆయన సర్ రెజినాల్డ్ క్రెడాక్‌కు తన నాలుగో క్షమాపణ లేఖ ఇచ్చినపుడు, ఆయన 57 కిలోల బరువున్నారు. అంటే ఆయన జైల్లో ఉన్నప్పుడు ఆరు కిలోలు బరువు పెరిగారు" అని నిరంజన్ తక్లే చెప్పారు.

మాపై దయ చూపాలని, భారత్‌లోని ఏవైనా వేరే జైళ్లకు పంపించాలని కొందరు ప్రభుత్వాన్ని కోరేవారు. దానికి బదులుగా ఏదో ఒక స్థాయిలో ప్రభుత్వం కోసం పనిచేయడానికి సిద్ధమయ్యేవారు.

సావర్కర్ కూడా ఆంగ్లేయులు అమలు చేసిన చర్యల వల్ల తనకు వారి రాజ్యాంగ వ్యవస్థపై విశ్వాసం ఏర్పడిందని, తను ఇప్పుడు హింసామార్గం వదిలేశానని చెప్పారు. బహుశా దానివల్లే కాలాపానీలో శిక్ష అనుభవిస్తున్న సావర్కర్‌కు 1919 మే 30,31న భార్య, తమ్ముడిని కలిసే అవకాశం ఇచ్చారు.

చిత్రం శీర్షిక సీనియర్ జర్నలిస్ట్ రామ్ బహదూర్ రాయ్‌తో బీబీసీ ప్రతినిధి రేహాన్ ఫజల్

జైలు నుంచి బయటికెళ్లే వ్యూహం

తర్వాత స్వయంగా సావర్కర్, ఆయన మద్దతుదారులు ఆంగ్లేయులను క్షమాపణ అడగడం సబబే అన్నారు. దానిని తమ వ్యూహంలో భాగంగా వర్ణించారు. దాని వల్లే ఆయనకు జైల్లో కొన్ని మినహాయింపులు లభించాయి.

సావర్కర్ కూడా తన ఆత్మకథలో "నేను జైల్లో నిరాహారదీక్షలు చేసుంటే, నాకు లేఖలు రాసే హక్కు ఉండేది కాదు" అని చెప్పారు.

నేను "భగత్ సింగ్ దగ్గర కూడా క్షమాపణ అడిగే ప్రత్యామ్నాయం ఉంది. కానీ ఆయన అలా చేయలేదు. అలాంటప్పుడు సావర్కర్‌కు అలా చేయాల్సిన అవసరమేముంది" అని సీనియర్ జర్నలిస్ట్, ఇందిరా గాంధీ సెంటర్ ఆఫ్ ఆర్ట్స్ చీఫ్ రాం బహదూర్ రాయ్‌ను అడిగాను.

సమాధానంగా ఆయన "అండర్‌గ్రౌండ్‌లో ఉండి పనిచేయడానికి ఎంత అవకాశం దొరికితే అంత మంచిదని ఆయన భావించారు. నాకు తెలిసి సావర్కర్ "తను క్షమాపణ అడిగితే జనం ఏమనుకుంటారు అని వెనకాడలేదు. జైలు బయట ఉంటే నేనేం చేయాలనుకుంటే అది చేయచ్చు అని ఆలోచించారు" అన్నారు.

చిత్రం శీర్షిక బీబీసీ స్టూడియోలో నీలాంజన్ ముఖోపాధ్యాయ్

సావర్కర్ హిందుత్వ భావనలు

అండమాన్ నుంచి తిరిగి వచ్చిన సావర్కర్ 'హిందుత్వ-హూ ఈజ్ హిందూ?' అనే పుస్తకం రాశారు. అందులో ఆయన "మొదటిసారి హిందుత్వను ఒక రాజకీయ ఆలోచనా విధానంగా ఉపయోగిస్తున్నారని" చెప్పారు.

"సావర్కర్ హిందుత్వను ఒక రాజకీయ మ్యానిఫెస్టోలా ఉపయోగించేవారు. హిందుత్వను నిర్వచిస్తూ ఈ దేశంలో మనిషి ప్రాథమికంగా హిందువే అన్నారు, ఎవరి పితృ భూమి, మాతృభూమి, పుణ్య భూమి భారతదేశమో వారే ఈ దేశ పౌరుడు అవుతారని చెప్పారు" అని నీలాంజన్ ముఖోపాధ్యాయ్ తెలిపారు.

"పితృభూమి, మాతృభూమి అందరికీ ఉంటుంది. కానీ పుణ్య భూమి హిందువులు, సిక్కులు, బౌద్ధులు, జైనులకు ఉంటుంది. ముస్లింలు, క్రైస్తవులకు ఇది పుణ్యభూమి కాదు. ఈ నిర్వచనం ప్రకారం ముస్లింలు, క్రైస్తవులు ఎప్పటికీ ఈ దేశ పౌరులు కాలేరు"

"వాళ్లు హిందువుగా మారితే అలా కావచ్చు. మీరు హిందువుగా ఉండి కూడా మీకు నచ్చిన మత విశ్వాసాలను పాటించవచ్చు అనే విషయాన్ని ఆయన ఎప్పుడూ అర్థం చేసుకోలేకపోయారు".

Image copyright SAVARKARSMARAK.COM

ఆంగ్లేయులతో ఒప్పందం

1924లో రెండు షరతులతో సావర్కర్‌ను పుణెలోని యరవాడ జైలుకు పంపించారు.

వాటిలో ఒకటి ఆయన రాజకీయ కార్యకలాపాలలో భాగం కాకూడదు. రెండోది రత్నగిరి జిల్లా కలెక్టర్ అనుమతి లేకుండా జైలు నుంచి సావర్కర్ బయటికి రాకూడదు.

"సావర్కర్ అప్పట్లో తమ ఉమ్మడి ఉద్దేశాల ప్రకారం గాంధీ, కాంగ్రెస్, ముస్లింలను వ్యతిరేకించాలని వైస్రాయ్ లిన్లిత్‌గోతో ఒక లిఖిత ఒప్పందం చేసుకున్నారు" అని నిరంజన్ తక్లే చెప్పారు.

"ఆంగ్లేయులు ఆయనకు నెలకు 60 రూపాయల పెన్షన్ ఇచ్చేవారు. ఆయన ఆంగ్లేయులకు ఏ సేవలు అందించినందుకు ఆ పెన్షన్ ఇచ్చారు? ఆ తరహా పెన్షన్ అందుకున్న ఒకే ఒక వ్యక్తి సావర్కర్."

Image copyright SAVARKARSMARAK.COM

నల్ల టోపీ, కోటు జేబులో అత్తరు సీసా

అతివాద ఆలోచనలు ఉన్నప్పటికీ వ్యక్తిగత జీవితంలో ఆయనకు చాలా అభిరుచులు ఉండేవి. చాక్లెట్లు, జింటాన్ బ్రాండ్ విస్కీ అంటే సావర్కర్‌కు ఇష్టం.

ఆయన జీవితచరిత్ర రాసిన అశుతోష్ దేశ్‌ముఖ్ "సావర్కర్ 5.2 అడుగుల ఎత్తుండేవారు. అండమాన్ జైల్లో ఉన్న తర్వాత బట్టతల వచ్చింది. ఆయనకు ముక్కుపొడి పీల్చే అలవాటుండేది. దాంతో అండమాన్ జైల్లో ముక్కుపొడికి బదులు సావర్కర్ జైలు గోడలకు ఉన్న సున్నం గీక్కుని వాసన చూసేవారు. దాంతో ఆయన ఆరోగ్యం బాగా పాడైంది" అని చెప్పారు.

ఆయన సిగరెట్, సిగార్ తాగాలని కూడా ప్రయత్నించారు. కానీ అవి ఆయనకు పడలేదు. సావర్కర్ అప్పుడప్పుడు మద్యం తాగేవారు. టిఫిన్లో రెండు ఉడకబెట్టిన గుడ్లు తింటూ, రోజుకు నాలుగు కప్పుల టీ తాగేవారు. ఆయనకు మసాలా దట్టించిన ఆహారం, ముఖ్యంగా చేపలంటే చాలా ఇష్టం.

సావర్కర్‌కు అల్ఫోన్సో మామిడిపళ్లు, ఐస్‌క్రీం, చాక్లెట్ కూడా చాలా ఇష్టం. ఆయన ఎప్పుడూ ఒకే రకమైన దుస్తులు వేసుకునేవారు. గుండ్రంగా ఉండే నల్ల టోపీ, ధోవతి లేదా ప్యాంట్, కోటు వేసుకునేవారు. ఆ కోటు జేబులో ఒక చిన్న ఆయుధం, ఒక అత్తరు సీసా ఉండేవి. ఒక చేతిలో గొడుగు, రెండో చేతిలో మడతపెట్టిన న్యూస్ పేపర్ పట్టుకునేవారు.

Image copyright KEYSTONE/GETTY IMAGES

మహాత్మా గాంధీ హత్య కేసులో అరెస్టు

1949లో గాంధీ హత్యలో ప్రమేయం ఉన్న 8 మందితో ఆయన్ను కూడా అరెస్టు చేసినపుడు సావర్కర్ ఇమేజ్‌కు గట్టి దెబ్బ తగిలింది.

అయితే, తగిన ఆధారాలు లేకపోవడంతో ఆయన్ను నిర్దోషిగా విడుదల చేశారు.

"గాంధీ హత్యతో పడిన మచ్చను తుడిపేసుకోడానికి సంఘ్ పరివార్‌కు చాలా కాలం పట్టింది. సావర్కర్ ఆ కేసులో జైలుకెళ్లారు, తర్వాత బయటికొచ్చారు. 1966 వరకూ జీవించి ఉన్నారు" అని నీలాంజన్ ముఖోపాధ్యాయ్ చెప్పారు.

"ఆరెస్సెస్ కూడా ఆయనకు దూరంగా జరిగింది. ఎందుకంటే సావర్కర్‌పై గాంధీని హత్య చేయించారనే అనుమానాలు ఎప్పుడూ ఉండేవి. కూపర్ కమిషన్ రిపోర్టులో కూడా 'సావర్కర్‌కు సమాచారం లేకుండా గాంధీ హత్య ఎలా జరిగిందో నమ్మకం కలగడం లేదని' స్పష్టంగా చెప్పారు".

Image copyright NANA GODSE
చిత్రం శీర్షిక కూర్చున్న వారు ఎడమ నుంచి నానా ఆప్టే, దామోదర్ సావర్కర్, నాథూరాం గాడ్సే, విష్ణుపంత్ గర్కరే, దిగంబర్ బడ్గే, మదన్‌లాల్, పహావా( నుల్చున్నవారు ఎడమ నుంచి ) గోపాల్ గాడ్సే, శంకర్ కిస్తయ్యా

సావర్కర్ పొలిటికల్ ఐడియాలజీ

జీవితంలో చివరి రెండు దశాబ్దాలు సావర్కర్ రాజకీయ ఏకాకిగా, అపకీర్తితో గడిపారు.

ఆయన జీవిత చరిత్ర రాసిన మరో రచయిత ధనంజయ్ కీర్ తన 'సావర్కర్ అండ్ హిజ్ టైమ్స్' పుస్తకంలో "ఎర్రకోటలో జరిగిన విచారణలో జడ్జి ఆయన్ను నిర్దోషిగా, నాథూరామ్ గాడ్సే, నారాయణ్ ఆప్టేకు ఉరిశిక్ష విధిస్తూ తీర్పు చెప్పగానే కొంతమంది నిందితులు సావర్కర్ పాదాలమీద పడ్డారు. అందరూ కలిసి హిందూ-హిందీ-హిందుస్తాన్, ఎప్పటికీ జరగదు పాకిస్తాన్ అని నినాదాలు చేశారు" అని చెప్పారు.

"నిజానికి చివరి రోజుల్లో సావర్కర్‌పై మచ్చ పడింది. దాంతో ఆయన వారసత్వంపై చీకటి మేఘాలు కమ్మేశాయి. ఒక విప్లవకారుడు మంచి కవి, రచయిత, సాహితీవేత్తగా కూడా కావడం లాంటి ఉదాహరణలు ప్రపంచంలో బహుశా చాలా తక్కువే ఉంటాయి" అంటారు రాం బహదూర్ రాయ్.

"అండమాన్ జైల్లో ఉంటున్నప్పుడు రాతి ముక్కలనే పెన్నుగా చేసుకున్న ఆయన గోడలపై 6 వేల కవితలు రాశారు. వాటిని కంఠస్థం కూడా చేశారు. అంతేకాదు, వీర్ సావర్కర్ ఐదు పుస్తకాలు కూడా రాశారు. కానీ, ఆయన పేరును మహాత్మా గాంధీ హత్యతో జోడించగానే, ఆయన కనిపించరు. సావర్కర్ రాజకీయ ఐడియాలజీ మాత్రమే కనిపిస్తుంది".

చిత్రం శీర్షిక బీబీసీ స్టూడియోలో సావర్కర్‌పై ప్రత్యేక పరిశోధన చేసిన నిరంజన్ తక్లే

'పోలరైజింగ్ ఫిగర్'

1966లో మరణించిన చాలా దశాబ్దాల తర్వాత వీర్ సావర్కర్ భారత రాజకీయాల్లో ఒక 'పోలరైజింగ్ ఫిగర్‌' అయ్యారు. ఆయన మీకు హీరో లేదా విలన్ అనిపించవచ్చు.

"2014లో పార్లమెంట్ సెంట్రల్ హాల్లో నరేంద్ర మోదీ సావర్కర్ చిత్రానికి నివాళులు అర్పించడానికి వెళ్లినపుడు ఆయన తనకు తెలీకుండానే మహాత్మాగాంధీ వైపు వీపు చూపించారు. గాంధీ చిత్రం అక్కడ సరిగ్గా ఆయన వెనక ఉంది" అని నిరంజన్ తక్లే చెప్పారు.

"ఇప్పటి రాజకీయాల వాస్తవం ఇదే. మీరు సావర్కర్‌ను గౌరవించాలంటే, గాంధీజీ ఐడియాలజీ వైపు వీపు చూపించాల్సి ఉంటుంది. లేదా గాంధీజీని అనుసరించాలనుకుంటే, సావర్కర్ ఆలోచనాధోరణిని వదులుకోవాల్సి ఉంటుంది. బహుశా సావర్కర్ భారత్‌లో ఇప్పటికీ ఒక 'పోలరైజింగ్ ఫిగర్' కావడానికి ఇదే అసలు కారణం."

ఇవి కూడా చదవండి:

(బీబీసీ తెలుగును ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్‌, ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి)