మోదీ నిజంగానే మిరాజ్ విమానాలను మేఘాలతో పాక్ రాడార్ నుంచి కాపాడారా ? :Fact Check

  • 14 మే 2019
మేఘాల మాట మోదీ Image copyright Getty Images

సందర్భం- బాలాకోట్ దాడులు

జర్నలిస్ట్(ఒక ఇంటర్వ్యూలో): జవాన్లు దాడులు చేయడానికి సిద్ధమవుతున్నప్పుడు, ఆ రాత్రి మీరు నిద్రపోగలిగారా?

ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ: రోజంతా బిజీగా ఉన్నాను. రాత్రి 9 గంటలకు రివ్యూ (ఎయిర్ స్ట్రైక్ సన్నాహాల కోసం) చేశాను. తర్వాత 12 గంటలకు రివ్యూ చేశాను. మాకొక సమస్య ఎదురైంది. ఆ సమయంలో వెదర్(వాతావరణం) హఠాత్తుగా పాడైంది. చాలా వర్షం పడుతోంది.

"నిపుణులు(దాడులకు ) తేదీని మార్చాలనుకున్నారు. కానీ నేను 'ఇన్ని మేఘాలున్నాయి, వర్షం పడుతోందిగా, అందుకే మనం రాడార్ (పాకిస్తాన్) నిఘా నుంచి తప్పించుకోవచ్చు' అన్నాను. అందరూ వెళ్లాలా, వద్దా అనే సందిగ్ధంలో ఉన్నారు. 'నేను మేఘాలున్నాయిగా వెళ్లండి' అన్నా, అంతే, బయల్దేరారు (సైనికులు).

Image copyright OFFICIALDGISPR

పిల్లలకు పరీక్షల టిప్స్ ఇచ్చిన ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ చేసిన ఈ వ్యాఖ్యలు ఫిజిక్స్ విద్యార్థులను గందరగోళంలో పడేశాయి.

మేఘాలుంటే, రాడార్ పనిచేస్తుందా, లేదా? అనేదే ఆ డైలమా.

అంటే బాలాకోట్ దాడుల సమయంలో మేఘాల వల్ల భారత సైన్యం సాంకేతిక ప్రయోజనం పొందిందని, భారత మిరాజ్ విమానం పాకిస్తాన్ రాడార్ పసిగట్టకుండా తప్పించుకుందని, లక్ష్యాలపై దాడులు చేయడంలో విజయవంతమైందని ప్రధానమంత్రి అన్నారు..

రాడార్‌కు ఎలాంటి వాతావరణంలో అయినా పనిచేసే సామర్థ్యం ఉంటుందని, సూక్ష్మ తరంగాల ద్వారా అది విమానాలను గుర్తిస్తుందని విద్యార్థులు ఇప్పటివరకూ ఫిజిక్స్ పాఠాల్లో నేర్చుకున్నారు.

సోషల్ మీడియాలో నరేంద్ర మోదీ చేసిన ఈ వ్యాఖ్యలను వేళాకోళం చేస్తున్నారు. కొందరు ఆయనకు ఫిజిక్స్ చదవాలని కూడా సూచిస్తున్నారు.

సైన్స్ విషయాల నిపుణుడు పల్లవ్ బాగ్లా కూడా ప్రధాన మంత్రి మోదీ చేసిన ఈ వ్యాఖ్యలు తప్పని అన్నారు.

ఆయన బీబీసీతో "నాకు తెలిసినంతవరకూ మేఘాల వల్ల రాడార్‌కు ఎలాంటి అడ్డంకి ఉండదు. దాని సూక్ష్మ తరంగాలు మేఘాల్లోంచి చొచ్చుకుని వెళ్తాయి, విమానాలను పసిగడతాయి. ప్రధాన మంత్రి మోదీ ఇలా అనడం సాంకేతికంగా పూర్తిగా తప్పు" అన్నారు.

మేఘాల వల్ల ఏ శాటిలైట్ లేదా ఫొటో తీసే ఉపకరణాలు పనిచేయడం ఆగిపోతాయో కూడా పల్లవ్ బాగ్లా వివరించారు.

"అంతరిక్షంలో ఆప్టికల్ శాటిలైట్(ఫొటోలు తీసే శాటిలైట్) మబ్బుల వల్ల, వెలుగు లేకపోవడం వల్ల ఫొటోలు తీయలేకపోతే, రాడార్ ఇమేజింగ్ శాటిలైట్‌ను అమరుస్తారు. దాంతో అది అంతరిక్షం నుంచి శక్తివంతమైన సూక్ష్మ తరంగాలను పంపిస్తుంది. అవి రిఫ్లెక్ట్ అయి తిరిగి వస్తాయి. దానివల్ల శాటిలైట్ తీసే ఫొటోలను మనం చూడచ్చు" అన్నారు.

అయితే ప్రధానమంత్రి తన ఇంటర్వ్యూలో బాలాకోట్ దాడుల్లో భారత విమానాన్ని పసిగట్టే భూమిపై ఉపయోగించే రాడార్ గురించి చెప్పారు.

అసలు రాడార్ అంటే ఏంటి, అది ఏం పని చేస్తుంది

ఇప్పుడు, అసలు రాడార్ ఏం పనిచేస్తుంది, అది విమానాలను ఎలా గుర్తిస్తుంది అనే ప్రశ్న కూడా వస్తుంది.

రాడార్ అంటే Radio Detection And Ranging

నేషనల్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ(ఎన్ఐటీ) పట్నా ప్రొఫెసర్ వివరాల ప్రకారం ప్రయాణిస్తున్న విమానాలు, పడవలు, మోటార్ వాహనాలు ఎంత దూరంలో ఉన్నాయి, వాటి ఎత్తు, దిశ, వేగం తెలుసుకోడానికి రాడార్‌ను ఉపయోగిస్తారు. .

అంతే కాదు, దీని సాయంతో వాతావరణంలో వచ్చే మార్పుల గురించి కూడా తెలుసుకుంటారు.

ఇది 'రిఫ్లెక్షన్ ఆఫ్ ఎలెక్ట్రోమాగ్నటిక్ వేవ్స్' ఆధారంగా పనిచేస్తుంది.

రాడార్‌లో రెండు పరికరాలు ఉంటాయి. సెండర్, రిసీవర్.

సెండర్ ఎలక్ట్రోమాగ్నటిక్ వేవ్స్ అంటే సూక్ష్మతరంగాలను టార్గెట్ అంటే లక్ష్యం వైపు పంపిస్తుంది. అవి దానిని గుద్దుకుని తిరిగి రిసీవర్ దగ్గరికి వస్తాయి.

తరంగాలను పంపించడం తిరిగి అందుకోవడం మధ్య ఎంత సమయం పట్టింది అనే ఆధారంగా విమానం దూరం, ఎత్తు, వేగం గురించి తెలుసుకుంటారు.

నగరాల్లో రహదారులపై సీసీటీవీ కెమెరాల్లాగే 'రాడాన్ గన్' కూడా ఏర్పాటు చేస్తారు. అది వాహనాల వేగం తెలుసుకుంటుంది. చాలా ప్రాంతాల్లో కార్లు నిర్ధారిత వేగాన్ని మించి దూసుకువెళ్లినపుడు ఈ 'రాడార్ గన్'(స్పీడ్ గన్) వాటిని గుర్తిస్తుంది. అప్పుడు ట్రాఫిక్ పోలీసులు ఆ వాహనాలకు చలాన్లు విధిస్తారు.

ప్రధాని వ్యాఖ్యపై విమర్శలు

శనివారం టీవీ చానల్ న్యూస్ నేషన్‌కు ఇచ్చిన ఇంటర్వ్యూలో నరేంద్ర మోదీ తనకు సైన్స్ అంత బాగా తెలీదని, మబ్బుల వల్ల దాడుల తేదీని మార్చాలని కూడా నిపుణులు తనకు సలహా ఇచ్చారని కూడా చెప్పారు.

విద్య, సైన్స్ రంగాల్లో ఉన్న వారు ప్రధానమంత్రి వ్యాఖ్యలు దేశ శాస్త్రవేత్తలను అవమానించినట్లేనని భావిస్తున్నారు. ఇది వారి సమర్థతను ఎగతాళి చేయడమేనని చెబుతున్నారు. శాస్త్రవేత్తలు ప్రధానమంత్రికి ఇలాంటి తెలివితక్కువ సలహా ఇచ్చుండరని అంటున్నారు.

బీజేపీ అధికారిక ట్విటర్‌ హ్యాండిల్లో కూడా ప్రధానమంత్రి చేసిన ఈ వ్యాఖ్యలను ట్వీట్ చేశారు. దీనిపై విమర్శలు పెరుగుతుండడంతో ఆ ట్వీట్‌ను డెలిట్ చేశారు.

Image copyright DASSAULT RAFALE

రాడార్‌ నిఘాను తప్పించుకునే విమానాలు భారత్‌కు ఉన్నాయా

బాలాకోట్ దాడుల తర్వాత భారత్ మొదట్లో ఇండియన్ ఎయిర్ ఫోర్స్ విమానాలు పాకిస్తాన్ సరిహద్దులు దాటి చాలా లోపలికి వెళ్లాయని లక్ష్యాలపై గురిపెట్టాయని చెప్పారు.

తర్వాత పాక్ పాలిత కశ్మీర్‌లోనే వైమానిక దాడులు చేశామని చెప్పారు.

భారత్ ఇలాంటి దాడులకు ఉపయోగించే సిస్టంను 'స్టాండాఫ్ వెపన్' అంటారు. ఈ సిస్టం ద్వారా దూరం నుంచే శత్రు లక్ష్యాలను ఛేదించవచ్చు.

భారత మిరాజ్‌ యుద్ధ విమానాలకు ఇలాంటి స్టాండాఫ్ వెపన్ సిస్టమే ఉంది. అందుకే ఈ విమానం మేఘాలు ఉన్నా లక్ష్యాలను గురితప్పకుండా ఛేదించగలదు.

ఇప్పుడు మీకు "మిరాజ్ విమానం మేఘాలున్నా లక్ష్యాలను ఛేదించినపుడు, భారత్ దగ్గర రాడార్ నిఘా నుంచి తప్పించుకునే యుద్ధ విమానాలు లేవా అనే ప్రశ్న రావచ్చు.

Image copyright AFP

రఫేల్‌లో ఈ టెక్నిక్ ఉందా..

దీనికి సమాధానంగా పల్లవ్ బాగ్లా "స్టెల్త్ టెక్నాలజీ((Stealth Technology) ఉన్నప్పుడు, లేదా తక్కువ ఎత్తులో ఎగరడం వల్ల మాత్రమే విమానాలు రాడార్ నిఘా నుంచి తప్పించుకోగలవు" అని చెప్పారు.

"నాకు తెలిసినంత వరకూ భారత మిరాజ్‌ విమానాలకు స్టెల్త్ టెక్నాలజీ లేదు. ఆ టెక్నాలజీ ఉన్నప్పుడు మాత్రమే మన విమానాలు రాడార్ నిఘా నుంచి తప్పించుకోగలవు".

స్టెల్త్ టెక్నాలజీ ఉన్న ప్రత్యేక విమానాలు రష్యా, అమెరికా దగ్గర మాత్రమే ఉన్నాయి. భారత్ కొనుగోలు చేస్తున్న రఫేల్ విమానాలకు కూడా ఈ టెక్నాలజీ లేదు. భారత్ దగ్గర స్టెల్త్ టెక్నాలజీ ఉన్న విమానం ఒక్కటి కూడా లేదు.

ఇవి కూడా చదవండి:

(బీబీసీ తెలుగును ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్‌, ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)

ఈ కథనం గురించి మరింత సమాచారం