కమల్ హాసన్ వ్యాఖ్యలపై చర్చ: గాడ్సే.. హంతకుడా లేక తీవ్రవాదా?

  • 14 మే 2019
కమల్ హాసన్ Image copyright ARUN SANKAR/GETTY IMAGES

కమల్ హాసన్ ఇటీవల చేసిన వ్యాఖ్యలు తీవ్ర చర్చకు దారితీశాయి.

కమల్ హాసన్ ఆదివారం తమిళనాడులోని అరవకురిచ్చిలో ఎన్నికల ప్రచారం చేస్తూ.. "నాథూరాం గాడ్సే స్వతంత్ర భారత దేశంలో తొలి తీవ్రవాది, ఆయన హిందూ" అన్నారు. కమల్ హాసన్ తమిళంలో మాట్లాడుతూ ఈ వ్యాఖ్యలు చేశారు.

ప్రజలను ఉద్దేశించి మాట్లాడిన కమల్ హాసన్, భిన్నత్వంలో ఏకత్వాన్ని విశ్వసించే వారిలో తనూ ఒకడినన్నారు.

మన జాతీయ జెండాలో మూడు రంగులూ వేరు వేరు మతాలకు ప్రాతినిధ్యం వహిస్తాయి, కానీ అన్నీ కలిసి ఉంటాయని అన్నారు. ముస్లిం మెజారిటీ ఏరియాలో ఆయన ఈ మాటలు అన్నారు.

Image copyright Makkal Needhi Maiam/twitter

"ఇక్కడ ముస్లింలు ఎక్కువ మంది ఉంటారని నేనీ మాటను చెప్పడం లేదు. ఇక్కడ గాంధీ విగ్రహం ఉందనే చెబుతున్నాను. స్వతంత్ర భారతదేశంలో తొలి తీవ్రవాది హిందూ, అతడి పేరు నాథూరాం గాడ్సే. అది అక్కడ మొదలైంది. నిజమైన భారతీయుడు సమానత్వం కోరుకుంటాడు. జాతీయ జెండాలోని మూడు రంగులూ కలిసి ఉండాలనుకుంటాడు. నేను ఒక అసలైన భారతీయుడిని, అది నేను గర్వంగా చెబుతున్నా" అన్నారు.

మే 19న ఉప ఎన్నికలు జరగనున్న నాలుగు అసెంబ్లీ స్థానాల్లో అరవకురుచ్చి ఒకటి. కమల్ హాసన్ పార్టీ 'మక్కళ్ నీది మయ్యమ్' నుంచి ఎస్.మోహన్‌రాజ్ ఇక్కడ అభ్యర్థిగా నిలిచారు.

కమల్ హాసన్ చేసిన ఈ వ్యాఖ్యపై చాలా మంది అభ్యంతరాలు వ్యక్తం చేశారు.

"ప్రియమైన కమల్ సర్, మీరు ఒక గొప్ప కళాకారుడు. కళకు ఎలా అయితే మతం ఉండదో, అలాగే తీవ్రవాదానికి కూడా ఎలాంటి మతం ఉండదు. గాడ్సే తీవ్రవాది అని మీరు అనొచ్చు, కానీ హిందూ అనాల్సిన అవసరం ఏముంది? మీరు ముస్లిం మెజారిటీ ప్రాంతంలో ఉన్నారు కాబట్టే అలా అన్నారా?" అని బాలీవుడ్ నటుడు, బీజేపీ మద్దతుదారుడు వివేక్ ఒబెరాయ్ ట్విటర్‌లో ప్రశ్నించారు.

వివేక్ తన తర్వాత ట్వీట్‌లో "సర్, ఇది ఒక చిన్న కళాకారుడు చెబుతున్న మాట. మేమంతా ఒక్కటే, ఈ దేశాన్ని విభజిస్తుంటే చూడలేం" అన్నారు.

నటి కొయినా మిత్ర కూడా కమల్ హాసన్ వ్యాఖ్యపై అభ్యంతరం వ్యక్తం చేశారు.

ఆమె తన ట్విటర్‌లో "కమల్ హాసన్ సర్, భారత మొదటి తీవ్రవాది జిన్నానే. ఆయనే ముస్లింల కోసం దేశాన్ని విభజించారు. దానివల్ల లక్షల మంది చనిపోయారు. మీరు హంతకుడికి, తీవ్రవాదికి తేడా తెలుసుకోవాలి" అన్నారు.

కమల్ వ్యాఖ్యపై సమాజ్‌వాదీ పార్టీ మాజీ నేత అమర్ సింగ్ ట్వీట్ చేశారు.

"కమల్ హాసన్‌ను ముందుకు తీసుకొచ్చింది రేఖ తండ్రి. ఆయన ఒక హిందూ. ఆయన మొదటి, చివరి భార్యలు కూడా హిందువులే. ఈ విషపూరిత వ్యాఖ్యలు ఎందుకు? గాడ్సే కచ్చితంగా హంతకుడే, కానీ ఆయన 26/11 దాడులకు పాల్పడిన తీవ్రవాది లాంటి వారు కాదు. ముస్లింలందరూ తీవ్రవాదులు కారు, కానీ దురదృష్టవశాత్తూ ఎక్కువ మంది తీవ్రవాదులు ముస్లింలే" అన్నారు.

సీపీఐఎంఎల్ నేత కవితా కృష్ణన్ మాత్రం కమల్ హాసన్‌ను సమర్థించారు.

ఆమె తన ట్వీట్‌లో "అవును, కమల్ చెప్పిన దానికి ఆధారాలున్నాయి. గాడ్సే భారత మొదటి తీవ్రవాదే. గాంధీ హత్య దేశంలో తొలి తీవ్రవాద ఘటన. మీరు ఈ మాటను ఆరెస్సెస్, బీజేపీ నేతల నోటి నుంచి ఎప్పుడూ వినుండరు. గాడ్సే, సావర్కర్ స్ఫూర్తితోనే ప్రజ్ఞా ఠాకూర్ 'అభినవ భారత్' సంస్థను ఏర్పాటు చేశారు" అన్నారు.

కమల్ హాసన్ వ్యాఖ్యకు పాకిస్తాన్ మీడియా కూడా చోటు కల్పించింది. పాక్ న్యూస్ వెబ్‌సైట్ 'ది న్యూస్' కమల్ హాసన్ అన్న మాట గురించి రాసింది. "భారతదేశంలోని ప్రముఖ నటుడు భారత మొదటి తీవ్రవాది హిందూ, అతడే గాంధీని హత్య చేశాడు" అని చెప్పినట్లు రాసింది.

కమల్ హాసన్ చేసిన వ్యాఖ్యపై బీజేపీ తమిళనాడు అధ్యక్షుడు తమిళసాయి సుందర్ రాజన్ తీవ్ర అభ్యంతరం వ్యక్తం చేశారు. "మొత్తం హిందూ సమాజాన్ని అవమానించే హక్కు కమల్ హాసన్‌కు లేదు. ఇటీవల శ్రీలంక బాంబు పేలుళ్లలో వందల మంది చనిపోవడం ఆయనకు గుర్తు రాలేదా? ఉప ఎన్నికల్లో ఓట్లు రాబట్టడానికే కమల్ ఇలా చేస్తున్నారు" అన్నారు.

ఇవి కూడా చదవండి

(బీబీసీ తెలుగును ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్‌, ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)