అమిత్ షా కోల్‌కతా రోడ్ షోలో ఘర్షణలకు బీజేపీ కార్యకర్త ముందే 'ప్రణాళిక' వేశారా?: Fact Check

  • 17 మే 2019
అమిత్ షా ర్యాలీ Image copyright Getty Images

తృణమూల్ కాంగ్రెస్ కేడర్‌తో పోరాడేందుకు కోల్‌కతాలో ఉన్న బీజేపీ కార్యకర్తలందరూ కర్రలతో సిద్ధంగా ఉండాలని ఒక బీజేపీ కార్యకర్త అంటున్నట్టు చూపించే 53 సెకన్ల వీడియో సోషల్ మీడియాలో విస్తృతంగా షేర్ అవుతోంది.

ఆల్ ఇండియా తృణమూల్ కాంగ్రెస్ సోషల్ మీడియా కన్వీనర్ దిప్తాంశు చౌదరి తన అధికారిక ట్విటర్ హాండిల్లో బుధవారం ఒక ట్వీట్ చేశారు.

"ఈశ్వర చంద్ర విగ్రహాన్ని ధ్వంసం చేయాలని బీజేపీ ముందే ప్లాన్ చేసిందా? అమిత్ షా రోడ్‌షోకు కర్రలతో రావాలని బీజేపీ బెంగాల్ క్లోజ్డ్ గ్రూపుల్లో వీడియోలు ఎందుకు సర్కులేట్ అయ్యాయి? షా తనను లక్ష్యం చేసుకున్నారని అంటూ సానుభూతి పొందాలని ప్రయత్నిస్తున్నారు. షాను ఎవరు లక్ష్యంగా చేసుకుంటారు? అబద్ధాలకోరులు" అని ఈ పోస్టులో రాశారు.

ఈ వీడియోను సోషల్ మీడియాలో కొన్ని వేల మంది చూశారు, షేర్ చేశారు.

"ఫటాఫటి (ఒక వాట్సాప్ గ్రూప్) సభ్యులకు వారి పాత్ర ఏంటో బాగా తెలుసు. రేపు రోడ్ షోలో కొన్ని సమస్యలు రావచ్చు. రేపటి రోడ్ షోకు రానివారిని ఈ గ్రూప్ నుంచి తొలగిస్తాం. రేపు వచ్చి, సమస్యలు సృష్టించాలని నేను ఫటాఫటి గ్రూప్ సభ్యులను కోరుతున్నాను. రేపటి షోకు మీ అందరికీ స్వాగతం. మీరు రేపు అమిత్ షా రోడ్ షోలో కీలక పాత్ర పోషించాల్సి ఉంటుంది. మన దగ్గర 8 అడుగుల పొడవున్న కర్రలున్నాయి. మనం టీఎంసీతో, పోలీసులతో పోరాడదాం" అని ఈ వీడియోలో ఒక వ్యక్తి చెప్పడం వినిపిస్తోంది.

మంగళవారం బీజేపీ అధ్యక్షుడు అమిత్ షా రోడ్‌షో తర్వాత ఈ వీడియో వెలుగుచూసింది.

ఈ రోడ్ షోలో హింస చెలరేగడంతో పశ్చిమ బెంగాల్‌లో పార్టీల ప్రచార గడువుకు ఎన్నికల సంఘం ఒక రోజు ముందే తెరదించింది.

ఈసీ నిర్ణయాన్ని బీజేపీ స్వాగతించింది. ముఖ్యమంత్రి మమతా బెనర్జీ పాలనలో రాష్ట్రంలో అరాచకత్వం పెరిగిపోయిందన్న తమ వాదనను ఇది ధ్రువీకరించిందని చెప్పింది.

మమత మాత్రం ఈసీ నిర్ణయం అప్రజాస్వామికం అని, బెంగాల్ ప్రజలను అవమానించిందని అన్నారు.

రెండు పార్టీల్లో హింసను మొదట ఏ పార్టీ ప్రారంభించింది, అనే విషయంపై విస్తృత చర్చ జరుగుతోంది. మంగళవారం జరిగిన హింసకు అవతలి పార్టీనే కారణమని ఆరోపిస్తూ రెండు పార్టీలూ ఎన్నో ఆధారాలు చూపిస్తున్నాయి.

"హింసకు బీజేపీ ముందే ప్రణాళికలు వేసింది" అని తనను తాను కాంగ్రెస్ మద్దతుదారుడుగా చెప్పుకుంటున్న గౌరవం పంథి తన ట్విటర్‌లో అన్నారు.

Image copyright EPA

ఈ వీడియోను ఎడిట్ చేశారా

ఈ వీడియో నిజమైనదేనని బీబీసీ ఫ్యాక్ట్ చెక్ బృందం పరిశీలనలో గుర్తించాం.

ఈ వీడియోలో కనిపిస్తున్న వ్యక్తి రాకేష్ కుమార్ సింగ్‌తో బీబీసీ మాట్లాడింది. వీడియోలో ఉన్నది నేనే అని ఆయన అంగీకరించారు.

"అమిత్ షాపై టీఎంసీ గూండాలు దాడి చేసే అవకాశం ఉందని టీఎంసీ అధికారి ఒకరు నన్ను హెచ్చరించారు. చాలా జాగ్రత్తగా ఉండాలని ఆయన నాకు చెప్పారు. పార్టీ కార్యకర్తలుగా మేం సిద్ధంగా ఉండాలి. అయినా, ఈ వీడియో మొత్తం రెండు నిమిషాలుంది. కానీ ఒక చిన్న ముక్కను మాత్రమే షేర్ చేస్తూ, తప్పుడు సమాచారం వ్యాప్తి చేస్తున్నారు" అని ఆయన చెప్పారు.

"8 అడుగుల కర్రల గురించి చేసిన వ్యాఖ్యలపై" ఆయన "నేను ఆ టీఎంసీ కార్యకర్తలను ఓడించడానికి బీజేపీ జెండాల గురించి చెప్పాను. కానీ ఆ వీడియోను కత్తిరించారు" అన్నారు.

మాకు మొత్తం వీడియో కాపీని ఇవ్వగలరా అని బీబీసీ ఆయన్ను అడిగింది. కానీ ఆ వీడియో ఆధారంగా న్యాయపరమైన చర్యలు తీసుకోవాలని భావిస్తున్న తమ సీనియర్లు ఒరిజినల్ వీడియోను ఎవరికీ ఇవ్వవద్దని చెప్పారని, దాన్ని ఇవ్వడానికి నిరాకరించారు.

ఆ వీడియోను ఎవరైనా ఎడిట్ చేశారా అనేది బీబీసీ స్వతంత్రంగా పరిశీలించలేకపోయింది.

(ఇలాంటి అనుమానాస్పద వార్తలు, ఫొటోలు, వీడియోలు లేదా సమాచారం ఏదైనా మీ దృష్టికి వస్తే, వాటి ప్రామాణికతను పరిశీలించడానికి బీబీసీ న్యూస్ వాట్సాప్ నెంబర్ +919811520111 కు పంపించండి లేదా ఇక్కడ క్లిక్ చేయండి.)

ఇవి కూడా చదవండి

(బీబీసీ తెలుగును ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్‌, ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)