చంద్రగిరి రీపోలింగ్: పోలింగ్‌కి, రీపోలింగ్‌కి ఇంత వ్యవధి ఇదే తొలిసారి

  • 16 మే 2019
పోలింగ్

ఆంధ్ర ప్రదేశ్‌లో సాధారణ ఎన్నికలు, అసెంబ్లీ ఎన్నికలు ఏప్రిల్ 11న జరిగాయి. తొలిదశలోనే తెలుగు రాష్ట్రాల్లో ఎన్నికల ప్రక్రియ ముగించారు. ఇప్పుడు చివరి దశ ఎన్నికలతో పాటుగా ఏపీలో మరోసారి పోలింగ్ జరగబోతోంది. ఈసారి చిత్తూరు జిల్లా చంద్రగిరి అసెంబ్లీ నియోజకవర్గం పరిధిలోని 5 పోలింగ్ బూత్‌లలో రీపోలింగ్ నిర్వహించాలని ఈసీ నిర్ణయం తీసుకోవడం చర్చనీయాంశంగా మారింది.

ఏపీలోని 5 అసెంబ్లీ నియోజకవర్గాల పరిధిలో మే 6న రీపోలింగ్ జరిగింది. నెల్లూరు జిల్లా కోవూరు, సూళ్లూరుపేట, ప్రకాశం జిల్లా ఎర్రగొండపాలెం, గుంటూరు వెస్ట్, నరసరావుపేట నియోజకవర్గాల్లోని 5 పోలింగ్ కేంద్రాల్లో జరిగిన రీపోలింగ్ ప్రశాంతంగా ముగిసింది. ఇప్పుడు మళ్లీ 13 రోజుల తర్వాత మరో నియోజకవర్గ పరిధిలోని 5 పోలింగ్ స్టేషన్లలో రీపోలింగ్ ఏర్పాట్లు ఇప్పుడు రాజకీయంగా ఆసక్తిని రాజేస్తున్నాయి.

Image copyright Getty Images

పోలింగ్‌కి, రీపోలింగ్‌కి ఇంత వ్యవధి ఇదే తొలిసారి

సాధారణంగా ఎన్నికల ప్రక్రియలో సమస్యలు తలెత్తిన సందర్భాల్లో రీపోలింగ్ జరుగుతుంది. అది కూడా ఎన్నికలు జరిగిన కొద్ది రోజుల్లోనే ఉంటుంది. కానీ ఈసారి అనూహ్యంగా పోలింగ్ జరిగిన 38 రోజులకు రీ పోలింగ్ జరుగుతుండటం విశేషం. ఆంధ్ర ప్రదేశ్ రాజకీయాల్లో ఎన్నడూ ఇలా జరిగిన దాఖలాలు లేవని రాజకీయ పరిశీలకుడు అచ్యుత్ దేశాయ్ బీబీసీకి తెలిపారు.

"గతంలో చివరి రెండు దశల్లో ఏపీ, తెలంగాణ ఎన్నికలు ఉండేవి. రీపోలింగ్ అవసరం అయిన చోట్ల ఒకటి, రెండు రోజుల వ్యవధిలో జరిగిపోయేది. కానీ ఈసారి ఏకంగా పోలింగ్‌కు ఫలితాలకు 42 రోజుల వ్యవధి వచ్చింది. దాంతో ఈసీ అనేక అంశాలు పరిశీలించే అవకాశం దక్కింది. రీపోలింగ్ విషయంలో సీసీ కెమెరా ఫుటేజ్ కూడా అందుబాటులోకి రావడంతో వాటిని కూడా సంపూర్ణంగా పరిశీలించిన తర్వాత ఈసీకి నిర్ణయం తీసుకునే అధికారం ఉంది. పోలింగ్‌కి, రీపోలింగ్‌కి ఇంత వ్యవధి ఉండడం తొలిసారి" అని దేశాయ్ అభిప్రాయపడ్డారు.

Image copyright TDP.OFFICIAL/FACEBOOK

మా ఫిర్యాదులు పట్టించుకోరా?

ఈసీ నిర్ణయాన్ని తెలుగుదేశం పార్టీ తప్పుబడుతోంది.

ఆంధ్ర ప్రదేశ్ టీడీపీ అధ్యక్షుడు కిమిడి కళా వెంకట్రావు బీబీసీతో మాట్లాడుతూ "ఈసీ తీరు సరిగా లేదు అనడానికి ఈ రీపోలింగ్ ఓ ఉదాహరణ. నిబంధనల ప్రకారం టీడీపీ ఫిర్యాదులు చేసింది. చంద్రగిరి నియోజకవర్గంలో 166, 310 నంబర్లు గల పోలింగ్ బూత్‌లలో జరిగిన అక్రమాలను టీడీపీ అభ్యర్థి పులివర్తి నాని ఈసీ దృష్టికి తీసుకెళ్లారు. ఆధారాలు సమర్పించారు. అయినా మా ఫిర్యాదులు పట్టించుకోలేదు. వైసీపీ ఆరోపణల ఆధారంగా నిర్ణయం తీసుకున్నారు. ఫిర్యాదులు అన్నింటినీ పరిగణనలోకి తీసుకోకుండా ఏకపక్షంగా వ్యవహరించడం తగదు. ఈ విషయాన్ని ఏపీ అదనపు ఎన్నికల ప్రధాన అధికారి దృష్టికి రాతపూర్వకంగా తీసుకెళ్లాం" అని అన్నారు.

Image copyright YSRCP/Facebook

32 ఏళ్లుగా ఓటు హక్కు వినియోగించుకోనివ్వడం లేదు

చంద్రగిరి నియోజకవర్గంలోని కొన్ని గ్రామాల్లో మూడు దశాబ్దాలుగా ఎస్సీలను ఓట్లు వేయనివ్వడం లేదని వైసీపీ అభ్యర్థి చెవిరెడ్డి భాస్కరరెడ్డి ఆరోపించారు.

"నియోజకవర్గ పరిధిలోని 7 పోలింగ్ బూత్‌లలో ఎన్నికల సందర్భంగా రిగ్గింగ్ జరిగింది. పోలింగ్ జరిగిన ఏప్రిల్ 11 నాడే జిల్లా కలెక్టర్‌కి, ఎన్నికల కమిషన్‌కి ఫిర్యాదు చేశా. అయినా స్పందించకపోవడంతో పలు రూపాల్లో పోరాటం చేశా. హైకోర్టుకి కూడా వెళ్ళా. సీసీ ఫుటేజ్ పరిశీలించి రీపోలింగ్‌కి చర్యలు తీసుకోవాలని కోరాను. గత ఎన్నికల్లో కూడా కొన్ని బూత్‌లలో ఏకపక్షంగా ఓటింగ్ జరిగింది. దాంతో ముందు నుంచి అధికారులను అప్రమత్తం చేస్తూనే ఉన్నాం. 5 బూత్‌లలో కాకుండా 7 చోట్ల రీపోలింగ్ జరపాలని డిమాండ్ చేస్తున్నా" అన్నారు.

అంతా నిబంధనల ప్రకారమే చేస్తున్నామంటున్న ఈసీ

ఈసీ మాత్రం నిబంధనల ప్రకారం వ్యవహరిస్తున్నట్టు చెబుతోంది.

"అన్ని అంశాలు పరిశీలించిన తర్వాత చంద్రగిరి నియోజకవర్గ పరిధిలోని వెంకటరామ పురం, కొత్త కండ్రిగ, పులవర్తివారి పల్లి, కమ్మపల్లి, ఎన్ఆర్ కమ్మపల్లి పోలింగ్ బూత్‌లలో రీపోలింగ్ ఏర్పాట్లు చేస్తున్నాం. 19వ తేదీ ఉదయం 7 గంటల నుంచి పటిష్ట బందోబస్తు మధ్య పోలింగ్ నిర్వహిస్తాము. 17వ తేదీ సాయంత్రం తర్వాత ఎటువంటి ప్రచారం, ఇతర వ్యవహారాలకు అవకాశం లేదు. పోలింగ్ ప్రశాంతంగా నిర్వహించేందుకు అందరూ సహకరించాలి" అని అదనపు ఎన్నికల ప్రధానాధికారి సుజాత శర్మ కోరారు.

ఇవి కూడా చదవండి:

(బీబీసీ తెలుగును ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్‌, ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)