ఆంధ్రప్రదేశ్: ఏజెన్సీల్లో తాగునీటి కొరత.. చెలమలో నీళ్ల కోసం కిలోమీటర్ల దూరం నడుస్తున్న గిరిజన మహిళలు

  • 17 మే 2019
గిరిజనులు

మన్యంలో భూగర్భజలాలు అడుగంటడంతో దప్పిక తీర్చే నీటి చుక్క కోసం గిరిజన పల్లెలు అల్లాడిపోతున్నాయి.

ఈ పల్లెల్లోని గిరిజన మహిళలు రెండు బిందెల మట్టి నిండిన నీళ్ల కోసం అన్ని పనులూ మానుకుని కిలోమీటర్లు దూరం వెళ్తున్నారు.

ఇప్పుడే కాదు, ప్రతీ వేసవిలో వీళ్లను నీటి కష్టాలు వెంటాడుతాయి. మురికి నీళ్లే తాగి రోగాల బారిన పడేలా చేస్తాయి.

ఉత్తరాంధ్రలో పాడేరు, సీతంపేట, పార్వతీపురం ఐటిడిఎల పరిధిలో మొత్తం 39 మండలాలు 7 వేలకు పైగా గ్రామాలు ఉన్నాయి. వీటిలో దాదాపు అన్ని గ్రామాల్లో నీటి సమస్య ఉంది.

ఎక్కువ గ్రామాల్లో తాగు నీరు అందక గిరిజనులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. బిందె నీళ్ల కోసం కిలోమీటర్ల దూరం నడుస్తున్నారు.

బోర్లు పనిచేయకపోవడం, బావులు పాడుబడడంతో ఇక్కడి గిరిజనులు ఊట చెలమల్లో నీటిని, చివరకు పంటలకు పెట్టే నీటినే తాగి దప్పిక తీర్చుకుంటున్నారు.

మీ పరికరంలో మీడియా ప్లేబ్యాక్ సదుపాయం లేదు.
Media captionవీడియో: నీటి చుక్క కోసం అల్లాడుతున్న మన్యం

అడుగంటిన భూగర్భ జలాలు

భూగర్భజల శాఖ అధికారిక లెక్కలు కూడా ఈ మూడు ఐటీడీఏల పరిదిలో భూగర్భ జలమట్టం తగ్గిపోయిందని చెబుతున్నాయి.

2018 మేలో 5.5 మీటర్లున్న నీటిమట్టం ఈసారి 6.2 మీటర్లకు పడిపోయింది. విశాఖ ఏజన్సీలోని గిరిజన గ్రామం పెదబయలులో భూగర్భ జలాలు 8.5 మీటర్ల నుంచి 10 మీటర్ల లోతుకు చేరాయి.

అరకులో కూడా ఇవి ఒక మీటరు వరకూ పడిపోయాయి. అటు విజయనగరం గిరిజన ప్రాంతాల్లో కూడా ఇదే పరిస్థితి. కురుపాం, ఎస్ కోట మండలం బొడ్డవరల్లో దాదాపు రెండు మీటర్ల వరకూ భూగర్భ జలాలు పడిపోయాయి.

ఇక వర్షపాతం కూడా అంతంతమాత్రంగానే ఉంది. శ్రీకాకుళంలో సాధారణ వర్షపాతం ఉంటే, విశాఖ, విజయనగరం జిల్లాల్లో తక్కువ వర్షపాతం నమోదైంది.

ఇటీవల వరుసగా పెథాయ్, తిత్లి, ఫొనీ లాంటి వరుస తుపాన్లు వచ్చినా భూగర్భ జలమట్టంలో ఎలాంటి మార్పులూ రాలేదు.

విశాఖపట్నం జిల్లా డుంబ్రిగూడ మండలం కొర్రాయి పంచాయితీలోని బురుడివలస, నిమ్మగడ్డ, లోగిలి గ్రామాలలో బీబీసీ పర్యటించింది. అక్కడ నీటి కోసం కిలోమీటర్లు నడిచివెళ్లే గిరిజన మహిళలను పలకరించింది.

నీటికోసం నడక

వారిలో గుడ్డి శాంతి అనే మహిళ "నీటి కోసం రెండు కిలోమీటర్లు నడవాలి. రోజులో ఎక్కువ సమయం నీటిని వెతుక్కోవడంలోనే సరిపోతుంది. ఇంక వేరే పనులు చేసుకోవడానికి ఉండడం లేదు. పిల్లలను స్కూలుకు కూడా తీసుకెళ్లలేని పరిస్థితి" అంది.

రాణి "రోజూ నీటి కోసం మూడు కిలోమీటర్లు నడుస్తున్నాం. ఊర్లో బోర్లు ఉన్నా పనిచెయ్యడం లేదు. ఆఫీసర్లకు చెప్పినా లాభం లేకుండా పోయింది" అన్నారు.

150 మంది ఉన్న బుడ్డివలసలో తాగునీటి కోసం కొట్టుకునే పరిస్థితి వస్తోందని మహిళలు చెప్పడం ఇక్కడ తాగునీటి సమస్య తీవ్రతను చెబుతోంది.

"ఎండైనా, వర్షం ఉన్నా ఈ బురద నీళ్లే తాగుతాం. దాంతో జ్వరాలు వస్తున్నాయి. కానీ వేరే దారిలేదు. ఆఖరికి ఈ నీళ్లు తాగి జ్వరాలు వచ్చినవాళ్లకు సాయం కూడా చేయలేని పరిస్థితిలో ఉన్నాం" అని రాణి చెప్పారు.

అసలేంటి సమస్య?

ఏజన్సీ ప్రాంతాల్లో వాతావరణం భిన్నంగా ఉంటుంది. మైదానాల్లో ఉన్నట్టు కుళాయిలు, చెరువుల నుంచి పైపులైన్లు వేయడం చాలా కష్టం.

కానీ ఇక్కడ తాగునీటి సౌకర్యం కల్పించడం అంత కష్టం కూడా కాదని స్థానికులు చెబుతున్నారు.

"ఊటగడ్డల నీటి కోసం చెక్ డ్యాంలు నిర్మించి, బోర్లు, కుళాయిలు బాగు చేయిస్తే తక్కువ నిధులతోనే ఈ సమస్య తీర్చవచ్చు" అని గిరిజన సంఘం నాయకుడు నరేంద్ర బీబీసీకి చెప్పారు.

"2014 ఎన్నికల్లో మా ప్రభుత్వం అధికారంలోకి వస్తే ఇంటింటికి 20 లీటర్ల మంచినీళ్లు ఇస్తామని తెలుగుదేశం వాళ్లు హామీ కూడా ఇచ్చారు. ఇంటింటికి కుళాయిలు వేస్తామన్నారు. కానీ అది ఎక్కడా జరగలేదు,. కనీసం ఆర్వో ప్లాంట్లు ఏర్పాటు చేసినా మా దప్పిక తీరుతుంది" అన్నారు.

ప్రభుత్వం ఏం చేస్తోంది?

ప్రస్తుతం ఏజెన్సీలో రాష్ట్ర ప్రభుత్వం క్రాష్ ప్రోగ్రాం నిర్వహిస్తోంది. ఇందులో భాగంగా మార్చి 15 నుంచి ఏప్రిల్ 15 వరకు గ్రామాల్లో ఉన్న హ్యాండ్ పంపులు, నీటి పథకాలను గుర్తించి మరమ్మతులు చేయిస్తున్నారు.

ఒక్క అరకు పరిధిలో ఇప్పటి వరకూ 82 పంపులను బాగుచేశామని వాటర్ వర్క్స్ ఇంజినీర్లు చెప్పారు.

"వాటర్ గ్రిడ్ పధకం ఫేజ్- 1 పనులు కూడా ఇప్పటికే ప్రారంభించారు. దీనికి సంబంధించి సర్వే కూడా పూర్తయింది. త్వరలో వాటర్ గ్రిడ్ ఫేజ్-2లో నీటిని అందిచే ప్రయత్నం చేస్తున్నాం. త్వరలో అన్ని గ్రామాలకు నీళ్లు అందిస్తాం" అని జూనియర్ ఇంజినీర్ శ్రవణ్ చెప్పారు.

వ్యాపిస్తున్న రోగాలు

ప్రభుత్వం ఒకవైపు పనులు జరుగుతున్నాయని చెబుతుంటే, మరోవైపు కలుషిత నీటిని తాగడంతో మన్యంలో రోగాలు వ్యాపిస్తున్నాయి.

కలుషిత నీటిని తాగడం వల్ల అమీబియాసిస్, విష జ్వరాలు, డయేరియా వస్తున్నాయని ప్రభుత్వ వైద్యులు చెబుతున్నారు.

ఇక నీటి కోసం ఎక్కువ సార్లు తిరగకుండా నిల్వ చేసుకుందామని అనుకుంటే మరో సమస్య ఎదురవుతోంది. నీటి నిల్వ వల్ల దోమలు చేరి మలేరియా వ్యాప్తిస్తోంది. దీంతో నీటిని కాచి చల్లార్చి తాగాలంటూ ప్రభుత్వ వైద్యులు ప్రచారం చేస్తున్నారు.

"ఈ నీళ్లు తాగడం వల్ల జ్వరాలు, డయేరియా కేసులు ఎక్కువ వస్తున్నాయి. అందుకే మేం అవగాహనా కార్యక్రమాలు చేపడుతున్నాం" అని అరకు ఏరియా హాస్పిటల్ డాక్టర్ బానుప్రియ చెప్పారు.

తవ్వకాలతోనే సమస్య

ఏజన్సీ ప్రాంతంలో ఎక్కువగా జరిగే తవ్వకాలు, పోడు వ్యవసాయం వల్లే మన్యంలో భూగర్భ జలాలు తగ్గుతున్నాయని పర్యావరణవేత్తలు అభిప్రాయపడుతున్నారు.

"మైనింగ్ వల్ల కొండలు మాయం అవుతున్నాయి దాంతో ఎక్కడా నీళ్లు నిలబడడం లేదు. ఇటు గిరిజనులు పోడు వ్యవసాయం కోసం చెట్లు ఎక్కువగా కొట్టేస్తున్నారు. పచ్చదనం లేకపోవడం వల్ల కూడా భూగర్భ జలాలు అడుగంటుతున్నాయి. చెట్లకు నీటిని పట్టి ఉంచే గుణం ఉంటుంది. అవి లేక చెలమలు ఎండిపోతున్నాయి" అని వెత్త రత్నం చెప్పారు.

"గతంలో పోడు వ్యవసాయం చేసే గిరిజనులు ఒక చెట్టు కొట్టేస్తే ఇంకో మొక్కను నాటేవారు. ఇప్పుడు అలా చేయడం లేదు. దాంతో ఇలాంటి పరిణామాలు ఎదురవుతున్నాయి. తవ్వకాలు ఆపేయడంతోపాటు మొక్కలు ఎక్కువగా నాటడం వల్ల భూగర్భ జలాలు పెంచచ్చు" అన్నారు.

‘60 శాతం గ్రామాలకు తాగునీరు అందించాం. ఇంకా 40 శాతం గ్రామాలకు అందించాలి’

ఈ కథనంపై ఎస్సీ, ఎస్టీ కమిషన్ సభ్యుడు, తెలుగుదేశం పార్టీ నాయకుడు సివేరి అబ్రహం స్పందిస్తూ.. రూ.100 కోట్లతో ఏజన్సీ ప్రాంతాల్లో తాగునీటి ప్రాజెక్టులను రూపొందించాం. ఇప్పటికే పలు ప్రాంతాల్లో ట్యాంకులు నిర్మించాం. అయితే, భౌగోళికంగా ఏజన్సీలో భిన్నమైన వాతావరణం ఉండటంతో బోర్లు పడటం లేదు. అయినా, పడినచోట బోర్లకు సోలార్ సదుపాయం ఏర్పాటు చేశాం. 60 శాతం గ్రామాలకు తాగునీరు అందించాం. ఇంకా 40 శాతం గ్రామాలకు అందించాలి. వాటర్ గ్రిడ్ మొదటి దశ ఇప్పుడు నడుస్తోంది. మూడో దశ నాటికల్లా అన్ని గ్రామాలకూ తాగునీరు అందిస్తాం’’ అని తెలిపారు.

ఇవి కూడా చదవండి:

(బీబీసీ తెలుగును ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్‌, ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)