సోనాగచ్చి మహిళా సెక్స్ వర్కర్లు: ‘ఈసారి మా ఓటు నోటాకే.. ఎందుకంటే..’

  • 17 మే 2019
సోనాగచ్చి మహిళా సెక్స్ వర్కర్లు

బెంగాల్‌లో ఎన్నికల ప్రచార పర్వం తార స్థాయికి చేరుకుంది. ఈ హోరులో హింసాత్మక ఘటనల నడుమ ఎన్నో గొంతుకలు వినిపించకుండా పోతున్నాయి. అయితే, ఒక చిన్న సముదాయానికి చెందిన మహిళలు మాత్రం తమ ఆత్మ గౌరవం కోసం పోరాడుతున్నారు. వాళ్లే బెంగాల్‌లోని సెక్స్ వర్కర్లు. ఈ ఎన్నికల్లో తామంతా నోటా మీట నొక్కుతామంటున్నారు. అందుకు కారణాలేంటి? తెలుసుకునే ప్రయత్నం చేశారు బీబీసీ ప్రతినిధి మయూరేష్ కొన్నూర్.

దేశంలోనే అతి పెద్ద రెడ్ లైట్ ఏరియాల్లో కోల్‌కతాలోని సోనాగచ్చి ప్రాంతం ఒకటి.

అయితే ఇంత రాజకీయ వేడిలోనూ సోనాగచ్చి పేరు వినిపిస్తోందంటే అందుకు మరో కారణం ఉంది.

దాదాపు 18 వేల మంది వరకు ఉండే మహిళా సెక్స్ వర్కర్లు, ఈసారి ఏ ఒక్క అభ్యర్ధికీ ఓటు వేయబోమని, మూకుమ్మడిగా నోటా బటన్ నొక్కుతామని అంటున్నారు.

మీ పరికరంలో మీడియా ప్లేబ్యాక్ సదుపాయం లేదు.
Media captionవీడియో: ‘ఈసారి మా ఓటు నోటాకే.. ఎందుకంటే..’

కేవలం కోల్‌కతా నుంచే కాదు, పశ్చిమ బెంగాల్ రాష్ట్రవ్యాప్తంగా ఉన్న సెక్స్ వర్కర్లంతా వీరితో కలుస్తున్నారు.

''మేము రోజూ పనిచేసే కూలీలం. ఇంటి పనులు చేసుకునే మహిళలను కూలీలుగా గుర్తించినపుడు, మమ్మల్ని ఎందుకు గుర్తించరు? ఓట్లు అడగటానికి వచ్చే వాళ్లందరూ భారీ హామీలను గుప్పిస్తారు. కానీ, ఇప్పటివరకూ చేసిందేమీ లేదు. అందుకే ఈసారి మేము నోటాను ఎంచుకోబోతున్నాం'' అని 'ఉష మహిళ' సహకార సంఘం కార్యదర్శి రీటా రాయ్ చెప్పారు.

వీళ్లకు శాశ్వత చిరునామా లేని కారణంగా 2004 వరకు వోటు వేయలేకపోయారు. తర్వాత తమ సహకార సంఘంలో తమ ఇళ్ల చిరునామాలను నమోదు చేయించుకుని ఓటరు జాబితాలో పేరు చేర్చించుకున్నారు.

అలా నమోదు చేసుకున్న ఓటర్లు దాదాపు 18 వేల మంది ఉన్నారు. బెంగాల్ మొత్తంగా వారి కుటుంబ సభ్యులతో కలిపి చూస్తే వారి సంఖ్య నాలుగున్నర లక్షల మంది ఉంటారు.

సెక్స్ వర్కర్ల డిమాండ్లు ఏంటి?

సెక్స్ వర్క్ అధారంగా ఉండే పనులను నేర జాబితా నుంచి తొలగించాలన్నది వాళ్ల డిమాండ్.

అలానే, కార్మిక శాఖ తమను కార్మికులుగా గుర్తించాలని, ప్రత్యేక స్వయం నియంత్రిత యంత్రాంగాన్ని రాజ్యాంగ బద్దంగా ఏర్పాటు చేసి మహిళల అక్రమ రవాణాను అరికట్టాలని కోరుతున్నారు.

కొన్నేళ్లుగా చేస్తున్న వీరి డిమాండ్లను ఏ ఒక్క రాజకీయ పార్టీ కూడా వినిపించుకోలేదు.

''మేము ప్రతి ఎన్నికల్లో ఓటు వేస్తున్నాం. గతంలో ఎదో ఒక పార్టీకి మా ఓట్లు పడేవి. కానీ మా డిమాండ్లను ఏ ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్లినా, వారు పార్లమెంటు ముందు పెడతారు. దాంతో మా హక్కులు మాకు లభిస్తాయి అనుకునే వాళ్లం. కానీ ఇప్పటివరకు అలా జరగలేదు'' అని కుతుల్ సింగ్ చెప్పారు.

నోటాకు ఓటేసి ఏం సాధిస్తారు?

అయితే, వీరంతా నోటా మీట నొక్కడం వలన రాజకీయ పార్టీలపై ఏదైనా ప్రభావం ఉంటుందా?

''నాయకులకు ఇదొక రకమైన తలనొప్పే కదా. ఇంత భారీ సంఖ్యలో ఓట్లను కోల్పోతే ఖచ్చితంగా వాళ్లకు ఇబ్బందే'' అని దర్బార్ సెంట్రల్ కమిటీ ప్రెసిడెంట్ కుతుల్ హల్దర్ అభిప్రాయపడ్డారు.

‘‘ దేశవ్యాప్తంగా చూస్తే వారి సంఖ్య రెండున్నర కోట్ల వరకు ఉంది. అయితే, వారి మధ్య సమన్వయం, వారిని ఒక్కతాటిపైకి తీసుకొచ్చే ప్రయత్నాలు అంత బలంగా జరగడం లేదు. ఆల్ ఇండియా నెట్ వర్క్ ఆఫ్ సెక్స్ వర్కర్స్ సంస్థ దాదాపు 30 లక్షల మంది సెక్స్ వర్కర్లకు ప్రతినిధిగా ఉన్నారు. కానీ, కలిసి ఒక్కతాటిపైకి వచ్చే వారి సంఖ్య తక్కువే’’ అని దర్బార్ మహిళా సంఘం ముఖ్య సలహాదారు సమ్రజిత్ జన అంటున్నారు.

ప్రస్తుతం బెంగాల్లో వీరి సంఖ్య రాజకీయ పార్టీలను అంతగా ప్రభావితం చేయలేకపోవచ్చు. కానీ, జాతీయ స్థాయిలో ఒక్కటైతే ఆ తీవ్రత ఖచ్చితంగా తెలుస్తుంది.

ఇవి కూడా చదవండి

(బీబీసీ తెలుగును ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్‌, ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)

ఈ కథనం గురించి మరింత సమాచారం