కేంద్రంలో ఎవరి ప్రభుత్వం వచ్చినా.. ఈ సమస్య ఎదుర్కోవాల్సిందే

  • 17 మే 2019
మోదీ, రాహుల్ Image copyright Getty Images

మరికొన్ని రోజుల్లో సార్వత్రిక ఎన్నికల సమరం ముగియనుంది. వచ్చే అయిదేళ్లు దేశాన్ని పాలించేది ఎవరో తేలిపోనుంది. అయితే, ఎవరు అధికారంలోకి వచ్చినా దేశ ఆర్థిక వృద్ధికి సంబంధించి సమస్యలు ఎదుర్కోవాల్సిందేనన్న ఆందోళనలు వ్యక్తమవుతున్నాయి.

ప్రపంచంలోనే అత్యంత వేగంగా అభివృద్ధి చెందుతున్న భారత్... ఆర్థిక మందగమనం దిశగా అడుగులు వేస్తున్నట్లుగా కనిపిస్తోంది. అందుకు అనేక సంకేతాలు ఉన్నాయి.

2018 జూన్‌తో ముగిసిన త్రైమాసికంలో 8.2 శాతంగా ఉన్న దేశ ఆర్థిక వృద్ధి రేటు, క్రమంగా తగ్గుతూ... సెప్టెంబర్‌ నాటికి 7.1 శాతం, డిసెంబర్‌‌తో ముగిసిన త్రైమాసికంలో 6.6 శాతానికి దిగజారింది.

కార్లు, ఎస్‌యూవీల అమ్మకాలు ఏడేళ్ల కనిష్ఠానికి పడిపోయాయి. ట్రాక్టర్లు, ద్విచక్ర వాహనాల అమ్మకాలు కూడా తగ్గిపోయాయి.

అంతకు ముందు ఏడాదితో పోల్చితే 334 కంపెనీల (బ్యాంకులు, ఆర్థిక సంస్థలు మినహాయించి) నికర లాభాలు 18 శాతం తగ్గాయి.

Image copyright AFP

అంతేకాదు, ప్రపంచంలోనే అత్యంత వేగంగా అభివృద్ధి చెందుతున్న భారత విమానయాన రంగంలో కూడా మార్చిలో మందగమనం కనిపిస్తోంది. మార్చిలో ప్రయాణికుల సంఖ్యలో పెరుగుదల గడిచిన ఆరేళ్లతో పోలిస్తే అత్యల్పంగా నమోదైంది. బ్యాంకు రుణాలు ఆశించిన స్థాయిలో లేవు.

ప్రముఖ ఎఫ్‌ఎంసీజీ ఉత్పత్తుల తయారీ సంస్థ హిందుస్థాన్‌ యూనీలీవర్‌ మార్చితో ముగిసిన త్రైమాసికంలో 7 శాతం వృద్ధి రేటు మాత్రమే సాధించింది. గడిచిన 18 మాసాల్లో ఇదే అత్యల్పం.

పట్టణ, గ్రామీణం అన్న తేడా లేకుండా అంతటా వినియోగం తగ్గుతోంది.

Image copyright Reuters

దిగుబడులు ఆశాజనకంగా రాకపోవడంతో రైతులకు ఆదాయం పడిపోయింది. ఐఎల్‌ అండ్‌ ఎఫ్‌ఎస్‌ సంస్థ రుణ సంక్షోభం ప్రభావంతో పలు సంస్థలు నష్టాలు చవిచూశాయి.

ప్రస్తుత "ఆర్థిక మందగమనం చాలా తీవ్రమైనది" అని ప్రపంచ బ్యాంకు మాజీ ప్రధాన ఆర్థికవేత్త, కార్నెల్ విశ్వవిద్యాలయం ప్రొఫెసర్ కౌశిక్ బసు అన్నారు. దీనిని ఏమాత్రం నిర్లక్ష్యం చేయకూడదని, ప్రభుత్వం తక్షణమే చర్యలు చేపట్టాల్సిన అవసరం ఉంటుందని ఆయన అభిప్రాయపడ్డారు.

ఈ పరిస్థితి రావడానికి 2016లో తీసుకున్న పెద్ద నోట్ల రద్దు నిర్ణయం కూడా ఒక కారణమని ఆయన చెప్పారు. పాత 500, 1000 నోట్లను రద్దు చేయడంతో కొన్ని నెలలపాటు దేశవ్యాప్తంగా ప్రజలు నగదు కోసం తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొన్నారు.

Image copyright AFP

నిరాశపరిచిన మరో అంశం ఎగుమతులు. గడచిన అయిదేళ్ల కాలంలో ఎగుమతుల్లో వృద్ధి రేటు దాదాపు సున్నాకు చేరువైందని ప్రొఫెసర్ బసు చెప్పారు.

వినియోగదారుల మధ్య అంతరం వేగంగా పెరిగిపోతోందని ప్రధాన మంత్రి ఆర్థిక సలహా మండలి సభ్యుడు, ఆర్థిక నిపుణుడు రతిన్ రాయ్ లాంటి వారు అంటున్నారు.

"ఆర్థికంగా ఎగువస్థాయిలో ఉన్న 10 కోట్ల మంది వల్లే భారతదేశం వేగంగా వృద్ధిచెందింది. కార్లు, ద్విచక్ర వాహనాలు, ఏసీలు లాంటివి ఎక్కువగా వినియోగించేది వారే. అయితే, ఇన్నాళ్లూ దేశీయంగా అందుబాటులో ఉన్న వస్తువులను కొనుగోలు చేసిన వారు, ఇప్పుడు విదేశాల నుంచి దిగుమతి చేసుకునే విలాసవంతమైన వస్తువులపై ఆసక్తి చూపిస్తున్నారు. విదేశీ యాత్రలకు ఖర్చు చేస్తున్నారు" అని రతిన్ రాయ్ వివరించారు.

ఆర్థికంగా దిగువన ఉన్నవారి కొనుగోలు శక్తిని పెంచడంపై ప్రభుత్వం దృష్టి సారించాల్సిన అవసరం ఉందని, తద్వారా ఆర్థిక వృద్ధిని ముందుకు తీసుకెళ్లే అవకాశం ఉంటుందని నిపుణులు చెబుతున్నారు.

Image copyright Getty Images

దేశంలో అత్యధిక మందికి కావాల్సింది పోషకాహారం, అందుబాటు ధరల్లో దుస్తులు, నివాసం, ఆరోగ్యం, విద్య. దేశ ఆర్థిక స్థితిని సూచించే ప్రధాన అంశాలు ఇవే.

"ఆర్థికంగా వెనుకబడి ఉన్న ప్రజల జీవన ప్రమాణాలు సబ్సిడీలు, నగదు ప్రోత్సాహకాల ద్వారా కొంతమేరకు మెరుగుపడేందుకు అవకాశం ఉంటుంది. కానీ, ఆ పథకాలు వారి కొనుగోలు శక్తిని భారీగా పెంచలేవు. కొనుగోలు శక్తి పెరగాలంటే వారికి సంపాదన ఉండాలి. అంటే వారికి ఉపాధి అవకాశాలు కల్పించాలి. వచ్చే పదేళ్ల కాలంలో ఇది జరగకపోతే పోటీ ప్రపంచంలో భారత్ వెనుకబడిపోయి, "మధ్య ఆదాయ ఆర్థిక వ్యవస్థగా"గా ఉండిపోయే పరిస్థితి రావొచ్చు" అని ఆర్థిక వేత్త ఆర్డో హాన్సన్ అభిప్రాయపడ్డారు.

దేశం ఆ పరిస్థితిలోకి వెళ్తే ధనికులు మరింత ధనికులుగా మారతారు, నిరుపేదలు అలాగే ఉండిపోయే ప్రమాదం ఉంటుంది. కాబట్టి, వచ్చే దశాబ్ద కాలం భారత్ అత్యంత వ్యూహాత్మకంగా ముందుకెళ్లాల్సిన సమయమని విశ్లేషకులు అంటున్నారు.

ఇవి కూడా చదవండి

(బీబీసీ తెలుగును ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్‌, ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)