నరేంద్రమోదీ: 'మళ్లీ పూర్తి మెజారిటీతో అధికారంలోకి వస్తాం'

  • 17 మే 2019
నరేంద్రమోదీ Image copyright MONEY SHARMA/AFP/Getty Images

మోదీ తన ఐదేళ్ల పదవీ కాలంలో మొట్టమొదటి సారిగా.. ప్రస్తుత ఎన్నికల్లో చివరి దశ ఓటింగ్‌కు ఇక రెండు రోజులే మిగిలి ఉండగా.. శుక్రవారం విలేకరుల సమావేశంలో మాట్లాడారు. దిల్లీలోని బీజేపీ కార్యాలయంలో నిర్వహించిన ఈ సమావేశంలో పార్టీ అధ్యక్షుడు అమిత్ షా కూడా పాల్గొన్నారు.

అయితే తమ ప్రశ్నలకు మోదీ సమాధానం ఇవ్వకపోవటంతో విలేకరులు నిరుత్సాహానికి లోనయ్యారు. ఆయన తమ ప్రభుత్వం సాధించిన విజయాల గురించి మాట్లాడారు.

భారతదేశం ప్రపంచంలో అతిపెద్ద ప్రజాస్వామ్యం అంటూ.. దీని శక్తిని ప్రపంచానికి చాటాల్సిన బాధ్యత ప్రతి ఒక్కరికీ ఉందని చెప్పారు. ''మన ప్రజాస్వామ్యంలో ఎంత భిన్నత్వం ఉందో ప్రపంచానికి చూపాల్సిన అవసరం ఉంది'' అని పేర్కొన్నారు.

అమిత్ షా పక్కన కూర్చున్న మోదీ.. తాను విలేకరుల ప్రశ్నలకు సమాధానం ఇవ్వనని.. ఎందుకంటే ఈ సమావేశం అమిత్ షాదని చెప్పారు.

Image copyright MONEY SHARMA/AFP/Getty Images

‘‘ఆమెను ఎన్నటికీ క్షమించలేను’’

అంతకుముందు.. మహాత్మా గాంధీని అవమానించిన వారిని తాను ''ఎన్నటికీ క్షమించలేను'' అని మోదీ పేర్కొన్నారు. బీజేపీ అభ్యర్థి ప్రజ్ఞా ఠాకూర్.. మహాత్మా గాంధీని హత్యచేసిన నాథూరాం గాడ్సేను ''దేశభక్తుడు'' అని అభివర్ణించిన నేపథ్యంలో మోదీ పై విధంగా ప్రకటన చేశారు. బీజేపీ నాయకులు సహా పలువురి నుంచి విమర్శలు రావటంతో ప్రజ్ఞా ఠాకూర్ క్షమాపణలు చెప్పారు.

''అటువంటి ప్రకటనలను ఖండించాలి. అటువంటి వ్యాఖ్యలకు సమాజంలో స్థానం లేదు. ఆమె (ప్రజ్ఞా ఠాకూర్) క్షమాపణ చెప్పి ఉండొచ్చు. కానీ నేను ఆమెను ఎన్నడూ క్షమించలేను'' అని ప్రధాని న్యూస్24 టీవీ చానల్ ఇంటర్వ్యూలో పేర్కొన్నారు.

నరేంద్రమోదీ ప్రధానమంత్రి హోదాలో భారతదేశంలో ఉండగా ఒక విలేకరుల సమావేశంలో పాల్గొనటం ఇదే మొదటిసారి. ఆయన ఇతర దేశాల్లో అధికారిక పర్యటనలకు వెళ్లినపుడు అక్కడ విలేకరుల సమావేశాల్లో పాల్గొన్నారు. అందులోనూ అధికారిక ప్రకటనలు చదవటమే ఎక్కువగా ఉండేది.

భారత మీడియాకు కొన్ని ముఖాముఖి ఇంటర్వ్యూలు ఇచ్చారు. కానీ ఆ మీడియా సంస్థల మీద కఠిన నియంత్రణ ఉందని, మోదీ పట్ల సానుభూతిగా ఉన్న వారికే ఇంటర్వ్యూలు ఇచ్చేవారని విమర్శలూ ఉన్నాయి. అయితే.. ఇటీవల.. తనను విమర్శించే వాటితో సహా పలు ప్రముఖ ప్రచురణ సంస్థలు, టెలివిజన్ చానళ్లకు మోదీ వరుస ఇంటర్వ్యూలు ఇచ్చారు.

అయితే.. ఈసారి ఆయన మీడియా విధానం మారుతుందని ఆశించిన వారు నిరాశకు గురయ్యారు. దీంతో కొందరు విలేకరులు ట్విటర్‌లో నిస్పృహ వ్యక్తం చేశారు.

2014 మే 17న ఘోరమైన దెబ్బపడింది: మోదీ

విలేకరుల సమావేశంలో ప్రధానమంత్రి మోదీ మాట్లాడుతూ.. ప్రస్తుత లోక్‌సభ ఎన్నికలు 'అద్భుత'మని అభివర్ణించారు. తాము మళ్లీ అధికారంలోకి వస్తామని ధీమా వ్యక్తంచేశారు.

''2014 మే 16న ఎన్నికల ఫలితాలు వచ్చాయి. 2014 మే 17న ఘోరమైన దెబ్బపడింది. నేడు మే 17. కాంగ్రెస్ గెలుస్తుందని 'సత్తా బజార్'లో పందెం కాసే వారు మే 17న భారీ నష్టాలు చవిచూశారు'' అని మోదీ వ్యాఖ్యానించారు.

''గత రెండు ఎన్నికల్లో ఐపీఎల్‌ను కూడా నిర్వహించలేకపోయారు. ప్రభుత్వం బలంగా ఉన్నపుడు ఐపీఎల్, రంజాన్, స్కూల్ పరీక్షలు, అన్నీ శాంతియుతంగా సాగుతాయి'' అని ప్రధాని పేర్కొన్నారు.

''మా పార్టీ పూర్తి మెజారిటీతో మళ్లీ అధికారంలోకి వస్తుందని నా అభిప్రాయం. ఈ దేశంలో సుదీర్ఘ కాలం తర్వాత ఇలా జరుగుతుంది'' అని ఆయన పేర్కొన్నారు.

''ప్రజల నుంచి నాకు లభించిన మద్దతు నన్ను సంతోషంతో ముంచెత్తుతోంది. వారి ప్రేమకు, మద్దతుకు ప్రజలకు నేను కృతజ్ఞతలు చెప్తున్నా'' అని మోదీ పేర్కొన్నారు.

Image copyright Getty Images

మేం 300 కన్నా ఎక్కువ సీట్లు గెలుస్తాం: అమిత్ షా

అంతకుముందు అమిత్ షా మాట్లాడుతూ.. తమ పార్టీ రెండో విడత కూడా ప్రభుత్వాన్ని నడుపుతుందని ఉద్ఘాటించారు. ''మాకు 300 సీట్ల కన్నా ఎక్కువ వస్తాయి. మంచి ఫలితాలు లభిస్తాయన్న విశ్వాసం మాకుంది'' అని చెప్పారు.

''మేం జనవరి 16వ తేదీ నుంచే ఎన్నికల ప్రచారం ప్రారంభించాం. మేం గత ఎన్నికల్లో గెలవలేకపోయిన 120 లోక్‌సభ స్థానాలను గెలుచుకోవాలన్నది మా లక్ష్యం. మాకు మంచి ఫలితాలు వస్తాయన్న ధీమా ఉంది'' అని షా పేర్కొన్నారు.

పశ్చిమ బెంగాల్‌లో గత ఏడాదిన్నరలో 80 మంది బీజేపీ కార్యకర్తలు హత్యకు గురయ్యారని.. దీని గురించి మమతా బెనర్జీ ఏమంటారని షా ప్రశ్నించారు. ''దీనికి మేం బాధ్యులమైనట్లయితే.. ఇతర ప్రాంతాల్లో ఎందుకు హింస జరగలేదు'' అని వ్యాఖ్యానించారు.

''ప్రజ్ఞా ఠాకూర్ అభ్యర్థిత్వం.. బూటకపు 'భాగ్వా' తీవ్రవాదం పేరుదో బూటకపు కేసు మీద 'సత్యాగ్రహం'. సంఝౌతా ఎక్స్‌ప్రెస్' కేసులో తొలుత లష్కరే తోయిబాతో సంబంధం ఉన్న వారిని అరెస్ట్ చేశారు. 'భాగ్వా ఉగ్రవాదం' పేరుతో బూటకపు కేసు తయారు చేసి నిందితులను విడుదల చేశారు'' అని అమిత్ షా ఒక ప్రశ్నకు సమాధానంగా పేర్కొన్నారు.

నాథూరాం గాడ్సేకు సంబంధించి ప్రజ్ఞా ఠాకూర్ చేసిన ప్రకటన విషయంలో ''పార్టీ ఆమెకు షోకాజ్ నోటీస్ ఇచ్చింది. పది రోజుల్లో సమాధానం ఇవ్వాలని అడిగింది. ఆమె సమాధానం ఇచ్చాక పార్టీ క్రమశిక్షణ కమిటీ తగిన చర్యలు చేపడుతుంది'' అని చెప్పారు.

''ఈశాన్యంలో మాకు మంచి ఫలితాలు వస్తాయి, పశ్చిమబెంగాల్‌లో ఇంకా మంచి ఫలితాలు వస్తాయి. ఒడిశాలోనూ మంచి ఫలితాలు వస్తాయి. దక్షిణాదిలో మా సీట్ల సంఖ్య మెరుగవుతుంది. మహారాష్ట్రలో కూడా మేం మెరుగుపడతాం'' అని ఆయన చెప్పారు.

ఇవి కూడా చదవండి.

(బీబీసీ తెలుగును ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్‌, ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)