సూటిపోటి మాటలను భరిస్తూనే అనుకున్నది సాధించిన యూపీ యువతి

  • 20 మే 2019
ఇల్మా అఫ్రోజ్
చిత్రం శీర్షిక ఇల్మా అఫ్రోజ్

ఆమె 14 ఏళ్ల వయసులోనే తండ్రిని కోల్పోయారు. ఆడపిల్లకు పెళ్ళి చేసి పంపించకుండా, చదువు చెప్పించి నెత్తికెక్కించుకుంటారా అంటూ సమాజం చేసే మాటల గాయాలను తట్టుకుని నిలబడ్డారు. తల్లి అండతో అనుకున్నది సాధించారు. ఐపీఎస్ కావాలన్న కలను నిజం చేసుకున్నారు.

మొరాదాబాద్ జిల్లా కుందరికీ గ్రామంలో పుట్టిన ఇల్మా అఫ్రోజ్ కథ ప్రతి ఒక్కరికీ స్ఫూర్తి కలిగిస్తుంది.

బాల్యం నుంచీ ఎన్నో ఇబ్బందులు ఎదుర్కున్న ఇల్మా తనకు పదేళ్లప్పుడు తండ్రికి క్యాన్సర్ వచ్చిందని, ఆ తర్వాత చనిపోయారని, తల్లే తనను కష్టపడి చదివించారని చెబుతారు.

చదువుకుంటున్న సమయంలో చుట్టుపక్కల వారు, బంధువులు చాలా మంది తల్లితో "అమ్మాయికి పెళ్లి చేసి పంపించెయ్, ఎప్పటికైనా పరాయి సొత్తే కదా. ఇంత చదివి ఏం చేయాలి" అనేవారని ఇల్మా బీబీసీతో చెప్పారు.

"ఇప్పుడు వాళ్లే మా ఇంటికి తమ పిల్లల్ని తీసుకొస్తున్నారు. వీళ్లను కూడా మీలాగే ఐపీఎస్ చేయండి అని మమ్మల్ని అడుగుతున్నారు" అంటారు అఫ్రోజ్.

కూతురు బాగా చదివి ఏదో సాధిస్తుందని ఆశపడ్డ ఆ తల్లి ఆశలు వమ్ము కాలేదు. స్కాలర్‌షిప్ ద్వారా దిల్లీ, ప్యారిస్, ఆక్స్‌ఫర్డ్ యూనివర్సిటీల్లో చదువు పూర్తి చేసిన ఇల్మా, ఇండోనేసియాలో ఐక్యరాజ్యసమితి కోసం కూడా పనిచేశారు.

మీ పరికరంలో మీడియా ప్లేబ్యాక్ సదుపాయం లేదు.
Media captionఇల్మా కథ ప్రతి ఒక్కరికీ స్ఫూర్తిదాయకం

తండ్రి లేని అమ్మాయికి త్వరగా పెళ్లి చేసి అత్తింటికి పంపించేయాలని బంధువులు తొందరపడతారని ఇల్మా చెప్పారు.

"మా దగ్గర ఏ ఆడపిల్లకైనా తండ్రి లేకపోతే, ఆమె కుటుంబంలో వాళ్లు, బంధువులు, ఇరుగు-పొరుగు వారు కొద్ది కొద్దిగా డబ్బు వేసుకుని కట్నంగా ఇస్తారు. ఒకరు సైకిల్ తెచ్చిస్తే, ఇంకొకరు ఇంకొకటి తెచ్చిస్తారు. ఆడపిల్లని ఒక జత బట్టల్లో చుట్టి వాళ్లకు ఇచ్చేస్తారు" అని చెప్పారు.

సమాజం బయట ఉండి లోపాలు వెతిక్కుండా తల్లి తనకు కష్టపడి పని చేయడం నేర్పించిదని చెబుతారు ఇల్మా. ఉన్నత చదువులు చదివిన ఇల్మా. కానీ ఆమె మనసులో దేశం కోసం ఏమైనా చేయాలనే కోరిక అలాగే ఉండిపోయింది.

దాంతో భారత్ వచ్చిన తర్వాత యూపీఎస్సీ పరీక్షలు రాసిన ఇల్మా ఐపీఎస్ అయ్యారు. సమాజంలో బలహీనులకు అండగా నిలవాలనే అది ఎంచుకున్నానని చెప్పారు.

"అంటే, మీరేదైనా దిక్కుతోచని స్థితిలో ఉన్నారనుకోండి, మీకు ఒక బలహీనుడి గురించి ఆలోచన రావాలి. ఒక చీకటి గ్రామంలో, దుర్భర పరిస్థితుల్లో ఉన్న, ఒక బలహీనుడిని తలుచుకోవాలి. మీ జీవితంలో మీరు తీసుకున్న ఏదైనా నిర్ణయం, మీరు చేసిన ఏదైనా పని అతడి కన్నీళ్లు తుడవగలిగిందా అని చూడాలి. అంటే, జీవితాన్ని నేను ఆ దృష్టితోనే చూస్తుంటాను" అని చెప్పారు.

అబ్బాయి అయినా, అమ్మాయి అయినా దేశంలో అందరికీ సమాన అవకాశాలు లభించాలని ఇల్మా భావిస్తున్నారు.

"భారత రాజ్యాంగంలో, చట్టంలో ప్రతి పౌరుడికీ కల్పించిన సమాన హక్కులు, న్యాయం, స్వేచ్చ, సమానత్వం అందరికీ లభించేలా నేను పనిచేయాలనుకుంటున్నాను. నా తుది శ్వాస వరకూ దేశాభివృద్ధి కోసం పనిచేస్తానని నాకు పూర్తి నమ్మకం ఉంది అంటారు ఇల్మా.

ఇవి కూడా చదవండి:

(బీబీసీ తెలుగును ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్‌, ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)

ముఖ్యమైన కథనాలు