గుప్త నిధుల వేటలో ‘మూత్రం తాగి ప్రాణాలు దక్కించుకున్నా’: ప్రెస్‌ రివ్యూ

  • 19 మే 2019
Image copyright Ramesh/fb
చిత్రం శీర్షిక వెలిగొండ అటవీ ప్రాంతం

గుప్తనిధుల వేట నరకప్రాయంగా మారింది. ప్రాణాలు దక్కుతాయన్న ఆశ ఆవిరవుతూ వచ్చింది. ఆఖరికి మూత్రాన్ని తాగుతూ ఎడతెగని నడకతో బయటపడ్డానని ప్రత్యక్ష సాక్షి వెల్లడించారని ఈనాడు తెలిపింది.

ఆంధ్రప్రదేశ్‌‌లోని గుంటూరు జిల్లాకు చెందిన హనుమంత్‌ నాయక్‌, కృష్ణ నాయక్‌తోపాటు హైదరాబాద్‌కు చెందిన శివకుమార్‌లు గత ఆదివారం ప్రకాశం జిల్లాలోని వెలుగొండ అటవీప్రాంతంలో గుప్తనిధుల వేటకు వెళ్లారు.

అందులో శివకుమార్‌, హనుమంత్‌ నాయక్‌ మృత్యువాతపడిన సంగతి తెలిసిందే. ప్రాణాలతో బయటపడిన కృష్ణనాయక్‌ శనివారం 'న్యూస్‌టుడే'తో తాను ఎదుర్కొన్న అనుభవాలను వివరించారు.

'రుద్రాక్షల కోసం వెళ్తున్నామంటూ బాబాయి హనుమంత్‌ నాయక్‌, బ్యాంకు ఉద్యోగి శివకుమార్‌లు నన్ను మభ్యపెట్టారు. గత ఆదివారం అటవీ ప్రాంతానికి బయలుదేరాం. దారి మధ్యలో వారు గుప్తనిధుల కోసం ఆరాతీస్తుండడంతో అసలు విషయం తెలిసింది. కెమెరాతో పురాతన విగ్రహాలు, కట్టడాలు ఉండే ప్రాంతాల ఫొటోలు తీసుకుని గుప్త నిధులుండే ప్రదేశాన్ని కచ్చితంగా గుర్తించేందుకు ప్రణాళిక రూపొందించాం.

దారిలో స్వామీజీలతో నిర్ధరించుకున్నాక వెనుదిరుగుదామని భావించాం. కేవలం 15 మజ్జిగ ప్యాకెట్లు, ఒక నీళ్ల సీసా మాత్రమే మా వెంట ఉన్నాయి. వెలుగొండ అటవీ ప్రాంతంలో పెద్ద లోయలు దాటుకుంటూ చాలాదూరం వెళ్లాం. తీవ్ర దాహంతో వెంట తీసుళ్లిన మజ్జిగ, నీళ్లు అయిపోయాయి.

అప్పటికే మిట్ట మధ్యాహ్నం కావడంతో గొంతు ఎండిపోయి నీరసం ఆవహించింది. అడుగు తీసి అడుగు వేయడం గగనమైంది. వెనుదిరిగి వెళ్లిపోదామని నిర్ణయించుకున్నాం. ముగ్గురం తిరుగు ప్రయాణమయ్యాం.

తీక్షణ ఎండ కారణంగా జనావాస ప్రాంతానికి చేరడం కష్టమని, కనీసం ఒక్కరైనా చేరుకోగలిగితే మిగిలిన ఇద్దరిని రక్షించే వీలుంటుందని బాబాయి హనుమంత్‌ నాయక్‌ నన్ను తొందరగా వెళ్లమన్నాడు. నేను వేగంగా నడిచా.. శివకుమార్‌, హనుమంత్‌ నాయక్‌లు వెనకబడిపోయారు.

గొంతెండిపోతుండడంతో గత్యంతరం లేక ఆదివారం సాయంత్రం ఒకమారు నా మూత్రాన్నే మంచినీళ్ల మాదిరిగా తాగా. అటవీప్రాంతంలోనే నిద్రించి సోమవారం తెల్లవారుజామున మళ్లీ నడక ప్రారంభించా.

దారిలో నాలుగుసార్లు మూత్రం తాగుతూనే ముందుకు అడుగులేశా. మధ్యాహ్నం అటవీప్రాంతానికి ఆనుకుని రోడ్డు పక్కనే స్పృహ తప్పి పడిపోయా. అక్కడే ఉన్న వేంకటేశ్వరస్వామి ఆలయ పూజారి వచ్చి ముఖంపై నీళ్లు చల్లి కొంత ప్రసాదం ఇవ్వడంతో ప్రాణాలు దక్కాయి' అని పోలీసు కస్టడీలో ఉన్న కృష్ణనాయక్‌ చెప్పారని ఈనాడు పేర్కొంది.

Image copyright AP fibernet/fb
చిత్రం శీర్షిక ఫైబర్ నెట్

ఏపీలో పడకేసిన ఫైబర్‌ నెట్‌

ఆంధ్రప్రదేశ్‌లో ఫైబర్‌ నెట్‌ పడకేసింది. ఎన్నికలకు ముందు ప్రజలకు ఏపీ ఫైబర్‌ నెట్‌ కనెక్షన్లను ప్రభుత్వం అంటగట్టింది. ఇపుడు దానికి కావాల్సిన మెటీరియల్‌ సరఫరాను నిలిపివేసింది. దీంతో కొత్త కనెక్షన్లు ఇవ్వడం సాధ్యం కావడంలేదని ఆపరేటర్లు చెబుతున్నారని సాక్షి ఒక కథనాన్ని ప్రచురించింది.

ఫైబర్‌ నెట్‌ కనెక్షన్‌ ఇవ్వాలంటే ఆప్టికల్‌ లైన్‌ టెర్మినల్‌ (ఓఎల్టీ) బాక్స్‌లు, పాన్‌ బాక్స్‌లు అవసరం. ఒక ఓఎల్టీకి ఎనిమిది పాన్‌లు ఉంటాయి. ఒక్కొక్క పాన్‌ నుంచి 125 కనెక్షన్లు ఇవ్వవచ్చు. అంటే ఒక ఓఎల్టీ ఉంటే సుమారు వెయ్యి కనెక్షన్లు ఇచ్చే అవకాశం ఉంటుంది.

రూ.2.5 లక్షలు చెల్లిస్తే ప్రభుత్వమే ఓఎల్టీ, పాన్‌ బాక్స్‌లు సరఫరా చేస్తుంది. వీటి కోసం ఆపరేటర్లు డబ్బులు చెల్లించినా అధికారులు బాక్స్‌లు ఇవ్వడం లేదు. గత మూడు నెలలుగా ఓఎల్టీ బాక్స్‌ల సరఫరాను ప్రభుత్వం ఆపివేసింది.

ఫైబర్‌ నెట్‌ నిధుల్ని పసుపు-కుంకుమ కోసం వినియోగించడంతో నిధులు లేక వాటిని కొనుగోలు చేయడం లేదని సమాచారం.

గ్రామీణ ప్రాంతాల్లో రూ.125, నగరాల్లో రూ.235 చెల్లిస్తే ఫైబర్‌ నెట్‌ ద్వారా కనెక్షన్‌ ఇస్తున్నారు. వీటి ద్వారా వినియోగదారుడు టీవీ, ఇంటర్‌ నెట్‌ సదుపాయం పొందొచ్చు.

ఇవి కల్పించాలంటే ఓఎల్టీ, పాన్‌ బాక్స్‌లు కావాలి. ముడుపులు ఇవ్వందే అధికారులు వాటిని ఇవ్వడం లేదు. ఒక్కో ఓఎల్టీ, పాన్‌ బాక్స్‌లకు రూ.50 వేల వరకు లంచాలు డిమాండ్‌ చేస్తున్నట్లు సమాచారం. దీంతో ఆపరేటర్లు అవసరమైన బాక్సులను సమకూర్చలేకపోతున్నారని సాక్షి వెల్లడించింది.

Image copyright Rohit sharma/fb

విరామం తీసుకుని.. ఉత్సాహంగా రండి!

ప్రపంచకప్‌ నేపథ్యంలో.. ఆస్ట్రేలియా తమ ఆటగాళ్లలో స్ఫూర్తి నింపడం కోసం వారిని యుద్ధ భూమికి తీసుకెళ్లిందని ఈనాడు తెలిపింది.

అలాగే, ఇంగ్లాండ్‌, పాకిస్థాన్‌, వెస్టిండీస్‌, బంగ్లాదేశ్‌ తీరిక లేకుండా క్రికెట్‌ ఆడుతున్నాయి.. ఇక దక్షిణాఫ్రికా, న్యూజిలాండ్‌ జట్లు ప్రత్యేక శిక్షణ శిబిరాలు ఏర్పాటు చేశాయి. మరి టీమ్‌ఇండియా ఏం చేస్తోంది. ఇప్పటికే క్రికెట్‌ డోసు ఎక్కువైందని భావించిన బీసీసీఐ.. ప్రత్యేకంగా ఏం చేయక్కర్లేదు విశ్రాంతి తీసుకోండని ఆటగాళ్లకు సూచించింది.

కుటుంబ సభ్యులతో సరదాగా గడిపి ఉత్సాహంగా ప్రపంచకప్‌ సమరానికి సిద్ధం కావాలని కీలక ఆటగాళ్లను కోరింది. ప్రస్తుతం రోహిత్‌ శర్మ తన కుటుంబంతో మాల్దీవులకు వెళ్లగా.. కెప్టెన్‌ కోహ్లి ప్రేగ్‌లో విహరిస్తున్నాడు.

స్పిన్నర్‌ యజువేంద్ర చాహల్‌ గోవాలో వినోదం పొందుతున్నాడు. నిజానికి ప్రపంచకప్‌ కోసం బయల్దేరి వెళ్లే ముందు శిక్షణ శిబిరం నిర్వహించాలని బోర్డు భావించిందట. ఐతే కోచింగ్‌ బృందం సూచన మేరకు ఆటగాళ్లకు విశ్రాంతి ఇవ్వాలని నిర్ణయానికి వచ్చింది.

ప్రపంచకప్‌కు ఎంపికైన ఆటగాళ్లందరూ మే 21 ముంబయిలో కలుసుకోనున్నారు. భారత జట్టు మే 22న ప్రపంచకప్‌ వేటకు లండన్‌ బయల్దేరి వెళ్తుందని ఈనాడు వెల్లడించింది.

ఫోర్జరీ Image copyright Madhapurpolice/fb
చిత్రం శీర్షిక సీఎం కేసీఆర్ సంతకం ఫోర్జరీ విషయాలను మాదాపూర్ డీసీపీ వెంకటేశ్వర్లు మీడియాకు వివరించారు.

సీఎం కేసీఆర్ సంతకం ఫోర్జరీ

ఏకంగా తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ సంతకాన్ని ఫోర్జరీ చేసి వంద కోట్ల విలువైన ప్రభుత్వ భూమిని స్వాహా చేసేందుకు ప్రయత్నించిన ముగ్గురు వ్యక్తులను రాయదుర్గం పోలీసులు అరెస్ట్‌చేసి వీరి నుంచి 10 ఫోర్జరీ లెటర్‌ప్యాడ్లను పోలీసులు స్వాధీనం చేసుకొన్నారని నమస్తే తెలంగాణ తెలిపింది.

పరారీలో ఉన్న మరో వ్యక్తి కోసం పోలీసులు గాలిస్తున్నారు. ఫోర్జరీ వివరాలను శనివారం మాదాపూర్ డీసీపీ వెంకటేశ్వరరావు మీడియాకు వెల్లడించారు. నగరంలోని దారుస్సలాం వాసి మహ్మద్ ఉస్మాన్ ఖురేషి.. గచ్చిబౌలిలోని సర్వేనంబర్ 44 పార్ట్‌లో 2.2 ఎకరాల స్థలాన్ని గోల్కొండకు చెందిన రఫియా సుల్తానా నుంచి అగ్రిమెంట్ చేసుకొన్నందున తన పేరిట మ్యుటేషన్ చేయాలని రంగారెడ్డి కలెక్టరేట్‌లో ఈ నెల 14వ తేదీన దరఖాస్తు చేశాడు.

దరఖాస్తుతోపాటు సీఎం సంతకం చేసిన టీఆర్‌ఎస్ లెటర్‌హెడ్‌ను జతచేశాడు. దరఖాస్తును పరిశీలించిన చేవెళ్ల ఆర్డీవో చంద్రకళ.. మ్యుటేషన్ కోరిన స్థలాన్ని ప్రభుత్వస్థలంగా గుర్తించి.. సీఎం కేసీఆర్ పేరిట ఉన్న రికమండేషన్ లెటర్‌ను చూసి సీఎం కార్యాలయంతోపాటు టీఆర్‌ఎస్ ఆఫీస్‌లో ఆరాతీసి నకిలీదిగా తేల్చారు. అనంతరం రాయదుర్గం పోలీసులకు ఈ నెల 15న ఫిర్యాదు చేశారు.

ఉస్మాన్‌ఖురేషి తన స్నేహితుడైన శాలిబండకు చెందిన సయ్యద్ రషీద్‌హుస్సేన్‌ను సంప్రదించి ఈ మోసానికి తెరలేపాడు. రషీద్‌హుస్సేన్ తన స్నేహితుడైన నిజామాబాద్‌కు చెందిన బాబాఖాన్‌ను సంప్రదించి సీఎం సంతకం, టీఆర్‌ఎస్ పార్టీ ఖాళీ 10 లెటర్‌ప్యాడ్లను రూ.45వేలకు కొనుగోలు చేశాడు.

తొమ్మిదింటిని ఉస్మాన్‌ఖురేషికి రూ. 60వేలకు విక్రయించాడు. మూసారాంబాగ్‌లో నివసించే బిప్యాట అమరేంద్రను సంప్రదించి రెవెన్యూశాఖను అదేశిస్తున్నట్టుగా లేఖ సృష్టించాడు. రషీద్‌హుస్సేన్ మెఘల్‌పురా డివిజన్ టీఆర్‌ఎస్ పార్టీ డివిజన్ సెక్రటరీగా పనిచేసినట్టు పోలీసుల విచారణలో తేలింది.

ఉస్మాన్‌ఖురేషి నుంచి 9 లెటర్‌ప్యాడ్లను స్వాధీనం చేసుకొన్న పోలీసులు.. చాదర్‌ఘాట్‌లో 200 గజాల స్థలానికి పరిహారం అందించాలని మెట్రో ఎండీకి, చాదర్‌ఘాట్‌లో 300 గజాల స్థలవివాదం పరిష్కరించాలని నగర పోలీసు కమిషనర్‌కు రాసిన లేఖలను గుర్తించారని నమస్తే తెలంగాణ వెల్లడించిది.

ఇవి కూడా చదవండి

(బీబీసీ తెలుగును ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్‌, ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)

ముఖ్యమైన కథనాలు

బీజేపీలో చేరిన నలుగురు టీడీపీ రాజ్యసభ సభ్యులు.. ఎంపీల ‘విలీనం’పై లీగల్ యాక్షన్ తీసుకుంటామన్న టీడీపీ

ప్రపంచవ్యాప్తంగా 7 కోట్ల మంది వలస.. 70 ఏళ్లలో ఇదే అత్యధికం - యుఎన్‌హెచ్‌సీఆర్

టీకాలు ఎలా పనిచేస్తాయి.. టీకాల విజయం ఏమిటి.. టీకాలపై కొందరిలో సంశయం ఎందుకు

14 ఏళ్ల తర్వాత చైనా అధ్యక్షుడు ఉత్తర కొరియాకు ఎందుకు వెళ్తున్నారు

‘టీడీపీని బీజేపీలో విలీనం చేయండి’ - వెంకయ్య నాయుడిని కోరిన సుజనా, సీఎం రమేశ్, గరికపాటి, టీజీ

పాకిస్తాన్‌ జైళ్లలో మత్స్యకారులు: 'ఎదురుచూపులతోనే ఏడు నెలలు .. వస్తారో రారో తెలియదు'

గుజరాత్ లాకప్‌డెత్ కేసులో ఐపీఎస్ అధికారి సంజీవ్ భట్‌ను దోషిగా తేల్చిన కోర్టు

వీడియో: చిన్న కర్రతో సింహాన్ని తరిమేసిన గోశాల నిర్వాహకుడు