గాంధీ హత్యకు పది రోజుల ముందు గాడ్సే, ఆప్టే ఏం చేశారు?

  • 21 మే 2019
గాంధీ హత్య Image copyright Getty Images

న్యూ దిల్లీలోని కనాట్ ప్లేస్‌లో మెరీనా హోటల్‌కు ఎదురుగా ఉన్న మసీదులో సాయంత్రం నమాజు మొదలవబోతోంది.

ఆ తర్వాత వారు ఉపవాసం వదులుతారు. మెరీనా హోటల్లోని ఒక గదిలో ఓ వ్యక్తి మసీదు దగ్గర హడావిడిని చూస్తున్నాడు.

అతడికి బహుశా తెలుసో, తెలీదో... 1948 జనవరి 17న దిల్లీలో చలి తీవ్రంగా ఉన్న సమయంలో ఇప్పుడు రాడిసన్ బ్లూ మరీనా హోటల్‌గా పిలుస్తున్న హోటల్లో నాథూరాం గాడ్సే, నారాయణ్ ఆప్టే ఉండేవారు.

అప్పుడు ఉదయం 11 గంటలు కావస్తోంది.

నాథూరాం గాడ్సే, నారాయణ్ ఆప్టే ఇద్దరూ ఎస్ దేశ్‌పాండే, ఎస్ఎన్ దేశ్‌పాండే పేర్లతో అక్కడ గది బుక్ చేశారు.

ఆ కాలంలో ఇప్పటిలా హోటల్లో రూం బుక్ చేయడానికి ఆధార్ కార్డ్, లేదా ఏదైనా గుర్తింపు కార్డు చూపించాల్సిన అవసరం ఉండేది కాదు.

అది మెరీనా హోటల్లోని రూం నంబర్ 40.

ఇద్దరు మిత్రులూ 15-20 నిమిషాల్లో నలుపు-పసుపు రంగు టాక్సీలో కనాట్ ప్లేస్ చేరుకుని ఉంటారు.

ఈ హోటల్‌కు వెళ్లేటపుడు అల్‌బుకరక్ రోడ్ (ఇప్పుడు తీస్ జనవరి మార్గ్) నుంచే వెళ్లుంటారు.

ఆ రోజు అదే మార్గంలో ఉన్న బిర్లా హౌస్‌లో 79 ఏళ్ల మహాత్మా గాంధీ నిరాహారదీక్షలో ఉన్నారు.

నిరాహారదీక్ష ముగించాలని బాపూజీని కోరేందుకు కొన్ని వేల మంది బిర్లా హౌస్ వెళ్తుండడం కూడా వీళ్లు ఆరోజు చూసుంటారు.

నిజానికి, ఆప్టే, గాడ్సే ఆరోజు దిల్లీలో గాంధీజీని హత్య చేయాలనే భయంకరమైన పథకాన్ని అమలు చేసేందుకు వచ్చారు.

ఇద్దరికీ హోటల్ ఫస్ట్ ఫ్లోర్‌లో ఉండే 40వ నంబర్ రూమ్ దొరికింది. బొంబాయి నుంచి విమానంలో వచ్చిన గాడ్సే, ఆఫ్టే సఫ్దర్‌గంజ్ విమానాశ్రయంలో దిగారు.

మిగిలిన వారంతా రైల్లో దిల్లీ వస్తున్నారు. అప్పటికి పాలం విమానాశ్రయమే ప్రారంభించ లేదంటే, ఇక ఇందిరాగాంధీ ఇంటర్నేషనల్ ఎయిర్ పోర్ట్ ప్రస్తావనే రాదు.

Image copyright Getty Images

బాపూజీపై అంత కోపం ఎందుకు

నిజానికి 1948 జనవరి 13 నుంచి గాంధీ నిరాహారదీక్ష చేయబోతున్నారనే విషయం వీరికి జనవరి 12న తెలిసింది. అప్పటికప్పుడే ఆయన్ను హత్య చేయాలనేంత కోపం వచ్చింది.

గాంధీజీ చిన్న కొడుకు దేవదాస్ గాంధీ మనుమరాలైన రచయిత సుకన్యా భరత్ రాం తన పుస్తకంలో "గాడ్సే, ఆప్టే, వారి సహచరులు రెండు కారణాలతో గాంధీజీపై కోపం పెంచుకున్నారు" అని చెప్పారు.

వాటిలో మొదటిది గాంధీ 1948 జనవరి 13న నిరాహారదీక్ష ఎందుకు చేస్తున్నారు? అనేది.

"ఎందుకంటే దిల్లీలో ముస్లింలను చంపుతున్నారు. వారి ఆస్తులను లూటీ చేస్తున్నారు. హింస, గృహ దహనాలూ ఆగే పరిస్థితి కనిపించడం లేదు. అన్ని ప్రయత్నాలూ విఫలమయ్యాయి. చివరికి అల్లర్లు ఆగేలా నైతిక ఒత్తిడి పెంచేందుకు గాంధీ 1948 జనవరి 12న ఆమరణ నిరాహారదీక్ష చేయాలని నిర్ణయించారు."

ఆయన కొడుకు దేవదాస్ గాంధీ అప్పుడు హిందుస్తాన్ టైమ్స్ సంపాదకులుగా ఉండేవారు. ఆయన గాంధీజీకి నిరాహారదీక్ష వద్దని సూచించారు.

ఇక, రెండోది దేశవిభజన జరిగినప్పుడు ప్రభుత్వ ఆస్తులను భారత్-పాకిస్తాన్‌ రెండింటికీ పంచారు. ప్రభుత్వ ఖజానాలో ఉన్న డబ్బు కూడా రెండు భాగాలు చేశారు. అప్పుడు పాకిస్తాన్ భాగంగా 75 కోట్లు వచ్చాయి. భారత ప్రభుత్వం మొదట్లో పాకిస్తాన్‌కు 20 కోట్ల రూపాయలు ఇచ్చింది. ఇక మిగిలింది 55 కోట్లు. బాపూజీ ఆలస్యం చేయకుండా ఆ మొత్తం కూడా పాకిస్తాన్‌కు ఇచ్చేయాలని కోరారు.

ఈ రెండు కారణాలతో గాడ్సే, ఆయన సహచరులకు గాంధీపై కోపం వచ్చింది.

అప్పుడు గాడ్సే, ఆప్టే తమ మిగతా సహచరుల రాక కోసం ఎదురుచూస్తున్నారు. దిల్లీని చూడ్డానికి రాలేదు.

చీకటిపడే సమయానికి మిగతావారు వచ్చేశారు. వారిలో మదన్ లాల్ పాహ్వా, విష్ణు కర్కరే, గోపాల్ గాడ్సే ఉన్నారు. అందరూ మెరీనా హోటల్ చేరుకున్నారు.

వాళ్లందరూ హాండ్ గ్రెనేడ్లు, టైం బాంబ్, పిస్టళ్లతో దిల్లీ వచ్చారు.

Image copyright Getty Images
చిత్రం శీర్షిక గాంధీ హత్య కేసు విచారణ సమయంలో బోనులో గాడ్సే

నాటు బాంబు పేల్చిన పాహ్వా

'ఫ్రీడమ్ ఎట్ మిడ్ నైట్' పుస్తకం రాసిన డామినిక్ లాపియెర్, లారీ కాలిన్స్ "మెరీనా హోటల్ గదిలో గాంధీ హత్యకు వేసిన ప్లాన్ గురించి చర్చిస్తున్నప్పుడు కర్కరే తను, ఆప్టే తాగేందుకు విస్కీ తెప్పించాడు. గాడ్సే విస్కీ తాగడు, ఆయన కాఫీ తాగేవారు. గాడ్సే మెరీనా హోటల్లో మాటిమాటికీ కాఫీ ఆర్డర్ ఇచ్చారు" అని చెప్పారు.

బిర్లా హౌస్ వెళ్లందుకు రీగల్‌లో టాక్సీ ఎక్కారు.

జనవరి 20న ప్రార్థన సభ సమయంలో గాంధీజీపై బాంబులతో దాడి చేయాలని వారు మరీనా హోటల్‌లో ఒక నిర్ణయానికి వచ్చారు.

ఆ సమయంలో వాళ్లందరూ బిర్లా హౌస్ వెళ్లి తనిఖీ చేస్తూ ఉండేవారు. తర్వాత జనవరి 20 రానే వచ్చింది.

నాథూరాం గాడ్సే, గోపాల్ గాడ్సే, నారాయణ్ ఆప్టే, విష్ణు కర్కరే, మదన్‌లాల్ పాహ్వా టాక్సీలో బిర్లా హౌస్ చేరుకున్నారు.

ఆప్టే రీగల్ నుంచి బేరాలాడిన తర్వాత బిర్లా హౌస్ వెళ్లడానికి టాక్సీ ఎక్కాడు.

బిర్లా హౌస్‌లో మదన్ లాల్ పాహ్వా బాంబు పేల్చాడు. అది ఎక్కువ నష్టం కలిగించని నాటు బాంబు అని తర్వాత తెలిసింది.

ఆ బాంబు విసిరినందుకు మదన్‌లాల్ పాహ్వాను పట్టుకున్నారు. అప్పుడు వారందరూ గాంధీని హత్య చేయాలని తహతహలాడుతున్నారు.

వారి ఉద్దేశం మొదట ప్రార్థన సభ సమయంలో బాంబు పేల్చాలి. అక్కడ అంతా అల్లకల్లోలంగా ఉన్నప్పుడు బాపూజీపై కాల్పులు జరపాలి.

Image copyright GANDHISMRITI.GOV.IN

పాత దిల్లీ రైల్వే స్టేషన్లో మకాం

పాహ్వా, విష్ణు కర్కరే మొదట బిర్లా హౌస్ చేరుకున్నారు. మిగిలిన వారిని టాక్సీ డ్రైవర్ సుర్జీత్ సింగ్ తీసుకుని వస్తున్నాడు. సుర్జీత్ సింగ్ తర్వాత ప్రభుత్వ సాక్షిగా మారారు.

మదన్ లాల్ పాహ్వా అక్కడకు ఒక ఫొటోగ్రాఫర్‌లా వచ్చాడు. పేలుడు తర్వాత ఆయన సహచరులు అక్కడ్నుంచి తప్పించుకుని పారిపోయారు.

అయితే, అంత భయానక ఘటన తర్వాత నియమాల ప్రకారం బిర్లా హౌస్‌లో భద్రత కట్టుదిట్టం చేయాల్సి ఉంటుంది.

కానీ, ఆ దిశగా ఏవైనా ప్రయత్నాలు జరిగాయా? అదే జరిగుంటే బాపూజీ మరణించేవారు కాదు.

అక్కడ, మొదటి ప్రయత్నం ఫలించకపోయినా, తర్వాత పది రోజుల్లోనే గాడ్సే, ఆప్టే రెండో సారి ఎయిర్ ఇండియా వైకింగ్ విమానంలో బొంబాయి నుంచి దిల్లీ వచ్చారు.

వీళ్లిద్దరూ జనవరి 20 తర్వాత బొంబాయి వెళ్లిపోయారు. పోలీస్ యాక్షన్ ఉంటుందనే భయంతో వాళ్లు ఈసారి మెరీనా హోటల్ వైపు వెళ్లరని మనం అర్థం చేసుకోవచ్చు.

అందుకే, ఇద్దరికీ పాత దిల్లీ రైల్వే స్టేషన్లో ఉన్న వెయిటింగ్ రూమే సురక్షితం అనిపించింది. గాడ్సే నారాయణ్ ఆప్టే ఆ రాత్రి ఆ వెయిటింగ్ రూంలోనే గడిపారు. జనవరి 27న బాపూజీ మహ్రోలీలో సూఫీ బక్తియార్ కాకీ దర్గా దగ్గరికి వెళ్తారని వారికి సమాచారం అందింది.

నిజానికి కాకీ దర్గాకు అల్లర్ల వల్ల నష్టం జరిగింది. దాంతో బాపూజీకి కోపం వచ్చింది. గాంధీజీ జీవితంలో చివరి కార్యక్రమం అదే.

Image copyright NANA GODSE
చిత్రం శీర్షిక గాంధీపై మూడు సార్లు కాల్పులు జరిపిన నాథూరాం గాడ్సే

గాంధీజీకి సెక్యూరిటీ కరవు

ఆయన అక్కడికి వస్తున్నారనే విషయం తెలిసి ఇద్దరికీ రక్తం మరిగింది. అప్పుడు విష్ణు కర్కరే కూడా వాళ్లతో ఉన్నాడు.

చరిత్రకారుడు దిలీప్ సిమియన్ "బాపూజీ కాకీ దర్గాకి వెళ్లి వచ్చిన తర్వాత వెంటనే ఆయన్ను చంపేయాలని వాళ్లు నిర్ణయించుకున్నారు" అని తెలిపారు.

ఇక, ఆ ఘోరం జరిగిన జనవరి 30 వచ్చింది. వాళ్లు బాపూజీని హత్య చేయాల్సింది ఆ రోజే. నాథూరాం గాడ్సే గాంధీపై కాల్పులు జరపాలి.

బిర్లా హౌస్ వెళ్లేందుకు వాళ్లు ఒక గుర్రపు బగ్గీ తీసుకున్నారు.

బాపూ చివరి రోజు ఒక్కొక్క క్షణాన్నీ వివరించిన జర్నలిస్ట్ స్టీఫెన్ మర్ఫీ తన పుస్తకంలో "జనవరి 20న జరిగిన దాడి తర్వాత బిర్లా హౌస్‌లో 30 మంది పోలీసులను మోహరించారు. నెహ్రూ, పటేల్ అభ్యర్థనను గాంధీజీ తిరస్కరించారు. కానీ,ఆరోజు గాడ్సే ఆయనపై కాల్పులు జరిపినప్పుడు, గాంధీజీ వెంట మఫ్టీలో ఉండాల్సిన కానిస్టేబుల్ ఏపీ భాటియా కూడా గైర్హాజరు అయ్యారు. ఆరోజు ఆయనకు వేరే ఎక్కడో డ్యూటీ వేశారు. ఆయన స్థానంలో బాపూజీకి సెక్యూరిటీ కోసం ఎవరినీ నియమించలేదు. గాంధీజీతో ఎప్పుడూ ఉండే గురుబచన్ సింగ్ కూడా ఆరోజు లేరు. ఆయన బాపూజీకి అటెండెంట్‌గా పనిచేసేవారు" అని తెలిపారు.

అప్పుడు ఎవరైనా బిర్లా హౌస్‌లోకి సులభంగా ప్రవేశించేలా ఉండేదా? అక్కడికి వచ్చేవారికి ఎలాంటి తనిఖీలు ఉండేవి కావా? అంటే బిర్లా హౌస్ భద్రతకు నియమించిన సెక్యూరిటీ సిబ్బంది అప్పుడు ఏం చేస్తున్నారు? జనవరి 30న భాటియాకు ఎవరు, ఎందుకు వేరే దగ్గర డ్యూటీ వేయించారు? అనే ప్రశ్నలు కూడా వస్తాయి.

Image copyright Getty Images

నిర్ఘాంతపోయిన నెహ్రూ

ఆ రోజు 1948 జనవరి 30న చాందినీ చౌక్ ప్రాంతంలో పారిశుద్ధ్య కార్మికులు తమ డిమాండ్లు నెరవేర్చాలంటూ భారీ ఆందోళన చేసిన విషయం నిజమే. దాంతో, చాలా మంది పోలీసులను అక్కడికి పంపించారు.

అయితే, భాటియా కూడా చాందినీ చౌక్‌ దగ్గరే ఉన్నారా? అంటే, బాపూజీని ఆయన ప్రాణాలకు ఒంటరిగా వదిలేశారా?

బాపూజీతో నిరంతరం ఉండే వ్యక్తిగత డాక్టర్ సుశీలా నాయర్ కూడా ఆ రోజు లేరనేది చింతించాల్సిన విషయం, ఆమె ఆరోజు పాకిస్తాన్లో ఉన్నారు.

కానీ, ఆయన కాల్పుల్లో చనిపోయిన కాసేపటి తర్వాత డాక్టర్ డీపీ భార్గవ్, డాక్టర్ జీవాజీ మెహతా అక్కడికి చేరుకున్నారు.

గాంధీజీ చనిపోయారని డాక్టర్ మెహతా ధ్రువీకరించారు. బాపూజీ జీవిత చరిత్రల్లో ఒకటైన 'ది లైఫ్ ఆఫ్ మహాత్మా గాంధీలో లూయీ ఫిషర్ "నెహ్రూ కూడా వెంటనే బిర్లా హౌస్ చేరుకున్నారు. రక్తంతో తడిసిన గాంధీజీ శరీరాన్ని ఆయన నిర్ఘాంతపోయి చూస్తున్నారు. తర్వాత బాపూజీ చిన్న కొడుకు దేవదాస్ గాంధీ, విద్యా మంత్రి మౌలానా అబుల్ కలాం ఆజాద్ కూడా బిర్లా హౌస్ వచ్చారు" అని రాశారు.

గాంధీజీ హత్యలో ఇద్దరు ప్రధాన నిందితులు, మిత్రులు అయిన గాడ్సే, ఆఫ్టేకు ఉరిశిక్ష విధించారు. మిగిలినవారికి జీవిత ఖైదు విధించారు.

ఇవి కూడా చదవండి:

(బీబీసీ తెలుగును ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్‌, ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి)

ముఖ్యమైన కథనాలు