వివేక్ ఓబెరాయ్: ఐశ్వర్యారాయ్‌పై ట్వీట్ వివాదం, క్షమాపణలు కోరిన బాలీవుడ్ నటుడు

  • 20 మే 2019
పీఎం నరేంద్ర మోదీ చిత్రంలో ప్రధాన పాత్ర పోషించిన వివేక్ ఒబెరాయ్ Image copyright vivekoberoi/facebook
చిత్రం శీర్షిక పీఎం నరేంద్ర మోదీ చిత్రంలో ప్రధాన పాత్ర పోషించిన వివేక్ ఒబెరాయ్

ఐశ్వర్యా రాయ్‌పై ట్విటర్‌లో షేర్ చేసిన మీమ్‌ వివాదాస్పదం కావడంతో యాక్టర్ వివేక్ ఓబెరాయ్ దానిని డెలీట్ చేశాడు.

మంగళవారం ట్వీట్ చేసిన వివేక్ ఓబెరాయ్ "చాలా సార్లు మొదట చూడగానే ఒకరికి సరదాగా, ఏ నష్టం లేదులే అనిపించే ఒక విషయం, వేరే వారికి అలా అనిపించకపోవచ్చు. నేను గత పదేళ్లలో రెండు వేల మందికి పైగా నిరుపేద బాలికలకు సాయం అందించాను. మహిళలను గౌరవించకపోవడాన్నినేను అసలు ఊహించలేను. నేను షేర్ చేసిన మీమ్ వల్ల ఏ మహిళకైనా బాధ కలిగుంటే దానికి నేను క్షమాపణ కోరుతున్నాను. నా ట్వీట్ డెలిట్ చేశాను" అని చెప్పాడు.

అంతకు ముందు వివేక్ ఓబెరాయ్ తన మీమ్‌లో ఎలాంటి తప్పు లేదని, క్షమాపణ అడిగేది లేదని అన్నాడు.

వివేక్ ఓబెరాయ్ "క్షమాపణ అడగడంలో సమస్య లేదు. కానీ నేనేం తప్పు చేశాను. నేనేదైనా తప్పు చేసుంటే, అప్పుడు క్షమాపణ అడుగుతాను. నేను తప్పు చేసినట్లు నాకు అనిపించడం లేదు" అన్నాడు.

ట్వీట్ వివాదం ఎందుకైంది

ఎగ్జిట్ పోల్స్ గురించి ఒక ట్వీట్ చేసిన నటుడు వివేక్ ఓబెరాయ్ వివాదాల్లో చిక్కుకున్నాడు.

వివేక్ ఓబెరాయ్ సోమవారం ఎగ్జిట్ పోల్స్ గురించి ఒక వ్యాఖ్యతోపాటు ఒక మీమ్ షేర్ చేశాడు. ఆ తర్వాత నుంచీ ట్విటర్‌లో ఆయనపై విమర్శలు మొదలయ్యాయి.

వివేక్ షేర్ చేసిన ఫొటోలో నటి ఐశ్వర్యా రాయ్.. సల్మాన్ ‌ఖాన్‌తో, వివేక్ ఓబెరాయ్‌తో, చివరగా భర్త అభిషేక్ బచ్చన్, కూతురు ఆరాధ్యా బచ్చన్‌లతో కనిపిస్తోంది.

ఈ ఫొటోలపై ఒపీనియన్ పోల్, ఎగ్జిట్ పోల్, ఫలితం అని ఉంది..

ఈ ఫొటోల ద్వారా ఆయన ఎగ్జిట్ పోల్ ట్రెండ్స్ గురించి వ్యంగ్యంగా చెప్పాలనుకున్నారు.

ఈ ట్వీట్‌ వెలుగుచూడగానే దీనిపై జనాల స్పందన మొదలైంది. నటి సోనమ్ కపూర్, బ్యాడ్మింటన్ క్రీడాకారిణి గుత్తా జ్వాల, చాలా మంది జర్నలిస్టులు ఈ ట్వీట్‌ను 'సిగ్గుచేటు'గా వర్ణించారు.

నటి సోనమ్ కపూర్ ఇది చాలా "అసహ్యమైన, క్లాస్‌లెస్" అని ట్వీట్ చేశారు.

మరికొందరు కూడా ఇలాగే స్పందించారు.

జితేంద్ర అవ్హాద్ అనే యూజర్ "మోదీ సినిమాలో నటించిన తర్వాత వివేక్‌ తనను తాను మోదీ అవతారం అనుకుంటున్నారు, మహిళల పట్ల గౌరవం లేకుండా పోయింది" అని ట్వీట్ చేశారు.

చౌకీదార్ గాడ్సే అనే మరో యూజర్ "ఒక జీవిత చరిత్రలో నటించిన తర్వాత ఆయన అలా అయిపోయినట్లుందని" అన్నారు.

జర్నలిస్ట్ పల్లవీ ఘోష్ "సిగ్గుచేటు.. ఇది ఈయనకు ఏ క్లాసూ లేదనేది చూపిస్తోంది" అని రాశారు

సబితా సింగ్ అనే ఒక యూజర్ "వివేక్ మీరు మీ వివేకాన్ని కోల్పోతున్నారు" అని రాశారు.

జర్నలిస్ట్ మయాంక్ గుప్తా "చాలా దారుణమైన జోక్.. ముఖ్యంగా ఒక పాపను ఇందులో చేర్చడం చాలా ఘోరం" అన్నారు.

గుత్తా జ్వాల "ఇలా ట్వీట్ చేయడం చాలా అసంబద్ధం, నిరుత్సాహం కలిగించింది" అని ట్వీట్ చేశారు.

ఇంకా చాలా మంది ట్విటర్ యూజర్లు వివేక్ ఓబెరాయ్‌పై రకరకాలుగా తమ ఆగ్రహం వ్యక్తం చేశారు.

శిల్పీ తివారి తన ట్విటర్‌లో "దీన్నుంచి బయటపడు, ఈ మీమ్ మీ గురించి కాదు, అది మీక్కూడా తెలుసు. పేరు తెచ్చుకోవాలన్న మీ ఈ చేష్టల వల్ల ఐశ్వర్య ఉన్న ఈ మీమ్ గ్రాఫిక్ వైరల్ అవుతుంది. మీరు మీపై జోక్ వేసుకుంటున్నట్టు జనాలను మభ్యపెట్టకండి" అని రాశారు.

చిరాగ్ వకాస్కర్ అనే యూజర్ ఈ ట్వీట్‌ను ముంబై పోలీసులకు ట్యాగ్ చేస్తూ రీ ట్వీట్ చేశారు.

కమలేష్ సుతర్ అనే యూజర్ "ఒక మైనర్ బాలికను మీమ్‌లో చేర్చే ముందు పది వేల సార్లు ఆలోచించి ఉండాల్సింది. మిమ్మల్ని చూసి సిగ్గుపడుతున్నా వివేక్ ఓబెరాయ్" అని పెట్టారు.

మహిళా కమిషన్ నోటీస్

ఈ విషయంపై స్పందించిన జాతీయ మహిళా కమిషన్ దీనిపై సమాధానం ఇవ్వాలంటూ వివేక్ ఓబెరాయ్‌కు నోటీసు పంపించింది.

మహిళా కమిషన్ తరఫున జారీ చేసిన నోటీసులో "వివేక్ ఓబెరాయ్ చాలా అవమానకరమైన మహిళా వ్యతిరేక ట్వీట్ చేశారని ఆరోపిస్తూ మాకు ఒక మీడియా రిపోర్ట్ వచ్చింది. ఈ ఫొటోలో ఒక మహిళ, మైనర్ బాలికను చూపిస్తున్నారు. మీరు ఎన్నికల ఫలితాలపై వ్యాఖ్యను ఒక మహిళ వ్యక్తిగత జీవితంతో పోలుస్తూ ట్వీట్ చేసినట్లు చెబుతున్నారు" అని ఉంది.

"ఇది చాలా అనైతికంగా, మహిళ పట్ల చేసిన తప్పిదంగా సూచిస్తోంది. ఈ కేసులో మీరు కమిషన్‌కు సంతృప్తికరమైన సమాధానం చెప్పాల్సి ఉంటుంది" అని పేర్కొన్నారు.

వివేక్ ఓబెరాయ్ ఇటీవల తన సినిమా 'పీఎం నరేంద్ర మోదీ' సినిమా గురించి చర్చల్లో నిలిచారు. ఈ సినిమా దేశ ప్రస్తుత ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ జీవితం ఆధారంగా తెరకెక్కింది. ఈ సినిమా వివాదాస్పదం కావడంతో ఈసీ దీని విడుదలను ఎన్నికలు అయ్యే వరకూ ఆపేసింది.

Image copyright Getty Images

అప్పట్లో ఐశ్వర్య ఏమన్నారు?

2003లో సల్మాన్ ఖాన్‌ తనను బెదిరించాడని వివేక్ ఓబెరాయ్ ఆరోపించాడు.

ఆ తర్వాత నటి ఐశ్వర్యా రాయ్ కుటుంబ క్షేమం కోసం, తన గౌరవం కోసం ఇకమీదట తను సల్మాన్‌తో కలిసి నటించేది లేదని చెప్పారు.

సల్మాన్‌తో గడిపిన సమయాన్ని ఒక 'పీడకల'గా భావిస్తున్నానని ఆమె అప్పట్లో ప్రకటించారు.

అప్పుడు ఒక ప్రకటనలో ఐశ్వర్య "ఇక జరిగింది చాలు, నేను క్షేమంగా, గౌరవంగా ఉన్నప్పుడే, నా కుటుంబానికి కూడా గౌరవంగా ఉంటుంది. ఇక నేను సల్మాన్‌తో పని చేయను" అని చెప్పారు.

"సల్మాన్‌తో గడిపిన కాలం నా జీవితంలో ఒక పీడకల లాంటిది. అదంతా ముగిసిపోయినందుకు నేను దేవుడికి కృతజ్ఞతలు చెబుతున్నా" అన్నారు.

సల్మాన్ కుటుంబ సభ్యులు, స్నేహితులు వ్యక్తిగతంగా, వృత్తిపరంగా తనకు మాటిమాటికీ ప్రశాంతత లేకుండా చేశారని ఆమె సల్మాన్ ఖాన్‌పై ఆరోపణలు చేశారు.

సల్మాన్, అతడి కుటుంబం తమ గురించి వదంతులు ప్రచారం చేస్తున్నారని ఐశ్వర్య ఆరోపించారు. మిగతా కళాకారులతో తన సంబంధాలు చెడగొట్టేందుకు చాలా ప్రయత్నించారని చెప్పారు.

అయితే వివేక్ ఓబెరాయ్‌తో అఫైర్ ఉన్నట్లు వచ్చిన వార్తలను ఐశ్వర్యా రాయ్ ఎప్పుడూ ధ్రువీకరించలేదు.

2007లో ఐశ్వర్యా రాయ్ బాలీవుడ్ నటుడు అభిషేక్ బచ్చన్‌ను పెళ్లి చేసుకున్నారు. 2011లో వారికి ఆరాధ్య జన్మించింది.

ఇవి కూడా చదవండి:

(బీబీసీ తెలుగును ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్‌, ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)