రూపాయికే అంత్యక్రియలు... కరీంనగర్‌ నగర పాలక సంస్థ నిర్ణయం: ప్రెస్‌రివ్యూ

  • 21 మే 2019
Image copyright Ravindrasingh/fb

ఒక రూపాయికే నల్లా కనెక్షన్‌ పథకాన్ని ప్రారంభించి రాష్ట్రవ్యాప్తంగా అమలుకు శ్రీకారం చుట్టిన తెలంగాణలోని కరీంనగర్‌ నగరపాలక సంస్థ మేయర్‌ రవీందర్‌సింగ్‌.. మరో పథకానికి ముందడుగు వేశారని ఈనాడు తెలిపింది.

పేద, మధ్య తరగతి ప్రజలకు భారం కలగకుండా నగర పాలక ద్వారా రూపాయికే అంత్యక్రియలు నిర్వహించేందుకు నిర్ణయించారు. ఇందుకు నిధులు కేటాయించడంతోపాటు ప్రత్యేక విభాగాన్ని ఏర్పాటు చేసి నిరుపేదలకు అండగా ఉంటామని ప్రకటించారు.

కరీంనగర్‌లో సోమవారం రవీందర్‌సింగ్‌ విలేకర్లతో మాట్లాడుతూ.. నగరంలో ఎవరు చనిపోయినా రూపాయి చెల్లిస్తేచాలు వారి మత ఆచారాల ప్రకారం అంత్యక్రియలు, దహనసంస్కారాలు చేపడతామని తెలిపారు.

వచ్చే 15లోగా పూర్తి కార్యాచరణతో అమలు చేసేందుకు ఏర్పాట్లు చేస్తున్నట్లు వివరించారు. 'అంతిమ యాత్ర.. ఆఖరి సఫర్‌' పేరుతో ఈ కార్యక్రమాన్ని నిర్వహించనున్నట్లు చెప్పారు.

పేదలకు భారం కలగకుండా దాతల సాయంతో నిధులు సమకూర్చుతామని తెలిపారు. నగర పాలక ద్వారా రూ.1.10కోట్లు కేటాయించామని, రూ.50లక్షలతో వాహనాల కొనుగోలుకు ఆమోదం తెలిపామని చెప్పారు. దాతల కోసం ప్రత్యేకంగా నగర పాలక కమిషనర్‌ పేరు మీద ఖాతా ఏర్పాటు చేస్తామన్నారు.

చనిపోయిన వారి కుటుంబానికి 50 మందికి సరిపడా భోజనం రూ.5కే అందించే ఏర్పాటు చేస్తామని తెలిపారని ఈనాడు వెల్లడించింది.

Image copyright chandrababu/fb

గెలుపు మాదే.. రాసి పెట్టుకోండి

''టీడీపీ 33 ఏళ్లుగా సర్వేలు చేయిస్తోంది. రాసిపెట్టుకోండి. ఈ ఎన్నికల్లో తెలుగుదేశానిదే గెలుపు'' అని ఆ పార్టీ అధ్యక్షుడు, ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు స్పష్టం చేశారని ఆంధ్రజ్యోతి వెల్లడించింది.

సోమవారం నిర్వహించిన మీడియా సమావేశంలో, అంతకుముందు టెలీకాన్ఫరెన్స్‌లోనూ ఆయన గెలుపుపై ధీమా వ్యక్తం చేశారు. ''పోలింగ్‌ రోజు ఈవీఎంలు పనిచేయకుండా చేశారు. ఓటింగ్‌ తగ్గించాలని చూశారు. కానీ, మధ్యాహ్నం నేను ఒక్క పిలుపు ఇవ్వగానే జనం పోలింగ్‌బూత్‌లకు తిరిగి తరలి వెళ్లారు.

అర్ధరాత్రి అయినప్పటికీ క్యూలోనే ఉండి, ఓటు వేశాకే వచ్చారు. టీడీపీ గెలుపు ఖాయం అని చెప్పడానికి ఇంతకుమించిన నిదర్శనం ఏం కావాలి?'' అని చంద్రబాబు ప్రశ్నించారు. 18 నుంచి 20 ఎంపీ స్థానాల్లో టీడీపీ గెలుపు ఖాయమన్నారు.

''ఇక... అసెంబ్లీలో టీడీపీ బలం 110 నుంచి మొదలవుతుంది. 120 నుంచి 130 సీట్ల వరకు వస్తాయి'' అని సీఎం చంద్రబాబు అన్నారు. ఎగ్జిట్‌పోల్స్‌ చూసే వైసీపీ ఆనందపడిపోతోందని... నిజమైన గెలుపు, పారదర్శకంగా సాధించి ఆనందపడితే ఫర్వాలేదుకానీ ఇదేంటని ఒక ప్రశ్నకు సమాధానంగా స్పందించారు.

''ఈ ఎన్నికల్లో కరుడుగట్టిన నేరస్తులపై పోరాడాం. అందుకే కౌంటింగ్‌ వరకు అప్రమత్తంగా ఉండాలి'' అని పార్టీ శ్రేణులకు సూచించారు. కౌంటింగ్‌పై బుధవారం మరోసారి శిక్షణ నిర్వహిస్తామన్నారని ఆంధ్రజ్యోతి తెలిపింది.

Image copyright kcr/fb

‘నకిలీవిత్తన దందాపై ఉక్కుపాదం’

కల్తీ విత్తనాల సరఫరాపై ఉక్కుపాదం మోపాలని తెలంగాణ ముఖ్యమంత్రి కే చంద్రశేఖర్‌రావు అధికారులను ఆదేశించారని నమస్తే తెలంగాణ పేర్కొంది. రైతుల జీవితాలతో ఆటలాడుకుంటున్న కల్తీ విత్తన వ్యాపారుల ఆటలు కట్టించాలని, రాష్ట్రంలో కల్తీ అన్నమాటే వినిపించకూడదని వ్యవసాయశాఖ, ఎన్ఫోర్స్‌మెంట్ అధికారులను పురమాయించినట్టు సమాచారం.

రైతులు వ్యాపారులను నమ్మి విత్తనాలు కొనుగోలుచేసి, ఆరుగాలం కష్టపడి, ఎన్నో వ్యయ ప్రయాసలకోర్చి ఎరువులు, పురుగు మందులు ఉపయోగించి, తీరా పంట చేతికి రాకపోతే ఎంతగా కుంగిపోతారో నాకు తెలుసు. కల్తీ విత్తనాల కారణంగా రైతులు ఆత్మహత్యలపాలవుతున్నారు.

కల్తీవిత్తనాలు అమ్మడం హత్యానేరానికంటే మించినది. కల్తీ విత్తన వ్యాపారుల నడ్డి విరవాలి అని ముఖ్యమంత్రి ఆదేశించినట్టు తెలిసింది. రాష్ట్రంలో నకిలీ విత్తనాల విక్రయానికి ఎట్టి పరిస్థితుల్లో స్థానం ఉండకూడదని సంకల్పించిన సీఎం కేసీఆర్.. నకిలీ విత్తనాలు తయారుచేసే కంపెనీలు, సరఫరాదారులపై చాలా కఠినంగా వ్యవహరించాలని అధికారులకు ఆదేశాలు జారీచేశారు.

కల్తీ విత్తనాలను మార్కెట్‌లోకి అడ్డదారిన సరఫరాచేసేవారిని, నిల్వచేసేవారిని గుర్తించి, పీడీయాక్ట్ కింద కేసులు నమోదుచేయాలని చెప్పారు. ఒకవైపు వానకాలం పంటలకు రైతన్నలు సన్నద్ధం అవుతున్న నేపథ్యంలో ఇదే అదనుగా నకిలీ, కల్తీ విత్తనాలను అంటగట్టేవారు వస్తారని, ఇలాంటి వారిని ఏరిపారేయాలని ముఖ్యమంత్రి కేసీఆర్ డీజీపీని ఆదేశించినట్లు తెలిసింది.

ఈ దందా వెనుక ఎలాంటి వారున్నా.. ఎంతటి పెద్ద వ్యక్తులున్నా వదిలేప్రసక్తే లేదని స్పష్టంచేసినట్టు సమాచారం. నకిలీ విత్తనాల విషయంలో రాష్ట్ర డీజీపీ, వ్యవసాయాధికారులతో సీఎం కేసీఆర్ సోమవారం చర్చించినట్లు సమాచారం. రాష్ట్రవ్యాప్తంగా మార్కెట్‌లలో విస్తృతంగా తనిఖీలుచేసి, నకిలీ విత్తనాలను విక్రయించే వ్యాపారులను, ఏజెంట్లను ఆరెస్టుచేసి, పీడీయాక్ట్ నమోదు చేయాలని డీజీపీని ముఖ్యమంత్రి ఆదేశించినట్లు తెలిసిందని నమస్తే తెలంగాణ వెల్లడించింది.

రవిప్రకాశ్ Image copyright youtube/tv9

‘ముందస్తు బెయిలివ్వండి’

టీవీ 9 మాజీ సీఈవో రవిప్రకాశ్‌ తనకు ముందుస్తు బెయిల్‌ మంజూరు చేయాలంటూ హైకోర్టును ఆశ్రయించారని సాక్షి తెలిపింది. బంజారాహిల్స్‌ పోలీసులు నమోదు చేసిన మూడు వేర్వేరు కేసుల్లో ముందస్తు బెయిల్‌ కోసం ఆయన మూడు వేర్వేరు పిటిషన్లు దాఖలు చేశారు.

ఈ పిటిషన్లపై బుధవారం (22న) హైకోర్టు విచారణ జరపనుంది. ఏబీసీపీఎల్‌ కార్పొరేషన్‌ యాజమాన్య మార్పిడి, వాటాల బదిలీ తదితర అంశాలపై జాతీయ కంపెనీ లా ట్రిబ్యునల్‌ (ఎన్‌సీఎల్‌టీ)లో కేసులు పెండింగ్‌లో ఉన్న విషయాన్ని పోలీసులు పట్టించుకోకుండా తనపై కేసులు నమోదు చేశారని రవిప్రకాశ్‌ తన పిటిషన్లలో పేర్కొన్నారు.

ఎన్‌సీఎల్‌టీలో ఉన్న వివాదం గురించి తాను పోలీసులకు తెలియచేశానన్నారు. ఏబీసీపీఎల్‌ను అలందా మీడియాకు అప్పగించే విషయంలో ఎటువంటి అభ్యంతరాలు చెప్పకుండా ఉండేందుకే తనపై కేసులు నమోదు చేశారన్నారు.

తనపై కేసులు నమోదు చేయడం వెనుక దురుద్దేశాలు ఉన్నాయన్నారు. తనను అరెస్ట్‌ చేయడం ద్వారా ఒత్తిడి తెచ్చి ఎన్‌సీఎల్‌టీ ముందున్న కేసులను కొనసాగించకుండా చేయడమే ఈ కేసుల వెనకున్న ఉద్దేశమన్నారు.

కొత్త యాజమాన్యం తనపై చేస్తున్న ఆరోపణల్లో ఎంత మాత్రం వాస్తవం లేదని తెలిపారు. ఒకే అంశానికి సంబంధించి పలు ఎఫ్‌ఐఆర్‌లు నమోదు చేయడం చెల్లదని ఆయన అన్నారు. ఎన్‌సీఎల్‌టీలో పెండింగ్‌లో ఉన్న వివాదానికి సంబంధించి కేసులు నమోదు చేయడం సరికాదని ఆయన తన పిటిషన్లలో పేర్కొన్నారు.

పాత తేదీతో డాక్యుమెంట్‌ సృష్టించారని పోలీసులు చెబుతున్నారని, వాస్తవానికి ఆ విషయాన్ని ఎన్‌సీఎల్‌టీ తేల్చాల్సి ఉందన్నారు. ముందస్తు బెయిల్‌ మంజూరు చేసేందుకు తనకు ఏ షరతులు విధించినా అభ్యంతరం లేదన్నారు. ముందస్తు బెయిల్‌ మంజూరు చేస్తే, దర్యాప్తునకు పూర్తిగా సహకరిస్తానని రవిప్రకాశ్‌ తెలిపారని సాక్షి వెల్లడించింది.

ఇవి కూడా చదవండి

(బీబీసీ తెలుగును ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్‌, ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)