యానాంలో ఫ్రాన్స్ ఎన్నికల సందడి... ఓటు వేసేందుకు సిద్ధమవుతున్న ఫ్రెంచి పౌరులు

  • 22 మే 2019
ఫ్రెంచ్ ఎన్నికలు - యానాం

యూరోపియ‌న్ యూనియ‌న్ ఎన్నిక‌ల‌కు యూర‌ప్ దేశాలు స‌న్న‌ద్ద‌మ‌వుతున్నాయి. అదే స‌మ‌యంలో తెలుగు రాష్ట్రంలో అంత‌ర్భాగంగా క‌నిపించే యానాంలో కూడా ఈయూ ఎన్నిక‌ల సంద‌డి మొద‌ల‌య్యింది.

ఒక‌నాటి ఫ్రెంచ్ పాల‌న‌లో సాగిన యానాంలో నేటికీ ఫ్రాన్స్ పౌర‌స‌త్వం ఉన్న ఓట‌ర్లు ఉండ‌డమే దానికి కార‌ణం. పుదుచ్ఛేరి ప‌రిధిలోని మ‌హే, కైర‌క‌ల్, యానాంతో పాటు పుదుచ్ఛేరిలో కూడా ఫ్రెంచ్ పౌరులున్నారు. వారిలో ఓట‌ర్లు సుమారుగా 5,500 మంది ఉన్నారు.

ఆంధ్ర ప్రదేశ్‌లోని తూర్పుగోదావరి జిల్లాను ఆనుకుని బంగాళాఖాతం తీరంలో ఉన్న యానాం ఒకనాడు ఓ సాధారణ పల్లెటూరు. ప్రస్తుతం యానాంలో 32 వేల మంది జనాభా ఉన్నారు.

ఫ్రెంచ్ పాల‌న‌లో యానాం

ప్ర‌స్తుతం యానాం పాండిచ్ఛేరి పాల‌నలో ఉంది. 1723 నుంచి ఫ్రెంచ్ పాల‌న‌లో ఉన్న యానాం 1954లో భారత్‌లో అంత‌ర్భాగమైంది. కానీ దీన్ని నేటికీ ఫ్రెంచ్ యానాంగానే పిలుస్తారు.

భార‌త‌దేశానికి స్వాతంత్ర్యం వచ్చిన తర్వాత పుదుచ్ఛేరి, యానాం స‌హా ప‌లు ప్రాంతాలు ఫ్రాన్స్ నుంచి విడిపోయి భార‌త్‌లో క‌లిశాయి. అయితే అప్ప‌టికే ఫ్రెంచ్ ప్ర‌భుత్వంలో ప‌నిచేస్తున్న ప‌లువురికి ఏ పౌర‌స‌త్వం కావాలో నిర్ణయించుకునే అవకాశం ఇచ్చారు. రెండేళ్ల పాటు ఈ స‌దుపాయం అమ‌లులో ఉంది. దాంతో అనేక మంది భార‌తీయ పౌర‌స‌త్వం తీసుకున్న‌ప్ప‌టికీ కొంద‌రు మాత్రం ఫ్రెంచ్ పౌర‌స‌త్వాన్నే కొన‌సాగించారు. దీంతో ఇప్పటికీ ఇక్కడి కుటుంబాల్లోని పిల్లలు ఫ్రాన్స్‌లో స్థిర‌ప‌డుతున్నారు.

కొన్ని ఇళ్లకు ఫ్రెంచ్ జాతీయ ప‌తాక రంగులు, మ‌రికొన్ని నిర్మాణాలు ఫ్రెంచ్ సంస్కృతి తరహాలో ఉంటాయి.

"మా తాత వల్లే మాకూ ఫ్రెంచ్ పౌర‌స‌త్వం"

ఫ్రెంచ్ పాల‌న‌లో ఉద్యోగులుగా ఉన్న త‌మ పూర్వీకులకు ఫ్రెంచ్ పౌర‌స‌త్వం ఉంద‌ని యానాంకు చెందిన సాధ‌నాల బాబు బీబీసీకి తెలిపారు.

"యానాం ప్రాంత ఫ్రెంచ్ పౌరుల కౌన్సిల‌ర్‍‌గా మా తాతను ఫ్రెంచ్ ప్ర‌భుత్వం నామినేట్ చేసింది. ఫ్రాన్స్ అధ్య‌క్ష ఎన్నిక‌ల‌తో పాటు ఫ్రెంచ్ పౌరులు పాల్గొనే అన్ని ఎన్నిక‌ల్లోనూ మేమూ భాగ‌స్వాముల‌వుతున్నాం. మా అమ్మ ఫ్రెంచ్ పౌరురాలు కాబ‌ట్టి ఆమె ద్వారా నాకు ఫ్రెంచ్ పౌర‌స‌త్వం వ‌చ్చింది. 1979 నుంచి యూరోపియ‌న్ యూనియన్ ఎన్నిక‌ల్లోనూ పాల్గొంటున్నాం.

చెన్నై, పాండిచ్చేరిలోని ఫ్రెంచ్ కాన్సులేట్‌లలో పోలింగ్ బూత్‌లు అందుబాటులో ఉన్నాయి. యానాం నుంచి ఓటేయ‌డానికి వెళ్లే వారితో పాటు ఓటింగ్‌కి వెళ్ల‌లేని వారికి ఫ్రాక్సీ ఓటింగ్ విధానం అమ‌లులో ఉంది. ఓటేయ‌డానికి అంత దూరం వెళ్ల‌లేనివారు ఎవ‌రో ఒక‌రికి ఓటేయ‌డానికి రాత‌పూర్వ‌కంగా రాసి ఇస్తారు. అలా ఒక్కో ఓట‌రు మ‌రో ఇద్ద‌రి ఓట్లు తీసుకుని వెళ్లి ఓటేసే అవ‌కాశం ఉంటుంది.

ఓటింగ్‌లో ఫ్రాన్స్ బ‌య‌ట ఉన్న ఫ్రెంచ్ పౌరుల‌కు క‌లిగించే ప్ర‌యోజ‌నాల‌ను ప్ర‌ధానంగా ప‌రిగ‌ణ‌నలోకి తీసుకుని ఓటేస్తాం.

బ్రెగ్జిట్ తర్వాత జరుగుతున్న ఈయూ ఎన్నిక‌లు ఈసారి కీల‌కంగా మారాయి. ఈయూలో ఫ్రాన్స్‌కి 72 సీట్లుండ‌గా పాండిచ్ఛేరి ప‌రిధిలో ఓట‌ర్ల త‌రపున ముగ్గురు ప్ర‌తినిధులుంటారు. వారిని ఎంపిక చేసుకోవ‌డానికి 33 మంది అభ్య‌ర్థులు బ‌రిలో ఉన్నారు. వారిని బ్యాలెట్ ప‌ద్ధ‌తిలో ఎన్నుకుంటాం".

భారత్ చాలా నేర్చుకోవాలి

ఫ్రాన్స్‌లో జ‌రుగుతున్న ఎన్నిక‌లు అత్యంత పకడ్బందీగా జ‌రుగుతాయ‌ని మ‌ద్దింశెట్టి జియ్య‌న్న వెల్ల‌డించారు.

ప్ర‌స్తుతం యానాంలో ఉంటున్న ఆయ‌న గ‌తంలో పాండిచ్ఛేరిలో వెట‌ర్న‌రీ డిపార్ట్ మెంట్‌లో జాయింట్ డైరెక్ట‌ర్‌గా ప‌నిచేశారు.

"ఫ్రాన్స్ పౌర‌స‌త్వం విష‌యంలో 1954 నాటి ఒప్పందాన్ని ఫ్రాన్స్, భారత ప్ర‌భుత్వాలు అమ‌లు చేస్తున్నాయి. నేను భార‌త ప్ర‌భుత్వంలో ప‌నిచేశాను. అయితే ఏ దేశ పౌర‌స‌త్వం పొందిన‌ప్ప‌టికీ ప్ర‌భుత్వ ఉద్యోగుల‌ను తొల‌గించ‌కూడ‌ద‌నే ఒప్పందం రెండు ప్ర‌భుత్వాల మ‌ధ్య ఉంది. దాని ప్ర‌కార‌మే నేను భార‌తీయ ఉద్యోగిగా ప‌నిచేసినా ఫ్రెంచ్ పౌర‌స‌త్వం కొన‌సాగింది" అని వివ‌రించారు.

"భార‌త‌ ఎన్నిక‌ల విధానానికి ఫ్రాన్స్ ఎన్నిక‌ల ప‌ద్ధ‌తికి చాలా వైరుధ్యం ఉంది. ముఖ్యంగా ప్ర‌చారం విష‌యంలో ఓట‌ర్ల‌ని అభ్య‌ర్థులు క‌ల‌వ‌రు. పూర్తిగా ప్ర‌భుత్వం త‌రపునే జ‌రుగుతుంది. అభ్య‌ర్థుల వివ‌రాల‌ను ప్ర‌భుత్వమే మెయిల్స్ ద్వారా ఓట‌ర్లంద‌రికీ తెలియ‌జేస్తుంది. ఏ అభ్య‌ర్థి బాగా పనిచేస్తారనేది ఓట‌ర్లు నిర్ణ‌యించుకుంటారు. సామాజిక భ‌ద్ర‌త‌కు సంబంధించిన అంశాల‌పై ప్ర‌ధానంగా దృష్టి పెడ‌తారు" అని జియ్య‌న్న బీబీసీకి తెలిపారు.

మెరుగైన విద్యావకాశాలు లభిస్తున్నాయి

ప్ర‌స్తుతం యానాం ప్ర‌భుత్వ విభాగంలో ప‌నిచేస్తున్న జురేకా సుల్తానా బీబీసీతో మాట్లాడుతూ ఫ్రెంచ్ పౌర‌సత్వం విష‌యంలో తొలినాళ్ల‌లో కొంత స‌మ‌స్య ఎదురైనా ప్ర‌స్తుతం ఎలాంటి ఇబ్బందీ లేదన్నారు.

"భార‌త‌ ఓట‌ర్లు ఎంత ఆస‌క్తిగా తమ ఎన్నిక‌లకు సిద్ధ‌మ‌వుతారో మేం కూడా అదే రీతిలో ఫ్రాన్స్ ఎన్నిక‌ల్లో భాగ‌స్వాముల‌వుతాం. ముఖ్యంగా పిల్ల‌ల భ‌విష్య‌త్తుకు సంబంధించిన విష‌యాలను ప‌రిగ‌ణ‌నలోకి తీసుకుంటాం. ఫ్రెంచ్ పౌర‌స‌త్వం రావ‌డంతో విద్య అందుబాటులోకి వ‌చ్చింది. యూర‌ప్‌లోని అన్ని దేశాల్లోనూ సులువుగా ప్ర‌యాణాలు చేసేందుకు అవ‌కాశం ద‌క్కింది. ఫ్రాన్స్ ప్ర‌భుత్వం నుంచి ప‌లు ప్ర‌యోజ‌నాలు అందుతున్నాయి" అని ఆమె తెలిపారు.

పిల్ల‌లిద్ద‌రూ ఫ్రాన్స్‌లోనే

విద్య‌కు ఫ్రాన్స్‌లో ప్ర‌భుత్వం నుంచి మంచి ప్రోత్సాహం ఉంటుంద‌ని సాధ‌నాల బాబు బీబీసీకి వెల్ల‌డించారు.

"మా అమ్మ‌తో పాటు ఇద్ద‌రు పిల్ల‌లు ఫ్రాన్స్‌లో ఉన్నారు. అక్క‌డ ప్ర‌భుత్వం అన్ని ర‌కాల స‌దుపాయాలు క‌ల్పిస్తోంది. యానాం స‌హా ప్ర‌పంచంలోని 52 దేశాల ప‌రిధిలో ఫ్రెంచ్ పౌరులున్నారు. అంద‌రి సంక్షేమం విష‌యంలో శ్ర‌ద్ధ వ‌హిస్తారు. ఫ్రాన్స్ బ‌య‌ట ఉన్న పౌరుల త‌రపున ప్ర‌తినిధుల‌ను ఎన్నుకుంటాము. మా స‌మ‌స్య‌ల ప‌రిష్కారం విష‌యంలో వారు కృషి చేస్తారు. తుఫాన్లు, ఇత‌ర ప్ర‌కృతి విప‌త్తుల స‌మ‌యంలోనే కాకుండా వృద్ధాప్య పింఛన్లు, ఇత‌ర స‌హాయ కార్య‌క్ర‌మాల‌న్నీ నిరాటంకంగా ఫ్రాన్స్ నుంచి పౌరుల‌కు చేరుతుంటాయి. వాటిని ప‌ర్య‌వేక్షించేందుకు యానాం ఫ్రెంచ్ పౌరుల త‌రపున ప్ర‌య‌త్నిస్తున్నాను" అని బాబు తెలిపారు.

పన్నులు తక్కువ

యూరోపియ‌న్ యూనియ‌న్ దేశాల కూట‌మికి మే 23 నుంచి 26 వ‌ర‌కూ పోలింగ్ జ‌ర‌గ‌బోతోంది. పుదుచ్ఛేరి ప‌రిధిలో ఉన్న ఓట‌ర్లు 26వ తేదీన త‌మ ఓటు హక్కు వినియోగించుకోబోతున్నారు. 28 దేశాల నుంచి 10 పార్టీల కూట‌ములు పాల్గొంటున్నాయి. మొత్తం 51.2 కోట్ల మంది ఓటు హ‌క్కు వినియోగించుకోబోతుండ‌గా అందులో తెలుగు వారు కూడా ఉన్నారు.

ఆనాటి చర్చి, ఫ్రెంచి వారి సమాధులు దర్శించేందుకు ఇప్పటికీ ఫ్రాన్స్ దేశస్తులు యానాం సందర్శనకు వస్తూ ఉంటారు.

ఒకనాడు ఇది పెద్ద వ్యాపార కూడలిగా ఉండేది కానీ యానాం-ఎదుర్లంక వంతెన 2001లో నిర్మాణం పూర్తి కావడంతో యానాం వ్యాపారం తగ్గుముఖం పట్టిందని స్థానిక వ్యాపారి కామిశెట్టి రాయుడు బీబీసీకి తెలిపారు.

పుదుచ్ఛేరి ప్రభుత్వం స్థానికులకు పలు సంక్షేమ పథకాలను అమలు చేస్తోంది. ముఖ్యంగా ఆంధ్ర ప్రదేశ్‌తో పోలిస్తే పన్నులు తక్కువ. దాంతో పెట్రోల్, మద్యం వంటి ధరల వ్యత్యాసం స్పష్టం. ఈ నేపథ్యంలో యానాం వెళ్లి వాటిని కొనుగోలు చేసేందుకు సమీప ఆంధ్ర ప్రదేశ్ ప్రజలు ఆసక్తి చూపిస్తుంటారు.

ఫ్రెంచ్ పౌరులకు ఫ్రాన్స్ నుంచి వృధాప్య పింఛన్ కిందే 900 యూరోలు పంపిస్తారని లబ్ధిదారులు చెబుతున్నారు. సామాజిక పింఛన్లతో పాటు ఇతర పథకాల అమలు కూడా సక్రమంగా జరిగేలా చూడడానికి తమ ప్రతినిధుల ఎంపిక పట్ల ఇక్కడి వారు ఆసక్తిగా ఉన్నారు.

ఇవి కూడా చదవండి.

(బీబీసీ తెలుగును ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్‌, ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)