స్ట్రాంగ్‌ రూముల్లో ఉండాల్సిన ఈవీఎంలు రోడ్లపై ఎలా దొరుకుతున్నాయి? ఈవీఎంలు దొరకడం వెనుక అసలు కథ

  • 21 మే 2019
ఈవీఎంలు దొరికాయా Image copyright AFP

ఎన్నికలు ముగియగానే, ముఖ్యంగా సోమవారం నుంచి దేశంలో అక్కడక్కడా ఈవీఎంలు దొరికాయని వార్తలు వస్తున్నాయి.

జిల్లా యంత్రాంగం ఒత్తిడితో కౌంటింగ్‌ సమయంలో ఈవీఎంలు మార్చేయడానికి కుట్ర చేస్తున్నారని విపక్ష నేతలు ఆరోపిస్తున్నారు.

ఉత్తర భారతదేశంలో అక్కడక్కడా ఈవీఎం, వీవీప్యాట్‌లు నిండిన ట్రక్కుల గురించి మీడియాలో చెబుతున్నారు. ఈవీఎంలు మార్చేస్తున్నారని అంటున్నారు. బిహార్, ఉత్తరప్రదేశ్‌లోని ఝాన్సీ, చందౌలీ, గాజీపూర్, డుమరియాగంజ్ నుంచి ఇలాంటి వార్తలు వస్తున్నాయి.

దీనిపై బిహార్ మాజీ ముఖ్యమంత్రి, ఆర్జేడీ చీఫ్ లాలూ ప్రసాద్ యాదవ్ భార్య రబ్రీ దేవి ఒక ట్వీట్ కూడా చేశారు. ఈవీఎం మెషీన్లు నిండిన ట్రక్కులను పట్టుకుంటున్నారని రాశారు.

ఆమె తన ట్వీట్‌లో "దేశంలో స్ట్రాంగ్ రూంల దగ్గర ఈవీఎంలు స్వాధీనం చేసుకుంటున్నారు, ట్రక్కులు, ప్రైవేటు వాహనాల్లో ఉన్న ఈవీఎంలను పట్టుకుంటున్నారు. ఇవన్నీ ఎక్కడనుంచి వస్తున్నాయి? ఎక్కడికి వెళ్తున్నాయి? ఎప్పుడు, ఎందుకు, ఎవరు, వీటిని తీసుకెళ్తున్నారు? ఇది ముందే అనుకున్న ప్రక్రియలో భాగమా? ఎన్నికల కమిషన్ వెంటనే దీనిపై స్పష్టత ఇవ్వాలి" అన్నారు.

ఎన్నికల సంఘం అధికార ప్రతినిధి షెఫాలీ శరణ్ సోషల్ మీడియాలో ఈవీఎంల గురించి ఎన్నికల అధికారులు చేసిన ప్రకటనలను షేర్ చేశారు.

ఉత్తరప్రదేశ్ ఘాజీపూర్ జిల్లా ఎన్నికల అధికారి ట్విటర్‌లో ఘాజీపూర్‌లో ఈవీఎంలను పరిశీలించడానికి వచ్చిన అభ్యర్థులను అడ్డుకుంటున్నట్టు మీడియాలో వార్తలు వ్యాపించాయని చెప్పారు.

ఆయన ఈ వీడియోలో "స్ట్రాంగ్ రూంలో ఉండే ఈవీఎంలు పరిశీలించడానికి ప్రతి అభ్యర్థికీ చెందిన ఒక్కొక్క వ్యక్తికి మూడు కలెక్షన్ పాయింట్ల దగ్గర ఎనిమిదేసి గంటలు పాస్ జారీ చేయాలని ఘాజీపూర్‌లో రిటర్నింగ్ ఆఫీసర్ నిర్ణయించారు. కానీ చాలా ప్రాంతాల్లో ఒక్కోసారి ముగ్గురికి, ఒక్కోసారి ఐదుగురికి పాస్ ఇవ్వాలని డిమాండ్ చేశారు. దానికి అధికారులు నిరాకరించారు" అని చెప్పారు.

Image copyright Getty Images

ఝాన్సీ జిల్లా ఎన్నికల అధికారి కూడా ఇదే విషయంపై ట్విటర్ ద్వారా సమాచారం ఇచ్చారు.

ఆయన తన సందేశంలో "ఝాన్సీలో ఒకే పోలింగ్ పార్టీ ఉంటుంది. అక్కడే స్ట్రాంగ్ రూం, అక్కడే కలెక్షన్ పాయింట్ ఉంది. ఎందుకంటే గరోటా, మావూ చాలా దూరంలో ఉండే అసెంబ్లీ నియోజకవర్గాలు. అందుకే కొన్ని పోలింగ్ పార్టీలు అక్కడి నుంచి రావడానికి ఆలస్యం అవుతోంది. అక్కడ ఉన్న అధికారులకు ఫాం నింపడానికి ఆలస్యం అవుతోంది. అందుకే స్ట్రాంగ్ రూం సీల్ చేయడానికి ఉదయం అవుతోంది. ఇక్కడ కూడా ఉదయం 7-7.30 కల్లా అన్ని ఈవీఎంలు మా స్ట్రాంగ్ రూంలో పెట్టేశాం. వాటికి జనరల్ అబ్జర్వర్, వచ్చిన అభ్యర్థుల ముందే సీల్ వేశాం. సీల్ వేసేటప్పుడు వీడియో తీశాం. అది సీసీటీవీ కెమెరా ముందే జరిగింది" అని చెప్పారు.

"ఉపయోగించని ఈవీఎంలు, వీవీ ప్యాట్‌ల కోసం ఒక స్ట్రాంగ్ రూం నిర్మించాం. ఎలాంటి గందరగోళం లేకుండా వాటిని విడిగా ఉంచాలనుకున్నాం. అభ్యంతరాలు వ్యక్తం చేసిన అభ్యర్థుల ముందు మేం వాటిని, వీవీప్యాట్‌లు చెక్ చేసి, వీటిలో ఏం లేవని కూడా చూపించాం" అన్నారు.

"ఫారంలు నింపకపోవడంతో స్ట్రాంగ్ రూం సీల్ చేయడం ఆలస్యం అయ్యింది. దీంతో కొంతమంది అభ్యర్థులకు అలా అనిపించింది. రిజర్వ్ అన్‌యూజ్డ్ ఈవీఎంల కోసం నిర్మించిన స్ట్రాంగ్ రూంను కూడా ఈసీ ఆదేశాలతోనే నిర్మించాం".

Image copyright Getty Images

ఎన్నికల సంఘం సమాధానం

దేశవ్యాప్తంగా ఈవీఎంలపై చర్చ జరుగుతుండడంతో ఈసీ దీనిపై ఒక ప్రకటన విడుదల చేసి క్లారిటీ ఇచ్చింది.

  1. ఘాజీపూర్: అభ్యర్థులు కంట్రోల్ రూం నిఘాపై ప్రశ్నలు లేవనెత్తారు. దానిని పరిష్కరించాం.
  2. చందౌలీ: కొందరు ఆరోపణలు చేస్తున్నారు, కానీ ఈవీఎంలు ప్రొటోకాల్ ప్రకారం సురక్షితంగా ఉన్నాయి.
  3. డుమరియాగంజ్: ఈవీఎంలు ప్రొటోకాల్ ప్రకారం సురక్షితంగా ఉన్నాయి. అనవసర ఆరోపణలు చేస్తున్నారు. డీఎం, ఎస్పీతో మాట్లాడి సమస్య పరిష్కరించాం.
  4. ఝాన్సీ: రాజకీయ పార్టీల అభ్యర్థుల సమక్షంలో ఈవీఎంలు సీల్ చేశాం. ఇక్కడ ఎలాంటి సమస్య లేదు.

ఈసీ తమ ప్రకటనలో "నిజానికి, ఈ సమస్యలు వచ్చిన అన్ని చోట్లా ఈవీఎంలు, వీవీప్యాట్లకు రాజకీయ పార్టీల అభ్యర్థుల ముందే సీళ్లు వేశాం. దాని వీడియో కూడా తీశాం. అక్కడ సీసీటీవీ కెమెరాలు కూడా ఉన్నాయి" అని కూడా చెప్పింది.

"అక్కడ సీపీఎఎఫ్ సెక్యూరిటీ గార్డులను కూడా మోహరించాం. ఒక సమయంలో, ఒక పాయింట్‌లో ప్రతి అభ్యర్థికి సంబంధించిన ఒక ప్రతినిధి 24 గంటలూ నిఘా పెట్టడానికి అనుమతి ఉంది. అందుకే ఈ ఆరోపణలు నిజం కాదు" అని తెలిపింది.

ఇవి కూడా చదవండి:

(బీబీసీ తెలుగును ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్‌, ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)