'వీవీప్యాట్ స్లిప్పులను ముందే లెక్కించాలి' - చంద్రబాబు నేతృత్వంలో ఈసీని కోరిన విపక్షాలు : ప్రెస్ రివ్యూ

  • 22 మే 2019
Image copyright TDP/FACEBOOK

'మళ్ళీ మోదీయే' అని ఎగ్జిట్ పోల్స్ మొత్తం కోడై కూసినా సరే.. ఏ అవకాశమూ జార విడుచుకోరాదని విపక్షాలు నిర్ణయించుకున్నాయి... కేంద్రంలో బీజేపీకి వ్యతిరేకంగా గట్టి కూటమి ఏర్పాటుకు బలమైన అడుగులు పడ్డాయంటూ ఆంధ్రజ్యోతి మొదటి పేజీ కథనాన్ని ప్రచురించింది.

ప్రతి అసెంబ్లీ నియోజకవర్గానికి అయిదు పోలింగ్ కేంద్రాల చొప్పున వీవీ ప్యాట్ స్లిప్పులను ముందే లెక్కించాలని కోరుతూ ఏపీ సీఎం చంద్రబాబు నేతృత్వంలో 22 రాజకీయ పార్టీల ప్రతినిధులు మంగళవారం దిల్లీలో ఈసీ అధికారులకు వినతి పత్రం సమర్పించారు. నెలరోజులుగా అనేక వినతి పత్రాలు ఇచ్చినా ఇంతకాలం ఎందుకు నిర్ణయం తీసుకోలేదని నేతలు ప్రశ్నించారని ఈ కథనంలో రాశారు.

అంతకుముందు, చంద్రబాబు నేతృత్వంలో సమావేశమైన విపక్ష నేతలు ఈసీ దృష్టికి తీసుకువెళ్ళాల్సిన అంశాలపై 40 నిమిషాల పాటు చర్చలు జరిపారు. అనంతరం అక్కడి నుంచి కిలోమీటర్ దూరంలో ఉన్న కేంద్ర ఎన్నికల సంఘం కార్యాలయానికి పాదయాత్రగా వెళ్ళాలని భావించారు. కానీ, పోలీసులు అభ్యంతరం చెప్పడంతో ఆ ఆలోచనను విరమించుకున్నారు.

మధ్యాహ్నం 3 గంటలకు సీసీసీ సునీల్ అరోడా, కమిషనర్లు అశోక్ లవాసా, సుశీల్ చంద్రతో కూడిన పూర్తి స్థాయి కమిషన్‌తో ఈ నేతలు సమావేశమయ్యారు.

సమావేశం తరువాత చంద్రబాబు మీడియాతో మాట్లాడుతూ, "ఈవీఎంలో ఓట్లు లెక్కించక ముందే ప్రతి అసెంబ్లీ నియోజకవర్గం పరిధిలో 5 వీవీప్యాట్ల స్లిప్పులను లెక్కించడానికి ఈసీకి వచ్చే సమస్యేంటో అర్థం కావడం లేదు" అని అన్నారు.

ఈసీకి ఇచ్చిన వినతిపత్రంపై సంతకం చేసిన వారిలో చంద్రబాబుతో పాటు కాంగ్రెస్ ప్రధాన కార్యదర్శి గులాం నబీ అజాద్, ఎస్పీ నేత రాంగోపాల యాదవ్, సీపీఎం ప్రధాన కార్యదర్శి సీతారం ఏచూరి, ఆప్ అధినేత దిల్లీ ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాలు, రాజస్థాన్ ముఖ్యమంత్రి అశోక్ గెహ్లాట్ తదితరులున్నారు.

Image copyright I&PR Telangana

నిధులు ఫుల్... పెండింగ్ నిల్

తెలంగాణ రాష్ట్ర ఆర్థిక వ్యవస్థ దేశంలోని మిగతా రాష్ట్రాల కంటే పటిష్ఠంగా ఉన్నదని రాష్ట్ర ఆర్థిక శాఖ ముఖ్య కార్యదర్శి కే. రామకృష్ణారావు స్పష్టం చేశారని 'నమస్తే తెలంగాణ' పత్రిక రాబడులు, రుణాల వివరాలతో ఒక కథనాన్ని ప్రచురించింది.

ఉద్యోగుల వేతనాలు, ఆసరా పింఛన్లు, ప్రాజెక్టుల బిల్లులు సకాలంలో చెల్లిస్తున్నామని, సంక్షేమ అభివృద్ధి పథకాలకు నిధుల కొరత లేదని రామకృష్ణారావు వివరించారని ఈ కథనంలో తెలిపారు. రాష్ట్ర ఆర్థిక తాజా పరిస్థితిపై ఆయన మంగళవారం సచివాలయంలో మీడియా సమావేశం నిర్వహించారు. రాష్ట్ర స్థూల ఉత్పత్తి గణనీయంగా పెరిగిందన్నారు. తాజా గణాంకాల ప్రకారం, 2018-19 ఆర్థిక సంవత్సరంలో వివిధ రంగాల్లో రాష్ట్రం మొత్తం సంపదం రూ. 8,66,875 కోట్లకు పెరిగిందని, గత ఆర్థిక సంవత్సరంలో ఈ మొత్తం రూ. 7,53,804 కోట్లుగా ఉందని ఆర్థిక శాఖ ముఖ్య కార్యదర్శి వివరించినట్లు ఈ కథనంలో తెలిపారు.

ఇంకా, ప్రభుత్వ సంక్షేమ పథకాలకు, ఫ్లాగ్ షిప్ కార్యక్రమాలకు చాలినన్ని నిధులు ఉన్నాయని, ఇప్పటికే ఓటాన్ అకౌంట్ బడ్జెట్‌లో ఆరు నెలల వరకు రైతు బంధు, వ్యవసాయ రుణ మాఫీ, ఆసరా పెన్షన్లకు సరిపడా నిధులను వాడుకోవడానికి చట్టసభ అనుమతి తీసుకున్నామని ఆయన గుర్తు చేసినట్లు ఈ వార్తలో పేర్కొన్నారు.

ఇకపోతే, వివిధ శాఖల వారీగా కాంట్రాక్టర్లకు చెల్లించాల్సిన బిల్లులు రూ. 3,474.22 కోట్లు మాత్రమే పెండింగ్‌లో ఉన్నాయని, అవి కూడా నిధుల కొరత వల్ల కాకుండా వివిధ సాంకేతిక కారణాల వల్ల, స్పష్టత లేకపోవడం వల్లనే ఆగిపోయాయని ఆర్థిక శాఖ ముఖ్య కార్యదర్శి తెలిపినట్లు ఈ కథనంలో వివరించారు.

Image copyright KIPL Barrage 2

కాళేశ్వరం, పాలమూరు ప్రాజెక్టులకు రూ. 14 వేల కోట్లు

తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్ఠాత్మకంగా చేపడుతున్న కాళేశ్వరం, పాలమూరు -రంగారెడ్డి ప్రాజెక్టుల నిర్మాణాలను పూర్తి చేయడానికి అవసరమైన రుణాలు ఇచ్చేందుకు పవర్ ఫైనాన్స్ కార్పొరేషన్ (పీఎఫ్‌సీ) అంగీకరించిందంటూ సాక్షి దినపత్రిక ఒక వార్తను ప్రచురించింది.

పీఎఫ్‌సీ బోర్డు సమావేశంలో ఈ రెండు ప్రాజెక్టులకు కలిపి రూ. 14,000 కోట్ల రూపాయల రుణం ఇచ్చేందుకు సమ్మతించినట్లు సంస్థ చైర్మన్ రాజీవ్ శర్మ ప్రభుత్వ ఉన్నతాధికారులకు తెలిపినట్లు ఈ కథనంలో రాశారు. ఈ మొత్తంలో కాళేశ్వ రం ప్రాజెక్టురు రూ. 10,000 కోట్ల రుణం ఇవ్వనున్నట్లు పేర్కొన్నారు.

తెలంగాణలో నిర్మిస్తున్న వివిధ నీటి పారుదల ప్రాజెక్టులకు రుణాలు పొందేందుకు ముఖ్యమంత్రి కేసీఆర్ ఆదేశాల మేరకు రాష్ట్ర ప్రభుత్వ సీఎస్ ఎస్.కె. జోషి, ఈఎన్‌సీ హరిరామ్ గతంలోనే పీఎఫ్‌సీతో చర్చించారు.

ఇప్పటికే వివిధ బ్యాంకులు, కార్పొరేషన్ల ద్వారా కాళేశ్వరం ప్రాజెక్టుకు మొత్తం 40,000 కోట్ల రూపాయల రుణం తీసుకుని 27 వేల కోట్ల రూపాయలు ఖర్చు చేశారు. కొత్త రుణం తీసుకుంటే ఈ ప్రాజెక్టు కోసం తీసుకున్న రుణ మొత్తం రూ. 50,000 కోట్లకు చేరుకుంటుంది.

పాలమూరు-రంగారెడ్డి ప్రాజెక్టు వరద నీటిపై ఆధారపడింది కావడంతో రిజర్వాయర్లు, కాల్వల నిర్మాణాలకు బ్యాంకులు నేరుగా రుణాలిచ్చే పరిస్థితి లేదు. వీటితో పాటు ఎలక్ట్రో మెకానికల్ పనులకు రూ. 17 వేల కోట్లు అవసరం ఉండగా రూ. 4,000 కోట్లు ఇచ్చేందుకు పీఎఫ్‌సీ ముందుకు వచ్చింది.

ఇక రూరల్ ఎలక్ట్రిక్ కార్పొరేషన్ (ఆర్ఈసీ) ద్వారా కూడా కాళేశ్వరం ప్రాజెక్టుకు మరో 18 వేల కోట్ల రూపాయల రుణం తీాసుకోవాలని ప్రభుత్వ స్థాయిలో నిర్ణయం జరిగిందని ఈ కథనంలో తెలిపారు.

గోదావరి జిల్లాల్లో గోదారమ్మ పరవళ్లు, పచ్చని పంట పొలాలు

గోదావరి జల కాలుష్యం

గోదావరి నది కాలుష్య కాసారంలా మారిపోతోందని, పంట కాల్వలు మురుగు కూపాలవుతున్నాయని ఈనాడు దినపత్రిక ప్రత్యేక కథనాన్ని ప్రచురించింది. పట్టణాలు, పల్లెల నుంచి వచ్చే మురుగును, వివిధ పరిశ్రమల వ్యర్థాలను శుద్ధి చేయకుండానే విచ్చలవిడిగా నదిలోకి వదిలేయడం వల్ల పంట కాల్వలు మురికి కూపాల్లా మారిపోతున్నాయని ఈ కథనంలో తెలిపారు.

ఉభయ గోదావరి జిల్లాల్లో పంట కాల్వలు 3,000 కిలోమీటర్ల మేర ఉన్నాయి. దాదాపు 300 కిలోమీటర్ల పరిధిలో వాటి దుస్థితిని క్షేత్ర స్థాయిలో పరిశీలించి ఈ కథనాన్ని ప్రచురించారు.

బ్యాక్టీరియా, సూక్ష్మ జీవులతో కలుషితమైన గోదావరి నీరు ఇప్పుడు పంట కాల్వల్లోకి వస్తోందని, ఆక్వా విస్తరణతో క్రిమి సంహారక మందుల అవశేషాలు ఈ నీళ్ళలో కలిసిపోతున్నాయని ఈ కథనం వివరించింది.

ఈ జిల్లాల్లో కొన్ని చోట్ల పంచాయతీలు సరఫరా చేస్తున్న రక్షిత తాగునీటిలో వ్యాధి కారక ఈకోలి కనిపించినట్లు పరిశోధనల్లో తేలిందని కూడా ఈ వార్తా కథనం తెలిపింది.

ఇవి కూడా చదవండి:

(బీబీసీ తెలుగును ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్‌, ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)