ఆంధ్రప్రదేశ్ ఎన్నికల ఫలితాలు: మహిళా ఎమ్మెల్యేలలో అత్యధికులు గుంటూరు జిల్లా నుంచే

  • 25 మే 2019
రోజా, మాధవీలత Image copyright FACEBOOK/ROJASELVAMANI/ACTORMADHAVILATHA
చిత్రం శీర్షిక రోజా వైసీపీ తరఫున, మాధవీలత బీజేపీ తరఫున పోటీ చేశారు

ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీ ఎన్నికల్లో మొత్తం 2,186 మంది అభ్యర్థులు పోటీ పడగా, వారిలో మహిళా అభ్యర్థులు 187 మంది మాత్రమే. మరి, ఆ కొద్ది మంది మహిళల్లోనూ గెలిచిందెవరు? ఓడిందెవరు?

రాష్ట్ర అసెంబ్లీలో మొత్తం 175 ఎమ్మెల్యే స్థానాలు ఉండగా, తాజాగా గెలుపొందిన ఎమ్మెల్యేల్లో 14 మంది మాత్ర‌మే మ‌హిళ‌లు ఉన్నారు. అంటే, 8 శాతం సీట్లు మాత్రమే మహిళలకు దక్కాయి.

రాష్ట్రంలో మొత్తం 1,98,79,421 మంది మ‌హిళా ఓట‌ర్లున్నారు. ఈ సంఖ్య పురుషుల క‌న్నా ఎక్కువే. పురుష ఓటర్లు 1,94,62,339 మాత్ర‌మే.

వారిలో 1,57,87,759 మంది మహిళలు, 1,55,45,211 మంది పురుషులు ఓటు హ‌క్కు వినియోగించుకున్నారు. అంటే, ఓటింగ్‌లోనూ మ‌హిళ‌లే ముందున్నారు. కొన్ని చోట్ల అర్ధరాత్రి వ‌ర‌కూ క్యూలో నిలబడి మ‌హిళ‌లు ఓటు హ‌క్కు వినియోగించుకున్నారు.

ఫ‌లితాల్లో మాత్రం మ‌హిళ‌ల ప్రాతినిధ్యం నామమాత్రంగా క‌నిపిస్తోంది. ఈసారి మ‌హిళా ఎమ్మెల్యేల్లో అత్య‌ధికంగా గుంటూరు జిల్లా నుంచి విజ‌యం సాధించారు.

ఈ జిల్లాలో వైసీపీ త‌రఫున ముగ్గురు మ‌హిళా ఎమ్మెల్యేలు విజ‌యం సాధించారు. వారిలో సీనియ‌ర్ ఎమ్మెల్యే మేక‌తోటి సుచ‌ర‌తి ప్ర‌త్తిపాడు నుంచి, తొలిసారిగా బ‌రిలో దిగిన విడ‌ద‌ల ర‌జ‌నీ చిల‌క‌లూరిపేట నుంచి, ఉండ‌వ‌ల్లి శ్రీదేవి తాడికొండ నుంచి గెలుపొందారు.

ప్రధాన పార్టీల తరఫున పోటీ చేసిన మహిళాల్లో గెలిచిందెవరు? ఓడిందెవరు?

క్ర. సం నియోజకవర్గం అభ్యర్థి పార్టీ ఫలితం
1 తిరువూరు (ఎస్సీ) పోలే శాంతి బీజేపీ ఓటమి
2 నందిగామ (ఎస్సీ) తంగిరాల సౌమ్య టీడీపీ ఓటమి
3 పామర్రు (ఎస్సీ) ఉప్పులేటి కల్పన టీడీపీ ఓటమి
4 పామర్రు (ఎస్సీ) మేడేపల్లి ఝాన్సీ జనసేన+ ఓటమి
5 పెనమలూరు లామ్ తాంతియా కుమారి కాంగ్రెస్ ఓటమి
6 విజయవాడ వెస్ట్ షబానా ఖాతూన్ టీడీపీ ఓటమి
7 రాయదుర్గం బీజే వసుంధర దేవి బీజేపీ ఓటమి
8 పెనుకొండ పెద్దిరెడ్డిగారి వరలక్ష్మి జనసేన+ ఓటమి
9 పుట్టప్తర్తి కోట శ్వేత కాంగ్రెస్ ఓటమి
10 కల్యాణదుర్గం కేవీ ఉష శ్రీచరణ్ వైసీపీ విజయం
11 సింగనమల (ఎస్సీ) బండారు శ్రావణి టీడీపీ ఓటమి
12 సింగనమల (ఎస్సీ) జొన్నల గడ్డ పద్మావతి వైసీపీ విజయం
13 మదనపల్లి గంగారపు స్వాతి జనసేన+ ఓటమి
14 నగరి ఆర్కే రోజా వైసీపీ విజయం
15 నగరి ఎన్. ప్రవల్లిక జనసేన+ ఓటమి
16 పుంగనూరు అనీశ రెడ్డి టీడీపీ ఓటమి
17 తిరుపతి ఎం.సుగుణమ్మ టీడీపీ ఓటమి
18 శ్రీకాళహస్తి నగరం వినూత జనసేన+ ఓటమి
19 పూతలపట్టు లలితకుమారి టీడీపీ ఓటమి
20 పిఠాపురం మాకినీడు శేషుకుమారి జనసేన+ ఓటమి
21 రాజోలు (ఎస్టీ) బత్తుల లక్ష్మీకుమారి బీజేపీ ఓటమి
22 రాజమండ్రి సిటీ ఆదిరెడ్డి భవాని టీడీపీ విజయం
23 పెద్దాపురం తోటవాణి వైసీపీ ఓటమి
24 కాకినాడ రూరల్ పిల్లి అనంతలక్ష్మి టీడీపీ ఓటమి
25 అమలాపురం ఎస్సీ ఐతాబత్తుల సుభాషిణి కాంగ్రెస్ ఓటమి
26 గన్నవరం పాముల రాజేశ్వరి జనసేన+ ఓటమి
27 ప్రత్తిపాడు(ఎస్సీ) ఎం.సుచరిత వైసీపీ విజయం
28 గుంటూరు వెస్ట్ పసుపులేటి మాధవిలత బీజేపీ ఓటమి
29 తాడికొండ (ఎస్సీ) ఉండవల్లి శ్రీదేవి వైసీపీ విజయం
30 చిలకలూరి పేట వి.రజిని వైసీపీ విజయం
31 జమ్మలమడుగు వెన్నపూస సులోచన కాంగ్రెస్ ఓటమి
32 కోడూరు(ఎస్సీ) గోశాల దేవి కాంగ్రెస్ ఓటమి
33 బద్వేల్ (ఎస్సీ) పీఎం కమలమ్మ కాంగ్రెస్ ఓటమి
34 రాజంపేట ప్రత్తిపాటి కుసుమకుమారి జనసేన+ ఓటమి
35 పాణ్యం గౌరు చరితారెడ్డి టీడీపీ ఓటమి
36 పత్తికొండ కె.శ్రీదేవి వైసీపీ విజయం
37 ఎమ్మిగనూరు రేఖా జవ్వాజి జనసేన+ ఓటమి
38 ఆళ్లగడ్డ భూమా అఖిలప్రియ టీడీపీ ఓటమి
39 శ్రీశైలం నాయక్ సయ్యద్ తస్లీమా కాంగ్రెస్ ఓటమి
40 శ్రీశైలం సజ్జల సుజల జనసేన+ ఓటమి
41 ఆలూరు కోట్ల సుజాతమ్మ టీడీపీ ఓటమి
42 ఆలూరు ఆశాబేగం కాంగ్రెస్ ఓటమి
43 కందుకూరు చిలకపాటి సుశీల కాంగ్రెస్ ఓటమి
44 ఎర్రగొండపాలెం(ఎస్సీ) బూదాల అజితా రావు టీడీపీ ఓటమి
45 కోవూరు డాక్టర్ మారం విజయలక్ష్మి బీజేపీ ఓటమి
46 పాతపట్నం రెడ్డి శాంతి వైసీపీ విజయం
47 పాలకొండ (ఎస్టీ) వి.కళావతి వైసీపీ విజయం
48 పాలకొండ (ఎస్టీ) సునీత బీజేపీ ఓటమి
49 శ్రీకాకుళం గుండ లక్ష్మీదేవి టీడీపీ ఓటమి
50 పలాస గౌతు శిరీష టీడీపీ ఓటమి
51 పలాస మజ్జి శారద కాంగ్రెస్ ఓటమి
52 ఆముదాలవలస బొడ్డేపల్లి సత్యవతి కాంగ్రెస్ ఓటమి
53 అరకు (ఎస్టీ) పాచిపెంట శాంతకుమారి కాంగ్రెస్ ఓటమి
54 విశాఖ ఈస్ట్ ఎ. విజయనిర్మల వైసీపీ ఓటమి
55 పాడేరు (ఎస్టీ) గిడ్డి ఈశ్వరి టీడీపీ ఓటమి
56 పాడేరు (ఎస్టీ) భాగ్యలక్ష్మీ వైసీపీ విజయం
57 సాలూరు (ఎస్టీ) బోనెల గోవిందమ్మ జనసేన+ ఓటమి
58 నెల్లిమర్ల లోకం నాగమాధవి జనసేన+ ఓటమి
59 విజయనగరం అదితి గజపతి రాజు టీడీపీ ఓటమి
60 విజయనగరం పాలవలస యశస్వి జనసేన+ ఓటమి
61 కురుపాం (ఎస్టీ) పాముల పుష్పశ్రీవాణి వైసీపీ విజయం
62 శృంగవరపు కోట కోళ్ల లలితాకుమారి టీడీపీ ఓటమి
63 దెందులూరు జి.వెంకటలక్ష్మి జనసేన+ ఓటమి
64 కొవ్వూరు (ఎస్సీ) అనిత టీడీపీ ఓటమి
65 కొవ్వూరు (ఎస్సీ) వనిత తానేటి వైసీపీ విజయం
66 కొవ్వూరు (ఎస్సీ) అరుణకుమారి కాంగ్రెస్ ఓటమి
67 నిడదవోలు అటికల రమ్యశ్రీ జనసేన+ ఓటమి
Image copyright VIDADALARAJINI/FACEBOOK
చిత్రం శీర్షిక గుంటూరు జిల్లా చిల‌క‌లూరిపేట నుంచి విడద‌ల ర‌జినీ వైసీపీ తరపున పోటీ చేసి గెలిచారు

ఎక్కువ మంది వైసీపీ వారే

శ్రీకాకుళం నుంచి ఇద్ద‌రు మ‌హిళా ఎమ్మెల్యేలు ఎన్నిక‌య్యారు. వారిలో పాల‌కొండ నుంచి విశ్వ‌స‌రాయి క‌ళావ‌తి వ‌రుస‌గా రెండోసారి గెలిచారు. వైసీపీ త‌రఫున గెలిచిన ఆమెతో పాటుగా ఈసారి రెడ్డిశాంతి పాత‌ప‌ట్నం నుంచి తొలిసారిగా అసెంబ్లీలో అడుగుపెడుతున్నారు.

గ‌త ఎన్నిక‌ల్లో శ్రీకాకుళం ఎంపీ స్థానం నుంచి రెడ్డి శాంతి ఓట‌మి పాల‌యిన‌ప్ప‌టికీ ఈసారి శాస‌న‌స‌భ‌లో సీటు ద‌క్కించుకున్నారు.

విజ‌య‌న‌గ‌రం జిల్లా కురుపాం నుంచి వైసీపీ త‌రఫున పాముల పుష్ప శ్రీవాణి మ‌రోసారి విజ‌యం సాధించారు.

విశాఖ జిల్లా పాడేరు నుంచి కొత్త‌ప‌ల్లి భాగ్య‌ల‌క్ష్మి కూడా వైసీపీ అభ్య‌ర్థిగా తొలిసారిగా బ‌రిలో దిగి గెలిచారు. ప‌శ్చిమ గోదావ‌రి జిల్లా కొవ్వూరులో వైసీపీ త‌రుపున పోటీ చేసిన తానేటి వ‌నిత విజ‌యం ద‌క్కించుకున్నారు. ఆమె గ‌తంలో టీడీపీ త‌రఫున అసెంబ్లీకి ప్రాతినిధ్యం వ‌హించారు. గ‌డిచిన ఎన్నిక‌ల్లో ఓట‌మి పాల‌యిన‌ప్ప‌టికీ ఈసారి ఎమ్మెల్యేగా విజ‌యం సాధించారు.

తూర్పుగోదావ‌రి జిల్లా నుంచి కూడా ఇద్ద‌రు మ‌హిళా ఎమ్మెల్యేలు చెరో పార్టీ నుంచి గెలిచారు. ఇద్ద‌రూ మొద‌టిసారిగా పోటీ చేసి విజ‌యం సాధించ‌డం విశేషం. వారిలో 'రాజ‌మండ్రి సిటీ' స్థానం నుంచి కేంద్ర‌ మాజీ మంత్రి ఎర్రంనాయుడు కుమార్తె ఆదిరెడ్డి భ‌వానీ టీడీపీ త‌రుపున పోటీచేసి గెలుపొందారు. రంప‌చోడ‌వ‌రం నుంచి ఉపాధ్యాయురాలిగా ప‌నిచేసి రాజ‌కీయాల్లోకి వ‌చ్చిన నాగుల‌ప‌ల్లి ధ‌న‌ల‌క్ష్మి విజయం సాధించారు.

Image copyright FACEBOOK/PUSHPA SREEVANI
చిత్రం శీర్షిక విజ‌య‌న‌గ‌రం జిల్లా కురుపాం నుంచి రెండోసారి ఎమ్మెల్యేగా పాముల పుష్పశ్రీవాణి గెలిచారు

అనంత‌పురం జిల్లాలో కూడా ఇద్ద‌రికి అవ‌కాశం ద‌క్కింది. శింగ‌న‌మ‌ల నుంచి జొన్న‌ల‌గ‌డ్డ ప‌ద్మావ‌తి రెండో ప్ర‌య‌త్నంలో గెలుపొందారు. క‌ళ్యాణ‌దుర్గం నుంచి ఉష‌శ్రీ చ‌ర‌ణ్ కూడా విజ‌యం సాధించారు. ఈ ఇద్ద‌రూ వైసీపీ తరఫున గెలిచారు.

క‌ర్నూలు జిల్లా పత్తికొండలో కే. శ్రీదేవి గెలిచారు. ఆమె తొలిసారిగా పోటీ చేసి విజ‌యం ద‌క్కించుకున్నారు. ఉప ముఖ్య‌మంత్రి కేఈ కృష్ణ‌మూర్తి వార‌సుడిగా రంగంలో దిగిన కేఈ శ్యామ్‌ని ఓడించారు.

చిత్తూరు జిల్లా నుంచి ఒక్క‌రికే అవ‌కాశం ద‌క్కింది. సీనియ‌ర్ నేత ఆర్కే రోజా వ‌రుస‌గా రెండోసారి న‌గ‌రి నుంచి వైసీపీ త‌రఫున విజ‌యం సాధించారు. అంత‌కుముందు ఆమె రెండుసార్లు టీడీపీ త‌రఫున బ‌రిలో నిలిచి ఓట‌మి పాల‌య్యారు.

కృష్ణా, ప్ర‌కాశం, నెల్లూరు, క‌డ‌ప‌ జిల్లాల్లో ఒక్క మ‌హిళ‌కు కూడా ప్రాతినిధ్యం ద‌క్క‌లేదు. ఈ నాలుగు జిల్లాల ప‌రిధిలోని 48 అసెంబ్లీ స్థానాల‌కు గానూ ఒక్క మ‌హిళ‌కు చోటు లేక‌పోవ‌డం విశేషంగా క‌నిపిస్తోంది.

వివిధ పార్టీల త‌రుపున పోటీ చేసేవారి సంఖ్యే త‌క్కువ‌గా క‌నిపించ‌గా వారిలో విజ‌యం ద‌క్కించుకున్న వారు మ‌రింత త‌క్కువ‌గా ఉన్నారు.

Image copyright SRUTHI DEVI/FB
చిత్రం శీర్షిక అరకు లోక్‌సభ స్థానం నుంచి తండ్రి కిషోర్ చంద్ర దేవ్‌పై పోటీ చేసిన శ్రుతి దేవి (కాంగ్రెస్) పరాజయం పొందారు

పార్లమెంటుకు వెళ్తున్నది ఎవరు?

ఏపీ నుంచి పార్ల‌మెంట్‌కు న‌లుగురు మ‌హిళ‌లు విజ‌యం సాధించారు. ఆ న‌లుగురూ వైసీపీ అభ్య‌ర్థులే.

25 మంది ఎంపీల‌కు గానూ న‌లుగురు మ‌హిళా నేత‌లు విజ‌యం ద‌క్కించుకోగా వారిలో సీనియ‌ర్ నాయకురాలు వంగా గీత ఉన్నారు. ఆమె గ‌తంలో ఏపీ అసెంబ్లీతో పాటుగా రాజ్య‌స‌భ‌కు కూడా ప్రాతినిధ్యం వ‌హించారు. ఈసారి పార్ల‌మెంట్‌లో దిగువ స‌భ‌కు ఎన్నిక‌య్యారు.

తొలిసారిగా పోటీ చేసిన మ‌రో ముగ్గురు మ‌హిళా నేత‌లు డాక్ట‌ర్ భీశెట్టి వెంక‌ట స‌త్య‌వతి అన‌కాప‌ల్లి నుంచి, గొడ్డేటి మాధ‌వి అర‌కు నుంచి, చింతా అనురాధ అమ‌లాపురం నుంచి గెలిచారు.

2014 ఎన్నిక‌ల్లో ఏపీ నుంచి ఇద్ద‌రు మ‌హిళ‌లు మాత్ర‌మే ఎంపీలుగా గెలిచారు. క‌ర్నూలు నుంచి బుట్టా రేణుక‌, అర‌కు నుంచి కొత్త‌ప‌ల్లి గీత అప్ప‌ట్లో గెల‌వ‌గా, ఈసారి వారిద్ద‌రూ పోటీకి దూరంగా ఉన్నారు. అయినా, మ‌హిళా ప్రాతినిధ్యం రెట్టింప‌య్యింది.

Image copyright SRIDEVI/FB
చిత్రం శీర్షిక కర్నూలు జిల్లా పత్తికొండ అసెంబ్లీ నియోజకవర్గంలో వైసీపీ తరఫున బరిలో నిలిచిన శ్రీదేవి విజయం సాధించారు

33 రిజర్వేషన్ ఇవ్వాల్సిందే

ఆంధ్ర‌ప్ర‌దేశ్ అసెంబ్లీలో మ‌హిళ‌లకు త‌గిన రీతిలో ప్రాతినిధ్యం ద‌క్క‌క‌పోవ‌డం ప‌ట్ల ఐద్వా రాష్ట్ర కార్య‌ద‌ర్శి డి. ర‌మాదేవి అసంతృప్తి వ్య‌క్తం చేశారు. ఆమె త‌న అభిప్రాయాల‌ను బీబీసీతో పంచుకున్నారు.

"దాదాపుగా అన్ని పార్టీల‌లోనూ మ‌హిళ‌ల‌కు త‌గిన ప్రాతినిధ్యం ద‌క్క‌లేదు. గెలుపు గుర్రాల పేరుతో పోటీ చేసే అవ‌కాశ‌మే అంతంత‌మాత్రంగా ద‌క్క‌డంతో గెలిచిన వారి సంఖ్య కూడా నామ‌మాత్రంగా ఉంది. ఓటర్లలో స‌గానికి పైగా ఉన్న మ‌హిళ‌ల‌కు అందుకు త‌గ్గ‌ట్టుగా అవ‌కాశాలు లేక‌పోవ‌డంతో మ‌హిళా స‌మ‌స్య‌ల ప్ర‌స్తావ‌న కూడా అదే రీతిలో ఉంటోంది. ఓట్ల కోసం మ‌హిళ‌ల‌ను మెప్పించే ప్ర‌య‌త్నం చేసిన పార్టీల నేత‌లు పోటీ చేసేందుకు మాత్రం వారికి అవ‌కాశం ఇవ్వ‌డం లేదు. మహిళలకు 33 శాతం రిజ‌ర్వేష‌న్ కల్పించే బిల్లు ఆమోదించాల్సిన అవ‌స‌రాన్ని ఈ అనుభ‌వం మ‌రోసారి చాటుతోంది. ఈ స‌భ‌లోన‌యినా అందుకు త‌గ్గ‌ట్టుగా నిర్ణ‌యం తీసుకోవాలి" అని ఆమె అన్నారు.

విజ‌య‌వాడ‌కు చెందిన ర‌చ‌యిత దుట్టా శ‌మంత‌క‌మ‌ణి మాట్లాడుతూ... మ‌హిళ‌ల‌కు చ‌ట్ట స‌భ‌ల్లో ప్రాతినిధ్యం ద‌క్క‌క‌పోవ‌డం విచార‌క‌ర‌మ‌న్నారు.

"మ‌హిళ‌లు అన్ని రంగాల్లోనూ రాణిస్తున్నారు. రాజ‌కీయాల్లో కూడా ముందుకొస్తున్నారు. కానీ, అవ‌కాశాలు లేక‌పోవ‌డంతో తెర‌మ‌రుగు అవుతున్నారు. ఏపీ అసెంబ్లీలో అతి త‌క్కువ సంఖ్య‌లో మ‌హిళ‌ల‌కు ప్రాతినిధ్యం ద‌క్క‌డానికి రాజ‌కీయ పార్టీలు, నేత‌ల తీరే కార‌ణం. ఈ తీరు మారాల్సిన అవ‌స‌రం ఉంది" అని అభిప్రాయపడ్డారు.

ఇవి కూడా చదవండి:

(బీబీసీ తెలుగును ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్‌, ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)