చంద్రబాబు, జగన్, పవన్‌.. విజేత ఎవరో ఎన్నింటికి తెలుస్తుంది

  • 22 మే 2019
చంద్రబాబు, పవన్, జగన్

ఆంధ్రప్రదేశ్‌ ఎన్నికల ఫలితాల కోసం రాజకీయ పార్టీలు, అభ్యర్థులే కాదు సాధారణ ప్రజలూ ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు.

కౌంటింగ్‌ ప్రారంభం కావడానికి ఇంకా కొద్దిగంటలే ఉండడంతో 6 వారాల నిరీక్షణకు తెరపడే సమయం ఆసన్నమైంది.

ఆంధ్రప్రదేశ్ ఎన్నికల్లో ఈసారి విజయం ఎవరిది..? ఏపీలో కొత్త ప్రభుత్వం ఏర్పాటు చేసేదెవరు? చంద్రబాబే మళ్లీ ముఖ్యమంత్రవుతారా.. లేదంటే వైఎస్ జగన్‌ సీఎం కానున్నారా.. ఈ ఇద్దరినీ కాదని ప్రజలు ఆదరిస్తే పవన్ కల్యాణ్‌కు అవకాశం దక్కుతుందా? అన్న ప్రశ్నలకు మరికొన్ని గంటల్లో సమాధానం దొరకనుంది.

మరోవైపు ఓట్ల లెక్కింపు కోసం అన్ని ఏర్పాట్లూ ఇప్పటికే పూర్తయ్యాయని రాష్ట్ర ఎన్నికల ప్రధాన అధికారి గోపాలకృష్ణ ద్వివేది వెల్లడించారు.

Image copyright I&prANDHRAPRADESH

ఈవీఎంల లెక్కింపు 8.30 గంటలకు ప్రారంభం

తొలుత పోస్టల్‌ బ్యాలెట్లు, సర్వీస్‌ ఓట్లు లెక్కించిన తరువాత ఉదయం 8.30 గంటలకు ఈవీఎంల లెక్కింపు ప్రారంభిస్తామని ద్వివేది తెలిపారు.

మధ్యాహ్నం 12గంటల లోపు ఫలితాల సరళి తెలిసిపోతుందని ఆయన చెప్పారు.

వీవీప్యాట్‌ రశీదులను లెక్కించిన తరువాత ఫలితాలు అధికారికంగా ప్రకటిస్తామని ఆయన అన్నారు.

Image copyright I&prANDHRAPRADESH

లెక్కింపు కేంద్రాల్లో ఫోన్లకు అనుమతి లేదు

లెక్కింపు 36 కేంద్రాల్లో చేపడతారని, మొత్తం 25 వేల మంది సిబ్బంది లెక్కింపులో పాల్గొంటారని, ప్రతి అసెంబ్లీ స్థానానికి ఒక పరిశీలకుడు, పార్లమెంట్‌ స్థానానికి మరో పరిశీలకుడు ఉంటారని ద్వివేదీ తెలిపారు.

రిటర్నింగ్ అధికారులు, పరిశీలకుల ఆధ్వర్యంలో లెక్కింపు జరుగుతుంది.

రాష్ట్రంలో ఓట్ల లెక్కింపు సరళిని పరిశీలించేందుకు ఈసీఐ నుంచి ఇద్దరు పరిశీలకులు రాష్ట్రానికి వచ్చారని ఆయన చెప్పారు.

పోలింగ్‌ కేంద్రాల వద్ద మూడంచెల భద్రత ఉంటుందని.. కేంద్రానికి 100 మీటర్ల దూరం నుంచే వాహనాలను అనుమతించరని.. చివరి అంచెలో సీపీఎంఎఫ్‌ బలగాలు ఉంటాయని చెప్పారు. మొత్తం 25వేల మంది పోలీసులను మోహరిస్తున్నట్లు తెలిపారు.

లెక్కింపు కేంద్రాల్లోకి సెల్‌ఫోన్లకు అనుమతి లేదని, బయట ఏర్పాటుచేసే కౌంటర్లలోనే ఫోన్లు ఉంచాలని చెప్పారు.

ఇ-సువిధ యాప్‌, ఈసీఐ వెబ్‌సైట్‌లో ఫలితాలు చూడొచ్చని సూచించారు.

Image copyright I&prANDHRAPRADESH
చిత్రం శీర్షిక లెక్కింపు కోసం 25 వేల మంది సిబ్బందికి శిక్షణ ఇచ్చారు.

లాటరీ ద్వారా వీవీ ప్యాట్ల ఎంపిక

వీవీప్యాట్‌ స్లిప్పులు లెక్కింపు కోసం లాటరీ తీసి వీవీ ప్యాట్లను ఎంపిక చేస్తామని.. అసెంబ్లీ, పార్లమెంట్‌ స్థానాలకు వేర్వేరుగా ఎంపిక చేస్తామని ద్వివేదీ వెల్లడించారు.

మధ్యాహ్నం 2 గంటల నాటికి చాలా వరకు ఫలితాలు తెలిసిపోయే అవకాశం ఉంది. వీవీప్యాట్‌ స్లిప్పుల్ని లెక్కించాక రాత్రి కల్లా ఈసీఐ అనుమతి తీసుకొని ఫలితాన్ని ప్రకటిస్తామని చెప్పారు.

Image copyright I&prANDHRAPRADESH

కౌంటింగ్ సందర్భంగా ప్రభుత్వ కార్యాలయాలు, విద్యాసంస్థలు సెలవులు

ఓట్ల లెక్కింపు సందర్భంగా ప్రభుత్వ కార్యాలయాలు, విద్యాసంస్థలకు సెలవులు ప్రకటించారు.

బార్ అండ్ రెస్టారెంట్లు గురువారం తెరవరాదని అధికారులు ఆదేశించారు.

ఇవి కూడా చదవండి:

(బీబీసీ తెలుగును ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్‌, ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)