వైసీపీ జోరు.. టీడీపీలో లోకేశ్ సహా మంత్రులు సైతం వెనుకంజ.. పవన్ సహా జనసేన అభ్యర్థులు డీలా

  • 23 మే 2019
ఏపీ అసెంబ్లీ ఎన్నికల్లో వైసీపీ అత్యధిక స్థానాల్లో ఆధిక్యంలో ఉంది Image copyright facebook/ysrcp
చిత్రం శీర్షిక ఏపీ అసెంబ్లీ ఎన్నికల్లో వైసీపీ అత్యధిక స్థానాల్లో ఆధిక్యంలో ఉంది

ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీ ఎన్నికల్లో వైసీపీ దూసుకుపోతోంది. ఉదయం 11 గంటలకు ఆ పార్టీ 120కి పైగా స్థానాల్లో ముందంజలో ఉండగా టీడీపీ అభ్యర్థులు 25 స్థానాల్లోనే ఆధిక్యంలో ఉన్నారు. ఈసారి త్రిముఖ పోరుకు కారణమైన జనసేన పార్టీ ఎక్కడా ఆధిక్యంలో లేదు.

వైసీపీ అధినేత వైఎస్ జగన్మోహనరెడ్డి పులివెందులలో భారీ ఆధిక్యంతో దూసుకుపోతుండగా.. టీడీపీ అధినేత చంద్రబాబు కుప్పంలో మూడు రౌండ్లు ముగిసే సమయానికి స్వల్ప ఆధిక్యంలో మాత్రమే ఉన్నారు.

ఇక జనసేన అధినేత పవన్ కల్యాణ్ తాను పోటీ చేసిన భీమవరంలో వెనుకంజలో ఉండగా.. గాజువాకలో స్వల్ప ఆధిక్యంలో ఉన్నారు.

ఏపీ మంత్రి నారా లోకేశ్ మంగళగిరి నియోజకవర్గంలో వెనుకంజలో ఉన్నారు. టీడీపీకి చెందిన మంత్రుల్లో చాలామంది ప్రతి రౌండ్లోనూ వైసీపీ అభ్యర్థుల కంటే వెనుకంజలోనే ఉన్నారు.

చిత్తూరు జిల్లా నగరి నియోజకవర్గంలో వైసీపీ నేత, సినీ నటి రోజా ఆధిక్యంలో ఉన్నారు.

Image copyright facebook/jagan

ఆ జిల్లాల్లో అన్ని నియోజకవర్గాల్లో ఫ్యాన్ గాలి

విజయనగరం, నెల్లూరు, కర్నూలు, కడప జిల్లాల్లోని అన్ని నియోజకవర్గాల్లో వైసీపీ అభ్యర్థులు ప్రతి రౌండ్లోనూ తమ ప్రత్యర్థులపై భారీ ఆధిక్యం చూపుతున్నారు.

విజయనగరం జిల్లా చీపురుపల్లిలో వైసీపీ కీలక నేత బొత్స సత్యనారాయణ ఆధిక్యంలో ఉన్నారు.

విజయనగరం అసెంబ్లీ నియోజకవర్గంలో కేంద్ర మాజీ మంత్రి పూసపాటి అశోక్ గజపతిరాజు కుమార్తె అదితిపై అక్కడి వైసీపీ అభ్యర్థి కోలగట్ల వీరభద్రస్వామి ఆధిక్యం చూపారు.

నెల్లూరులో మంత్రి నారాయణపై వైసీపీ అభ్యర్థి అనిల్ కుమార్ యాదవ్ ముందంజలో ఉన్నారు.

శ్రీకాకుళం జిల్లాలో పది నియోజకవర్గాలకు గాను వైసీపీ 9 చోట్ల ఆధిక్యంలో ఉంది.

టీడీపీకి గట్టి పట్టున్న జిల్లాగా చెప్పే కృష్ణా జిల్లాలో 10 చోట్ల వైసీపీ 6 చోట్ల టీడీపీ ముందంజలో ఉన్నాయి.

రాయలసీమ జిల్లాల్లో అత్యధిక నియోజకవర్గాల్లో వైసీపీ అభ్యర్థులు ముందంజలో ఉన్నారు.

ఇవి కూడా చదవండి:

(బీబీసీ తెలుగును ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్‌, ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)