కేఏ పాల్‌కు వచ్చిన ఓట్లు ఎన్ని?

  • 24 మే 2019
కేఏ పాల్ Image copyright Facebook/KA Paul
చిత్రం శీర్షిక ప్రజాశాంతి పార్టీ అధ్యక్షుడు కేఏ పాల్

ప్రజాశాంతి పార్టీ అధ్యక్షుడు కేఏ పాల్ 2019 ఆంధ్రప్రదేశ్ ఎన్నికల్లో చాలా హడావుడి చేశారు. వినూత్న ప్రచారశైలితో మీడియా దృష్టిని ఆకర్షించారు.

తనను గెలిపిస్తే లక్షల కోట్ల రూపాయల విరాళాలు తీసుకొచ్చి ఆంధ్రప్రదేశ్‌ను అమెరికా చేస్తానని చెప్పారు కేఏ పాల్‌.

ఆయన పశ్చిమగోదావరి జిల్లా నరసాపురం అసెంబ్లీ స్థానం నుంచి పోటీ చేసిన ఆయనకు 281 ఓట్లు (278 ఈవీఎం ఓట్లు, 3 పోస్టల్ ఓట్లు) వచ్చాయి. ఇక్కడ నోటాకు వచ్చిన ఓట్లు 1,143.

ఆంధ్రప్రదేశ్ ఎన్నికల్లో ప్రజా శాంతి పార్టీ (పీఎస్‌పీ) ప్రభంజనం సృష్టించబోతోందని చెప్పిన కేఏ పాల్ నరసాపురం లోక్‌సభ స్థానానికి కూడా పోటీ చేశారు. అక్కడ ఆయనకు వచ్చిన ఓట్లు 3037. నోటాకు లభించిన ఓట్లు 12,066.

ఆయనకంటే కొందరు స్వతంత్ర పార్టీల అభ్యర్థులకే ఎక్కువ ఓట్లు పోలయ్యాయి.

Image copyright FAcebook/KA Paul

‘ఆంధ్రాను అమెరికా చేస్తా’

ఎన్నికల ముందు ఆయన వివిధ టీవీ చానెళ్లకు ఇచ్చిన ఇంటర్వ్యూలలో ఆంధ్ర ప్రదేశ్ ప్రజలు మార్పు కోరుకుంటున్నారని చెప్పుకొచ్చిన పాల్... తామే అధికారంలోకి వస్తున్నామని ధీమాగా చెప్పుకొచ్చారు.

నామినేషన్ నుంచి ప్రచారం వరకు పాల్ తనదైన శైలిలో వినూత్నంగా ముందుకెళ్లారు. కోట్ల రూపాయలు విరాళాలు తీసుకొచ్చి ఆంధ్రప్రదేశ్‌ను అమెరికాగా తీర్చిదిద్దుతానని కూడా పాల్ అన్నారు.

Image copyright Facebook/KA Paul

‘రష్యా జోక్యం’

ఆ తరువాత ఆయన తన మాట మర్చారు. ఎన్నికలు పారదర్శకంగా జరగలేదని ఆరోపించారు. ఈవీఎంలో తన పార్టీ గుర్తుకు ఓటు వేస్తే అది మరొకరికి పడుతోందని, అందువల్ల ఎన్నికలు మళ్లీ నిర్వహించాలని డిమాండ్ చేశారు.

అంతేకాదు ఈ ఎన్నికల్లో రష్యా జోక్యం చేసుకుందని ఆరోపిస్తూ ఆయన ఫేసుబుక్ ఖాతాలో వీడియోలు కూడా పోస్టు చేశారు.

వైసీపీ విజయం

నరసాపురం అసెంబ్లీ స్థానంలో వైసీపీఐ అభ్యర్థి ముదునూరి ప్రసాద రాజు గెలుపొందారు. ప్రసాద రాజుకు 55,556 ఓట్లు రాగా, ఆయన సమీప ప్రత్యర్థి జనసేన పార్టీ అభ్యర్థి బొమ్మిడి నాయకర్‌కు 49,120 ఓట్లు పడ్డాయి.

టీడీపీ తరపున బరిలో నిలిచిన బండారు మాధవ నాయుడుకు 27,059 ఓట్లు లభించాయి.

నరసాపురం లోక్‌సభ స్థానాన్ని కూడా వైసీపీనే కైవసం చేసుకుంది. కనుమూరి రఘురామ కృష్ణ రాజు ఎంపీగా విజయం సాధించారు.

ఇవి కూడా చదవండి.

(బీబీసీ తెలుగును ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్‌, ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి)