ఆంధ్రప్రదేశ్‌లో బీజేపీ, కాంగ్రెస్ కంటే నోటాకే ఎక్కువ ఓట్లు

 • 25 మే 2019
కాంగ్రెస్, బీజేపీ ఎన్నికల గుర్తులు Image copyright Getty Images

ఆంధ్రప్రదేశ్‌లోని సాలూరు శాసనసభ నియోజకవర్గంలో వైసీపీ అభ్యర్థి రాజన్నదొర దాదాపు 20 వేల ఓట్ల మెజారిటీతో గెలుపొందారు.

ఆయనకు పోలైన ఓట్లలో 51.7 శాతం ఓట్లు పడ్డాయి. రెండో స్థానంలో నిలిచిన టీడీపీ అభ్యర్థికి 38.49 శాతం ఓట్లు వచ్చాయి.

ఇక ఇక్కడ నోటా గుర్తు మూడో స్థానంలో నిలిచింది. దీనికి 4,874 ఓట్లు పడ్డాయి. అంటే పోలైన ఓట్లలో 3.21 శాతం ఓట్లు నోటాకే పడ్డాయి.

వైసీపీ, టీడీపీతో సహా ఇక్కడి నుంచి ఐదు పార్టీల అభ్యర్థులు పోటీపడ్డారు. కాంగ్రెస్ నుంచి పోటీ చేసిన సుందర్ రావుకు కేవలం 1737 ఓట్లు (1.14శాతం ఓట్లు) రాగా, బీజేపీ అభ్యర్థి ఉదయ్ కుమార్‌కు 3268 ఓట్లు (2.15 శాతం ఓట్లు), జనసేన అభ్యర్థికి 3038 ఓట్లు (2.18 శాతం) వచ్చాయి.

ఇలా చాలా చోట్ల బీజేపీ, కాంగ్రెస్ అభ్యర్థుల కంటే నోటాకే ఎక్కువ ఓట్లు వచ్చాయి. కేవలం శాసన సభ ఎన్నికలకే కాకుండా పార్లమెంట్ ఎన్నికల్లోనూ ఇదే పరిస్థితి కనిపించింది.

ఆంధ్రప్రదేశ్ విభజన తర్వాత 2014లో జరిగిన ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ ఒక్క స్థానం కూడా గెలుచుకోలేకపోయింది. ఆ పార్టీ అభ్యర్థులు అన్నిచోట్లా డిపాజిట్లు కోల్పోయారు. ఇప్పుడు ఆ పార్టీ అదే ఫలితాలను నమోదు చేసింది.

గత ఎన్నికల్లో 4 శాసన సభ స్థానాలు గెలుచుకున్న బీజేపీ కూడా ఈసారి అన్నిచోట్ల డిపాజిట్లు కోల్పోయింది.

Image copyright Getty Images

ఫలితాల సరళిని గమనిస్తే రాష్ట్రంలోని 25 లోక్ సభ స్థానాలకు సంబంధించి నోటాకు 1.5 శాతం ఓట్లు పోలైతే, బీజేపీకి 0.96 శాతం, కాంగ్రెస్‌కు 1.29 శాతం ఓట్లు పడ్డాయి.

శాసన సభ విషయానికి వస్తే నోటాకు 1.28 శాతం ఓట్లు రాగా, బీజేపీకి 0.84 శాతం, కాంగ్రెస్ 1.17 శాతం ఓట్లు వచ్చాయి.

ముఖ్యంగా ఉత్తరాంధ్రాలోని చాలా నియోజకవర్గాల్లో బీజేపీ, కాంగ్రెస్‌ కంటే నోటాకే ఎక్కువ ఓట్లు పడ్డాయి.

నోటాకు అధిక ఓట్లు పడిన అసెంబ్లీ స్థానాలు:

 • అరకు- 9,991 (4.46%)
 • పాడేరు- 7,556 (5.55%)
 • సాలూరు- 4,874 (3.21%)
 • కురుపాం- 4,535 (3.17%)
 • చోడవరం- 5,033 (2.8%)
 • పాతపట్నం- 4,077 (2.76%)
 • గజపతినగరం- 4,638 (2.69%)

పార్లమెంటు ఎన్నికల్లోనూ...

నోటా విషయంలో అసెంబ్లీ ఎన్నికల ట్రెండే పార్లమెంటు ఎన్నికల్లోనూ కనిపించింది. అరకు పార్లమెంటు స్థానంలో నోటాకు 4.48 శాతం అంటే 47,330 ఓట్లు వచ్చాయి.

ఇక్కడ జనసేన అభ్యర్థికి వచ్చిన ఓట్లు 41,689 (3.95శాతం) మాత్రమే. ఇక బీజేపీ 17,406 (1.65శాతం), కాంగ్రెస్‌లకు 17,458 (1.65శాతం) ఓట్లు పడ్డాయి.

నోటాకు అధిక ఓట్లు పడిన లోక్‌సభ స్థానాలు

 • అరకు- 47,330 (4.48%)
 • అనకాపల్లి- 33,163 (2.82%)
 • విజయనగరం- 29,057 (2.42%)
 • శ్రీకాకుళం- 25,119 (2.21%)
 • విశాఖపట్నం- 12,780 (1.34%)

ఇవి కూడా చదవండి

(బీబీసీ తెలుగును ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్‌, ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)