ఏపీ అసెంబ్లీ ఫలితాలు: ఆ పది కీలక నియోజకవర్గాల్లో గెలిచిందెవరు.. ఓడిందెవరు?

  • 24 మే 2019
బాలకృష్ణ Image copyright facebook/nandamuribalakrishna

ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీ ఎన్నికల్లో ఈసారి వైసీపీ ప్రభంజనం సృష్టించడంతో కీలక నియోజకవర్గాల్లోనూ అనూహ్య ఫలితాలు వచ్చాయి.

ప్రధాన పార్టీల అధ్యక్షులు పోటీ చేస్తున్న నియోజకవర్గాలతో పాటు మరికొన్ని నియోజకవర్గాల్లో ఫలితాలపై ప్రజలు ఎంతో ఆసక్తి కనబరిచారు.

అక్కడ పోటీ చేస్తున్న నేతల కారణంగా కొన్ని.. స్థానిక రాజకీయాల కారణంగా మరికొన్ని నియోజకవర్గాలు ఈ ఎన్నికల్లో అందరి దృష్టినీ ఆకర్షించాయి.

అలాంటివాటిలో నుంచి ఈ పది నియోజకవర్గాలలో ఎవరెవరు గెలిచారో చూద్దాం.

Image copyright Tdp

కుప్పంలో గెలిచిన టీడీపీ జాతీయ అధ్యక్షుడు చంద్రబాబు

చిత్తూరు జిల్లాలోని కుప్పం నియోజకవర్గానికి 1989 నుంచి నారా చంద్రబాబునాయుడు ప్రాతినిధ్యం వహిస్తున్నారు. ఒక వైపు కర్నాటక, మరోవైపు తమిళనాడు రాష్ట్రాలు సరిహద్దులుగా ఉన్న ఈ నియోజకవర్గంలో 1985 నుంచి తెలుగుదేశం పార్టీయే గెలుస్తోంది.

ఆరుసార్లు ఇక్కడి నుంచి విజయం సాధించిన చంద్రబాబు ఏడోసారి ఇక్కడ అసెంబ్లీ బరిలో నిలిచారు. ఆయనకు ప్రత్యర్థిగా వైసీపీ నుంచి చంద్రమౌళి పోటీ చేశారు. మాజీ ఐఏఎస్‌ అధికారైన కె.చంద్రమౌళి 2014 ఎన్నికల్లో చంద్రబాబు చేతిలో 47,121 ఓట్ల తేడాతో ఓటమి పాలయ్యారు.

ప్రస్తుత ఎన్నికల్లో జనసేన నుంచి మద్దినేని వెంకటరమణ, బీజేపీ నుంచి ఎన్.ఎస్.తులసీనాథ్, కాంగ్రెస్ నుంచి బీఆర్ సురేశ్ బాబు బరిలో ఉన్నారు.

ముఖ్యమంత్రిగా సుదీర్ఘకాలం పనిచేయడం.. ముప్ఫయ్యేళ్లుగా ఒకే నియోజకవర్గానికి ప్రాతినిధ్యం వహించడంతో చంద్రబాబు కుప్పంను తనకు కంచుకోటగా మార్చుకోగలిగారు.

ప్రస్తుత ఎన్నికల్లో చంద్రబాబు విజయం సాధించినప్పటికీ మెజారిటీ భారీగా తగ్గింది.

Image copyright ycp

పులివెందులలో జగన్ భారీ విజయం

రాష్ట్రంలోని అందరి దృష్టినీ ఆకర్షిస్తున్న నియోజకవర్గాల్లో కడప జిల్లా పులివెందుల కూడా ఒకటి. తాజా ఎన్నికల్లో జగన్ 90 వేలకు పైగా మెజారిటీతో గెలిచారు.

1978 నుంచి వైఎస్ రాజశేఖరరెడ్డి కుటుంబానికి కంచుకోటగా ఉన్న ఈ నియోజకవర్గం నుంచి వైఎస్ జగన్మోహన్‌రెడ్డి 2014లో ఎన్నికై తొలిసారి అసెంబ్లీలో అడుగుపెట్టారు.

ఏపీ అసెంబ్లీలో ప్రతిపక్ష నేతగా ఉన్న జగన్మోహనరెడ్డి ఈ ఎన్నికల్లోనూ అదే నియోకజవర్గం నుంచి బరిలో దిగారు. గత ఎన్నికల్లో తెలుగుదేశం పార్టీ నుంచి ఆయనతో పోటీ పడిన సతీశ్ రెడ్డే ఈసారీ బరిలో ఉన్నారు.

పులివెందులలో 1978 నుంచి 1985 ఎన్నికల వరకు వరుసగా మూడు సార్లు వైఎస్ రాజశేఖరరెడ్డి, 1989లో వైఎస్ వివేకానందరెడ్డి, 1991 ఉప ఎన్నికల్లో వైఎస్‌పీ రెడ్డి, 1994లో మళ్లీ వివేకానందరెడ్డి గెలవగా... 1999 నుంచి 2009 వరకు రాజశేఖరరెడ్డి వరుసగా మూడు ఎన్నికల్లో గెలిచారు.

2011 ఉప ఎన్నికల్లో వైఎస్ విజయమ్మ ఇక్కడి నుంచి విజయం సాధించారు.

2014లో విజయమ్మ విశాఖపట్నం నుంచి లోక్‌సభ స్థానానికి పోటీపడడంతో ఆ ఎన్నికల్లో పులివెందుల నుంచి జగన్ బరిలో దిగి 75,243 ఓట్ల ఆధిక్యంతో గెలిచారు.

ప్రస్తుత ఎన్నికల్లో కాంగ్రెస్ నుంచి వేలూరు శ్రీనివాసరెడ్డి, బీజేపీ నుంచి పెడవల్లి సుష్మ బరిలో ఉన్నారు. జనసేన అభ్యర్థి నామినేషన్ ఇక్కడ ఆమోదం పొందకపోవడంతో ఆ పార్టీ పోటీలో లేదు.

Image copyright janasena

భీమవరంలో పవన్ కల్యాణ్‌ దారుణ ఓటమి

వసతులు, వాణిజ్యం, వ్యాపారం అన్నింటిపరంగా ముందు వరుసలో ఉండే భీమవరం రాజకీయంగానూ పశ్చిమగోదావరి జిల్లాలో కీలకం.

ఈ నియోజకవర్గంలో గెలుపు కాంగ్రెస్, తెలుగుదేశం పార్టీల మధ్య చేతులు మారుతోంది. భీమవరంలో ఇప్పటివరకు కాంగ్రెస్ 7 సార్లు, టీడీపీ 5 సార్లు గెలిచాయి.

2014లో పశ్చిమగోదావరి జిల్లాలోని అన్ని స్థానాలను తెలుగుదేశం గెలుచుకోవడంతో భీమవరం కూడా ఆ పార్టీ ఖాతాలోనే ఉంది. అయితే, ఈసారి జనసేన అధినేత, సినీ హీరో పవన్ కల్యాణ్ అక్కడి నుంచి పోటీ చేస్తుండడంతో ఒక్కసారిగా అంచనాలు మారాయి. కానీ, పవన్ ఆ అంచనాలను అందుకోలేకపోయారు.

టీడీపీ నుంచి సిటింగ్ ఎమ్మెల్యే పులవర్తి రామాంజనేయులు బరిలో ఉండగా.. వైసీపీ నుంచి మాజీ ఎమ్మెల్యే, గత ఎన్నికల్లో రామాంజనేయులు చేతిలో ఓటమి పాలైన గ్రంథి శ్రీనివాస్ మరోసారి రంగంలోకి దిగారు. కాంగ్రెస్ నుంచి అద్దంకి దొరబాబు, బీజేపీ నుంచి కాగిత సురేంద్ర పోటీ చేశారు.

త్రిముఖ పోరులో పవన్ మూడో స్థానానికి పరిమితమయ్యారు. వైసీపీ నేత గ్రంథి శ్రీనివాస్ ఇక్కడ గెలిచారు.

Image copyright jsp

గాజువాకలోనూ పవన్‌కు తప్పని ఓటమి

జనసేన అధ్యక్షుడు పవన్ కల్యాణ్ పోటీ చేస్తుండడంతో విశాఖపట్నంలోని గాజువాక నియోజకవర్గం అందరి దృష్టినీ ఆకర్షించింది.

టీడీపీ నుంచి సిటింగ్ ఎమ్మెల్యే పల్లా శ్రీనివాసరావు, వైసీపీ నుంచి గత ఎన్నికల్లో ఓటమి పాలైన తిప్పల నాగిరెడ్డి ఇక్కడ పోటీచేశారు. కాంగ్రెస్ పార్టీ గొల్లకోట వెంకటసుబ్బారావుకు టికెట్ ఇవ్వగా, బీజేపీ విశాఖ మాజీ మేయర్ పులుసు జనార్దన్‌ను బరిలో దించింది.

వైసీపీ అభ్యర్థి తిప్పల నాగిరెడ్డికి విజయం దక్కింది.

Image copyright facebook/balakrishna

హిందూపురంలో బాలకృష్ణ విజయం

తెలుగుదేశం ఆవిర్భావం నుంచి వరుసగా 9 సార్లు టీడీపీ అభ్యర్థులనే గెలిపించిన నియోజకవర్గం హిందూపురం.

1985, 89, 94లో ఎన్టీఆర్ ఇక్కడి నుంచి విజయం సాధించగా.. 1996లో ఆయన తనయుడు హరికృష్ణ ఇక్కడ ఎమ్మెల్యేగా గెలిచారు.

ఆ తరువాత 1999, 2004, 2009లలో ఎన్టీఆర్ కుటుంబ సభ్యులెవరూ ఇక్కడ పోటీ చేయలేదు. అయినా, టీడీపీ అభ్యర్థులే గెలుస్తూ వచ్చారు.

మళ్లీ 2014లో ఎన్టీఆర్ కుమారుడు, సినీ నటుడు నందమూరి బాలకృష్ణ హిందూపురం నుంచి గెలిచారు.

సిటింగ్ ఎమ్మెల్యేగా టీడీపీ నుంచి ఆయనే బరిలో ఉన్నారు. గత ఎన్నికల్లో వైసీపీ నుంచి పోటీ చేసిన నవీన్ నిశ్చల్‌కు ఈసారి ఆ పార్టీ టికెట్ ఇవ్వలేదు. వైసీపీ నుంచి ఇక్బాల్ అహ్మద్ ఖాన్ బరిలో ఉన్నారు. కాంగ్రెస్ నుంచి బాలాజీ మనోహర్, జనసేన నుంచి ఆకుల ఉమేశ్, బీజేపీ నుంచి పీడీ పార్థసారథి పోటీ చేశారు.

బాలకృష్ణ ఇక్కడ మరోసారి గెలిచారు.

కాగా, బాలకృష్ణ పెద్దల్లుడు నారా లోకేశ్ మంగళగిరి స్థానం నుంచి అసెంబ్లీకి, చిన్నల్లుడు శ్రీభరత్ విశాఖపట్నం స్థానం నుంచి లోక్‌సభకు పోటీ చేసి ఓడిపోయారు.

Image copyright facebook

పెద్దాపురంలో గెలిచిన చినరాజప్ప

ఏపీ ఉప ముఖ్యమంత్రి నిమ్మకాయల చినరాజప్ప సిటింగ్ స్థానం ఇది. ప్రస్తుతం టీడీపీ నుంచి మరోసారి పోటీ చేసి ఆయన విజయం సాధించారు.

వైసీపీ నుంచి తోట వాణి బరిలో దిగారు. గత లోక్‌సభలో తెలుగుదేశం పక్ష నేతగా వ్యవహరించిన తోట నరసింహం భార్యే వాణి. ఎన్నికల నోటిఫికేషన్ వెలువడిన కొద్దిరోజులకే తోట నరసింహం దంపతులు టీడీపీ నుంచి వైసీపీలోకి చేరారు.

కాపు సామాజికవర్గం ఓట్లు ఎక్కువగా ఉన్న పెద్దాపురంలో ప్రధాన పార్టీల అభ్యర్థులు అదే సామాజికవర్గం నుంచి ఉండడంతో ఇక్కడ పోటీ కీలకంగా మారింది. జనసేన నుంచి తుమ్మల రామస్వామి, కాంగ్రెస్ నుంచి తుమ్మల దొరబాబు, బీజేపీ నుంచి యార్లగడ్డ రామ్ కుమార్ బరిలో ఉన్నారు.

టీడీపీ ప్రభుత్వంలో చినరాజప్ప ఉపముఖ్యమంత్రిగా పనిచేయడం, తోట వాణి భర్త నరసింహం వైసీపీలో చేరడానికి ముందు టీడీపీ పార్లమెంటరీ పార్టీ నాయకుడిగా పనిచేయడంతో ఈ నియోజకవర్గంలో పోటీ ఆసక్తిదాయకంగా మారింది. చివరికి చినరాజప్పనే విజయం వరించింది.

Image copyright fb/lokesh

మంగళగిరిలో తొలి ప్రయత్నంలోనే ఓటమి పాలైన నారా లోకేశ్

ఏపీ సీఎం చంద్రబాబు తనయుడు, మంత్రి నారా లోకేశ్ తొలిసారి ప్రత్యక్ష ఎన్నికల బరిలో దిగి మంగళగిరి నుంచి పోటీ చేశారు. ఇక్కడ ఆయనకు పరాజయం తప్పలేదు.

ఇక్కడ వైసీపీ సిటింగ్ ఎమ్మెల్యే ఆళ్ల రామకృష్ణారెడ్డినే మరోసారి బరిలో దించింది. కాంగ్రెస్ పార్టీ నుంచి ఎస్కే సలీం, జనసేనతో పొత్తుల్లో భాగంగా సీపీఐ నుంచి ముప్పాళ్ల నాగేశ్వరరావు, బీజేపీ నుంచి జగ్గారపు రామ్మోహనరావు పోటీలో చేశారు.

2014లో ఇక్కడ వైసీపీ కేవలం 12 ఓట్ల స్వల్ప ఆధిక్యంతో గెలిచింది. టీడీపీ నుంచి పోటీ చేసిన గంజి చిరంజీవులు గత ఎన్నికల్లో గట్టి పోటీ ఇచ్చారు.

అయితే.. మంగళగిరి నియోజకవర్గ చరిత్ర చూస్తే 1983, 85లో తప్ప టీడీపీ మళ్లీ గెలవలేదు.

Image copyright ycp

గుడివాడలో మళ్లీ సత్తా చాటిన కొడాలి నాని

కోస్తాంధ్రలో అందరి దృష్టిని ఆకర్షించిన నియోజకవర్గాల్లో గుడివాడ ఒకటి. ఇక్కడ టీడీపీ నుంచి దేవినేని అవినాశ్, వైసీపీ నుంచి సిటింగ్ ఎమ్మెల్యే కొడాలి నాని బరిలో దిగారు.

కొడాలి నాని వైసీపీలో చేరడానికి ముందు ఈ నియోజకవర్గం టీడీపీకి కంచుకోటగానే చెప్పాలి. 2014లో వైసీపీ నుంచి గెలిచిన ఆయన అంతకుముందు 2009, 2004 ఎన్నికల్లో టీడీపీ నుంచి గెలిచారు. టీడీపీ ఆవిర్భావం తరువాత 1989, 2014 మినహా అన్నిసార్లూ ఆ పార్టీయే గెలిచింది.

1983, 85ల్లో ఎన్టీఆర్ ఇక్కడ నుంచి విజయం సాధించారు.

ఈసారి విజయవాడకు చెందిన దేవినేని నెహ్రూ తనయుడు అవినాశ్ ఇక్కడి నుంచి టీడీపీ తరఫున పోటీలో ఉండడంతో ఇక్కడ పోటీ తీవ్రమైంది.

కాంగ్రెస్ నుంచి ఎస్. దత్తాత్రేయులు, బీజేపీ నుంచి గుత్తికొండ రాజాబాబు పోటీ చేస్తున్నారు. జనసేన అభ్యర్థి నామినేషన్ ఇక్కడ తిరస్కరణకు గురైంది.

కొడాలి నానినే విజయం వరించింది.

Image copyright AmanchiKrishnamohan

చీరాలలో ఆమంచి ఓటమి

2019 ఎన్నికల్లో ప్రకాశం జిల్లా చీరాల నియోజవర్గం కూడా కీలక నియోజకవర్గాల్లో ఒకటిగా మారింది. టీడీపీ నుంచి కరణం బలరాం, వైసీపీ నుంచి సిటింగ్ ఎమ్మెల్యే ఆమంచి కృష్ణమోహన్ ప్రధాన అభ్యర్థులు. కాంగ్రెస్ నుంచి దేవరపల్లి రంగారావు, జనసేన నుంచి కట్టరాజ్ వినయ్ కుమార్, బీజేపీ నుంచి మువ్వల వెంకటరమణ పోటీ చేశారు.

ప్రకాశం జిల్లాలో టీడీపీ సీనియర్ నేతయిన ఎమ్మెల్సీ కరణం బలరాం తన అద్దంకి నియోజకవర్గం నుంచి ఈసారి చీరాలకు మారారు. నిజానికి 2009 ఎన్నికల్లో అద్దంకిలో ఓటమి తరువాత 2014లో తన కుమారుడు వెంకటేశ్‌ను పోటీకి నిలిపారు. కానీ, ఆయనకూ పరాజయం తప్పలేదు. ఈసారి అద్దంకి నుంచి వైసీపీ ఫిరాయింపు నేత గొట్టిపాటి రవికుమార్‌కు టీడీపీ టికెట్ ఇవ్వడంతో బలరాంను చీరాల నుంచి బరిలో నిలిపారు.

ఇక్కడ వైసీపీ నుంచి ఆమంచి కృష్ణమోహన్ బరిలో ఉన్నారు. 2009లో చీరాలలో కాంగ్రెస్ నుంచి గెలిచిన ఆయన 2014లో ఇండిపెండెంట్‌గా గెలిచి ఆ తరువాత టీడీపీలో చేరారు. కానీ, కొద్ది రోజుల కిందటే వైసీపీలోకి వచ్చి టికెట్ సాధించుకున్నారు.

ఆమంచికి ఈ నియోజకవర్గంలో గట్టి పట్టుండగా కరణం బలరాం కూడా ఇక్కడ ప్రజలకు పరిచితుడే.

ఇప్పటివరకు చీరాలలో ఎవరూ వరుసగా మూడుసార్లు గెలిచిన సందర్భం లేకపోవడంతో ఈసారి ఏమవుతుందా అన్న ఆసక్తి అందరిలోనూ ఏర్పడింది.

కరణం బలరాం గెలవడంతో ఆమంచికి రికార్డు సృష్టించే అవకాశం పోయింది.

Image copyright fb

నెల్లూరు సిటీలో మంత్రి నారాయణ ఓటమి

చంద్రబాబు ప్రభుత్వంలో మంత్రి పదవి అందుకుని ఆ తరువాత ఎమ్మెల్సీ అయిన విద్యాసంస్థల అధిపతి పి.నారాయణ తొలిసారి ప్రత్యక్ష ఎన్నికల్లో తలపడి ఓటమి మూటగట్టుకున్నారు.

టీడీపీ అభ్యర్థిగా ఆయన ఇక్కడ బరిలో నిలవగా వైసీపీ నుంచి సిటింగ్ ఎమ్మెల్యే అనిల్ కుమార్ యాదవ్ మరోసారి రంగంలోకి దిగారు.

నెల్లూరు సిటీ(2009కి ముందు నెల్లూరు) నియోజకవర్గంలో టీడీపీ కేవలం రెండు సార్లే విజయం సాధించింది. 1983, 1994లో తప్ప టీడీపీకి ఇక్కడ విజయం దక్కలేదు.

ఇవి కూడా చదవండి:

(బీబీసీ తెలుగును ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్‌, ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)