జగన్ క్యాబినెట్‌లో మంత్రులు వీరేనా... :ప్రెస్ రివ్యూ

  • 24 మే 2019
Image copyright facebook/ysrcp

వైఎస్ జగన్‌తోపాటు ఎంత మంది మంత్రులుగా ప్రమాణం చేస్తారు? ఏయే ప్రాంతాలకు ఎలాంటి ప్రాధాన్యమిస్తారు? ఉప ముఖ్యమంత్రులు ఉంటారా? అన్న అంశాలు ఆసక్తికరంగా మారాయంటూ ఈనాడు దినపత్రిక ఓ కథనాన్ని ప్రచురించింది. అందులో...

150 స్థానాల్లో వైకాపా గెలుపొందడంతో ఆశావహుల సంఖ్య భారీగా పెరిగిపోయింది. పలువురు సీనియర్లు, జూనియర్లు మంత్రివర్గంలో స్థానం ఆశిస్తున్నారు.

ముఖ్యమంత్రి కాకుండా మరో 25 మందికే మంత్రివర్గంలో అవకాశం ఉంటుంది. కాంగ్రెస్‌ నుంచి బయటికొచ్చి 2011లో వైకాపా ప్రారంభించినప్పుడు జగన్‌ని సీమాంధ్రకి చెందిన 16 మంది కాంగ్రెస్‌ ఎమ్మెల్యేలు అనుసరించారు.

వీరిలో నలుగురికి మంత్రి పదవులిచ్చే అవకాశం ఉందని పార్టీ వర్గాల సమాచారం. కచ్చితంగా ఏ నలుగురు అన్న దానిపై స్పష్టత లేదు. అన్ని సామాజికవర్గాలకు, ప్రాంతాలకు ప్రాతినిథ్యం కల్పించాల్సి ఉంది.

జగన్‌ రాయలసీమలోని పులివెందుల నుంచి ప్రాతినిధ్యం వహిస్తున్నందున కోస్తా, ఉత్తరాంధ్రల నుంచి ఉప ముఖ్యమంత్రులుగా ఒకరిద్దరిని తీసుకునే అవకాశం లేకపోలేదన్న వ్యాఖ్యలు వినిపిస్తున్నాయి. బాలినేని శ్రీనివాసరెడ్డి, ఆళ్ల రామకృష్ణారెడ్డిలను మంత్రివర్గంలోకి తీసుకోనున్నట్లు ఎన్నికల ప్రచార సభల్లోనే జగన్‌ ప్రకటించారు.

మంత్రివర్గంలో స్థానం ఆశిస్తున్న కొందరి ఆశావహుల పేర్లను ఈనాడు దినపత్రిక ప్రచురించింది. అందులో...

శ్రీకాకుళం నుంచి మాజీ మత్రి ధర్మాన ప్రసాదరావు, కళావతి, రెడ్డి శాంతి ఉన్నారు. విజయనగరం జిల్లా నుంచి బొత్స సత్యనారాయణ, పుష్ప శ్రీవాణి, రాజన్న దొర.

విశాఖపట్నం నుంచి గుడివాడ అమరనాధ్‌, గొర్లె బాబూరావు. తూర్పుగోదావరి నుంచి సుభాష్ చంద్రబోస్, కన్నబాబు, దాడిశెట్టి రాజా.

పశ్చిమ గోదావరి నుంచి ఆళ్ల నాని, తెల్లం బాలరాజు, తానేటి వనిత, గ్రంధి శ్రీనివాస్. కృష్ణా జిల్లా నుంచి పేర్ని నాని, ఉదయభాను, పార్థసారథి, మేకా వెంకట ప్రతాప్ అప్పారావు.

గుంటూరు నుంచి ఆళ్ల రామకృష్ణారెడ్డి, మర్రి రాజశేఖర్(ఎమ్మెల్సీ కోటా), అంబటి రాంబాబు, కోన రఘుపతి. ప్రకాశం జిల్లా నుంచి బాలినేని శ్రీనివాసరెడ్డి, ఆదిమూలపు సురేష్.

నెల్లూరు జిల్లా నుంచి మేకపాటి గౌతంరెడ్డి, రామిరెడ్డి ప్రతాప్ కుమార్ రెడ్డి, ఆనం రామనారాయణ రెడ్డి. చిత్తూరు నుంచి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి, కరుణాకర్‌రెడ్డి, రోజా.

కడప నుంచి శ్రీకాంత్ రెడ్డి, అంజాద్ బాష. కర్నూలు నుంచి బుగ్గన రాజేంద్రనాథ్ రెడ్డి, శ్రీదేవి, హఫఈజ్ ఖాన్. అనంతపురం నుంచి అనంత వెంకట్రామిరెడ్డి, కాపు రామచంద్రారెడ్డి, శంకర్ నారాయణ అంటూ, ఈనాడు కథనం పేర్కొంది.

Image copyright Getty Images

టీడీపీ చరిత్రలో ఎరుగనిఓటమి

ఈ ఓటమి టీడీపీ చరిత్రలో ఎరుగనిది అంటూ ఆంధ్రజ్యోతి దినపత్రిక ఓ కథనాన్ని ప్రచురించింది. అందులో...

ఇది ఘోర పరాజయం! అసాధారణ పరాభవం! 1982లో తెలుగుదేశం ఏర్పాటైన తర్వాత ఎప్పుడూ ఎదురుకాని ఓటమి! ఒక్క ముక్కలో చెప్పాలంటే... టీడీపీ కకావికలమైంది. కనీవినీ ఎరుగని రీతిలో, కలలోనైనా ఊహించని విధంగా దెబ్బతింది.

టీడీపీ ఏర్పాటైన తర్వాత ఐదుసార్లు విజయం సాధించింది. తాజా ఫలితాలతో కలిపి నాలుగుసార్లు ఓడిపోయింది. ఇన్ని ఓటముల్లో ఇదే అతి ఘోరమైన ఓటమి.

1989లో టీడీపీ తొలి ఓటమి ఎదుర్కొంది. అప్పుడు ఉమ్మడి రాష్ట్రంలో ఆ పార్టీకి తొంభై సీట్లు వచ్చాయి. ఆ తర్వాత వరుసగా రెండుసార్లు అసెంబ్లీ ఎన్నికల్లో నెగ్గి మళ్ళీ 2004లో ఆ పార్టీ ఓడిపోయింది.

అప్పుడు 47 సీట్లు వచ్చాయి. ఆ తర్వాత 2009లో మరోసారి ఓటమి ఎదురైంది. కానీ, అప్పుడు తొంభై సీట్లు వచ్చాయి. ఇప్పుడు మరోసారి ఓడిపోయింది. నిష్పత్తి ప్రకారం చూసుకుంటే... 2004లో కంటే ఇప్పుడే తక్కువ సీట్లు వచ్చినట్లు!

గత ఎన్నికల్లో పశ్చిమ గోదావరి జిల్లాలో మొత్తం అసెంబ్లీ సీట్లను బీజేపీతో కలిపి టీడీపీ గెలుచుకుంది. వైసీపీకి ఒక్కటీ దక్కలేదు. ఈసారి అలాంటి పరిస్థితి టీడీపీకి ఏకంగా నాలుగు జిల్లాల్లో ఎదురైంది. కర్నూలు, విజయనగరం, నెల్లూరు, కడప జిల్లాల్లో మొత్తం సీట్లను వైసీపీ స్వీప్‌ చేసింది.

పోయినసారి కడప జిల్లాలో ఒక సీటు టీడీపీ గెలుచుకోగలిగింది. ఈసారి అది కూడా రాలేదు. ఇక... చంద్రబాబు సొంత జిల్లా చిత్తూరులో ఆయన మినహా టీడీపీ అభ్యర్థులెవరూ గెలవలేకపోయారు.

టీడీపీకి కంచుకోటలుగా భావించే కృష్ణా, గుంటూరు జిల్లాల్లోనూ ఆ పార్టీకి చుక్కెదురైంది. రాజధాని ఏర్పాటు వల్ల ఈ జిల్లాలు అత్యధికంగా లబ్ధి పొందుతాయన్న అభిప్రాయం ఉంది.

పట్టిసీమ ప్రాజెక్టు వల్ల తక్షణ, ప్రత్యక్ష లబ్ధి కూడా ఈ జిల్లాకే దక్కుతోంది. కానీ, ఈ జిల్లాల్లోనూ పార్టీకి ప్రజాదరణ దక్కలేదు. వరుసగా గత ఐదు ఎన్నికల నుంచి గెలుస్తూ వస్తున్న సీనియర్‌ ఎమ్మెల్యే ధూళిపాళ నరేంద్ర, గత మూడు ఎన్నికల నుంచి గెలుస్తున్న మంత్రి దేవినేని ఉమా మహేశ్వరరావు వంటి సీనియర్లు ఓటమిని ఎదుర్కోవాల్సి వచ్చింది.

మరోవైపు... ఈ ఐదేళ్ల పాలనాకాలంలో తెలుగుదేశం పార్టీ ప్రతిష్టాత్మక ప్రాజెక్టులు అమలు చేసిన నియోజకవర్గాల్లో కూడా ఓటమి ఎదురు కావడం విశేషం. కియా ఫ్యాక్టరీని నెలకొల్పిన పెనుకొండ, పోలవరం ప్రాజెక్టు నిర్మాణం జరుగుతున్న పోలవరం నియోజకవర్గాల్లో కూడా టీడీపీకి ఓటమి తప్పలేదని ఆంధ్రజ్యోతి కథనం పేర్కొంది.

Image copyright Twitter/Kavitha Kalvakuntla

కవిత ఓటమి స్వయంకృతాపరాధమే!

కేసీఆర్‌ కూతురు కవిత ఘోర పరాజయం ఆమె స్వయం కృతాపరాధమేనని రాజకీయ విశ్లేషకులు భావిస్తున్నారంటూ నవతెలంగాణ పత్రిక ఓ కథనాన్ని ప్రచురించింది.

పసుపు, ఎర్రజొన్న రైతు సమస్యలపై స్పందించకపోవడం, ఐదేండ్లలో పసుపుబోర్డు ఏర్పాటు సహా బోధన్‌ చక్కెర ఫ్యాక్టరీ పునరుద్ధరించకపోవడం.. ఎన్నికల్లో మళ్లీ అవే హామీలు గుప్పించడం తీరని నష్టం కలిగించాయనే చర్చ ప్రారంభమైంది.

పార్లమెంట్‌ పరిధిలోని ఏడు స్థానాల్లో 'గులాబీ' ఎమ్మెల్యేలున్నా ఒక్కస్థానం మినహా అన్నింటా బీజేపీ ఆధిక్యత చూపడం గమనార్హం. పసుపు, ఎర్రజొన్న రైతుల ఉద్యమం ఎన్నికల ఫలితాలపై తీవ్ర ప్రభావం చూపింది.

పసుపు క్వింటాల్‌కు రూ.15 వేలతో పాటు ఎర్రజొన్నలకు రూ.3,500 చెల్లించాలని ఏడాది ఆరంభంలో రైతులు పోరుబాటపట్టారు. అయినా టీఆర్‌ఎస్‌ ఎమ్మెల్యేలు, ఎంపీ మౌనమే వహించారు.

రైతు నాయకులను అరెస్టు చేయించి కేసులు పెట్టారు. ఈ నేపథ్యంలో సర్కారుపై వ్యతిరేకతతో 175 మంది రైతులు పోటీకి దిగారు. ఈ పరిణామాల దరిమిలా రైతాంగమంతా టీఆర్‌ఎస్‌ను ఓడించాలని భీష్మించారు.

అధికార పార్టీపై ఆగ్రహంతో కొన్నిచోట్ల బీజేపీకి గంపగుత్తగా ఓట్లు కూడా వేశారు. ఆర్మూర్‌, బాల్కొండ, కోరుట్ల, జగిత్యాల అసెంబ్లీ నియోజక వర్గాల్లో బీజేపీ పూర్తి ఆధిక్యత ప్రదర్శించడం అందుకు అద్దం పడుతున్నది.

మరోవైపు పసుపుబోర్డు, చక్కెర ఫ్యాక్టరీ పునరుద్ధరణ వంటి హామీలతో 2014లో గెలిచిన కవిత ఆ దిశగా చేసిన పనులు చేయలేకపోయారు. పైగా చక్కెర ఫ్యాక్టరీని టీఆర్‌ఎస్‌ సర్కారు మూసివేసే ప్రయత్నం చేసింది.

కవితపై పోటీ చేసిన 176మంది రైతులకు ఏకంగా 94వేలా 353 ఓట్లు పడ్డాయి. కవితకు 4లక్షలా 7వేలా 351ఓట్లు పోలవ్వగా సమీప బీజేపీ అభ్యర్థి ధర్మపురి అరవింద్‌కు 4లక్షల 77వేలా 981ఓట్లు పోలై 70వేలా 630 ఓట్ల మెజార్టీతో గెలుపొందారు.

మూడో స్థానంలో నిలిచిన కాంగ్రెస్‌ అభ్యర్థి మధుయాష్కిగౌడ్‌కు కేవలం 59వేల 435ఓట్లు మాత్రమే వచ్చాయి. రైతులకొచ్చిన ఓట్ల సరళిని చూస్తే తమ ఉద్యమానికి ఈ పోటీ జీవం పోసినట్టయిందని రైతు నాయకులు తెలిపారంటూ నవతెలంగాణ పేర్కొంది.

కేసీఆర్ Image copyright facebook/KCR

‘కారు స్పీడు తగ్గింది’

తెలంగాణలో కారు స్పీడు తగ్గిందంటూ సాక్షి దినపత్రిక ఓ కథనాన్ని ప్రచురించింది. అందులో...

సార్వత్రిక ఎన్నికల ఫలితాల్లో టీఆర్‌ఎస్‌ సత్తాచాటింది. మొత్తం 17 స్థానాలకు గానూ 9 చోట్ల గెలిచి ఆధిపత్యం చాటుకుంది. డిసెంబర్‌లో తెలంగాణ శాసనసభకు జరిగిన ముందస్తు ఎన్నికల్లో 119 సీట్లకు గానూ 88 సీట్లలో గెలిచి ప్రభంజనం సృష్టించినట్లే.. లోక్‌సభ ఎన్నికల్లోనూ అదే ఊపును కొనసాగిస్తామని టీఆర్‌ఎస్‌ నాయకత్వం ఆశించింది.

టీఆర్‌ఎస్‌ 16 స్థానాలు, మిత్రపక్షం మజ్లిస్‌కు ఓ స్థానం కలిపి రాష్ట్రంలోని మొత్తం 17 లోక్‌సభ స్థానాలను తామే దక్కించుకుంటామని ప్రకటించింది. 2014 లోక్‌సభ ఎన్నికల్లో 11 లోక్‌సభ స్థానాల్లో నెగ్గిన టీఆర్‌ఎస్‌ తాజా ఎన్నికల్లో 9 స్థానాలకు పరిమితమైంది.

సంఖ్యాపరంగా రెండు స్థానాలను కోల్పోయింది. మూడు సిట్టింగ్‌ స్థానాల్లో పార్టీ అభ్యర్థులు ఓడిపోగా, టీఆర్‌ఎస్‌ ఆవిర్భావం నుంచి అందని ద్రాక్షగా ఉన్న నాగర్‌కర్నూల్‌ లోక్‌సభ స్థానాన్ని కైవసం చేసుకుంది.

నిజామాబాద్‌ లోక్‌సభ స్థానం నుంచి టీఆర్‌ఎస్‌ సిట్టింగ్‌ ఎంపీ, సీఎం కేసీఆర్‌ కుమార్తె కల్వకుంట్ల కవిత.. బీజేపీ అభ్యర్థి ధర్మపురి అరవింద్‌ చేతిలో 71,057 ఓట్ల తేడాతో ఓటమిపాలయ్యారు. కరీంనగర్‌ స్థానంలో సిట్టింగ్‌ ఎంపీ, పార్టీ కీలక నేత బోయినపల్లి వినోద్‌కుమార్‌.. బీజేపీ అభ్యర్థి బండి సంజయ్‌ కుమార్‌ చేతిలో 89,508 ఓట్ల తేడాతో పరాజయం పాలయ్యారు.

అసెంబ్లీ ఎన్నికలు, తదనంతర ఫలితాలతో రోజురోజుకూ అస్తిత్వాన్ని కోల్పోతున్న కాంగ్రెస్‌ పార్టీకి ఈ ఫలితాలు కొత్త శక్తినిచ్చాయి. 2014 లోక్‌సభ ఎన్నికల్లో రాష్ట్రంలో రెండు లోక్‌సభ స్థానాలను మాత్రమే గెలిచిన కాంగ్రెస్, తాజా ఎన్నికల్లో 3 స్థానాలను గెలుచుకుంది.

తెలంగాణ గడ్డపై కమలం పువ్వు వికసించింది. రాష్ట్రంలోని నాలుగు లోక్‌సభ స్థానాలను అనూహ్యంగా గెలుచుకుని అందరిని ఆశ్చర్యంలో ముంచెత్తింది.

నిజామాబాద్‌ సిట్టింగ్‌ ఎంపీ, టీఆర్‌ఎస్‌ కీలక నేత కల్వకుంట్ల కవితను ఓడించడం ద్వారా స్థానిక బీజేపీ అభ్యర్థి ధర్మపురి అరవింద్‌ జెయింట్‌ కిల్లర్‌గా నిలిచారు. 179 మంది రైతులు బరిలో దిగడంతో దేశం దృష్టిని ఆకర్షించిన ఈ ఎన్నికల్లో బీజేపీ విజయం సాధించింది. మరోవైపు, సిట్టింగ్‌ స్థానమైన సికింద్రాబాద్‌ను బీజేపీ నిలబెట్టుకుందని సాక్షి దినపత్రిక పేర్కొంది.

ఇవి కూడా చదవండి:

(బీబీసీ తెలుగును ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్‌, ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)