మోదీ ఎన్నికల మంత్రం: ‘దేశ భద్రత - హిందుత్వ సమ్మేళనం’తో... సామాజిక, ఆర్థిక సమస్యలు బలాదూర్ ,

  • 24 మే 2019
నరేంద్రమోదీ

ఈ లోక్‌సభ ఎన్నికల ఫలితాలు ఎలా చూసినా చరిత్రాత్మకమైనవనే చెప్పాలి. 1971లో ఇందిరాగాంధీ సాధించిన విజయం తర్వాత.. వరుసగా రెండోసారి సంపూర్ణ మెజారిటీ సాధించిన రెండో ప్రధానమంత్రి నరేంద్రమోదీ.

పశ్చిమాన, ఉత్తరాన తన కంచుకోటలను నిలబెట్టుకోవటమే కాదు.. తూర్పున, దక్షిణాన కొత్త ఖాతాలు తెరిచింది బీజేపీ.

కాంగ్రెస్ తన ఓట్ల శాతాన్ని మెరుగుపరచుకుంది. కానీ, ఆ పార్టీ సీట్లు స్వల్పంగానే పెరిగాయి.

రాహుల్ గాంధీ తమ కుటుంబ నియోజకవర్గమైన అమేఠీని కోల్పోయారు. 1999 తర్వాత కాంగ్రెస్ ఇక్కడ ఓడిపోవటం ఇదే మొదటిసారి. స్వాతంత్ర్యం తర్వాత మూడు సార్లు ఈ స్థానం కాంగ్రెస్ చేజారింది.

Image copyright BJP

మోదీ మ్యాజిక్

బీజేపీ విజయానికి కారణం మొత్తం నరేంద్రమోదీయే. ఇందిరాగాంధీ తర్వాత దేశం చూసిన అత్యంత బలమైన ప్రధానమంత్రి ఆయన.

ఇంతకుముందలి ఎన్నికల్లో విఫలమైన అభ్యర్థులు సహా పార్టీలో ఎన్ని బలహీనతలు ఉన్నప్పటికీ.. మోదీ వాటన్నిటినీ అధిగమించి నేరుగా ఓటరును ఆకట్టుకోగలిగారు.

అంటే.. ప్రతిపక్షం జాగ్రత్తగా అల్లిన సామాజిక సంకీర్ణాలన్నీ - కులం, వర్గం, గ్రామీణ, పట్టణ విభజన వంటివి - ప్రధానమంత్రి మోదీ తలపడినప్పుడు తునాతునకలయ్యాయి.

ఉద్యోగాలు, ఆర్థికాభివృద్ధి, వ్యవసాయ సంక్షోభం వంటి సామాజిక, ఆర్థిక సమస్యలను తోసిరాజని విజయం సాధించటానికి.. బలమైన దేశ భద్రత - హిందుత్వ సమ్మేళనం సమర్థంగా పనిచేస్తుందని నరేంద్రమోదీ నిరూపించారు.

Image copyright EPA

మట్టికరిచిన ప్రతిపక్షం

ఎన్నికల్లో విపక్ష వైఫల్యానికి బాధ్యుడిగా రాహుల్‌గాంధీ ఒక్కరి మీదే గురిపెడుతున్నారు. ఆయన బాధ్యత చాలా ఉందనటంలో సందేహంలేదు. ''చౌకీదార్ చోర్ హై'' అంటూ నరేంద్రమోదీ మీద వ్యక్తిగతంగా దాడి చేసే ఆయన ఎత్తుగడ పేలవమైనది. అది బలంగా బెడిసికొట్టింది.

పొత్తులు కుదుర్చుకోవటంలో ఆయన అసమర్థత, అభ్యర్థుల ఎంపికలో జాప్యం, చివరి నిమిషంలో ప్రియాంకా గాంధీని రంగంలోకి తీసుకురావటం కూడా తీవ్ర వైఫల్యాలే.

కానీ వాస్తవం ఏమిటంటే.. రాహుల్ గాంధీని మాత్రమే కాదు పెద్ద ప్రతిపక్ష నేతలు ప్రతి ఒక్కరినీ బీజేపీ మట్టికరిపించింది.

ఉత్తరప్రదేశ్‌లో మహాఘట్‌బంధన్‌గా ఏర్పడిన అఖిలేశ్ యాదవ్, మాయావతిలు కొంత సవాలు విసిరినట్లు కనిపించినప్పటికీ.. చివరికి వారు కూడా కొట్టుకుపోయారు.

నరేంద్రమోదీతో నేరుగా తలపడిన తృణమూల్ కాంగ్రెస్ అధినేత్రి మమతాబెనర్జీ.. తన సొంత ఇంట్లోనే అవమానం చవిచూశారు.

మోదీతో ఢీకొట్టటానికి ప్రయత్నించిన మాజీ మిత్రులు - తనను ప్రత్యామ్నాయ ప్రధానమంత్రి అభ్యర్థిగా ప్రతిపాదిస్తూ ప్రతిపక్ష కూటమిని ఏర్పాటు చేయటానికి ప్రయత్నించిన టీఆర్ఎస్ నాయకుడు కె.చంద్రశేఖరరావు, బీజేడీ అధినేత నవీన్ పట్నాయక్‌లకు సైతం వారి స్థానం ఏమిటో బీజేపీ తెలియజెప్పింది.

Image copyright Getty Images

విస్తరణవాద బీజేపీ

బీజేపీ దిగ్భ్రాంతికర ఫలితాలకు నేటి భారతదేశపు రాజకీయ పటం అద్దం పడుతోంది. గుజరాత్, రాజస్థాన్, హిమాచల్‌ప్రదేశ్, హరియాణా, దిల్లీ, ఉత్తరాఖండ్, జార్ఖండ్, ఛత్తీస్‌గఢ్, మధ్యప్రదేశ్‌లలో దాదాపు అన్ని సీట్లనూ గెలుచుకోవటం ద్వారా.. 2014 విజయాన్ని పునరావృతం చేయగలగటం అద్భుతం.

ఆ పార్టీ ఉత్తరప్రదేశ్‌లో సీట్లు కోల్పోయింది కానీ అనుకున్నన్ని కాదు. బిహార్, మహారాష్ట్ర, కర్ణాటక, అసోంలలో గత ఫలితాల కన్నా మెరుగుపడింది కూడా.

అన్నిటికీ మించి బీజేపీకి, ఆ పార్టీ నాయక ద్వయం - మోదీ, అమిత్‌షాలకు మోదం కలిగించేది ఏమిటంటే, పార్టీ కొత్త ప్రాంతాలకు విస్తరించటం.

బెంగాల్, ఒడిశా, తెలంగాణల్లో గతంలో ప్రతిపక్షం చేతుల్లో ఉన్న స్థానాలకు బీజేపీ విస్తరించింది. అక్కడ ప్రాంతీయ పార్టీలకు.. కనీసం బెంగాల్, ఒడిశాలలో బలమైన ప్రత్యర్థి అవుతోంది.

పశ్చిమబెంగాల్‌లో బీజేపీ ఫలితాలు అద్భుతం.. అంతటి విజయాలను ఆ పార్టీ సైతం ఊహించి ఉండకపోవచ్చు. పార్టీని, సంఘ్‌పరివార్‌ను, ప్రత్యేకించి ఆర్ఎస్ఎస్‌ను బాగా సంతోషం కలిగించే విషయం ఏమిటంటే.. ఆ విజయం వామపక్షాలను దెబ్బతీసి సాధించటం. ఒకప్పుడు కమ్యూనిస్టులకు కంచుకోట అయిన బెంగాల్‌లో ఇప్పుడు వామపక్ష ఎంపీ ఒక్కరు కూడా లేరు.

Image copyright TWITTER/KAVITHA KALVAKUNTLA

పాలక వారసత్వాల పరాజయం

అమేఠీలో రాహుల్‌గాంధీ ఓటమి.. దేశంలోని చాలా ప్రాంతాల్లో కుటుంబ, వారసత్వ రాజకీయాలను ఎలా తిరస్కరించారనేది చాటిచెప్తోంది.

బీజేపీలో సైతం కుటుంబ వారసత్వ రాజకీయ నాయకులు - హిమాచల్‌ప్రదేశ్‌లో అనురాగ్ ఠాకూర్, రాజస్థాన్‌లో దుష్యంత్ సింత్, మహారాష్ట్రలో పూనమ్ మహాజన్ వంటి వారు - ఉన్నప్పటికీ.. ప్రధానంగా ప్రతిపక్షాన్నే.. అంటే కాంగ్రెస్, ప్రాంతీయ పార్టీలనే వారసత్వ రాజకీయాలు అధికంగా ఉన్న పార్టీలుగా జనం పరిగణిస్తారు.

వారిలో చాలా మందిని ఓటర్లు తిరస్కరించారు. కాంగ్రెస్‌లో ఓటమి పాలైన వారసుల్లో రాహుల్‌తో పాటు జ్యోతిరాదిత్య సింధియా, మిలింద్ దేవరా, జితన్ ప్రసాద్, అశోక్ చవాన్‌ తదితరులు ఉన్నారు.

ములాయంసింగ్ యాదవ్ కోడలు డింపుల్, మేనల్లుడు ధర్మేంద్రయాదవ్, లాలూప్రసాద్ కుమార్తె మీసా భారతి, టీఆర్ఎస్ నాయకుడు, తెలంగాణ ముఖ్యమంత్రి కుమార్తె కవితలు కూడా పరాజయం పాలయ్యారు.

అయితే జయించగలిగిన వారు కొంతమంది ఉన్నారు. అందులో అతి ముఖ్యమైన వారు డీఎంకే కరుణానిధి వారసులు. కనిమొళి, దయానిధి మారన్‌లు విజయం సాధించారు. కానీ.. ఓట్లు గెలవటానికి కుటుంబ వారసత్వం ఒక్కటే సరిపోదన్నది స్పష్టమైంది. కాంగ్రెస్ నాయకుడు జ్యోతిరాదిత్య సింధియా ఓటమి ఈ విషయాన్ని చాలా స్పష్టంగా చాటుతోంది.

Image copyright UTTAM/FB

కాంగ్రెస్‌ను కాపాడిన దక్షిణాది

మరైతే.. భారతదేశపు అతి పురాతనమైన గొప్ప పార్టీ కాంగ్రెస్ పరిస్థితి ఏమిటి? దక్షిణాది రాష్ట్రాలు కనుక ఆదుకోకపోయినట్లయితే.. ఆ పార్టీ పరిస్థితి చరిత్రలో అత్యంత దారుణ స్థితికి దిగజారి ఉండేది.

కాంగ్రెస్ గెలిచిన సుమారు 50 సీట్లలో దక్షిణాది రాష్ట్రాలైన కేరళ, తమిళనాడు, కర్ణాటక, తెలంగాణల్లోనే దాదాపు 30 సీట్లు ఉన్నాయి. మిగిలిన సీట్లలోనూ అత్యధికం పంజాబ్ నుంచి వచ్చాయి.

కానీ వాస్తవం ఏమిటంటే.. ఉత్తరప్రదేశ్, బిహార్‌లలో ఆ పార్టీ దాదాపు తుడిచిపెట్టుకుపోయింది. హరియాణా, మహారాష్ట్ర వంటి రాష్ట్రాల్లో పట్టుసాధించలేకపోయింది. కేవలం కొన్ని నెలల కిందటే అసెంబ్లీ ఎన్నికల్లో గెలిచిన ఛత్తీస్‌గఢ్, రాజస్థాన్, మధ్యప్రదేశ్‌లలోనూ పట్టు కోల్పోయింది.

రాహుల్ గాంధీ నాయకత్వం ఇప్పుడు ప్రశ్నార్థకంగా మారింది. ఆయన సోదరి ప్రియాంక కూడా ప్రభావం చూపలేకపోయారు. మరి కాంగ్రెస్ పార్టీ ప్రత్యామ్నాయ నాయకత్వం గురించి ఆలోచిస్తుందా?

ముఖ్యమైన విషయం, లోక్‌సభలో ఎన్‌డీఏకి భారీ మెజారిటీ ఉంది. ఒకవేళ జగన్‌మోహన్‌రెడ్డికి చెందిన వైఎస్‌ఆర్‌సీపీ కూడా ఎన్‌డీఏకి మద్దతు ఇస్తే దిగువ సభలో ఆ కూటమి మెజారిటీ మూడింట రెండు వంతులు దాటిపోతుంది.

అదే జరిగితే, ప్రతిపక్షం అనేది పేరుకు మాత్రమే మిగులుతుంది.

ఇవి కూడా చదవండి:

(బీబీసీ తెలుగును ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్‌, ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)