జాకీర్ మూసా: ఇండియాలో 'మోస్ట్ వాంటెడ్' మిలిటెంట్ కశ్మీర్‌లో కాల్చివేత

  • 24 మే 2019
త్రాల్‌లో జరిగిన జాకీర్ మూసా అంతిమ యాత్రలో వేలాది మంది పాల్గొన్నారు Image copyright Reuters
చిత్రం శీర్షిక త్రాల్‌లో జరిగిన జాకీర్ మూసా అంతిమ యాత్రలో వేలాది మంది పాల్గొన్నారు

''ఇండియాలో మోస్ట్ వాంటెడ్'' మిలిటెంట్ అని చెప్పే జాకిర్ మూసాను కశ్మీర్‌లో కాల్చి చంపినట్లు సైన్యం ధృవీకరించింది.

దక్షిణ కశ్మీర్‌లోని త్రాల్ జిల్లాలో ఒక ఇంట్లో అతడిని చుట్టుముట్టిన సందర్భంలో ఈ సంఘటన జరిగినట్లు తెలిపింది.

కశ్మీర్‌లో సాయుధ మిలిటెంట్ సంస్థ హిజ్బుల్ ముజాహిదీన్‌ నుంచి చీలిపోయిన మూసా 2017లో తాను అల్‌ఖైదాతో అనుబంధంగా పనిచేస్తున్నట్లు ప్రకటించాడు.

మూసా కాల్చివేతతో కశ్మీర్‌లో నిరసనలు తలెత్తాయి.

జాకీర్ మూసా అసలు పేరు జాకీర్ రషీద్ భట్. 2016లో భద్రతా దళాలు కాల్చి చంపిన కశ్మీరీ మిలిటెంట్ బుర్హాన్ వానికి మూసా సన్నిహితుడు. బుర్హాన్ వాని కాల్చివేత సమయంలో కశ్మీర్‌ లోయలో నాలుగు నెలల పాటు చెలరేగిన నిరసనల్లో 100 మందికి పైగా పౌరులు ప్రాణాలు కోల్పోయారు.

Image copyright EPA
చిత్రం శీర్షిక జాకీర్ మూసా ఫొటో ఉన్న టీషర్టు ధరించిన కశ్మీరీ ఆందోళన కారుడ

జాకీర్ మూసాను కాల్చిచంపటం.. బుర్హాన్ వానిని చంపిన తర్వాత భారత సాయుధ దళాలు సాధించిన ''అతిపెద్ద విజయం'' అని స్థానిక మీడియా వ్యాఖ్యానించింది.

మూసా స్థాపించిన అన్సార్ ఘజ్వాత్-ఉల్-హింద్ గ్రూపులో ఎంత మంది మిలిటెంట్లు ఉన్నారన్న అంశంపై స్పష్టత లేదు.

''ఆపరేషన్ దాదాసుర్ (పుల్వామా). ఒక టెర్రరిస్టు హతం. టెర్రరిస్టును జాకీర్ మూసాగా గుర్తించాం. ఆయుధాలు, యుద్ధ తరహా నిల్వలు స్వాధీనం చేసుకున్నాం. ఆపరేషన్ ముగిసింది'' అని సైన్యం ఒక ప్రకటనలో పేర్కొంది.

జాకీర్ మూసా మరణం నేపథ్యంలో కశ్మీర్‌లో హింసను ఎదుర్కోవటానికి అధికారులు సంసిద్ధమయ్యారని స్థానిక జర్నలిస్ట్ సమీర్ యాసిర్ బీబీసీకి చెప్పారు. జాకీర్ కాల్చివేత వార్తలు వెలువడుతుండగానే కశ్మీర్‌లో అలజడి మొదలయిందని ఆయన తెలిపారు.

''ఉదయం నుంచీ చాలా ప్రాంతాల్లో నిరసనకారులు పోలీసులతో ఘర్షణ పడుతున్నారు. చాలా మంది ''మూసా మూసా.. జాకీర్ మూసా'' అని నినాదాలు చేస్తున్నారు. శ్రీనగర్‌ను భారతదేశంతో అనుసంధానించే ఏకైక హైవే మీద గుమిగూడి భద్రతా బలగాల మీద రాళ్లు రువ్వతున్నారు. పోలీసులు భాష్పవాయు గోళాలు, పెల్లెట్ గన్లతో తిప్పికొడుతున్నారు'' అని యాసిర్ వివరించారు.

దీంతో ఈ ప్రాంతంలో మొబైల్ ఇంటర్నెట్ సర్వీసులను నిలిపివేశారు. కర్ఫ్యూ విధించారు. శుక్రవారం నాడు స్కూళ్లు, కాలేజీలను తెరవవద్దని నిర్దేశించారు.

Image copyright EPA
చిత్రం శీర్షిక జాకీర్ మూసా చనిపోయిన ఇంటిని పరిశీలిస్తున్న ప్రజలు

కశ్మీర్‌లో హింస ఎందుకు?

  • బ్రిటిష్ పాలన నుంచి స్వాతంత్ర్యం వచ్చినప్పటి నుంచీ కశ్మీర్ మీద భారత్, పాకిస్తాన్‌ల మధ్య వివాదం నెలకొంది. ఈ ప్రాంతం తమ దేశానికే చెందుతుందని ఇరు దేశాలూ వాదిస్తున్నాయి. ఇరు దేశాల మధ్య మూడు యుద్ధాలు జరిగితే అందులో రెండు యుద్ధాలు కశ్మీర్ కేంద్రంగా జరిగాయి.
  • కశ్మీర్‌లో కొంత భాగం పాక్ ఆధీనంలో ఉంటే.. మరి కొంత భాగం భారత పాలనలో ఉంది. ముస్లింలు మెజారిటీగా ఉన్న ఈ ప్రాంతంలో 1989 నుంచి భారత పాలనకు వ్యతిరేకంగా సాయుధ మిలిటెన్సీ బలపడింది.
  • భారీ నిరుద్యోగిత, వీధుల్లో నిరసనకారులతో తలపడుతూ, వేర్పాటువాదులతో పోరాడుతున్న భద్రతా బలగాలు అణచివేత ఎత్తుగడలకు పాల్పడుతున్నాయన్న ఫిర్యాదులు.. సమస్యను జటిలం చేశాయి.
  • ఈ ప్రాంతంలో మిలిటెన్సీకి మద్దతు ఇవ్వటం ద్వారా పాకిస్తాన్ హింసను రెచ్చగొడుతోందని భారత్ ఆరోపిస్తోంది. దానిని పాకిస్తాన్ తిరస్కరిస్తోంది.
  • 1989 నుంచి కశ్మీర్‌లో తరచుగా హింసాత్మక ఘటనలు చోటు చేసుకుంటున్నాయి. ఆ హింసలో.. 1990ల ఆరంభంలో మిలిటెంట్లు లక్ష్యంగా చేసుకున్న కశ్మీరీ హిందువులు సహా 70,000 మందికి పైగా జనం ప్రాణాలు కోల్పోయారు.

ఇవి కూడా చదవండి:

(బీబీసీ తెలుగును ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్‌, ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)