సూరత్‌: భవనంలో భారీ అగ్ని ప్రమాదం.. 19 మంది కోచింగ్ సెంటర్ విద్యార్థులు మృతి

  • 24 మే 2019
మంటలు ఆపుతున్న అగ్నిమాపక శాఖ Image copyright GSTV

గుజరాత రాష్ట్రం సూరత్ నగరంలోని ఒక భవనంలో శుక్రవారం మధ్యాహ్నం భారీ అగ్ని ప్రమాదం సంభవించింది. ఈ ప్రమాదంలో 19 మంది మృతి చెందినట్లు గుజరాత్ ఉప ముఖ్యమంత్రి నితిన్ పటేల్ చెప్పారని పీటీఐ వార్తా సంస్థ వెల్లడించింది.

నగరంలోని తక్షశిల భవన సముదాయంలోని మూడు, నాలుగో అంతస్థుల్లో మంటలు అంటుకున్నాయని, దీంతో ఒక కోచింగ్ సెంటర్‌లో శిక్షణ పొందుతున్న 15 మంది విద్యార్థులు భవనంపై నుంచి కిందికి దూకడంతో చనిపోయారని నితిన్ పటేల్ వెల్లడించారు.

మూడు, నాగులో అంతస్థుల నుంచి విద్యార్థులు కిందికి దూకే దృశ్యాలను పలు టీవీ ఛానెళ్లు చూపించాయి.

19 అగ్నిమాపక యంత్రాలు, రెండు హైడ్రాలిక్ యంత్రాలతో సహాయక చర్యలు చేపట్టినట్లు అగ్నిమాపక శాఖ అధికారులు చెప్పారు.

Image copyright ANI
చిత్రం శీర్షిక మంటల్లో తక్షశిల భవనం

ఈ భవనంలో ఇంకా చాలామంది చిక్కుకుపోయి ఉంటారని భావిస్తున్నారు. విద్యార్థులు, మంటల్లో చిక్కుకుపోయిన వారిని కాపాడేందుకు స్థానికులు ప్రయత్నాలు చేస్తున్నారు.

‘‘పొగ, మంటల నుంచి తమను తాము కాపాడుకునేందుకు విద్యార్థులు మూడు, నాలుగో అంతస్థుల నుంచి కిందికి దూకేశారు. వారిలో చాలామందిని కాపాడి ఆసుపత్రికి పంపించాం. మంటల్ని ఆపేందుకు కృషి చేస్తున్నాం’’ అని అగ్నిమాపక శాఖ అధికారి ఒకరు చెప్పారు.

ఒక వీడియోలో.. కోచింగ్ సెంటర్ కిటికీల నుంచి బయటకు వచ్చి మూడు, నాలుగో అంతస్థుల నుంచి కిందికి దూకేస్తున్న విద్యార్థులు కనిపిస్తున్నారు.

ఈ ఘటనపై ప్రధాని నరేంద్ర మోదీ, గుజరాత్ ముఖ్యమంత్రి విజయ్ రూపాణీ ట్విటర్‌లో విచారం వ్యక్తం చేశారు. తక్షణ సహాయ చర్యలు చేపట్టాలని అధికారులకు సూచించారు.

ఘటనపై రుపాణీ విచారణకు ఆదేశించినట్లు ఏఎన్ఐ వార్తాసంస్థ పేర్కొంది.

మృతుల కుటుంబాలకు రూ.4 లక్షల చొప్పున నష్ట పరిహారం ప్రకటించినట్లు తెలిపింది.

Image copyright ANI

ఇవి కూడా చదవండి:

(బీబీసీ తెలుగును ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్‌, ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)

సంబంధిత అంశాలు

ఈ కథనం గురించి మరింత సమాచారం