‘ప్రియాంక గాంధీని రాజకీయాల్లోకి తేవడం తప్ప కాంగ్రెస్ చేసిందేమీ లేదు’: అభిప్రాయం

  • 25 మే 2019
మోదీ Image copyright Getty Images

ఈ ప్రజాతీర్పుకు ఒకే వివరణ ఉంది. ఆ రెండు పదాలు నరేంద్ర మోదీ. ఈ విజయం నరేంద్ర మోదీది.

మోదీపై ప్రజల్లో వెల్లువెత్తిన నమ్మకం అపూర్వం. భారత దేశానికి స్వతంత్రం వచ్చిన తర్వాత రాజకీయాల్లో ఒక వ్యక్తి హిందూ సమాజంపై ఇంత బ్రహ్మాండమైన ప్రభావం, పట్టు చూపించడం మొట్టమొదటిసారి జరిగింది.

ఇలా జవహర్ లాల్ నెహ్రూ కాలంలోగానీ, ఇందిరా గాంధీ సమయంలో గానీ జరగలేదు. దీనిని ఒక భారీ సమీకరణంలా చూస్తే దాదాపు 50 శాతం ఓటు షేర్, అన్ని సంస్థలు బీజేపీ చేతుల్లోకే వెళ్లాలి. కర్నాటక, మధ్యప్రదేశ్‌లో ప్రభుత్వాలు పడిపోతే రాజ్యసభలో సంఖ్యాబలం కూడా మారిపోతుంది.

పార్టీ పరిధిలో ఉన్న సివిల్ సొసైటీ సంస్థలు, ఆరెస్సెస్, మిగతా అన్ని సంస్థలూ తమలాగే సాంస్కృతిక చైతన్యం తీసుకొచ్చేందుకు ప్రయత్నిస్తాయి.

భారత రాజకీయాల్లో ఈ అవకాశం పూర్తిగా ఊహించనిది. మనం, అలా ఎందుకు జరిగింది అని అనుకుంటే, దానికి చాలా కారణాలు చెప్పుకోవచ్చు. ఓడిపోయినప్పుడు కూడా చాలా రకాల ఊహాగానాలు ఉంటాయి.

చిత్రం శీర్షిక ప్రతాప్ భాను మెహతా, అశోకా యూనివర్సిటీ వీసీ

ప్రతిపక్షం చాలా బలహీనంగా ఉందనే విషయాన్ని తోసిపుచ్చలేం, అది అన్నివైపులా బలహీనంగా ఉంది. వ్యూహంలో బలహీనంగా ఉండిపోయింది. జాతీయ స్థాయిలో కూటమిని కూడా ఏర్పాటుచేయలేకపోయింది. ఒక్క పార్టీ కూడా తమ స్వార్థానికి మించి ఆలోచించడం లేదని ప్రజల్లోకి ఒక సందేశం వెళ్లేలా చేసింది.

ప్రతిపక్షం ఎలాంటి కనీస భాగస్వామ్య కార్యక్రమం ఏర్పాటు చేయలేకపోయింది. దీన్ని గమనిస్తే గత పదేళ్లుగా నరేంద్ర మోదీ ఎన్నికల ప్రచారంలో భారత్ దేశంలో ఒక పురాతన వ్యవస్థ ఉంది అనే థీమ్‌ ఉంటూ వచ్చింది.

ఆ పురాతన వ్యవస్థ నెహ్రూ-గాంధీ కుటుంబానికి సంబంధించినది. ఆ వ్యవస్థ అవినీతిలో కూరుకుపోయింది. ఆ వ్యవస్థ భారతదేశాన్ని పేదరికంలో ముంచేసింది. 2014లో అదే వ్యవస్థ నరేంద్ర మోదీకి చాలా బాగా పనికొచ్చింది. అందుకే, అప్పుడు ప్రభుత్వ వ్యతిరేక(యాంటీ ఇంకుబెన్సీ) ఓటింగ్ జరిగింది.

Image copyright EPA

ప్రియాంకను తేవడం తప్ప కాంగ్రెస్ తెచ్చిన మార్పు ఇంకోటి లేదు

కానీ, గత ఐదేళ్లలో మీరు కాంగ్రెస్‌ను విశ్లేషిస్తే ప్రియాంకా గాంధీని రాజకీయాల్లోకి తీసుకురావడం తప్ప, ఏ రాష్ట్రంలో అయినా ఏదో ఒక స్థాయిలో కాంగ్రెస్ తమ సంస్థల్లో ఏవైనా మార్పులు తీసుకొచ్చిందా?

ఇక్కడ మోదీ సంప్రదాయవాద, వంశ పారంపర్య రాజకీయాల గురించి మాట్లాడుతున్నారు. కాంగ్రెస్ రాజస్థాన్‌ ఎన్నికల్లో గెలిచింది. అక్కడ అశోక్ గెహ్లాత్(రాజస్థాన్ ముఖ్యమంత్రి) చేసే మొట్టమొదటి పని జోధ్‌పూర్ టికెట్ వైభవ్ గెహ్లాత్‌( తన కొడుకు)కు ఇచ్చుకోవడం. కమల్ నాథ్(మధ్యప్రదేశ్ ముఖ్యమంత్రి) కూడా మొదట తన కుమారుడికి చింద్వాడా టికెట్ ఇచ్చేస్తారు.

పురాతన వ్యవస్థ చాలా బలహీనంగా ఉందని, కుటుంబంపై ఆధారపడిందని, దానిలో ఇప్పుడు ఏ మాత్రం సత్తా లేకుండా పోయిందని మోదీ చెబుతారు.

ఒకవేళ, ఈ గెలుపు ఏ ఐడియాలజీ విజయం అని ప్రశ్న వస్తే, ఇది బాహుళ్యవాదం విజయం అనే చెప్పాలి. స్వాతంత్రం వచ్చిన తర్వాత ఇప్పుడు మొదటిసారి ఇలా జరుగుతోంది.

భారత రాజకీయాల కేంద్రం ఎప్పుడూ సెంట్రిస్ట్(మధ్యేమార్గంగా) ఉంటుందని ప్రజలు భావిస్తారు. బీజేపీ గెలవాలంటే అది కూడా కాంగ్రెస్ లాగే మారాల్సి ఉంటుందని జోకులేసుకుంటారు. కానీ ఆ మధ్యేమార్గానికి ఇప్పుడు తెరపడింది.

Image copyright Reuters

పాత సమీకరణాలు విఫలం

ఈ ఎన్నికల్లో నెగటివ్ ప్రచారం జరిగింది. అలీ-బజరంగ్ బలీ అనే ఫ్రేమింగ్ జరిగింది. ప్రజ్ఞా ఠాకూర్ లాంటి అభ్యర్థి పోటీలో నిలిపారు. 2014లో కొత్త విషయం ఉందని చెప్పచ్చు. అప్పుడు ఆర్థికాభివృద్ధి అనే అంశం ఉంది. కానీ ఈసారీ ఎన్నికల ప్రచారంలో మీరు నరేంద్ర మోదీ ప్రసంగాలు గమనిస్తే, ఆయన ఎక్కువగా "కుటుంబ రాజకీయాల గురించి, లేదా హిందువులని గర్వంగా చెప్పండి" అనే అంశాలమీదే సాగాయి. అందుకే ఇది బాహుళ్యవాదం విజయం అనే నిర్ణయం నుంచి మనం వెనకడుగు వేయకూడదు.

ఇక్కడ విషయం అవినీతి మాత్రమే కాదు, మరో మూడు నాలుగు అంశాలు ఉన్నాయి. జాతి నిర్మాణం కోసం కాంగ్రెస్ ఎన్ని బలిదానాలు చేసిందో భారతదేశంలోని కొత్త తరానికి తెలీదు. రాజీవ్ గాంధీ తర్వాత ఉత్తర భారతంలో కాంగ్రెస్ పూర్తిగా క్షీణించింది. ఉత్తర భారత్‌లో ఆ పార్టీలో బాగా హిందీ మాట్లాడే మంచి నేతలే కరువయ్యారు.

కాంగ్రెస్ అన్ని గ్రూపుల నుంచి నమ్మకం పోగొట్టుకుంది. ఉత్తరప్రదేశ్‌లో దళితులు, ముస్లింల విశ్వాసం కోల్పోయింది. "మీరు మాకు అండగా ఉండండి, మేం మీ పురోగతి, అభివృద్ధి కోసం పనిచేస్తాం" అని వారిలో విశ్వాసం నింపేందుకు కాంగ్రెస్ అసలేం చేసింది అనే ప్రశ్న కూడా తలెత్తుతుంది.

వారిలో కూడా "కాంగ్రెస్‌కు ముస్లింలు కావాలి, కానీ వారికి మాత్రం ముస్లింలపై ఆసక్తి లేదు" అనే భావన ఏర్పడింది. 20-30 ఏళ్ల వరకూ ఎవరూ దానిని ఊహించలేదు. కారణం ఒకటే. ఉత్తర భారతంలో మండల్ కమిషన్ తర్వాత మండల్, కమండల్ రాజకీయం వచ్చింది. ఒక వైపు హిందుత్వ గుర్తింపు, ఇంకోవైపు దానిని ముక్కలు చేసే కులాల పార్టీలు నిలిచాయి.

Image copyright AFP/GETTY IMAGES

కానీ, భారతదేశంలో ఇప్పుడు ఈ కుల, సామాజిక సమీకరణాలతో విజయవంతం కావడం చాలా కష్టం అని ఇప్పుడు నరేంద్ర మోదీ నిరూపించారు.

ఇప్పుడు దళితుల ఓట్లు కూడా చీలిపోయాయి. మాయావతి దగ్గర జాటవ్ మినహా ఎక్కువ దళితుల ఓట్లు లేవు. కాంగ్రెస్, మిగతా పార్టీలు ఇప్పటికీ పాత సమీకరణాల్లో చిక్కుకుపోయి ఉన్నాయి. మోదీ ఈ సమీకరణాలను 2014లోనే ఓడించారు.

ఒకవిధంగా బీజేపీలో జాతీయవాదం దూకుడు కనిపిస్తుంది. పితృస్వామిక జాతీయవాదం ఉంది. కానీ తను మహిళల సమస్యలను లేవనెత్తుతున్నానని, గ్యాస్ సిలిండర్ ఇస్తున్నానని, స్వచ్ఛ భారత్ చేస్తున్నామని మోదీ చెప్పుకోవడం కూడా నిజం ఉంది.

ఒక అంశం భవిష్యత్ తరాలకు పనికొస్తుంది, దాన్ని ముందుకు ముందుకువెళ్తాం అనడానికి మీరు కాంగ్రెస్‌లో ఏదైనా ఉదాహరణ చెప్పగలరా?

కాంగ్రెస్ మ్యానిఫెస్టో చాలా బాగుంది. కానీ ఆ మ్యానిఫెస్టోను ఆ పార్టీ ఎన్నికలకు రెండు నెలల ముందు విడుదల చేసింది.

బలమైన సుప్రీంకోర్టు, బలమైన ఎన్నికల సంఘం ప్రాధాన్యం గురించి భారత ఓటర్లు అర్థం చేసుకోగలరు. కానీ ఆ సంస్థలు బలంగా లేనప్పుడు ఆ దోషం ఎవరికి అంటగట్టాలి. దానికి నరేంద్ర మోదీనే దోషి అని ప్రజలు చెప్పడం లేదు. దీనికి భారత్‌లోని మేధోవర్గమే దోషులని వారు ఆరోపిస్తున్నారు. ఈ వర్గం ఎంత అవినీతి మయం అయ్యిందంటే వారు ఆ సంస్థలనే అంతం చేయగలరని జనం భావిస్తున్నారు.

Image copyright Reuters

ఈ దోషం ఎవరిది

సుప్రీంకోర్టుపై ప్రభుత్వ ఒత్తిడి ఉంటుందని మీరు చెప్పవచ్చు. కానీ ఎన్నో అధికారాలు ఉన్న ఒక సంస్థ లోలోపలే నశించిపోతున్నప్పుడు, స్వయంప్రతిపత్తి ఉన్న విద్యాసంస్థలు అంతం అయిపోతున్నప్పుడు, దానికి మొదటి దోషం ఎవరిపైకి వెళ్తుంది. ఆ దోషం ఆయా సంస్థల్లో ఉన్న ఉన్నత వర్గాలపైకే వెళ్తుంది.

మీరు సుప్రీంకోర్టు ప్రభుత్వాన్ని వెనకేసుకొస్తోందని ప్రజలకు చెబితే, "అంత సమర్థులైన న్యాయమూర్తులు ప్రభుత్వాన్ని పొగుడుతున్నప్పుడు, అందులో ప్రభుత్వం తప్పేముంది" అని వారు మొదట ప్రశ్నిస్తారు.

ఇప్పుడు భారత సమాజం ఎదుర్కుంటున్న సంక్షోభం ఏంటంటే, ఉన్నతవర్గాల(ఎలైట్)పై విశ్వసనీయత పూర్తిగా క్షీణించింది. మోదీ చాలా తెలివిగా అదే సంకేతాన్ని ఇస్తున్నారు. అంటే, లూటియన్స్ దిల్లీ, ఖాన్ మార్గెట్ గ్యాంగ్ లాంటివి.

అలాంటి గ్యాంగ్ ఏదీ లేదని మీరు జోకులేయవచ్చు. కానీ, ఈ సంస్థలు అంతమైపోతున్నప్పుడు, ఆ దోషం మోదీపైకి కాదు, ఆ సంస్థలకే వెళ్లాలని భారత్‌లోని ఎగువ మధ్య తరగతి భావిస్తుందనే అభిప్రాయం ప్రజల మనసులో గూడుకట్టుకుపోయింది.

Image copyright Reuters

భారీ మెజారిటీతో ప్రమాదం

మీడియా కోసం ఎవరిని తప్పు పట్టాలి. మోదీనా? లేక ఆ సంస్థల యజమానులనా?

జర్నలిజం నిష్పక్షపాతంగా, నిర్భయంగా ఉందన్నప్పుడు, అవి ఎక్కడున్నాయి అనే ప్రశ్న కూడా తలెత్తుతుంది. అది నిష్పక్షపాతం పేరుతో పాత వ్యవస్థనే కొనసాగించాలనుకుంటోందా? ఇది కరెక్టా, కాదా అని నేను చెప్పను. కానీ ప్రజలు అదే అంటున్నారు.

ప్రజలపై వారి అబద్ధాల ప్రభావం తక్కువగా ఉంటుంది అనే పరిస్థితి సమాజంలో ఉందా? అనే ప్రశ్నకు మనం సమాధానం చెప్పాలి. ఎవరైనా ఒకవేళ ఆ అబద్ధాలను బహిర్గతం చేసినా, వారికి అందులో ఏదో స్వార్థం ఉందనే భావిస్తుంటారు.

ఎక్కడైనా అధికారం ఒకే వ్యక్తి చేతిలోకి వస్తే, అక్కడ చాలా ప్రమాదాలు ఉంటాయి, అనేది కూడా వాస్తవం. ప్రజాస్వామ్యంలో అది మంచిది కాదు.

భారతీయ జనతా పార్టీ ఒక రాజకీయ పార్టీ మాత్రమే కాదు. అది ఒక సామాజిక సమీకరణం కూడా. దానికి ఒక సాంస్కృతిక ఎజెండా ఉంది. భారతదేశంలో మైనారిటీలను రాజకీయాల్లో ఒక వీటోలా ఉపయోగించుకోవచ్చని, అది లేదంటే మైనారిటీలను పూర్తిగా సంబంధం లేకుండా చేయవచ్చని వారు చెప్పుకునేవారు. అది వారి ఐడియాలజీలోనే ఉంది. ఇప్పుడు ముస్లింల ప్రాతినిధ్యం దాదాపు లేనట్టే అయిపోయింది.

Image copyright Getty Images

సంప్రదాయవాదులను మోదీ ఆపరా?

రామ జన్మభూమి ఉద్యమం సమయం నుంచీ ఒక సిద్ధాంతాన్ని అనుసరించే పార్టీలు.. మీరు మీ సంస్థల్లో హిందుత్వ ఐడియాలజీని చేర్చకపోతే, ఇంకా ఎప్పుడు చేరుస్తారు? అంటూ ప్రశ్నించేవి. అంతకు మించిన విజయం ఏముంటుంది.

అవి బలప్రయోగం చేస్తే, మోదీ వాటిని అడ్డుకుంటారని, లేదా వెనకడుగు వేస్తారని నాకు అనిపించడం లేదు. ప్రమాణాలు పూర్తిగా పడిపోతున్నాయని ఈ ఎన్నికల్లోనే చూశాం. ప్రజ్ఞా ఠాకూర్ లాంటి వారు బీజేపీ స్టార్ అభ్యర్థి అవుతారని పదేళ్ల క్రితం ఎవరైనా ఊహించారా. ఆమె గెలిచారని ఇప్పుడు సంబరాలు చేసుకుంటున్నారు. దీన్ని మనం "మళ్లీ సీసాలో వేయలేని ఒక విషం" లాంటిదని చెప్పచ్చు.

బాహుళ్యవాదం ప్రమాదం ఈ ఎన్నికల్లో చాలా స్పష్టంగా బయటపడింది.

భారత ఆర్థిక వ్యవస్థ ప్రధాని నరేంద్ర మోదీ చెబుతున్నంత పటిష్టంగా లేని పరిస్థితుల్లో ఈ ఎన్నికలు జరిగాయి. వాస్తవ వృద్ధి రేటు 4 లేదా నాలుగున్నర శాతం ఉంది. నిరుద్యోగ సమస్య ఉంది. వ్యవసాయ రంగం సంక్షోభంలో ఉంది.

ఇవన్నీ ఉన్నా ప్రజలు ఆయనకు ఓట్లు వేశారంటే, వాళ్లు ఒక బలమైన నేతను కోరుకుంటున్నారనే నిర్ణయానికే రావాల్సి ఉంటుంది. రెండోది, ఈరోజు మనం ఏ పరిస్థితికి చేరుకున్నామంటే, ఇక్కడ బాహుళ్యవాదం, మెజారిటీలపై ఎక్కువ ప్రభావం చూపించడం లేదు. మనల్ని ఎవరేం చేస్తారులే అని వాళ్లు అనుకుంటున్నారు. ఇది భారత ప్రజాస్వామ్యానికి చాలా సున్నితమైన మలుపు.

జనం తమ తీర్పు ఇచ్చేశారు కాబట్టి ఇది ప్రజాస్వామ్య విజయం అని చెప్పవచ్చు. కానీ ఇది ఉదారత విజయం కాదు. ఇది రాజ్యాంగ విలువల గెలుపు కాదు.

ఏ కులమైనా, సమాజమైనా ప్రతి వ్యక్తీ కోరుకునే, భారత దేశాన్ని మనం నిర్మించాలి. తను ఏ సమాజం నుంచి వచ్చాడో, ఆ సమాజం కారణంగా తనకు ఏదైనా ప్రమాదం ఉంటుందని అతడు భయపడుతూ ఉండకూడదు.

Image copyright Reuters

బీజేపీ నుంచి పాఠం

భారత రాజకీయాల్లో భారతీయ జనతా పార్టీ నుంచి ఒక పాఠం నేర్చుకోవాలి. అది ఎంతో ఓపికతో దీర్ఘ కాలిక వ్యూహాలు సిద్ధం చేస్తుంది. రామజన్మభూమి ఉద్యమం సమయం నుంచీ ఆ పార్టీ లాంగ్ గేమ్ ఆడుతోంది.

ఆ పార్టీ ఎన్నికల్లో ఓడిపోతే సాంస్కృతిక సంస్థలపై దృష్టి పెడుతుంది. రాజకీయాల్లో వెనకబడితే సామాజిక పనులు చేపడుతుంది. వారి వ్యూహాలకు పక్కా ఆధారంగా ఒకటి చెప్పచ్చు. మీరు మీ లక్ష్యం నుంచి పక్కకు వెళ్లారని ఎవరూ అనకుండా, ఆ పార్టీ ఒకే మాటను మాటిమాటికీ చెబుతూ ఉంటుంది. వ్యూహాలను ఎన్నికల మధ్యలో ప్రారంభించదు.

కాంగ్రెస్ వైపు నుంచి చూస్తే వారి ఎన్నికల మిషన్ గత ఏడాది, ఏడాదిన్నర నుంచీ చురుగ్గా ఉంది. కాంగ్రెస్ దగ్గర డబ్బుకు కొదవలేదు. అయితే, కాంగ్రెస్ నేతలు సంపన్నులే, కానీ మాది పేద పార్టీ అని కాంగ్రెస్ వాళ్లే అప్పుడప్పుడూ జోకులు వేసుకుంటూ ఉంటారు.

అటు భారతీయ జనతా పార్టీలో ప్రతి నేత, కార్యకర్త 24 గంటలూ పార్టీ కోసం పనిచేస్తుంటారు. వ్యూహంలో మనకు సంస్థ, ఐడియాలజీ ఉండాలి. 2014లో బీజేపీ విజయం సాధించడానికి రెండేళ్ల ముందే, ఆ పార్టీ మన వ్యవస్థలో ఈ లోపాలు ఉన్నాయి అనే వాతావరణం సృష్టించింది. దాని ద్వారా లబ్ధి కూడా పొందింది.

ఇక పార్టీలో వక్తల విషయానికి వస్తే, బీజేపీ నేతల్లా హిందీలో బాగా మాట్లాడగల వారు కాంగ్రెస్‌లో ఇద్దరు, ముగ్గురిని వెతకడమే కష్టమైపోతుంది.

బలమైన ప్రభుత్వంలో ఉండే రాజ్యాంగ సంస్థల శక్తుల విషయానికి వస్తే సైన్యం లాంటి సంస్థలను గౌరవంగా చూస్తారు. అలాంటి వాటిపై రాజకీయంగా ఎప్పుడూ ఎలాంటి అభ్యంతరాలు రావు. గత ఎనిమిది నెలల్లో దానిని కూడా రాజకీయంగా ఉపయోగించుకుని దుర్వినియోగం చేశారు.

ఆర్థికంగా కూడా ఇది సున్నితమైన సమయం. బలమైన ఒక ప్రభుత్వం పరిస్థితిని చక్కదిద్దగలమనే గ్యారంటీ ఇవ్వలేదు. కానీ ఈ ప్రజాతీర్పును భారత రాజ్యాంగ విలువలను సురక్షితంగా ఉంచడానికి, ఆర్థిక వ్యవస్థను చక్కదిద్దడానికి ఉపయోగించే అవకాశం నరేంద్ర మోదీ దగ్గర ఉంది. కానీ ఎన్నికల ప్రచారం జరిగిన తీరు, ప్రస్తుత రాజకీయ అంశాలు చూస్తుంటే, అవి ఆయన్ను అలా చేయనిస్తాయని అనిపించడం లేదు.

( ప్రతాప్ భాను మెహతా అశోకా యూనివర్సిటీ వైస్ చాన్సలర్. ఆయనతో బీబీసీ ప్రతినిధి సంభాషణ ఆధారంగా రాసిన కథనం)

ఇవి కూడా చదవండి

(బీబీసీ తెలుగును ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్‌, ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)

ఈ కథనం గురించి మరింత సమాచారం