లగడపాటి రాజగోపాల్ సంచలన నిర్ణయం.. సర్వేలకు దూరం- ప్రెస్‌రివ్యూ

  • 25 మే 2019
Image copyright LagadapatiRajagopal

ఇక జీవితంలో సర్వేల జోలికి వెళ్లనని లగడపాటి చెప్పినట్లు సాక్షి దినపత్రిక ఓ కథనాన్ని ప్రచురించింది. అందులో...

ఆంధ్రప్రదేశ్‌ అసెంబ్లీ ఎన్నికల ఫలితాలపై చిలుక జోస్యం చెప్పి బొక్కబోర్లాపడ్డ మాజీ ఎంపీ లగడపాటి రాజగోపాల్‌... ఇక జీవితంలో సర్వేల జోలికి వెళ్లనని ప్రతినబూనారు.

ఎగ్జిట్‌ పోల్స్‌ సందర్భంగా ఏపీ ప్రజలు అభివృద్ధికి పట్టం కడతారు..సైకిల్‌ విజయం తథ్యం అంటూ బీరాలు పలికిన ఆయనకు ఫలితాల అనంతరం దిమ్మతిరిగే షాక్‌ తగిలింది. ఫ్యాన్‌ ప్రభంజనంతో సైకిల్‌ కొట్టుకుపోవడంతో ఆంధ్రా ఆక్టోపస్‌ లగడపాటి అభాసుపాలయ్యారు.

ఫలితాల అనంతరం మీడియా ముందుకు వస్తానని బీరాలు పలికిన లగడపాటి, ఫ్యాన్‌ ఫుల్‌ స్పీడ్‌కి మొహం చాటేసి చివరకు ప్రజల నాడి తెలుసుకోవడంలో విఫలం అయినందుకు చింతిస్తున్నానంటూ అధికారికంగా ఓ లేఖ విడుదల చేశారు.

కారణాలు ఏమైనప్పటికీ తెలంగాణ, ఏపీ అసెంబ్లీ ఎన్నికల్లో ప్రజల నాడి పసిగట్టడంలో వరుసగా రెండుసార్లు విఫలం అయినందుకు ఇక భవిష్యత్‌లో సర్వేలకు దూరంగా ఉండదలచుకుంటున్నట్లు చెప్పారు.

తన ఫలితాల వలన ఎవరైనా, ఏ పార్టీ అయినా నొచ్చుకుని ఉంటే మన్నించాలంటూ లగడపాటి చెప్పుకొచ్చారు. ఆంధ్రప్రదేశ్‌ ముఖ్యమంత్రిగా బాధ్యతలు చేపడుతున్న వైఎస్సార్ కాంగ్రెస్‌ పార్టీ వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డికి శుభాకాంక్షలు తెలిపారు.

ఇక చంద్రబాబు నాయుడు నిర్మాణాత్మక ప్రతిపక్ష నేతగా రాష్ట్రాభివృద్ధికి, నూతన ప్రభుత్వానికి తోడ్పాలంటూ లగడపాటి ఆకాంక్షించారని సాక్షి కథనం తెలిపింది.

Image copyright jagan/fb

హోదా సాధనే లక్ష్యం

రాష్ట్రానికి ఆర్థిక సాయం, ప్రత్యేక హోదా సాధన లక్ష్యంగా జగన్ సంసిద్ధమవుతున్నారంటూ సాక్షి దినపత్రిక ఓ కథనాన్ని ప్రచురించింది. అందులో...

తీవ్ర ఆర్థిక ఇబ్బందుల్లో ఉన్న రాష్ట్రానికి కేంద్ర ప్రభుత్వం నుంచి తక్షణ ఆర్థిక సాయాన్ని సాధించడం, రాష్ట్ర అభివృద్ధికి సంజీవని లాంటి ప్రత్యేక హోదా సాధన లక్ష్యంగా ఆయన కార్యాచరణకు సంసిద్ధమవుతున్నారు.

వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డిని శుక్రవారం మర్యాదపూర్వకంగా కలసిన పలువురు సీనియర్‌ అధికారులు రాష్ట్ర ఆర్థిక పరిస్థితి, ఇతర అంశాల గురించి ప్రాథమికంగా వివరించారు. ఏపీ ఆర్థిక పరిస్థితి అత్యంత దయనీయంగా ఉందని ఈ సందర్భంగా ఆయన దృష్టికి తెచ్చారు.

రెవెన్యూలోటు భారీగా ఉందని వివరించారు. రాష్ట్ర ఖజానా దాదాపు ఖాళీ కావడంతో రూ.15 వేలకోట్ల బిల్లులు పెండింగులో ఉన్న విషయాన్ని ఆయన దృష్టికి తెచ్చారు.

ఈ నెలలో ఇక అప్పులు చేయడానికి వీల్లేకుండా దిగిపోయే ముందు గత ప్రభుత్వం ఓపెన్‌ మార్కెట్‌ ద్వారా రూ.2 వేల కోట్లు అప్పు చేసింది. ఫలితంగా ఇక అప్పు పుట్టే పరిస్థితి లేదని జగన్‌ దృష్టికి తెచ్చారు. రాష్ట్రంలో ఉద్యోగులకు జూన్‌ 1వతేదీన జీతాలివ్వాలంటే తక్షణం రూ.4,500 కోట్లు అవసరమని ఉన్నతాధికారులు వైఎస్‌ జగన్‌కు తెలిపారు.

ఈ నేపథ్యంలో కేంద్రం నుంచి తక్షణ ఆర్థిక సాయాన్ని సాధించడంతోపాటు ప్రత్యేక హోదా సాధనకు అనుసరించాల్సిన కార్యాచరణపై జగన్‌ ఓ నిర్ణయానికి వచ్చినట్లు తెలుస్తోంది.

వరుసగా రెండోసారి గెలిచి ప్రధానిగా బాధ్యతలు చేపట్టనున్న నరేంద్రమోదీకి అభినందనలు తెలిపేందుకు ఆదివారం దిల్లీ వెళుతున్న వైఎస్‌ జగన్‌ తన పర్యటనను సద్వినియోగం చేసుకోవాలని భావిస్తున్నారంటూ సాక్షి కథనం పేర్కొంది.

Image copyright facebook/Narendra Modi

అడ్వాణీకి పాదాభివందనం చేసిన మోదీ

బీజేపీ అధికారంలోకి వచ్చిన నేపథ్యంలో మోదీ అడ్వాణీని కలిసి, పాదాభివందనం చేశారంటూ ఈనాడు దినపత్రిక ఓ కథనాన్ని ప్రచురించింది. అందులో..

భారతీయ జనతా పార్టీ కురువృద్ధులు, పార్టీని తమ చేతులతో పెంచి పెద్ద చేసిన ఎల్‌కే ఆడ్వాణీ, మురళీమనోహర్‌ జోషీలను ప్రధాని మోదీ, పార్టీ అధ్యక్షుడు అమిత్‌షా మర్యాదపూర్వకంగా కలిశారు.

పార్టీ తిరిగి అధికారంలోకి వచ్చిన నేపథ్యంలో వారిద్దరి వద్దకు వెళ్లి ఆశీస్సులు తీసుకున్నారు. శుక్రవారం ఉదయం ప్రధాని మోదీ.. అమిత్‌ షాతో కలిసి ఆడ్వాణీ నివాసానికి వెళ్లారు.

ఆడ్వాణీకి పాదాభివందనం చేసిన మోదీ ఆయన ఆశీస్సులు తీసుకున్నారు. అనంతరం వారిద్దరూ మురళీమనోహర్‌ జోషి ఇంటికి చేరుకున్నారు. పుష్పగుచ్ఛం అందజేసి ఆయనకు కృతజ్ఞతలు తెలిపారు. తనకు పాదాభివందనం చేసిన మోదీని.. జోషి గుండెలకు హత్తుకున్నారు.

ప్రధానికి మిఠాయిలు తినిపించి, ఓ స్టోల్‌ బహూకరించారు. అనంతరం జోషి మీడియాతో మాట్లాడుతూ అమిత్‌షా, మోదీ బ్రహ్మాండంగా పని చేసి పార్టీకి అత్యద్భుతమైన విజయాన్ని కట్టబెట్టారని ప్రశంసించారు.

ఆడ్వాణీ, జోషిలిద్దరినీ కలిసిన అనంతరం మెదీ వారిని ప్రస్తుతిస్తూ ట్వీట్లు చేశారు.

'ఆడ్వాణీ లాంటి నేతలు దశాబ్దాలుగా కష్టపడి పార్టీని ఈ స్థాయికి తీసుకొచ్చారు. ఈ రోజు మేం సాధించిన విజయం వారి చలవే. మురళీ మనోహర్‌ జోషి మేధావి. దేశంలో విద్యావ్యవస్థ మెరుగుదలకు ఆయన ఎంతో కృషి చేశారు. భాజపా పటిష్టతకు జోషీజీ ఎంతో శ్రమించారు. నాలాంటి ఎంతో మంది కార్యకర్తలకు మార్గదర్శిగా నిలిచారు' అని వేర్వేరు ట్వీట్లలో పేర్కొన్నారు.

kcr Image copyright Getty Images

టీఆర్ఎస్‌ను అతి విశ్వాసమే కొంపముంచిందా?

టీఆర్ఎస్ పార్టీని అతి అంచనాలే కొంపముంచాయా? అంటూ నవతెలంగాణ పత్రిక ఓ కథనాన్ని ప్రచురించింది. అందులో...

శాసనసభ ఎన్నికల మాదిరిగా ప్రతి పార్లమెంటు నియోజకవర్గం పైనా ప్రత్యేక దృష్టి పెట్టకపోవటం, పార్టీ బలాబలాలపై అతి అంచనాలకు పోవటమే టీఆర్‌ఎస్‌ స్థానాలు తగ్గటానికి కారణమని ఆ పార్టీ అగ్రనేతలు భావిస్తున్నారు.

2014లో 11 ఎంపీలను గెలుచుకున్న ఆ పార్టీ.. తాజా ఫలితాల్లో 9 సీట్లతో సరిపెట్టుకున్న సంగతి విదితమే. ఈ నేపథ్యంలో పార్టీ అధ్యక్షుడు కేసీఆర్‌, వర్కింగ్‌ ప్రెసిడెంట్‌ కేటీఆర్‌తోపాటు ఇతర సీనియర్లంతా గెలుపోటములపై శుక్రవారం సమీక్షించినట్టు తెలిసింది.

అధికార పార్టీ తరపున గెలిచిన తొమ్మిది మంది ఎంపీలు.. ముఖ్యమంత్రి కేసీఆర్‌ను ప్రగతి భవన్‌లో మర్యాదపూర్వకంగా కలిశారు. వారందరికీ సీఎం అభినందనలు, శుభాకాంక్షలు తెలిపారు.

మెదక్‌ నుంచి గెలుపొందిన కొత్త ప్రభాకరరెడ్డితో కలిసి మాజీ మంత్రి, సిద్ధిపేట ఎమ్మెల్యే హరీశ్‌రావు సీఎంతో భేటీ అయ్యారు. ఈ సందర్భంగా ఎన్నికలు జరిగిన తీరు, వివిధ పార్టీల బలాబలాలు, తమ పార్టీ గెలిచిన, ఓడిన స్థానాలు, వాటిని ప్రభావితం చేసిన అంశాలపై కేసీఆర్‌ చర్చించినట్టు సమాచారం.

లోక్‌సభ ఎన్నికలకు సంబంధించి పార్టీ 9 స్థానాలకే పరిమితం కావటానికి అతి అంచనాలు, భారీ తప్పిదాలే కారణమని వారు ఈ సందర్భంగా విశ్లేషించుకున్నట్టు తెలిసింది. శాసనసభ ఎన్నికల సందర్భంగా ప్రతి అసెంబ్లీ నియోజకవర్గంలో కేసీఆర్‌ ప్రచార సభలు నిర్వహించారు.

రాష్ట్రమంతటా సుడిగాలి పర్యటనలు చేసి క్యాడర్‌లో జోష్‌ నింపారు. తద్వారా అభ్యర్థిని కాదు.. నన్ను చూసి ఓటేయండంటూ ఆయన ఓటర్లకు పరోక్షంగా విజ్ఞప్తి చేశారు. దీంతో సీఎం చరిష్మా, సంక్షేమ పథకాల ప్రభావంతో ముందస్తు ఎన్నికల్లో కారు జోరు కొనసాగింది.

కానీ లోక్‌సభ ఎన్నికల్లో ఇందుకు భిన్నంగా వ్యవహరించటం పార్టీని దెబ్బకొట్టిందనే అభిప్రాయం సమావేశంలో వ్యక్తమైంది. కేటీఆర్‌కు వర్కింగ్‌ ప్రెసిడెంట్‌ బాధ్యతలను అప్పగించి.. ఆయన శక్తి సామర్థ్యాలను పరీక్షించేందుకు అవకాశమివ్వటం మంచిదే అయినా.. కేసీఆర్‌ కూడా అన్ని నియోజకవర్గాల్లో విస్తృతంగా పర్యటించి ఉంటే బావుండేదని పలువురు ఎంపీలు అభిప్రాయపడ్డారు.

అసెంబ్లీ, పార్లమెంటు ఎన్నికలను పోల్చి చూసినప్పుడు టీఆర్‌ఎస్‌ పరిస్థితిలో మార్పు కొట్టొచ్చినట్టు కనబడిందంటూ వారు ఈ సందర్భంగా వ్యాఖ్యానించారు. దీనికి అనేక కారణాలున్నా ప్రధానంగా టికెట్ల కేటాయింపులు, అభ్యర్థిగా ఎవర్ని నిలిపినా కేసీఆర్‌ను చూసి జనం ఓటేస్తారన్న ధీమా, కొన్ని ప్రాంతాల్లో ప్రభుత్వంపైనా, అక్కడ పోటీ చేసిన ఎంపీ అభ్యర్థులపైనా ఉన్న వ్యతిరేకత... వెరసి పార్టీని 9 సీట్లకే పరిమితం చేశాయంటూ ఒకనేత చెప్పినట్టు తెలిసింది.

ముఖ్యంగా నల్లగొండలో పార్టీతోనూ, ప్రజలతోనూ, క్యాడర్‌తోనూ ఎలాంటి సంబంధం లేని వ్యక్తిని అభ్యర్థిగా నిలపటం అక్కడి ఓటమికి కారణమైంది. నిజామాబాద్‌లో పసుపు, ఎర్రజొన్న రైతులను పట్టించుకోకపోవటం, వారి ఆందోళనల గురించి అవహేళనగా మాట్లాడటం, వారిని తక్కువగా చూడటం తదితర అంశాలు కవితను గెలుపునకు దూరం చేశాయనే అభిప్రాయాన్ని మరికొందరు వెలిబుచ్చినట్టు సమాచారం.

మరోవైపు రాష్ట్రంలోని పలు నియోజకవర్గాల్లో చాపకింద నీరులా విస్తరిస్తున్న బీజేపీనీ, పుంజుకుంటున్న కాంగ్రెస్‌నీ తక్కువగా అంచనా వేయటం కూడా టీఆర్‌ఎస్‌ కొంప ముంచిందని వారు ఆవేదన వ్యక్తం చేశారంటూ నవతెలంగాణ పత్రిక పేర్కొంది.

ఇవి కూడా చదవండి

(బీబీసీ తెలుగును ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్‌, ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)