జగన్‌పై దాడి కేసు నిందితుడు శ్రీనివాస్ బెయిల్‌పై విడుదల

  • 25 మే 2019
జగన్ Image copyright Chandrakanth

జగన్‌పై హత్యాయత్నం ఆరోపణలు ఎదుర్కొంటున్న శ్రీనివాస్ రాజమండ్రి జైలు నుంచి బెయిల్‌పై విడుదలయ్యారు. 2018 అక్టోబర్ చివర్లో విశాఖపట్నం ఎయిర్‌పోర్టులో ఈ ఘటన చోటుచేసుకుంది. బెయిల్‌పై విడుదలైన సందర్భంలో శ్రీనివాస్ మీడియాతో మాట్లాడారు. ఆ వివరాలు శ్రీనివాస్ మాటల్లోనే...

నేను జగన్‌పై హత్యాయత్నం చేయలేదు. నేను ఎయిర్‌పోర్ట్‌లో ఒక కుక్‌గా పనిచేస్తున్నాను. జగనన్న ఎట్లాగూ ముఖ్యమంత్రి అవుతాడని నాకు తెలుసు. అందుకే ప్రజలు ఎదుర్కొంటున్న సమస్యల గురించి జగనన్నకు చెప్పడానికి ఒక లెటర్ తీసుకుని వెళ్లాను. కంగారులో నా చేతిలో ఏముందో కూడా నేను గమనించలేదు.

నా దగ్గర పళ్లు కోసే కత్తి ఉంటుంది. ఆ కంగారులో యాక్సిడెంటల్‌గా ఆ కత్తి జగన్‌కు తగిలింది. అప్పుడు ఆయనకు ఏం తగిలిందో కూడా నేను చూడలేదు. ఆ క్షణంలో చిన్నగా గీసుకుంది.

Image copyright ugc
చిత్రం శీర్షిక సెల్ఫీ తీసుకుంటానని చెప్పి దగ్గరకు వచ్చిన వ్యక్తి ఈ దాడికి పాల్పడ్డారని ఆరోపణ

నార్కో టెస్ట్‌కు కూడా నేను సిద్ధం. జగన్‌పై మచ్చ తేవాలని ప్రయత్నించారు. నేను ప్రాణాలతో ఉన్నానంటే అందుకు జగన్ కారణం. ఆయన దయా హృదయుడు. ఆరోజు నాపై అందరూ దాడి చేస్తుంటే జగన్ అడ్డుకున్నాడు. ఆయన దైవగుణం కలిగిన వ్యక్తి.

జగన్ కావాలనే తనపై దాడి చేయించుకున్నాడని అప్పటి ప్రభుత్వం ప్రచారం చేసింది. ఎలాగూ ఓడిపోతామని అప్పటి ప్రభుత్వానికి ఆరోజే తెలుసు. అందుకే జగన్ సానుభూతి కోసం దాడి చేయించుకున్నాడని ప్రచారం చేశారు. నేను హత్యాయత్నం చేశానని తేలితే శిరచ్ఛేదనం చేయించుకుంటాను.

నేను షెఫ్‌ను. ఆరోజు నా దగ్గర వంట చేస్తున్నపుడు వాడే రెండు-మూడు కత్తులు, ఫోర్క్‌లు ఉన్నాయి. ఖంగారులో జగన్ దగ్గరకు వెళ్లినపుడు నాదగ్గర ఉన్న చిన్న కత్తి పొరపాటున ఆయనకు తగిలింది. ప్రజలు కోరుకున్నట్లుగానే జగన్ ముఖ్యమంత్రి అయ్యారు‘‘ అని శ్రీనివాస్ మీడియా ముందు చెప్పారు.

ఇవి కూడా చదవండి

(బీబీసీ తెలుగును ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్‌, ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)