13 మంది మాజీ ముఖ్యమంత్రులు ఓటమి.. 11 మందిపై బీజేపీ గెలుపు

  • 25 మే 2019
దేవెగౌడ, దిగ్విజయ్ సింగ్, సుశీల్ కుమార్ షిండే Image copyright facebook
చిత్రం శీర్షిక దేవెగౌడ, దిగ్విజయ్ సింగ్, సుశీల్ కుమార్ షిండే

2019 సార్వత్రిక ఎన్నికలు దేశంలోని కీలక నేతలకు పరాజయాన్ని రుచిచూపించాయి. ఈ ఎన్నికల్లో లోక్‌సభకు పోటీ చేసిన 13 మంది వివిధ రాష్ట్రాల మాజీ ముఖ్యమంత్రులు ఓటమి పాలయ్యారు. ఒక మాజీ ప్రధాని కూడా ఓటమిని మూటగట్టుకున్నారు.

ఓటమి పాలైన మాజీ ముఖ్యమంత్రుల్లో అత్యధికులు కాంగ్రెస్ పార్టీకి చెందినవారే.

కర్నాటక, మహారాష్ట్ర, ఝార్ఖండ్ రాష్ట్రాల నుంచి ఇద్దరేసి మాజీ సీఎంలు ఈసారి ఎన్నికల్లో పరాజయం పాలయ్యారు.

కర్నాటకలో దేవెగౌడ, వీరప్పమొయిలీ

దేశానికి ఒకసారి ప్రధానిగాను, కర్నాటక రాష్ట్రానికి ముఖ్యమంత్రిగానూ పనిచేసిన సీనియర్ నేత, జనతాదళ్(సెక్యులర్) పార్టీకి చెందిన హెచ్‌డీ దేవెగౌడ కర్నాటకలోని తుముకూరు లోక్‌సభ నియోజకవర్గం నుంచి ఈసారి బరిలో దిగారు. అక్కడ బీజేపీ నుంచి బరిలో దిగిన జీఎస్ బసవరాజ్ 13,339 ఓట్ల తేడాతో దేవెగౌడపై విజయం సాధించారు.

మహారాష్ట్రలో

మహారాష్ట్ర మాజీ సీఎంలు అశోక్ చవాన్, సుశీల్ షిండేలు కూడా ఈ ఎన్నికల్లో ఓటమి చవిచూశారు.

వీరిలో సుశీల్ కుమార్ షిండే కేంద్ర హోం మంత్రిగా, ఆంధ్రప్రదేశ్ గవర్నర్‌గా కూడా పనిచేశారు.

షిండే తనకు ఇవే చివరి ఎన్నికలంటూ ప్రజల్లోకి వెళ్లినప్పటికీ ఆయనకు అవకాశం దక్కలేదు.

ఝార్ఖండ్‌లో

ఝార్ఖండ్‌కు గతంలో ముఖ్యమంత్రులుగా పనిచేసిన శిబూ సొరేన్, బాబూలాల్ మరాండీలు సైతం ఓటమి పాలయ్యారు.

వీరిద్దరూ బీజేపీ అభ్యర్థుల చేతిలోనే ఓటమి చవిచూశారు.

Image copyright Getty Images
చిత్రం శీర్షిక మెహబూబా ముఫ్తీ

మూడోస్థానంలో నిలిచిన జమ్ముకశ్మీర్ మాజీ సీఎం

జమ్ముకశ్మీర్‌లోని అనంతనాగ్ నియోజకవర్గం నుంచి లోక్‌సభకు పోటీ చేసిన మెహబూబా ముఫ్తీ ఓటమి పాలయ్యారు.

అక్కడ నేషనల్ కాన్ఫరెన్స్ నేత హస్నైన్ మసూదీ తన సమీప ప్రత్యర్థి కాంగ్రెస్ నేత గులాం అహ్మద్ మీర్‌పై 6676 ఓట్ల తేడాతో గెలిచారు.

ఈ నియోజకవర్గంలో పీడీపీ అధ్యక్షురాలు, ఆ రాష్ట్ర మాజీ సీఎం మెహబూబా ముఫ్తీ మూడో స్థానంలో నిలిచారు.

ఓటమి పాలైన మాజీ సీఎంలు వీరే..

మాజీ సీఎం(రాష్ట్రం) నియోజకవర్గం పార్టీ గెలిచిన నేత(ఆధిక్యం) పార్టీ
హెచ్‌డీ దేవెగౌడ(కర్నాటక) తుముకూరు జనతాదళ్(ఎస్) జీఎస్ బసవరాజ్(13,339) బీజేపీ
వీరప్పమొయిలీ(కర్నాటక) చిక్‌బళ్లాపూర్ కాంగ్రెస్ బీఎన్ బచెగౌడ(1,82,110) బీజేపీ
సుశీల్ కుమార్ షిండే(మహారాష్ట్ర) షోలాపూర్ కాంగ్రెస్ జైసిద్ధేశ్వరస్వామి(1,58,608) బీజేపీ
అశోక్ చవాన్(మహారాష్ట్ర) నాందేడ్ కాంగ్రెస్ ప్రతాపరావు పాటిల్(40,148) బీజేపీ
శిబూసొరేన్(ఝార్ఖండ్) దుమ్కా ఝార్ఖండ్ ముక్తి మోర్చా సునీల్ సొరేన్(47,590) బీజేపీ
బాబూలాల్ మరాండీ(ఝార్ఖండ్) కోడర్మా ఝార్ఖండ్ వికాస్ మోర్చా అన్నపూర్ణ దేవి(4,55,600) బీజేపీ
మెహబూబా ముఫ్తీ(జమ్ముకశ్మీర్) అనంతనాగ్ పీడీపీ హస్నైన్ మసూదీ(6 వేలు) నేషనల్ కాన్ఫరెన్స్
షీలా దీక్షిత్(దిల్లీ) ఈశాన్య దిల్లీ కాంగ్రెస్ మనోజ్ తివారీ(3,66,102) బీజేపీ
దిగ్విజయ్ సింగ్(మధ్యప్రదేశ్) భోపాల్ కాంగ్రెస్ సాధ్వి ప్రజ్ఞా ఠాకూర్(3,64,822) బీజేపీ
భూపిందర్ సింగ్ హుడా(హరియాణా) సోనేపట్ కాంగ్రెస్ రమేశ్ చంద్ర కౌశిక్(1,64,864) బీజేపీ
హరీశ్ రావత్(ఉత్తరాఖండ్) నైనిటాల్ ఉదమ్ సింగ్ నగర్ కాంగ్రెస్ అజయ్ భట్(3,39,096) బీజేపీ
నబాం తుకీ(అరుణాచల్ ప్రదేశ్) అరుణాచల్ ప్రదేశ్ వెస్ట్ కాంగ్రెస్ కిరణ్ రిజిజు(1,74,843) బీజేపీ
ముకుల్ సంగ్మా(మేఘాలయ) తురా కాంగ్రెస్ అగాథా సంగ్మా(64,030) నేషనల్ పీపుల్స్ పార్టీ

ఇవి కూడా చదవండి:

(బీబీసీ తెలుగును ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్‌, ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)